ఎప్పటికీ మరచిపోలేని మన మాండొలిన్ శ్రీనివాస్ - అచ్చంగా తెలుగు

ఎప్పటికీ మరచిపోలేని మన మాండొలిన్ శ్రీనివాస్

Share This

ఎప్పటికీ మరచిపోలేని మన  మాండొలిన్  శ్రీనివాస్

మధురిమ

భాషలన్నిటికీ సంస్కృత భాష మూలం అని ఎలా ఐతే అంటామో ప్రపంచంలొ గల వేరు వేరు సంగీత ప్రక్రియలకు కర్ణాటక సంగీతం మూలం...ఇది నిరూపణ  అవసరంలేని నిజం..అందుకె ఎన్నో పాశ్చాత్య వాయిద్యాలు కూడా కర్ణాటక సంగీత ప్రపంచం లో ఓ సుస్థిర స్థానం తమకంటూ పొందు పరుచుకోగలిగాయంటే అది కర్ణాటక సంగీతం యొక్క అపారమైన విస్తీర్ణత అని చెప్పడంలొ ఎటువంటి అతిశయోక్తీ లేదు.అందుకె ముత్తు స్వామి దీక్షితార్ గారి కనిష్ట సోదరులు అయిన బాల స్వామి దీక్షితార్ గారు వాయులీనాన్ని అదే మన వయొలిన్ గా పిలువబడే , ప్రస్తుతం శాస్త్రీయ  సంగీత కచేరీలలో తప్పనిసరి అయిన పక్క వాయిద్యం గా మొట్టమొదటిసారి  ప్రవేశపెట్టి అలా దాన్ని కర్ణాటక సంగీత వెన్నుముక గా మలచడానికి అంకురార్పణ చేసిన మహానుభావులు...

ఇలాంటి ఒక అంకురార్పణనే మాండొలిన్ అనే ఒక పాశ్చాత్య  వాయిద్యం పై సుమధుర,సుస్వర సుమనోహర కర్ణాటక సంగీతాన్ని వినిపించడానికి చేసి...ఆ మాండొలిన్ వాయిద్యాన్ని తన తన వాయిద్య నైపుణ్యంతో,విద్వత్తుతో  ఇంటిపేరు గా  మార్చుకోగలిగి ఆ మండొలిన్ రూపు రేఖలినే కాదు దాని దశ ను ,దిశను కూడా మార్చెయగలిగిన  బాల మేధావి, 'మొజాట్ ఆఫ్  ఇండియన్ మ్యూసిక్' గా విశ్వ విఖ్యాతి గాంచి మండొలిన్ మాయా జాలంతో సంగీత ప్రియులను సమ్మొహులుగా చేసిన మనీషి పద్మశ్రీ మండొలిన్ శ్రీనివాస్.

ఫిబ్రవరి 28న ఆయన 50వ జన్మదినం సందర్భంగా ఆయన సంగీత ప్రస్థానాన్ని మీకందించే చిరు ప్రయత్నం.

శ్రీ మాండొలిన్ శ్రీనివాస్ గారు 1969 ఫిబ్రవరి నెల  28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించారు.

ఉప్పలపు శ్రీనివాస్ గారి తాతగారైన శ్రీ ఉప్పలపు సింహాచలం గారు ఊరిలో చిన్న నాదస్వర విద్వాంసులు.శుభకర్యాలకు నాదస్వరం వాయిస్తూ ఉండేవారు.తండ్రి గారైన సత్యనారాయణరాజు గారికి ఒక లలిత సంగీత వాద్యబృందం ఉండేది.దాని పేరు "సరస్వతి మ్యూసిక్ పార్టి" వీరు నెల్లూరు,విజయవాడలో ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు. తల్లి కాంతమ్మ గృహిణి.

ఒక సారి శ్రీనివాస్ గారు తన ఐదవ ఏట తండ్రి గారితో ఒక కచేరికి వెళ్ళి ఇంటికి వచ్చాక  మండొలిన్ పై ఆ రోజు కార్యక్రమంలో విన్న  విన్న కొన్ని పాటలను వాయించడం విని తన కుమారునికి సంగీతజ్ఞానాన్ని భగవంతుడిచ్చాడని గ్రహించి ఓ కొత్త మండొలిన్ కూడా కొని నేర్పించడం మొదలుపెట్టారుట,అలా తండ్రిగారే స్వర ఓనమాలు దిద్దించిన తొలిగురువన్నమాట.

ఆ తరువాత తండ్రిగారి గురువుగారైన  రుద్రరాజు సుబ్బరాజు గారు(ఈయన చెంబై వైద్యనాథ భాగవతార్ గారి శిష్యులు). రుద్రరాజు సుబ్బరాజుగారే శ్రీనివాస్ తండ్రిగారితో పాటు సాలూరి వాసురావు కి కూడా  సంగీతం నేర్పించేవారు.  శ్రీనివాస్ యొక్క ప్రతిభా పాఠవాలకి ఆశ్చర్యపడి మరియూ అనందపడి శ్రీనివాస్ కి సంగీతం లో గాత్ర శిక్షణ ఇచ్చేవారు.ఎందుకంటే ఆయనకి మాండొలిన్ వాయించడం తెలియదు కాబట్టి.

అయితే మన బాల మేధావి మాత్రం ఆయన ఏది చెపితే అది అప్పటికప్పుడే మాండొలిన్ పై వాయించడంతో సుబ్బరాజుగారు శ్రీనివాస్ ని చెన్నై నగరానికి తీసుకు వెళ్ళ మని సలహా ఇవ్వగా అప్పటికి 15ఏళ్ళు గా నడుస్తున్న తమ వాద్య బృందాన్ని మూసి వేసి కొడుకుని తీసుకుని మద్రాసు బయలుదేరారు.అప్పటి వరకూ మాండొలిన్ పై ఎవ్వరూ కర్ణాటక సంగీతం వాయించి ఉండకపోవడం చేత ఈ  కొత్తప్రక్రియ కి శ్రీనివాస్ ఆద్యులని నమ్మిన తండ్రిగారు ఆయనని సంగీతానికి పెద్దపీటవేసి దానికి ఆదరణ ఇచ్చి పోషిస్తున్న మద్రాస్ నగరానికి మకాం మార్చారు.ఈ సమయం లొ శ్రీనివాస్ కేవలం ఏడేళ్ళ బాలుడు.. చెన్నై నగరానికి కూడా సుబ్బరాజు గారు రావడం,వాళ్ళకి ఒక వసతి ఏర్పాటు చెయ్యడం  ఆతరువాత తిరిగి సంగీతంలో అక్కడ కూడా శిక్షణ ఇవ్వడం ఇవన్నీ శ్రీనివాస్ సంగీత మహాప్రస్థానానికి పడిన తొలి అడుగులు..ఆయన మాండొలిన్ పై మనకి అమృతం అందించడానికి శ్రీనివాస్ కి జరిగిన అన్నప్రాసనం ఈ చెన్నై ప్రయాణం.

ఇది ఇలా ఉండగా మద్రాసు వచ్చాక అక్కడ ప్రఖ్యాత సంగీత దర్శకులందరి దగ్గరికీ వెళ్ళి తన కుమారుడిని పరిచయం చేసి సాలూరి రాజేశ్వర రావు లాంటి వారి ఆశీస్సులు ఇప్పించి,నిరంతర సాధన చేయిస్తూ సంగీత ప్రపంచానికి ఓ ప్రభంజనాన్ని అందించారు.ఇది ఇలా ఉండగా వాసురావు 1976లో శ్రీనివాస్ కి వెష్ట్రన్ మ్యూసిక్)(పాశ్చాత్య సంగీతాన్ని) కూడా పరిచయం చేసాడు.

అయితే మద్రాసు నగరం లో అగ్ర కులాల ఆధిపత్యం కూడా చాలా ఎక్కువగా ఉండేది.ఛాందసం కూడా తారస్థాయిలో ఉండేది..బ్రాహ్మణుడు కానివాడు,తమిళుడు కానివాడు..సాంప్రదాయ వాయిద్యం కాక ఒక పాశ్చాత్య వాయిద్యం యొక్క వాదన్ని వినిపించడం చాలా కష్టం అయినా తన మాండొలిన్ నాదంతో ఆ వీణాపాణి వాణినే మురిపించి మైమరపించాక ఆమె అనుగ్రహించక ఏమి చేస్తుంది...తల్లికి పిల్లలందరూ ఒకటే జాతి,కుల మత వ్యత్యాసం తెలియనిది సంగీతం...సంగీతానికి తెలిసినది అది వినిపించేది సుస్వరం,తప్పని లయ...ఈరెండిటినీ వశం చేసుకున్న మన శ్రీనివాస్ సంగీత ప్రపంచం లో పెద్ద పెద్ద వాళ్ళ సందేహాలు కూడా తన మాండొలిన్ పై పలికించిన ఒక చిన్న గమకంతో సమాధాన పరిచి తన నిర్విరామ నిరంతర శాస్త్రీయ సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు.

ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడ లో 1978 త్యాగరాజారాధనలో శ్రీనివాస్, తన మొట్టమొదటి కచేరీ చేసారు.

1981లో కేవలం 11సంవత్సరాల వయసులో మద్రాసు లో "ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ" వారి ఆధ్వర్యం లో కచేరీ చేసాక ఇంక తరువాత ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు.

తన స్వరవిన్యాసం తో సంగీత దిగ్గజాలని కూడా అబ్బురపరిచిన బాల గంధర్వుడు..గాత్రంతో పాడేటప్పుడు భావం తొందరగా శ్రోతకి వెళుతుంది..అది గాత్రంలో సౌలభ్యం...కానీ ఒక వాయిద్యం ద్వారా వాగ్గేయకారుని  భావం శ్రోతకి అందివ్వాలంటే వాయించేవ్యక్తికి సంగీత సాహిత్యాలపై లోతు జ్ఞానం,శ్రోత నాడిని పట్టి అతని రంజింపచేయగలిగే నేర్పు,అందుకు కావలిసిన సాధన చేసే ఓర్పు ఎంతో అవసరం..ఇవన్నీ రావాలంటే మొట్టమొదట ఆ సరస్వతీ మాత అపార అనుగ్రహం,కటాక్షం కి పాత్రుడు అవ్వాలి....కాని శ్రీనివాస్ సాక్షాత్తు సరస్వతీ పుతృలే కాబట్టి ఆయనకి సంగీతం వెన్నులో ఉంది కాబట్టి వెన్నతో తల్లిగారు పెట్టేరో లేదొ మనకు తెలియదు కానీ ఆయనమాత్రం సంగీతమృతాన్ని మృతజీవులైన మనకి పెట్టారు.

శ్రీనివాస్ మొట్టమొదట్లో ఎకాష్టిక్ మాండొలిన్ నే వాయించేవారు..కానీ కర్ణాటక సంగీతం యొక్క ముఖ్య అంశం అయిన గమకాన్ని ఇంకా బాగా పలికించడానికీ ,దాన్ని నిలపడానికి ఎలక్ట్రానిక్ మాండొలిన్ కి మారారు.

ఎలక్ట్రానిక్ మాండొలిన్ ను మన కర్ణాటక సంగీతాన్ని చక్కగా పలికించడానికి ఆయన ఎన్నో మార్పులు,చేర్పులూ కూడా చేసారు.దానికి ఇంకో తీగ ని కూడా అమర్చి మన బాణీలకు,రాగాలాపనలకు సరిపడేలా మార్చడం వలన మొదట్లో కొంత వ్యతిరేక వాదాన్ని వినిపించినా మాండొలిన్ నాదం ఇంకే వాదాన్ని ఇక వినిపించనివ్వలేదు.

సంగీతానికి మక్కాగా విశ్వవిఖ్యాతి గాంచిన మద్రాసు నగరంలో డిసెంబరు మాసాన్ని "మార్గలి మాసమనీ",సంగీత ప్రియులు "సంగీత మాసమనీ" పిలుస్తారు..

అలాంటిసంగీత మాసంలోతలనెరిస్తే కానీ వేదిక ఎక్కలేము అని సంగీత విద్వాంసులందరూ అనుకునే ప్రతిష్టాత్మక మద్రాస్ మ్యూసిక్ అకాడమీ లో 1982 లో కేవలం 13ఏళ్ళ బాలుడు వేదిక ఎక్కి శాస్త్రీయ సంగీత కచేరి చేసి సాక్షాత్తు సెమ్మంగుడిశ్రీనివాస అయ్యంగార్(అపర సంగీత సరస్వతి శ్రీమతి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గారి గురువులు) లాంటివాళ్ళే ఆత్మానందంతో ఆ బాలుని ఆలింగనం చేసుకున్నారంటే అది అతడి విద్వత్తుకి పరాకాష్ట.."కళముందు విధి బలం సైతం పటాపంచలు కావలిసిందే.."అన్న నిజం నిరూపించబడినట్లే కదా..

ఇక అప్పటినుంచీ ఆయన జీవించినంత కాలం ఒక్క 2002 సంవత్సరంలో తప్ప డిసెంబరు 23వ తేదీ ఎప్పుడూ మాండొలిన్ శ్రీనివాస్ గారి కోసమే కేటాయించ బడుతూ వచ్చింది.

అదేవిధంగా 13సంవత్సరాల వయసులో ప్రపంచ సంగీత ప్రియులకు కూడా ప్రీతిపాత్రుడయ్యాడు...1982లో బెర్లిన్ జాజ్ ఫెస్టివల్ లో శ్రీనివాస్ కి అరగంట సమయం కేటాయించారట..కాని అరగంట అయ్యాక చిన్నారి శ్రీనివాస్ వాదనా నైపుణ్యానికి ముగ్ధులైన శ్రోతలు లేచి నిలబడి కరతాళ ధ్వనుల మధ్య ఇంకో గంటవాయించాలిసిందిగా  కోరడంతో మరో గంటసేపు వాయించారట..మన భారతీయ సంగీత మహత్వం అదేమరి..మన సంగీత భావనా ప్రవాహాం  యొక్క మహత్యం అది.

1992లో బార్సిలోనా ఒలంపిక్  ఆర్ట్ ఫెస్టివల్ లో కూడా శ్రీ శ్రీనివాస్ వాయించారు.ఇలా ఖండాంతరాల్లో కూడా వాయించడం వలనే జాన్ మెక్లాలిన్,  మైఖెల్ బ్రూక్ వంటి విశ్వవిఖ్యాత గిటార్ వాదకులతో పనిచేసే అవకాశం శ్రీశ్రీనివాస్ గారికి లభించింది.

1997లో జాన్ మెక్లాలిన్, శ్రీ మాండొలిన్ శ్రీనివాస్,ఉస్తాద్ జాకిర్ హుస్సైన్,శ్రీ సెల్వ గణేష్(ఘటం విద్వాన్ విక్కు వినాయక్ రాం గారి కుమారుడు) శ్రీ శంకర్ మహాదేవన్ గార్లతో కలిపి "రిమెంబర్ శక్తి" అనే బృందాన్ని స్థాపించి ప్రపంచమంతా పర్యటించి ఓ ప్రభంజనం సృష్టించారంటే అతిశయోక్తి లేదు.

శ్రీనివాస్ పాశ్చాత్య సంగీతజ్ఞులతో కలిసి పనిచెయ్యడానికి తనకు  కర్ణాటక సంగీతం పట్ల ఉన్న అవగాహనవలనే సాధ్యం అయ్యింది అని ఎప్పుడూ అంటూ ఉండేవారు. భాషలన్నిటికీ సంస్కృతం ఎలా మూలమో సంగీత ప్రక్రియలు ఎన్ని ఉన్నా అవన్నీ కర్ణాటక సంగీతం లోంచి ఉద్భవించినవే అని చెప్తూ ఉండేవారు.

తన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో ఇలా వెళుతూ,వెళుతూ ఎన్నో మైలు రాళ్ళను దాటుకుంటూ మండొలిన్ తన ఇంటిపేరుగాసుస్థిరం చేసుకోగలిగారు.

ఈ ప్రయాణంలో సుమారు 137 కు పైగా "ఆల్బం" లను విడుదల చెయ్యడమే కాక జాతీయ అంతర్జాతీయ కళాకారులెందరితోనో జుగల్బందీలు కూడా చేసారు.

చెన్నై లో "శ్రీనివాస్" ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ మ్యూసిక్ ని కూడా స్థాపించారు.ఇప్పుడు ఆయనకి ప్రపంచ వ్యాప్తం గా సుమారు ఓ వంద మంది శిష్యులు ఉన్నట్లు అంచనా. వారిలో ప్రముఖులు వారి తమ్ముడు మాండొలిన్ యు .రాజేష్ గారు.

ఎప్పుడూ అందరిని ఆత్మీయంగా నవ్వుతూ ,పలకరించేవారట.పెద్దలపట్ల ఎంతో వినయవిధేయతలు కలిగి పిన్నల పట్ల అపార అభిమానం చూపే జ్ఞానంతో నిండినా తొలకని నిండు కుండ మన శ్రీనివాస్.

సంగీతం,నృత్యానికి సంబందించినంతవరకూ మన భారతదేశం లో "శ్రుతి" ఓ మంచి మాస పత్రిక.ఆ పత్రిక ని 1983వ సంవత్సరంలో ప్రఖ్యాత అర్థశాస్త్రజ్ఞులు,కళాభిమాని శ్రీ ఎన్.పట్టాభిరామన్ గారు మద్రాసు నగరంలో స్థాపించారు.వారి పత్రిక మొట్టమొదటి సంకలం పైన మాండొలిన్ శ్రీనివాస్ గారి ఛాయాచిత్రంతోనేఆవిష్కరించబడి విడుదలయ్యింది.ఆ చిత్రం కింద ఈవిధం గా వ్రాయ బడింది. 

"సంగీతానికి సంబంధించి ఈతను అత్యంత శ్రేష్టమైన వ్యక్తి,అతి చిన్న వయసులోనే సంగీతంలో అసమాన ప్రతిభ కలిగి ఆ వర్గంలో ఉన్న అత్యంత ఉన్నత సంజాతులైన మొజార్ట్, మెనుహిన్ మొదలైన వారితో పోల్చదగిన వ్యక్తి " అని ఓ 13ఏళ్ళ బాలుడిపై రాయగలిగారు అంటే అతని ప్రతిభ ఏంతటిదో మనకి చెప్పనవసరం లేదు.

శ్రీనివాస్ ఒక విద్వాంసులే కాదు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి..దైవభక్తుడు, ఒక చిన్న కుగ్రామంలో ఎవరికీ తెలియని గుడిలో వాయించినా లేదా విశ్వవిఖ్యతి గాంచిన సభలో వాయించినా అదే దీక్షతో అదే అంకిత భావంతో వాయించేవారు.ఎంతో నిర్మలంగా,ప్రశాంతంగా చెదరని చిరునవ్వుతో పలకరిస్తూ ఉండేవారట.కచేరికి ఎక్కడికి వెళ్ళినా,ఎప్పుడు వెళ్ళినా పెట్టెలో రెండు మేండొలిన్లు, హనుమంతుడి ఫొటొ,అన్ని తానే  అయ్యి  ఇంతవాడిని చేసిన నాన్న...ఇవే ఆయన నేస్తాలు...

ఈ సుదీర్ఘ ప్రయాణం లో ఆయనను వరించి తరించిన బిరుదులు,పురస్కారాలు:
  • 1984లో కేవలం 15సంవత్సరాల వయసులో "తమిళనాడు రాష్ట్ర ఆస్థాన విద్వాన్"
  • 1985లో రాజ్యలక్ష్మి  ఫౌండేషన్  చెన్నై వారి అవార్డ్,సంగీత చూడామణి అవార్డ్
  • 1991లో అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారిచే "నేషనల్ సిటిజెన్ అవార్డ్" 
  • 1992లో  చౌడయ్య మెమోరియల్ నేషనల్ అవార్డ్
  • 1995లో  అపర సంగీత సరస్వతి ఎం.ఎస్ సుబ్బలక్ష్మి గారిచే "సంగీత బాల భాస్కర "  బిరుదు ప్రధానం
  • 1998లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం
  • 2004లో మధ్యప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వారిచే పురస్కారం
  • 2010లో  సంగీత నాటక అకాడమీ వారి పురస్కారం, మహారాజపురం సంతానం  పురస్కారం
  • 2014లో జీవిత సాఫల్య పురస్కారం
  • రాజీవ్ గాంధి జాతీయ సమైక్య పురస్కారం,సంగీత రత్న.
ఇలా ఎన్నో ఎన్నెన్నో...

కాని విధి బలీయం..ఇలా సంగీత జైత్ర యాత్రలు చేస్తున్న మండొలిన్ 2014 సెప్టెంబర్ 14వతేదీన  కర్ణాటక సంగీతం పలికే మాండొలిన్ మూగబోయింది..ఇంకెవ్వరూ వాయించలేరని కాదు తన చేత కూడా శాస్త్రీయ సంగీతాన్ని పలికించిన మొట్టమొదటి మనిషి తనని చివరికి ఇలా అకస్మాత్తుగా ఒంటరిగా వదిలి తానొక్కడే సరస్వతి సానిహిత్యం చేరుకున్నారని...

కాలేయ సంబంధ వ్యాదితో బాధపడుతూ చెన్నై అప్పోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు శ్రీ శ్రీనివాస్.

సంగీత ప్రపంచమంతా తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయింది...ఎందరో ప్రముఖులు, అభిమానులు ఆయనకు కన్నీటి అంజలితో స్వరనివాళులు అర్పించారు.

శాస్త్రీయ  సంగీత ప్రపంచంతో పాటు ,శ్రీ బాలసుబ్రహ్మణ్యం,ఏ.ఆర్ రెహ్మాన్ వంటి సినీ ప్రముఖులు కూడా ఇది నమ్మలేని నిజం అంటూ తమ సంతాపం తెలియచేసారు.

"ఓ హోటలులో,కచేరీలో ఆఖరికి రైల్వే స్టేషన్  లో చూసినా కూడా సవినయంగా తలవంచి నమస్కరించి నవ్వుతూ మాట్లాడేవాడయ్యా " అంటూ బాలసుబ్రహ్మణ్యం

"నాకైతే అతని మరణం ఎవరూ తీర్చని లోటు"అని అతనితో కలిసి పనిచేసిన నేపధ్య గాయకులు శ్రీ శంకరమహాదేవన్

"తాను ఇప్పుడు వెళుతున్న ఇంకో ప్రపంచంలో కూడా సుఖం గా ఉండు గాక " అనిసంగీత దర్శకులు శ్రీ ఏ.ఆర్. రెహమాన్.

"విధి బలీయమైనది..సంగీతప్రపంచానికి ఇంకా చాలా రావలిసి ఉన్నదిఈలోగానే ఆయనని తీసుకెళ్ళింది" అంటూ ప్రఖ్యాత గాయకులు శ్రీ శ్రీనివాస్.

ఇలా ఎందరో శ్రీనివాస్ తో తమకున్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు.

కళ కి కళాకారులకి  అంతం  ఉండదు..కళ ఓ మహాసముద్రం అయితే కళాకారుడు నిరంతరం  తుళ్ళుతూ ప్రవహిస్తూ ఆ మహాసంద్రం లో తన ఉనికి కూడా తెలియకుండా మమేకమవ్వాలని తహ తహ లాడే ఓ జీవనది.

అందుకే శ్రీ శ్రీనివాస్ మన మధ్య భౌతికంగా నేడులేకపోయినా మాండొలిన్ అన్న మాట పలకగానే మన స్మరణలోకి తన సంగీతం తో పాటుగా ప్రత్యక్షమవుతారు.
వారి జ్ఞాపకాలలో,వారి జ్ఞాపకాలతో ఎల్లప్పుడూ సంగీత రసికులు వారిని స్మరించి తరిస్తూనే ఉండాలని,ఉంటారని ఆశిస్తూ....
 మధురిమ
***

No comments:

Post a Comment

Pages