వదినగారూ!కులాసాగా వున్నారా ?” మద్రాస్ నుంచి వియ్యపురాలు ఫోన్.
“ షాపింగులన్నీ అయినట్టేనా , ప్రయాణానికన్నీ సర్డుకున్నారా ? “
“అయ్యో ఇంకా ఏమీలేదండీ, ఈసారి ఒక్కదాన్నీ వెళుతున్నా, అదొక టెన్షన్ . ఈయన రావటం లేదుకదా, ఇంట్లో మనిషిని అదీ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఇంటిపనులు అన్నీ చక్కపెట్టుకోవాలి. రొటీన్ డాక్టర్ చెకప్ లు అవీ ప్లాన్ చేసుకోవాలి. అంతా గందరగోళంగావుంది. చెప్పండి మీరెలా వున్నారు ? అన్నయ్యగారు కులాసానా?”
“ బాగున్నామండీ, మొన్న ఆవకాయ, మాగాయ పెట్టాను. పిల్లలకి తీసుకెళతారేమోనని.మీతో ఒకమాటని కొరియర్ లో వేద్దామని. “
నా గుండెల్లో రాయి పడింది. పచ్చళ్ళు ఎప్పుడూ నేనే పెడతా. ఇంత హడావుడిలో కూడా కొత్తపేట వెళ్లి,జలాలు మామిడికాయలు తెచ్చి,ఆవకాయ,మాగాయ పెట్టాను. బాగా కుదిరాయి కూడాను. ఈవిడేంటి ఇప్పుడిలా అంటుంది.
“ ఎప్పుడూమీరే పెడతారనుకోండి, ఈసారి పెట్టాలనిపించింది. మీకోడలికి ఆవకాయ పచ్చడంటే ప్రాణం మీకు తెలుసుకదా,”
“ అవునండీ అందుకే నేనుతన కోసమే పచ్చళ్ళు శ్రద్ధగా పెడతాను. పైగా ఈసారి చాలా బాగా కుదిరాయి కూడాను. మీరు పెట్టారని తెలిస్తే నేను ఈసారికి వూరుకుందును. “ ఆవిడ పచ్చళ్ళు ఎప్పుడూ పెట్టదు, పైగా మనకు లాగా ఆవపిండి,మామిడికాయలు అక్కడ దొరకవు కూడాను. ఆంధ్రా ఆవకాయ అన్నారుకానీ,ఇంకో పేరులేదుకదా, నేనెళ్ళి మెడ్రాస్ వాళ్లకి సాంబారు వండిపెడితే ఎలావుంటుంది ?
“ అవుననుకోండి,ఫస్ట్ టైం పెట్టాను,అమ్మ పెట్టినపచ్చడి తినాలని తనకి వుంటుంది కదాని.” చాలా వాలిడ్ పాయింట్. కాదనటానికి లేదు. నేను పెట్టిన పచ్చడి ఏంచేయాలి ? చాలా శ్రద్ధగా పెడతాను,ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా.
“ మీరెళతారుగా అప్పుడు తీసుకెళుదురుగాని, ఈలోపు నేను తీసుకెళ్లినవి తింటుంటారు.” “ నేను నసిగినట్టుగా అన్నాను. ఇంకా ఏదో మాట్లాడబోయాను.
“ మళ్ళీ చేస్తానండి “ అని ఫోన్ పెట్టేశారు. నాకు కంగారేసింది. అనవసరంగా హర్ట్ చేశానా అని. రెండు పచ్చళ్ళు తీసుకెళ్లటం లగేజ్ ప్రాబ్లం. ఏం చేయాలో అర్ధం కాలేదు. ఆరోజు మైండ్ లో అదే తిరుగుతోంది. నొప్పింపక, తానొవ్వక అంటాడు సుమతీ శతక కారుడు. ఆ రెండూ బాలెన్స్ చేయటం ఎంతకష్టమో !
మర్నాడు పిల్లవాడు ఫోన్ చేస్తే వాడితో చెప్పా, ఇదీ సంగతి అని.
“ అవకాశం వస్తే అందరూ అపార్ధం చేసుకునేవాళ్లే. సర్లే అనక పోయినావా ?”
“ పోనీ ఈసారికి నేను పెట్టిన పచ్చడి తేనులే “అన్నాను.
“ అంతపని చేయకు. నాకంటే నీకోడలికే నీ పచ్చడంటే ఇష్టం.”అదయితే నిజం. నేను పెట్టిన పచ్చళ్ళు నీరజకు బాగా ఇష్టం. తను యెంత బాగుందో పచ్చడి అని తింటుంటే, నాకు మరీ పరమానందం. కానీ వేరే వాళ్ళ ఫీలింగ్స్ కూడా నేను గౌరవించాలికదా! వెంటనే మద్రాస్ ఫోన్ చేసి, రెండు తీసుకెళతానని,తప్పక పంపించమని చెప్పి , ఆ సమస్య పరిష్కరించుకుని, మనసు తేలిక చేసుకుని హమ్మయ్య అనుకున్నాను,లగేజ్ ఏంతగ్గించు కోవాలో అని మనసులో తర్జన భ ర్జన పడుతూ.
********
ప్రతి శనివారం ఇంటి దగ్గర రామాలయంలో భజన. భజన ఎక్కువగా నేనే లీడ్ చేస్తుంటాను. కాలనీ ఆడవాళ్ళం అందరం ఎంతో కలివిడిగా వుంటాం.అందరూ గోలచేశారు, మీరోచ్చేదాకా భజన డల్ గా వుంటుంది అని.
“ ఎంతండీ రెండు నెలలే కదా “ అన్నాను కానీ నేనే మిస్ అవుతాను. వారం వారం అందరం, గుళ్ళో భజన, సత్సంగం,పారాయణ. చక్కగా సాగిపోతుంది.అందరం చాలా స్నేహంగా వుంటాం. పిల్లలకి దూరంగా ఇక్కడ వుంటూ ఇలా ఇరుగు పొరుగులతో ఆప్యాయతలు పంచుకుంటూ కొరతలులేని జీవితం గడుపుతున్నాము. వెళ్ళేది జూలై,ఆగష్ట్ కాబట్టి మాంగోస్ మిస్ కాలేదు.మామిడి పళ్ళు తృప్తిగా తిన్నాను. కానీ జులైలో ఆషాఢమాసం డిస్కౌంట్ సేల్స్,అదేంటో డైరెక్ట్ గా చౌకగా వచ్చినా అంత త్రిల్ వుండదు. సేల్ లో కొనుక్కుంటే యెంత సంబరంగా వుంటుందో. అదో తృప్తి. నా స్టే జులై,ఆగష్ట్ కాబట్టి, ఆషాఢమాసం షాపింగ్,,శ్రావణమాసం పేరంటాలు అవన్నీ మిస్ అవుతాను.
ఇంతలో పక్కింటి వాణిగారు పలకరించారు,
”విజయగారూ, నేనే ఫోన్ చేద్దామనుకున్నాను.నాకు రెండు కేజీ లు అట్టిపెట్టాలి. అమ్మాయికి పుల్లారెడ్డి స్వీట్స్ పంపిస్తాను. అదిప్పుడు కారీయింగ్, మీ కు తెలుసుకదా ?” నా గుండెల్లో రాయి పడింది. వాణిగారు మంచి స్నేహితులు. ఇక్కడ ఒకళ్లకొకళ్ళం సాయంగా, స్నేహంగా వుంటుంటాం. తనకి నో ఎలా చెప్పటం.మొత్తం లగేజీ లో నాకవసరమయిన వన్నీ తీసుకెళ్ళాలి. అక్కడ బయట యాక్టివిటీ ఎక్కువ వుండదుకాబట్టి, నేను చదవదలుచుకున్న పుస్తకాలు, నేను రాసుకునే మెటీరియల్,అవన్నీ తీసుకెళతాను.కాస్త అక్కడ తీరిక వుంటుంది. ప్రశాంతంగా చేసుకోవచ్చుఅని , అదొక లగేజ్ వుంటుంది. పిల్లలకవసరమయినవి,తీసుకెళ్ళాలి.పైగా ఈసారి ఒక్కదాన్ని వెళతాను కాబట్టి లగేజ్ ఎక్కువ తక్కువలయితే ఎయిర్ పోర్ట్ లో నేను మేనేజ్ చేసుకోలేను. ఆలోచనలో పడ్డాను ఏం చేయాలా అని.
మెల్లగా సూట్ కేసులు కిందకు తీయించి సర్దుకోవటం మొదలు పెట్టా. ఇంతలో నా చిన్ననాటి స్నేహితురాలు ఉమా ఫోన్ చేసింది. అది అమెరికా లోనే వుంటుంది. మా వాడికి ఒక గంటన్నర డ్రైవ్ దూరంలో వుంటుంది. అక్కడ కెళ్ళి నప్పుడు బానే కలుస్తాం ఇద్దరం. ఇద్దరిదీ ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి అభిరుచులు, ఆలోచనలు ఒకలాగానే వుంటాయి.ఫోన్లో కూడా గంటలు గంటలు మాట్లాడుకుంటాం,సాహిత్యం,సంగీతం, ఆధ్యాత్మికం. దీని ఫోన్ వచ్చిన రోజున ఆ రోజు పనులన్నీ గోవిందానే.
“ ఏం పుట్టిందే నీకు రెండు రోజులనుంచి ఫోన్ చేస్తున్నా. తీయటం లేదు.చూసుకుని నువ్వన్నా చేయెచ్చుకదా!”
“ నీ బొంద చూసుకోలేదులే. ఈ ప్రయాణం హడావుడి ఒకటి. చెప్పు. ఏంటి సంగతి ?”
“అదేనే, లాస్ట్ టైం నేనువచ్చినపుడు దొరకలేదు.జ్ఞానేశ్వరి తెలుగు వెర్షన్ రెండు కాపీలు తీసుకురా. మరిచిపోవాకు.”
చంపిందే.ఎలాగురాదేవుడా అనుకున్నా.
“ఇప్పుడు ఆ కోటీ కి వెళ్లి నేనెక్కడ వెతికేదే తల్లీ,టైం కూడా లేదు. “ బతిమలాడాను.
“ నాకు తెలీదు.తీసుకురాకుండా వస్తే చంపేస్తా.మళ్ళీ నాకు తెచ్చే వాళ్ళుండరు. “మరొక చాలెంజ్.కిందా మీదా పడి ఎట్లాగో అడ్జెస్ట్ చేసి సూట్ కేసులు సర్దేశా. భారంగా బయలుదేరా.మరీ అంత అవస్థ కాలేదు. పడే అవస్థ ఇంటి దగ్గరే పడ్డాను. వెయిట్ అంతా జాగ్రత్తగా బాలన్స్ చేసుకుని సర్డుకోవటాన ఏమీ ఇబ్బంది కాలేదు.
*********
“అమ్మా , ఈ వీకెండ్ మాల్ కెళదామ్. నీకూ,నాన్నకు కావల్సినివన్నీ లిస్టు చేయి. తీసుకుందాం.” పిల్లవాడు హెచ్చరిస్తుంటే,అవును కదా వెళ్ళే తేదీ దగ్గర పడిందే అనుకున్నా. పిల్లలతో రెండు నెలలు ఎలా అయిందో టైమే తెలియలేదు. రోజు ఉదయం కాసేపు వాళ్ళని సంగీతానికి కూర్చోపెట్టటం,చిన్న చిన్న పాటలు, భజనలు ఇంగ్లీష్ లో రాసి నేర్పిస్తే ఎంత బాగా నేర్చుకున్నారో. ముచ్చటేసింది. గురుపూర్ణిమ రోజు పిల్లలని కూర్చో పెట్టుకుని భజన చేసుకుంటే ఎంతబాగా జరిగిందో. సాయింత్రం కాసేపు యోగా చేయించటం. చుట్టుపక్కల పిల్లలని కూడా పిలిపిస్తా ను. లేకపోతె వీళ్ళు కూర్చోరు. 21 న యోగా డే పిల్లందరం కలిసి యోగా చేయటం,వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హాపీగా ఫీల్ అయ్యారు. అందరికీ వందేమాతరం నేర్పించాను. ఆగష్ట్ 15 న ఫ్లాగ్ హాయిష్టింగ్ చేసుకోవటం, పిల్లలందరూ కలిసి వందేమాతరం పాడుతుంటే ఎంతో తృప్తిగా అనిపించింది.పిల్లల కిష్టమయినవి రోజు కొక వంటచేసిపెడితే, పిల్లలు తృప్తిగా తింటుంటే చాలా హాయిగా అనిపించింది. “అమ్మా నువ్వుంటే ఎంతో నిశ్చింతగా వుంటుంది” అని పిల్లవాడు అనుకుంటుంటే సంతోషం అనిపించింది.నా జీవితం అంతా నేనొక హౌస్ వైఫ్ నే. ఎటువంటి ఉద్యోగాలు చేయలేదు. అయినా నాకెప్పుడు రిగ్రెట్ అనిపించలేదు. నా రోల్ నేను సక్రమంగా నిర్వర్తించానుకదా అనిపిస్తుంది.
మాల్స్ లో షాపింగ్ చేస్తుంటే బలే సరదా. ఇప్పుడు మనకు కూడా ఈ మాల్ కాన్సెప్ట్ బాగా వచ్చిందనుకోండి. అన్నీ కొనాలనిపిస్తుంది. నిజానికి ఏదీ పెద్ద అవసరం లేదు. అక్కడే, పిజ్జా నో బర్గరో తినటం, స్టార్ బక్స్ లో కాపుచినో కాఫీ బాగా ఎంజాయ్ చేస్తా. బెస్ట్ కాఫీ దొరుకుతుంది.బయటి కెళితే కాఫీ మిస్ కాను. అమెరికన్స్ దీ, నాదీ ఒకటే టేస్ట్ కదా అనిపించింది. ‘పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్’ అన్నాడు గిరీశం. నేను కాఫీ తాగని వాడు అంటాను. నేను కొనుక్కునేవి, ఎక్కువగా చెప్పులు, హ్యాండ్ బాగ్స్, విటమిన్స్ మా ఇద్దరికీ. ఇంకా ఫ్రెండ్స్ కీ,అక్కయ్య పిల్లలకీ, తమ్ముడు పిల్లకీ చిన్న చిన్న గిఫ్ట్స్ కొనాలి. ఇంకా నాకిష్టమయినవి కిచెన్ లో వాడుకొనేవి కొంటాను .చాక్లెట్స్. షాపింగ్ చేస్తుంటే వళ్ళుతెలీదు. మళ్ళీ నాప్రోబ్లెం నాకుండనే వుంది. లగేజ్ . పిల్లలు ఏం కావాలన్నా కొనిపెడతారు. మెల్లగా మనసుని సర్దుకుని కావాల్సినంత మటుకు సర్దుకున్నాను. ఎందుకంటె తిరిగి తీసుకెళ్ళాల్సిన లిస్టు కూడా పెద్దగానే వుంది. మా అక్కయ్య కోడలు ఇక్కడే వుంటుంది. తను ముందే చెప్పింది అక్కకి కావలసినవి తీసుకెళ్ళమని. తనకి మాటిచ్చాను.అదొకటి చూసుకోవాలి. అక్కడనించి మా వారు ఫోన్ చేశారు. ఫ్యామిలీ డాక్టర్ గారు అడిగారుట, వాళ్ళబ్బాయి యేవో ఐటమ్స్ ఇస్తారు తీసుకురమ్మని. లగేజ్ అంతా ఖాళీ అయింది కదా, నాక్కావల్సినవి తీసుకెళ్ళొచ్చు ననుకున్న నా ఆశ నిరాశ అయింది.
మళ్ళీ నా టార్గెట్ మొదలయింది. సూట్ కేసులు,వైయింగ్ మిషెన్ రెండూ దగ్గర పెట్టుకుని exercise. మెల్లగా నా కోరికల లిస్టు ఒకటొకటి కొట్టేసుకున్నాను. మరి నాక్కావాల్సినవి వీళ్ళు తెచ్చిన సందర్భాలు వున్నాయికదా. ఆమధ్య ఈయనకి హార్ట్ అటాక్ వస్తే,అక్కయ్యా బావగారు దగ్గరవుండి యెంత సహాయంగా వున్నారు. వచ్చి పదిరోజులు నా దగ్గరే వుంది అక్కయ్య. డాక్టరు గారు కూడా యెంత చక్కగా టేక్ కేర్ చేసారో.వారి ఋణం తీర్చుకునే అవకాశం ! ఆడపడుచు కూతురు నేషనల్ డ్రాయింగ్ పోటీల కి ప్రిపేర్ అవుతుంది. డ్రాయింగ్ మెటీరియల్ తెచ్చి పెట్టమంది. మరిది అల్లుడుకి ఫొటోగ్రాఫీ హాబీ, రిలేటెడ్ వస్తువులు వాళ్ళేవో చెప్పారు.మా అబ్బాయి కి చాలా చౌకగా హైటెక్ సిటీలో మంచి ఫ్లాట్ ఇప్పించాడు మరిది.ఇప్పుడు వాళ్లకి నో చెప్పలేం.
ఇంతకీ ఈ సోదంతా దేనికంటే, మనం పరస్పర సహకారంతో మాత్రమే జీవిస్తుంటాం. ఒకరి మీద ఒకరం ఆధారపడి జీవిస్తుంటాం. ఈ మానవీయ సంబంధాలు ఎంతో ముఖ్యమయినవి. అదేదో కొటేషన్ లో చెప్పినట్టు, ఈ రిలేషన్షిప్స్ అన్నవి చాలా సున్నితంగా వుంటాయి. మొరటుగా హేండిల్ చేశామా, విరిగిపోతాయి. తేలిగ్గా తీసుకుంటే ఎగిరిపోతయ్యి. జాగ్రత్తగా కాపాడుకోవాలి. చుట్టుపక్కల వారితో సంబంధాలు చక్కగా లేకపోతే ఆనందంగా వుండే ప్రసక్తి లేదు. సుమతి శతక కారుడు చెప్పాడు కానీ నొప్పింపక,తానొవ్వక అని, అప్పుడప్పుడు పక్కవాళ్లకోసం కాసింత కష్టపడటం అవసరం. అందుకే గురజాడ వారన్నట్టు,’ సొంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయ్’ ..ఒక్కొక్కసారి మన పక్క వాళ్ళ కోసం మనం ఇబ్బంది పడటం సంతోషంగా వుండటానికి ఎంతో అవసరం అనుకుంటా.
************
No comments:
Post a Comment