పారిజాతం - అచ్చంగా తెలుగు
పారిజాతం
సత్యం ఓరుగంటి 

సముద్రం ఒడ్డున కూర్చున్నాడు సత్యం , సముద్రం ప్రశాంతంగా ఉంది , కాని  మనసు అల్లకల్లోలంగా ఉంది .
సముద్రం ఎన్నో ఆటుపోట్లకి తట్టుకొని గంబీరంగా ఉంటుంది, ద్వాపరయుగం లో శ్రీ కృష్ణుడు ఏలిన ద్వారక నుంచి   నిన్న మొన్న పాకిస్తాన్ సబ్ మెరైన్ వరకు అన్నిటినీ తన గర్భం లో దాచుకొని ఏమి ఎరగనట్టు అంతే ప్రశాంతంగా గంబీరంగా ఉంది.
తను ఈ అప్పుల బాధ తట్టుకోలేడు, ఎన్నిసార్లు అవమానాలు భరించగలడు ?ఈ రోజుతో అన్నీ బాధలూ తీరిపోతాయ్ , కాకపోతే ఎవరూ చూడకుండా చెయ్యాలి, చూస్తే ఒడ్డుకి లాగేస్తారు, సముద్రంలో కి మునగడానికి వెళితే ఒకవేళ అలలు బయటికి తోసేస్తే ? ఎలా చావడం ? ఎవరో చెప్పేరు చచ్చి  పోయిన తరువాతే అలలు బయటికి తోసేస్తాయని, అలాగైతే పరవాలేదు. ఇతనెవరు ? ఇందాకటినుంచి నన్నే ఫాలో చేస్తున్నాడు ? పోలీసు కాదు కదా ? లేనిపోని గొడవ చావటం అటుంచి స్టేషన్ లో పెట్టి చావ కొడతారేమో ?
"ఏమిటీ సంగతీ ? సముద్రంలో దూకుదామనా ?" ముసలోడు గట్టి వాడె, అడగనే అడిగాడు.
"దూకడం ఎందుకు సర్ ? కూర్చొని చూద్దామని వచ్చేను".
"నీ వ్యవహారం చూస్తే అలాగ లేదు?"
"మీకెలా తెలుసు ?"
"నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు ?"
"పద పద మా యింటికి పోయి మాట్లాడుకుందాం. "
"నేను రాను."
"రాకపోతే పోలీసులను పిలుస్తాను, వొస్తే బతికే దారి చూపిస్తాను."
ముసలాయన మొండిఘటం వదిలేటట్టు లేడు, పదండి.
*** 
 మెల్లగా బీచ్ నుంచి నడుస్తూ రోడ్డు పైకి వచ్చాము , రోడ్డు దాటి కాలనీ లోకి వెళ్లేం, అన్నీ చక్కటి ఇళ్ళు, పూల మొక్కలు , పెద్ద పెద్ద కంపౌండ్లు ఉన్నాయి. నాలుగు ఇళ్ళు దాటి ఐదో ఇల్లు, ఇంటిముందు పారిజాతం చెట్టు, చక్కగా గాలికి వొయ్యారంగా ఊగుతోంది, చుట్టు చిన్న గట్టు కట్టి ఉంది, పక్కనే ఒక బోర్డు "స్ఫూర్తి వృక్షం"  అని వ్రాసి ఉంది.
 "పారిజాతం చెట్టు కదా ? స్ఫూర్తి వృక్షం ఏమిటి ?" అర్ధం కాలేదు,  ఇంటి గోడ మీద నేమ్ ప్లేట్ నరసింహమూర్తి,
"రా కూర్చుని మాట్లాడుకుందాం," అన్నారు పెద్దాయన.
 పారిజాతం చెట్టు గట్టున కూర్చున్నాం.  "ఏమిటీ పారిజాతం చెట్టు పేరు స్ఫూర్తి వృక్షం అని పెట్టేరు అనే కదా నీ అనుమానం ? పారిజాతం కధ చెబుతాను విను."
ఆ రెండు రోజులు ప్రపంచానికి ప్రశాంతమైతే విశాఖపట్నానికి విలయతాండవం, హుద్ హుద్ తుఫాను, కుండ పోత వర్షం, చిమ్మ చీకటి , గంటకి 200 కిలోమీటర్ల వేగంతో గాలి, ప్రకృతి బీభత్సం, ప్రజలు వీధులలోకి రావటానికి భయపడ్డారు, కరెంటు స్థంబాలు నెలకి ఒరిగేయి, పెద్ద పెద్ద మహా వృక్షాలు కూకటి వేళ్ళతో పెకలించుకు పోయేయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయేయి, ఇళ్ళ పై ఉన్న డిష్ ఎంటినాలు, సోలార్ ప్లేట్ లు ఎంత దూరం ఎగిరేయో ?
ఏ పల్లెటూర్లలో పడ్డాయో ? ఎవరికీ తెలియలేదు, ఆ రాత్రి మొత్తం నాకు  నిద్రలేదు, కాళ రాత్రి అని విన్నానే గాని ఆరోజు మాత్రం చూసాను, అయ్యో నేను రోజు ఉదయాన్నే  పూజించే  నా పారిజాతం , సాయత్రం నాకు నీడ నిచ్చి ప్రేమగా స్నేహితుడిలా పలకరించే నా పారిజాతం, ఈ రోజుతో మా బంధం సరేనా ? ప్రతి గంటకి బాల్కనీ లోంచి నా ద్రుష్టి అంతా నా పారిజాతం పైనే, ఒక టార్చ్ లైట్ పట్టుకొని అప్పుడప్పుడు పారిజాతం పై వేస్తూ పడిపోయిందేమో ?
అనుమానం , అంత పెద్ద సముద్రం , మహా మహా వృక్షాలే అటుపోట్లకి తట్టుకోలేకపోతే ఈ చిన్న చెట్టు ఎంత ? అని ఒక అదైర్యం.
అప్పటివరకు జీవితంలో ఎలాంటి తుఫానులు వచ్చినా స్థిరంగా ఎదురు నిలబడి గెలవాలి అనుకునే వాణ్ణి , కాని స్థిరంగా నిలబడటం అసంభవం, పెద్ద తుఫాను వస్తే ఎగిరిపోవటం కాయం అని తెలుసుకున్నాను, కాకపోతే ఆ రోజు ఆ రాత్రి పారిజాతం వ్యవహరించిన తీరు నా ఆలోచనని మార్చింది.
కాలానికి ఎదురు నిలబడలేం, కాలానుగుణంగా బతకాలి తప్ప అని ఆ రోజు తెలుసుకున్నాను.
ఎంతగాలి వీచినా, ముందుకు వంగేది , వెనుకకి వంగేది , కుడి ఎడమలికి వంగేది, గాలి సుడి తిరిగితే తాను సుడి తిరిగేది, కానీ గాలి తగ్గగానే మళ్ళీ నిలబడేది , ఆహా ! ఏమి దీని తెలివి ?  ఉదయాన్నే తుఫాను తెరిపి ఇచ్చింది,
గాలి వేగం తగ్గింది, వర్షం ఆగింది, సూర్యభగవానుడు యదాతదంగా వచ్చేడు ప్రకృతిని పలకరించడానికి.
రొజూ పలకరించే వృక్ష రాజాల పలకరింపులు లేవు, అన్నీ నేలకు ఒరిగి ఉన్నాయ్.
 పారిజాతం  మాత్రం ఆనందంగా ఎగురుతూ పలకరిస్తోంది, సూర్యభగవానుడు ఆనందంగా కాంతులు వెదజల్లేడు పారిజాతాన్ని పలకరిస్తూ.
నేను లేచి స్నానం చేసి పారిజాతానికి ప్రదక్షిణం చేసెను, నన్ను చల్లగా ఉండమని దీవిస్తూ పారిజాతం నాపై పూల వర్షం కురిపించిది.
అప్పుడు అనిపించిది పారిజాతం,  పారిజాతం కాదని ఎందరికో స్ఫూర్తి అని .
సంఘటన విన్న  సత్యం కళ్ళు చేమర్చేయి. మనసు ప్రశాంతంగా ఉంది ,
పారిజాతం మళ్ళీ పూల వర్షం కురిపించింది, మూర్తి గారు అడిగేరు సత్యాన్ని ఆటుపోట్లు అర్ధం అయ్యయా ?
ఇంకెక్కడి ఆటుపోట్లు మూర్తి గారు ? అతలాకుతలం కూడా నన్నేమి చెయ్యలేదు అంతా పారిజాతం మహిమ , కాదుకాదు స్ఫూర్తి వృక్షం మహిమ.
*** 

No comments:

Post a Comment

Pages