బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు-04 (పెద్దశేష వాహనము)22-02-2019 - అచ్చంగా తెలుగు

బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు-04 (పెద్దశేష వాహనము)22-02-2019

Share This
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య కీర్తనలు-04 (పెద్దశేష వాహనము)
22-02-2019
డా.తాడేపల్లి పతంజలి


బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-04 (పెద్దశేష వాహనము)
రేకు: 263-5  సంపుటము: 3-365
వీడుగదే శేషుడు శ్రీవేంకటాద్రిశేషుడు
వేడుక గరుడనితోబెన్నుద్దైన శేషుడు ॥పల్లవి॥
వేయివడిగెలతోడ వెలసిన శేషుడు
చాయమేని తళుకు వజ్రాల శేషుడు
మాయని శిరసులపై మాణికాల శేషుడు
యే యెడ హరికి నీడై యేగేటి శేషుడు ॥వీడు॥
పట్టపు వాహనమైన బంగారు శేషుడు
చుట్టు చుట్టుకొనిన మించుల శేషుడు
నట్టుకొన్న రెండువేలునాలుకల శేషుడు
నెట్టన హరిబొగడ నేరుపరి శేషుడు ॥వీడు॥
కదిసి పనులకెల్లఁ గాచుకున్న శేషుడు
మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు
అదె శ్రీవేంకటపతి కలమేలుమంగకును
పదరక యేపొద్దూ పానుపైన శేషుడు ॥వీడు॥
భావం:
॥పల్లవి॥
వీడు కదా ఆది శేషుడు.  శ్రీవేంకటాద్రిపై వేంకటేశ్వరుని కొలుస్తున్న ఆది శేషుడు.  
ఉత్సాహంతో ఉంటూ  గరుత్మంతునితో  పెన్నుద్ది అయిన(=a powerful combatant to match another equally powerful.)
ఆది శేషుడు వీడు.  
1
వేయిపడగలతోడ వెలసినవాడు ఆది శేషుడు.  
ఆకుపచ్చని రంగుకల శరీరముతో  తళుకుగొలిపే  వజ్రాల కాంతితో ఉన్నవాడు  ఆదిశేషుడు.  
ఏనాడు మాయని తలలపై  మాణిక్యాలున్నవాడు  ఆదిశేషుడు.
ఎప్పుడూ  హరికి నీడగా ప్రయాణం చేసేవాడు ఆదిశేషుడు. 
2
శ్రీహరికి పట్టపు వాహనమైనవాడు  చక్కని  ఆదిశేషుడు.
తన వేయి పడగల కాంతి తనచుట్టూ ఉండగా  ప్రకాశించేవాడు ఆదిశేషుడు.
విడువక ఉండు రెండువేలునాలుకలు కలిగినవాడు  ఆదిశేషుడు.
చక్కగా హరిని పొగుడు  నేర్పరియైనవాడు  ఆదిశేషుడు. 
3
సమీపానికి వచ్చు విష్ణుదేవుని భక్తుల పనులన్నీ  స్వామి ఆనతితో   నెరవేర్చు స్వభావము కలిగినవాడుఆదిశేషుడు.
మొట్టమొదట దేవతలందరూ  మొక్కే దేవుడు  ఆదిశేషుడు.
అదిగో !  శ్రీవేంకటపతికి  అలమేలుమంగకు  చలించక ఎప్పుడూ  పానుపైనవాడు  ఆదిశేషుడు.( శ్రీమహావిష్ణువును ఆదిశేషుడు అనుసరిస్తుంటాడు. స్వామివారికి ఆసనముగా మారతాడు.  గొడుగులా తన పడగలను విప్పుతాడు. స్వామి అలసినప్పుడు  పట్టుపానుపులా మారతాడని ప్రసిద్ధి).
విశేషాలు
అన్నమయ్య 29 సంపుటాలు తిరగవేస్తే ఈ 22 “శేష” వర్ణనలు కనిపించాయి.
1. అదివో అల్లదివో హరివాసము
పదివేలుశేషుల పడగల మయము01-023
2. సిరులసొమ్ములతోడ శేషునిపైఁ బవళించి
సొరిది దాసులఁ గృపఁ జూచుకొంటాను01-478
3. పరపగు శేషుని పడగల నీడల
అరుదగు రవిచంద్రాంకముల2-113
4. శేషుని పడగెనీడఁ జేరి యశోద యింటికి
శేషజాతి కాళింగుఁ జిక్కించి కాచె(3-402)
5. యీ పొద్దుకుఁ బోయిరారో ఇంద్రాది దేవతలు
శ్రీపతి పవ్వళించెను శేషునిమీఁద(03-525)
6. గరుడ సేనేశులను ఘనుని శేషుని మరియు
వరమతులఁ బాదసంహినులను( 04-540)
7. వెదచల్లుమణుల వేయిపడగలను
చెదరని మెరుఁగుల శేషునిపై
మృదువుఁ బరపుగా మెల్లనె పొరలుచు
నిదురవోదువట నీవా యిపుడు (04-565)
8. సొరిది శేషుని పెద్దచుట్టు పెనుఁగేవడము
సిరి దొలఁక నొకచేతఁ జిత్తగించి (04-569)
9. తెల్లని కన్నులతోడ తేనెగారు మోవితోడ
చెల్లుబడిఁ బవ్వళించీ శేషునిమీఁద
వెల్లిగొను పూర్పులతో వెన్నెల నవ్వులతోడ
కొల్లవలపులతోడ గోవిందరాజు(05-141)
10. సొరిది శేషుని పెద్దచుట్టు పెనుఁ గేవడము
సిరిదొలఁక నొకచేతఁ జిత్తగించి(05-210)
11. తిరు దండెల పై నేఁగీ దేవుఁడిదే తొలునాఁడు
సిరుల రెండవ నాఁడు శేషుని మీఁద (07-192)
12. మందానిలుండెదిరి మనసుగలఁచిన ఫలము
కందువగు శేషునికిఁ గాటియ్యవలసె (07-300)
13. చెదరని యారనే శేషునిఁ బూఁచి (07-409)
14. తనబంటు శేషుని తరితాడు గావించి - కొననాధారమై నిలిచె గోవిందుఁడే (07-409)
15. ముప్పదిమూఁడు గోటులై ముంచిన సురల నోళ్లు
విప్పిన శేషుని రెండువేల జిహ్వలు
తప్పులేని యనంతవేదంబుల శబ్దములు (15-349)
16. వాచవి శేషునివాతివిందు తరి
వేచి యీపెకును వెగటా(టే?) లాయా (16-370)
17. చెంగి పోయి వైకుంఠాన శేషునిపై బండితివి
చెంగఁట నీచెలి యారు శేషుఁడే కాఁడా(17-469)
18. చెలరేఁగి నవ్వుకొంటా శేషునిపైఁ బవళించి (19-143)
19. చిప్పిలుతా నొత్తగిలె శేషునిపడగెనీడ(19-578)
20. చెలియారనియెడి శేషుడు గలుగఁగ
అలతురుము భార మానె నిదె (24-191)
21. తెల్లని కన్నులతోడ తేనె గారుమోవితోడ
చెల్లుడిఁ బవ్వళించె శేషునిమీఁద (26-126)
22. చెందినమాణికముల శేషునిపడగెమీఁద
చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుఁడు(26-181)
ఆదిశేషుని రంగు
నమ్మాళ్వారు రచించిన తిరువాశిరియములో ఇలా ఉంది.
“స్వచ్ఛమైన తెల్లని పాలకడలి అలల నడుమన, ఆకుపచ్చ రంగు కలిగిన ఆదిశేషుడు తన వేయి పడగలను చేతి ఆకారపు గొడుగుగా చేసి, తన శరీరమును పానుపుగా చుట్టి ఉంచగా, ఆ పానుపుపై ఎరుపు రంగు మరకత మణి వర్ణముల మేళవింపుతో , పెద్ద మేఘము వంటి పర్వతాకారుడు, ప్రకాశవంతమైన సప్త వర్ణ సూర్యకాంతులతో, మిణుకు మిణుకుమంటూ మెరిసే నక్షత్రకాంతుల కలగలుపు నింపుకొని, చంద్రుడు చిందించు చల్లదనమును మించిన చల్లదనపు ప్రకాశము కలిగిన శరీరముతో, ఆ శరీరమునకు తగిన పీతాంబరము, కిరీటము, కంఠి మొదలగు అద్భుతమైన రత్న మణిమయ బంగారపు వజ్రాభరణములను ధరించి, ఉజ్వలమైన పగడపు అథరము చిద్విలాసపు చిరునవ్వులు చిందించుచుండగా, ఎర్రబారిన కలువకన్నులు మూసుకొని, తన నాభియందు తామరపువ్వును కలిగిన అద్వితీయ సుందరాకారపు సర్వేశ్వరుడు, ముల్లోకములు పూజించు సుందర దివ్య పాద పద్మములు కలిగిన శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో మునిగెను. ఆయనయే మోక్షప్రధానుడు.”
కనుక ఆదిశేషుని రంగు ఆకుపచ్చన అని చెప్పుకోవచ్చు.
శేషవాహనుడైన స్వామి మనందరికి అశేషముగా  అనుగ్రహించుగాత !
****

No comments:

Post a Comment

Pages