శ్రీ స్వయంభూ సిధ్ధేశ్వరాలయం, సిధ్ధేశ్వర కొండ
తరచి చూడాలేగానీమన దేశంలో భగవంతుడు స్వయం
వ్యక్తంగా అవతరించిన ప్రదేశాలు, ఋషుల తపస్సుతో పునీతమైన ప్రదేశాలు ఎన్నో
కానవస్తాయి. ఒక్కొక్కసారి అసలు ఇలాంటి
ప్రదేశాల్లో మనుషులు ఎలా నివసించారా అనే ఆశ్చర్యం కూడా మనలాంటి వాళ్ళకి సహజం. కానీ ఆ కాలంలో వారు తమ సుఖాలకోసం చూసుకోకుండా,
ముక్తి కోసం భగవంతుని ధ్యానంలోనే జీవితాలు గడిపేవారు.
అలా కొందరు మహా మునులు తపస్సు చేసుకున్న ప్రదేశం
ఈ సిధ్ధేశ్వర కొండ. ఇది చిత్తూరు జిల్లా,
టి.పుత్తూరు నుంచి పది కిలో మీటర్ల దూరంలోపే వున్నది.
ఈ ఆలయాన్ని మేము దర్శించటం కూడా ఆశ్చర్యకరమే. నేను, మా స్నేహితురాలు ఉమామహేశ్వరి చిత్తూరు
జిల్లాలోని ఆలయ సందర్శనానికి వెళ్ళినప్పుడు మిత్రులు శ్రీ సాంబశివ రెడ్డి, శ్రీ
పురందర రెఢ్ఢిగార్లు తమ ఊరు టి. పుత్తూరుకి సమీపంలో వున్న ఈ కొండ గురించి చెబితే
మేము ఎక్కలేమేమోనండీ అన్నాము ఇద్దరం జంటగా.
ఎక్కక పోయినా పర్వాలేదులెండి, కిందనుంచి చూసి వద్దురుగానీ, అది చాలా మహిమగల
ప్రదేశం అని చెప్పారు.
సరేనని బయల్దేరాము. కారులో వెళ్తుండగా దోవలో ఇంకొక విషయం కూడా
చెప్పారు. ఈనాడు అధినేత శ్రీ
రామోజీరావుగారి కోడలు శ్రీమతి శైలజగారిది ఆ ఊరేనట. ఆ మధ్యనే ఆవిడ వచ్చి ఆ స్వామికి పూజలు జరిపించి
వెళ్ళారుట.
మేము వెళ్ళిన దోవలో మాకు గ్రామమేమీ కనబడలేదుగానీ,
ఒక పక్కనుంచి కొండమీదకి రోడ్డు వేస్తున్నారు.
ఈ గుహాలయానికి తూర్పునుండి నవిశెట్టిపల్లి కనుమదారి, పడమరనుంచి వడ్డి
పల్లె, మోదల పల్లె దారి, ఉత్తరం నుంచి టి.పుత్తూరు దారి వున్నాయి. ఈ ఊర్లవారు వాళ్ళ ఊర్లనుంచి దేవాలయానికి దోవలు
నిర్మించుకుంటున్నారు.
దోవ సన్నగా వున్నా బాగానే వున్నది. కొండ సమీపిస్తుండగా పెద్ద వినాయకుడి విగ్రహం,
షెడ్లు కనిపించాయి. ఉత్సవాల సమయంలో
చాలామంది జనం వస్తారుట. ఆ షెడ్లల్లో
వారికి భోజనాలు ఏర్పాటు చేస్తారుట.
కొండదాకా కారు వెళ్ళదు. కొంచెం
ఇవతలే ఆపాల్సి వచ్చింది. ఎగుడు దిగుడుల కొండ
నేల. ఇంత దూరం వచ్చాం కదా, కొండ కిందనించయినా చూసి వద్దామనే ఉద్దేశ్యంతో చిన్న
చిన్న గుట్టలు దాటుకుంటూ కొంచెం దూరం నడిచాం.
700 అడుగుల ఎత్తున కొండ. కొండ
ఉత్తరం వాలులో ఉత్తర ముఖంగా ఒక గుహ వున్నది.
అక్కడే గుహలో శివలింగాలున్నాయి. కొండకి ఆన్చి రెండు ఇనుప నిచ్చెనలున్నాయి. కొండకి ఆనుకునే ఒక దేవ గన్నేరు చెట్టు ఆకులు
పూవులు లేవుగానీ శాఖలు విస్తరించుకుని వున్నది. 50 అడుగుల ఎత్తు ఎక్కితే అక్కడ
గుహాలయం. అది చూడగానే మా ఉమకి నాకూ,
కొద్ది మెట్లే వున్నాయి కదా నెమ్మదిగా ఎక్కదామా అనే ఆలోచన వచ్చింది. ధైర్యం చేసి ఎక్కేశాం.
నిచ్చెనకి 18 మెట్లే వున్నాయిగానీ, మాలాంటి
వాళ్ళకి కొంచెం కష్టసాధ్యమే అయింది. పైన
సన్నటి దోవలో కొంచెం ముందుకు వెళ్తే ఒక మనిషి మాత్రమే పట్టే (కొంచెం వంగుని వెళ్ళాలి) గుహ దోవ, శివ లింగాలు కనిపించాయి. నేనయితే ఆ సన్నటి దోవలో వంగుని వెళ్ళలేనని
ఇవతలనుంచే దర్శనం చేసుకున్నాను.
శివరాత్రి, ఇంకా మిగతా ఉత్సవాల సమయంలో ఇక్కడకి
భక్తుల రాక ఎక్కువగా వుంటుందిట.
అలాంటప్పుడు ఇంత ఇరుకు దారిలో, ఎంత కష్టపడుతూ వెళ్ళి స్వామి దర్శనం చేసుకు
వస్తారో అనిపించింది. మరి ఒకరి తర్వాత
ఒకరు వెళ్ళాల్సిందే. ఇద్దరు ముగ్గురుకన్నా
అక్కడ మిగతావారు వేచి వుండటానికి కూడా స్ధలం లేదు.
పూర్వం ఇక్కడ మునులు తపస్సు చేసుకున్నారని
చెప్పాను కదా. ఆ సమయంలో ఎవరో చూశారని,
వారి తపస్సుకు భంగం కలిగిందని వారు ఆ గుహలోకి వెళ్ళి ఒక పెద్ద బండ రాయిని దోవకి
అడ్డంగా పెట్టారుట. తర్వాత కాలంలో ఆ
రాతిని జరపాలని ఎంతమంది చూసినా జరగలేదుట.
ఇదివరకు ఆ రాతిని ముట్టుకుంటే విభూతిలా వచ్చేదని, దానిని భక్తులు అత్యంత
భక్తితో ప్రసాదంగా తీసుకుని తమ ఈతి బాధలు పోగొట్టుకునేవారని కధనం. ప్రస్తుతం ఆ రాతిని రాస్తే విభూతి రావటంలేదు.
ఆ గుహకి ముందే ఒక రాతి తొట్టెలాంటి దానిలో (గుహలో ఏర్పడినదే) నీళ్ళు వున్నాయి. దానిని దొనె అన్నారు. ఆ దొనెలో నీరు ఎప్పుడూ వుంటుందిట. ఆ నీటిని కూడా భక్తులు తమ అనారోగ్యాలు, ఈతి బాధల నివారణార్ధం సేవిస్తారుట. ఇంత దూరం వచ్చినందుకు ఆ నిచ్చెన ఎక్కి, స్వామి దర్శనం చేసుకున్నామని సంతోషంగా కిందకి దిగాం. దిగి తలెత్తి చూస్తే దేవగన్నేరు చెట్టు రారమ్మని పిలిచినట్లనిపించింది. అంత చక్కగా వున్న ఆ చెట్టుని ఎక్కకుండా వెళ్ళి పోవటమేమిటని మళ్ళీ కొంచెం దూరం ఎక్కి ఆ చెట్టుకూడా ఎక్కేశాను. అక్కడ తీసిన ఫోటోలు చుట్టూ కొండ దృశ్యాలతో చాలా బాగా వచ్చాయని ఇంకా సంతోషించాము.
వర్షా కాలంలో ఈ కొండపైనుంచి నీరు జలపాతంలాగా
పడుతూ వుంటుందిట. అప్పుడు ఆలయ సందర్శన తడుస్తూనే .. ఇంకా కష్టమవుతుంది కూడా. ఇక్కడ ఇంకొక విశేషమేమిటంటే కొన్ని ఆలయాలలో
స్వామి మీద సూర్యకాంతి ఉదయమో, సాయంత్రమో ప్రసరంచేటట్లు నిర్మాణం జరిగి
వుంటుంది. ఇక్కడ సూర్యుని కిరణాలు స్వామి
మీద మధ్యాహ్నం సమయంలో స్వతసిధ్ధంగానే పడతాయి, ఏ
నిర్మాణ నైపుణ్యం లేకుండానే.
కాణిపాకం, అర్ధగిరి నుంచి దాదాపు 10 కి.మీ. ల
దూరంలో, చిత్తూరు నుంచి టి.పుత్తూరు మీదుగా 18 కి.మీ. ల దూరంలో వున్న ఈ
క్షేత్రాన్ని అభివృధ్ధి చేస్తే భక్తుల రాకపోకలు ఎక్కువవుతాయనటానికి సందేహం
లేదు. ఇలాంటి ప్రకృతి సిధ్ధమైన గుహాలయాల
దర్శనం మానసికోల్లాసాన్నిస్తుంది.
ప్రస్తుతం ఈ ప్రాంతాలలో ఎక్కడినుంచయినా సొంత
వాహనంలో తేలికగా వెళ్ళి రావచ్చు. ఆహారం,
పానీయం తీసుకెళ్ళటం మాత్రం మరచిపోవద్దు.
***
No comments:
Post a Comment