"తొలగిన తెరలు"
డా.బల్లూరి ఉమాదేవి
"రాధా రాధా ఏం చేస్తున్నావోయ్ ?"
"కాఫీ కలుపుతున్నానండి, వస్తున్నా" అంటూ బదులిస్తూ రెండు కాఫీ కప్పులు పట్టుకొని, హాల్లోకి వచ్చి వేణు చేతి కొక కప్పు ఇచ్చి, తాను కాఫీ కప్పు తీసుకుని సోఫాలో కూర్చొని తాగడం మొదలెట్టింది. పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్న వేణు, హటాత్తుగా రాధ వంక చూస్తూ,
" రాధా ఇది విన్నావా?"
"ఏదండీ ?"
"అదే మన సురేష్ లేడూ! "
"ఉన్నాడు, అయితే?"
"అబ్బా వెటకారాలు వద్దు, చెప్పేది విను ."
"సరే చెప్పండి ."
"సురేష్ సంసారంలో చిన్నచిన్న గొడవలున్న సంగతి నీకు తెలుసు కదా. చిలికి చిలికి గాలివాన అయినట్లు ఇప్పుడది విడాకుల దాకా వచ్చిందట, చాలా బాధపడుతున్నాడు. అసలే మెతక మనిషి . ఈ వార్త విన్నప్పటి నుండి నాకే ఏదోలా వుంది. వాడి పరిస్థితి ఎలావుందో మరి!"
"ఔనా. ఇల్లన్నకా గొడవలు మామూలే కదండి. ఐనా ఇదేం పోయె కాలమండి ఆ ప్రీతికి. హాయిగా కాపురం చేసుకోక. అసలేం తక్కువైంది తనకు? చక్కని భర్త. ఐదంకెల జీతగాడు. ఏ బాదరబంది లేదు కదా. పాలునీళ్ళలా కలిసిమెలిసి వుండక ఎందుకిలా చేస్తుందా ప్రీతి. చూస్తే ఎంతో అమాయకంగా కనిపిస్తుంది కదండి."
"ఔను రాధా అదే వాడి కొంపముంచింది. ఎలా వుండే వాడు ఎలా అయ్యాడో తెలుసా? చిన్నప్పటి నుండి కలిసి చదువుకొన్నాం. వాడి స్వభావం నాకు బాగా తెలుసు. ఒకరి జోలికెళ్ళడు. తననెవరైనా అన్నా తాను బాధపడతాడే కాని ఎందుకిలా అన్నారని అడిగేవాడు కాదు. వాళ్ళమ్మకు ఒక్కగానొక్క కొడుకు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అమ్మే సర్వస్వమై అల్లారుముద్దుగా పెంచి ప్రయోజకుడిని చేసింది తెలుసా?"
వింటున్న రాధ "ఔనా ! అలాంటివారికీ గతి పట్టిందంటే ఆశ్చర్యంగా వుంది.
పైవాడి లీలలంటే ఇవేనేమో. వాళ్ళమ్మ కు తెలిస్తే ఎంత బాధ పడుతుందో కదా" అంటూ , కాఫీ కప్పులు పట్టుకొని లోపలికెళ్ళింది.
మళ్ళీ పేపర్ లో తలదూర్చాడు వేణు.
***
సురేష్ మంచి స్ఫురద్రూపి. విశాలమైన నుదురు చక్కని కళ్ళతో కోటేరులాంటి ముక్కుతో, మంచి రంగుతో ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు .బీటెక్ పూర్తి కాగానే మంచి ఉద్యోగం రావడంతో తల్లి పెళ్లి చేసి, తన బాధ్యత తీర్చుకోవాలనుకొని సంబంధాలు వెతికి మంచి సంబంధమని తెలిసినవాళ్ళ ద్వారా కుదుర్చుకొని నిశ్చయం చేసింది. అమ్మాయి తండ్రి రామారావు బ్యాంక్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి సీతమ్మ గృహిణి. ఒక కొడుకు,ఒక కూతురు. అమ్మాయి పేరు ప్రీతి. ఎంబిఏ చదివింది. సంప్రదాయబద్ధంగా పెళ్ళిచూపులు జరిగాయి. ఇరుపక్షాలవారు అంగీకరించడంతో పెళ్ళి ఘనంగా జరిగింది. పదహారురోజుల పండుగ తరువాత అద్దెకో ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు. అత్తామామలు, అమ్మ వెళ్ళి ఇల్లంతా సర్ది నాలుగు రోజులు వుండి వెళ్ళి పోయారు.
ఇంతవరకు ఇల్లు చదువు తప్ప మరేమి తెలియని ప్రీతికి ఒక్కసారిగా బాధ్యత, స్వేచ్చ లభించడంతో విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించిన దంతా కొనడం మొదలెట్టింది. భర్తయొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని గొంతెమ్మ కోరికలు కోరడం తీర్చుకునే వరకు అలగడం ప్రారంభించింది.
భార్య మాట కాదనలేక ఆమెను మార్చుకోలేక, ఎవరికి చెప్పకోలేక లోలోపలే కుమిలిపోతున్నాడు సురేష్.
ఏపనిపాట లేకపోవడంతో పొద్దస్తమానం టీవికి అంకితమై పోయి వాళ్ళలాగే వర్తించసాగింది.
“ఏ సీరియల్ చూసినా ఏమున్నది గొప్పకథాంశమన్నట్టు”, అందులోని ఆడవిలన్లను చూస్తూ అలా మారిపోసాగింది.
భర్త ఔనంటేకాదనడం కాదంటే ఔననడం అలవాటైపోయింది. పైగా పిల్లలు కూడా పుట్టక పోవడంతో, భర్తదే తప్పదన్నట్టుగా ఈసడించుకోవడం ఎక్కువైంది.
వారం రోజుల క్రితం సురేష్ ఆఫీస్ నుండి వస్తూనే "ప్రీతీ తలనొప్పిగా వుంది కాస్తా కాఫీ ఇస్తావా?" అని అడిగాడు.
అంతే, "ఆ అదొక్కటే తక్కువ నీమొహానికి అంటూ, ఏం నేను పనిమనిషి ననుకొన్నావా? నాకేంపనిలేదా, నీవు అడగ్గానే ఇవ్వాలా?" అంటూ అరవడం మొదలెట్టింది. సురేష్ జవాబు వినకుండా అతని సహనం హద్దులు దాటేలా చేసింది.
అంతే, "ఆ అదొక్కటే తక్కువ నీమొహానికి అంటూ, ఏం నేను పనిమనిషి ననుకొన్నావా? నాకేంపనిలేదా, నీవు అడగ్గానే ఇవ్వాలా?" అంటూ అరవడం మొదలెట్టింది. సురేష్ జవాబు వినకుండా అతని సహనం హద్దులు దాటేలా చేసింది.
"సరే వాదనలు ఎందుకు. ఇస్తే ఉంటే ఇవ్వు లేకపోతే నోర్ముసుకో", తీవ్రస్థాయిలో అరిచాడు .
అంతే ప్రీతి భద్రకాళిలా మారింది.
"ఏం నన్ను నన్ను నోర్ముసుకోమంటావా? నీకెలా కనిపిస్తున్నాను? నేను కాబట్టి నీతో కలిసి కాపురం చేస్తున్నాను. పనికిమాలిన వాజమ్మవు. ఇక నావల్ల కాదు. నీతో కాపురం చేయలేను. నాకు విడాకులు కావాలి అంతే. అది ఎంతో త్వరలో అయితే అంత మేలు ఇద్దరికీ," అంటూ పెద్ద పెద్ద అంగలేసు కొంటూ గదిలోకి వెళ్ళిపోయింది.
సురేష్ కు పిచ్చెక్కి నట్టు అనిపించింది. కప్పు కాఫీ కింత రభసా అనుకొంటూ అలాగే సోఫాలో ఒరిగి పోయాడు. రాత్రంతా కలత నిద్రే. ఎప్పుడో తెల్ల వారు ఝామున నిద్ర పట్టింది. మెలకువ వచ్చే సరికి బారెడు పొద్దెక్కింది. తిరిగి చూసేసరికి ప్రీతి కాఫీ తాగుతూ టీవీ చూస్తూ కనిపించింది.
ఓసారి సురేష్ ను చూసి మళ్ళీ టీవీ లో మగ్నమైంది. సురేష్ బాత్రూమ్ లోకెళ్ళి ఫ్రెషై వచ్చాడు.
ప్రీతి కదలలేదు.
"ప్రీతీ ఇప్పుడైనా కాఫీ ఇస్తావా? " అని అడిగాడు.
"లోపలుంది. కావాలంటే కలుపుకుని త్రాగమని," పెడసరంగా బదులిచ్చింది. చేసేదేంలేక లోపలికెళ్ళి పాలు డికాషన్ కలుపుకుని వేడి చేసి చక్కెర కలుపుకొంటూ హాల్లో సోఫాలో కూర్చున్నాడు.
"ఏం ప్రీతి కోపం తగ్గలేదా?" అంటూ మాట కలిపే లోగా ప్రీతి గభాలున లేచి టీవీ కట్టేసి లోపలికి వెళ్ళబోయింది.
"ఆగు ఏంటిది చిన్న పిల్లలా? ఇంకా అలకేనా ?" అంటూ వుండగానే "ఇదిగో విను, విడాకుల మాట తప్ప ఇంకేం ప్రస్తావన మన మధ్య రాదు, రాకూడదు." అంటూ లాగి కొట్టినట్లు చెప్పి గదిలో దూరి గట్టిగా తలుపేసుకుంది.
"హా హతవిధీ," అనుకొంటూ కూలబడి పోయాడు. ఇంటికంటే ఆఫీస్ నయమనుకొంటూ దుస్తులు మార్చుకొని తలుపులు ముందుకు లాగి వెళ్లి పోయాడు.
ఆఫీస్ కెళ్ళినా ధ్యాస మరోవైపు వుండడంతో అన్యమనస్కంగా పని చేస్తున్న సురేష్ ను మిత్రులు "ఏంటి సార్ అలా వున్నారు? ఆరోగ్యం బాగా లేదా?" అని అడిగితే ఏం లేదని అంటూ పనిలో నిమగ్నమయ్యాడు.
ఇదంతా చూస్తూ వున్న వేణు మెల్లగా దగ్గర కొచ్చి "ఏరా ఏదైనా గొడవ జరిగిందా? "అంటూ చనువుగా భుజం పై చేయి వేసి అడిగాడు.
అంతే, అంతవరకు ఆపుకోన్న బాధ కన్నీరుగా మారింది. అటు ఇటు చూసి
అంతే, అంతవరకు ఆపుకోన్న బాధ కన్నీరుగా మారింది. అటు ఇటు చూసి
"రారా కాఫీ తాగొద్దాం," అని బలవంతంగా తీసుకెళ్ళాడు.
చిన్నప్పటి మిత్రుడు కావడం, తనగురించి పూర్తిగా తెలిసిన వాడు కావడం తో, మరోసారి ఏం జరిగిందని అడగక ముందే జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పేశాడు. అంతా విని గట్టిగా నిట్టూర్పు విడుస్తూ, "బాధ పడకురా. అంతా త్వరలో సర్దుకొంటుందని" అనునయిస్తూ కాఫీ తాగి మళ్ళీ పనుల్లో పడి పోయారు.
ఇదంతా విన్న రాధ, " ఛీ ఇలా జరిగిందేంటి? ఐనా ప్రీతి ఎందుకిలా మారింది? చదువుకొన్న మూర్ఖురాలయింది. చేజేతులా సంసారాన్ని పాడు చేసుకొంటున్నదంటూ" బాధను వ్యక్తం చేసింది.
ఒకే ఇంట్లో వుంటున్నా ప్రీతి సురేష్ లు ఎడమొహం పెడమొహంలా కాలం గడుపుతున్నారు . ఎప్పుడేం జరుగుతుందో అని భయపడుతున్నాడు సురేష్.
చెప్పా పెట్టకుండా వచ్చిన తల్లిదండ్రులను చూసి ఆశ్చర్యపోయారు దంపతులు. సురేష్ పిలిపించాడేమో అని ప్రీతి, ప్రీతి పిలిపించిందేమోనని సురేష్ అనుకొంటూండగానే తల్లి, "నిన్ను చూడాలని అనిపించింది. ఇదిగో మీ నాన్నను ఉన్నఫళంగా తీసుకెళ్ళమని పోరు పెట్టి మరీ వచ్చాను," అనడంతో
అమ్మయ్య అంటూ ఇద్దరూ నిట్టూర్చారు. రెండు రోజులుండి వెళ్లి పోయారు.
"ఇద్దరూ ముభావంగా వున్నారు గమనించావా?" అని ప్రీతి తండ్రి అంటే "సంసారమన్నాక ఏవో గిల్లికజ్జాలు సహజం కదండీ," అని సర్ది చెప్పింది తల్లి.
ఓరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో వేణుకు ఫోన్ చేశాడు సురేష్ గాభరాగా.
"హలో వేణూ ఓసారి రారా. నాకెందుకో చాలాభయం గా వుంది." ఏం జరిగిందని ఆందోళనగా అడిగాడు.
"ప్రీతీ ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది రా. ఏదేదో పలవరిస్తూ వుంది. నాకాళ్ళు చేతులాడడం లేదురా."
"భయపడకు వస్తున్నా."
రాధను లేపి సంగతి తెలిపి వెళ్ళొస్తానంటూ చొక్కా..చెప్పులు వేసుకుని స్కూటర్ పై వెళ్ళాడు. వెళుతూ అంబులెన్స్ కు ఫోన్ చేయడంవల్ల వేణు సురేష్ ఇంటికి వెళ్ళేసరికి అంబులెన్స్ సిద్ధం గా వుంది. వెంటనే ముగ్గురు అందులో వెళ్లి పోయారు. హాస్పెటల్ చేరగానే నర్సులు స్ట్రెచర్ పై తీసుకుని వెళ్ళారు. వైరల్ ఫీవర్ అంటూ రక్తపరీక్ష చేయడానికి రక్తం తీసుకుని ఐసియు లో చేర్చుకొన్నారు.
24 గంటల్లో వరకు ఏం చెప్పలేమన్నారు. ప్రీతీకస్సలు స్పృహ లేదు. మళ్ళీ వస్తానని దిగులు పడవద్దని చెప్పి వేణు ఇంటికి వచ్చాడు.
రాధకు సంగతిని తెలిపి ఆఫిస్ కెళ్ళాలని తయారవసాగాడు.
ఆఫిస్ పనిపై వేణు పూనా వెళ్ళాల్సి వచ్చింది. అదే సమయంలో ఇంటికి బంధువులు రావడం తో రాధకూడా హాస్పిటల్ కు వెళ్ళలేక పోయింది.
పది రోజులు హాస్పిటల్లో వుండి, కాస్త కోలుకున్న తర్వాత ప్రీతిని డిశ్చార్జ్ చేశారు. సురేష్ ఆఫీస్ కు సెలవు పెట్టి ప్రీతిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇంటికొచ్చామని ప్రీతి కోలుకుంటూ ఉందని వేణుకు ఫోన్ చేసి చెప్పాడు.
***
"ఎవరండీ ఫోన్లో?" అడిగింది రాధ
"మన సురేష్."
"ఎలా వుందంట ప్రీతి?"
"ఇంటికొచ్చారట.బాగుందట."
"ఔనా!"
"రాధా ఓసారి సురేష్ వాళ్ళింటికి వెళ్ళొద్దామా?"
"అలాగే నండి. కాని తనేమైనా అనుకొంటుందేమో?"
"ఏం ఎందుకనుకొంటుంది?"
"పరామర్శించడానికి వచ్చామని చెబుదాం."
సరేనంటూ వెంటనే టిఫిన్ వంట చేసి వేణుకు కారియర్ లో సర్దింది. గబగబా టిఫిన్ తిని తయారయి వచ్చేసింది.
దార్లో ఆగి బ్రెడ్, పళ్ళు, పూలబొకె తీసుకుని సురేష్ ఇంటికి వచ్చారు.
కాలింగ్ బెల్ శబ్దం విని "ఎవరూ?" అంటూ సురేష్ వచ్చి తలుపు తీశాడు.
"అరె మీరా రండి రండి," అంటూ ఆహ్వానించాడు.
ప్రీతీ ఎలావుందన్నయ్యా చనువుగా అడుగుతూ లోనికి నడిచింది రాధ.
"దేవుడిదయవల్ల బాగుందమ్మా .పెద్ద గండం గడిచింది. ప్రీతీ ఎవరొచ్చారో చూడూ?" అంటూ పిలిచాడు సురేష్.
"దేవుడిదయవల్ల బాగుందమ్మా .పెద్ద గండం గడిచింది. ప్రీతీ ఎవరొచ్చారో చూడూ?" అంటూ పిలిచాడు సురేష్.
"ఎవరండీ?" అంటూ లేవబోయింది.
"ఆగు. లేవకు అని రాధ" అంటూ, ప్రీతి వున్న గదిలోకి వెళ్ళి టేబిల్ పై బ్రెడ్డు పళ్ళు పెట్టి, బొకే చేతికిస్తూ "ఎలావున్నవని?" చేతిని పట్టుకోగానే "ఇదిగో ఇలా రా కూర్చో." అంది ప్రీతి
"అందరిని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు తెలుసా." అంటూ మాట కలిపింది.
"ఆగు. లేవకు అని రాధ" అంటూ, ప్రీతి వున్న గదిలోకి వెళ్ళి టేబిల్ పై బ్రెడ్డు పళ్ళు పెట్టి, బొకే చేతికిస్తూ "ఎలావున్నవని?" చేతిని పట్టుకోగానే "ఇదిగో ఇలా రా కూర్చో." అంది ప్రీతి
"అందరిని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు తెలుసా." అంటూ మాట కలిపింది.
వేణు లోపలికొచ్చి పరామర్శించి ఆఫీసుకు టైమైందంటూ వెళ్ళిపోయాడు.
అక్కడే వున్నసురేష్ ను చూస్తూ, "అదేంటన్నయ్యా, మీరే పేషంట్ లా వున్నారే." అడిగింది ఆశ్చర్యంగా.
"అబ్బే లేదమ్మా, మాసిన గడ్డం.పీక్కుపోయిన కళ్ళు..మొహంలో అలసట కనిపిస్తుండగా కాఫీ కలుపుకొస్తాననడంతో," రాధ
"ఇంకానయం. మీరుండండి. నేనే కలుపుకొస్తా" అంటూ చొరవగా వంటింట్లోకెళ్ళి మూడు కప్పుల్లో కాఫీ కలుపుకొచ్చింది. అంతలో సురేష్ ప్రీతిని లేపి బాతురూం తీసుకెళ్ళి మొహం కడిగించుకొని వచ్చాడు. రాధ ఇచ్చిన కాఫీకప్పునందుకొని మెల్లగా తాగసాగింది ప్రీతి.
ఆ మొహంలోని పశ్చాత్తాపాన్ని చిటికెలో గ్రహించింది రాధ. ఇప్పుడు బ్రెయిన్ వాష్ చేస్తే ఫలితముంటుందనుకొంది.
"రాధా కాసేపుంటావా అమ్మా? ప్రీతికి మందులు తేవాలి అలాగే కూరలు తేవాలి." అడిగాడు సురేష్.
"అడగాలా అన్నయ్యా. వెళ్ళిరండి. ఆయనొచ్చేవరకు ఉంటాననడంతో" సురేష్ బయటికెళ్ళాడు.
తలుపు చేరవేసి వచ్చిన రాధ, ప్రీతి ప్రక్కనే కూర్చోని చేతిని పట్టుకొని నిమరగానే ప్రీతి దుఃఖాన్ని ఆపుకోలేక పోయింది. రాధ ఒళ్ళో తలపెట్టుకొని ఏడవసాగింది.
"ఏంభయపడకు. ఏం కాలేదుగా."
"నిజమే రాధా ఏంకాలేదు. జరిగింది తలచుకొంటే, అదే జరిగుంటే ఏమైపోయుండేదాన్నో అనే భయం ఇంకా భయపెడుతోంది తెలుసా?"
వీపుపై చేయి వేసి నిమురుతూ, "సరే జరిగిందో పీడకల అనుకో.ఇకపై జాగ్రత్తగా వుంటే సరి."
"నా ఆరోగ్యం గురించి కాదే. జరిగినసంఘటనల గురించి." అంటూ ఏదో చెప్పబోయింది ప్రీతి.
"తరువాత మాట్లాడవచ్చు ముందు విశ్రాంతి తీసుకో."
"బావున్నానే, విను, "అంటూ జరిగిందంతా చెప్పింది.
అంతా విన్నరాధ మనసులో ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తుంటే తనే చెప్పుకొచ్చింది. ఇనుము వేడిగా వున్నపుడే సుత్తిదెబ్బలు పడాలి అనుకొంటూ, "సరే ఇప్పుడు చెప్పు ప్రీతి తప్పెవరిదంటావు? ముందు నేనడిగిన దానికి జవాబులు చెబుతావా." అని అడిగింది రాధ.
"అడుగు సందేహమెందుకు?"
"సురేష్ చెడ్డవాడా?"
"కాదు."
"నీపై నోరు పారేసుకొనేవాడా?"
"కాదు."
"కొట్టేవాడా?"
"లేదు."
"చీటికి మాటికి విసుక్కొనే వాడా?"
"లేదు లేదు లేదు..."
"మరి ఇవి నీకన్వయించుకొని చెప్పు."
"నీవే సాధిస్తూవుంటావు కదా?"
"ఔను."
"అనవసరంగా నోరు పారేసుకొంటావు?"
"ఔను."
"ఎప్పుడు విసుక్కొంటుంటావు కదా?"
"ఔను."
"అతనికి వేళకు అన్నీ అమరుస్తున్నావా?"
"లేదు."
"ఆప్యాయంగా కబుర్లు చెబుతూ వడ్డించావా?"
"లేదు."
"విడాకులు సురేష్ అడిగాడా?"
"లేదు."
"పిల్లలు కలగక పోవడానికి సురేష్ ఒక్కడే కారణమా?"
"కాదు."
"మరి ఇన్ని తప్పులు నీలో వుంచుకొని ఆ బక్క ప్రాణిని, అమాయకుణ్ణి చేసి ఎందుకేడిపిస్తున్నావే చెప్పు?"
"ఐనా ప్రీతీ, నాకు తెలీక అడుగుతా, విడాకులు తీసుకొని ఏం చేస్తావే? ఒంటరిగా ఎలా బతకాలనుకొంటున్నావు? అసలే ఆత్మాభిమానం కలదానివి. అమ్మావాళ్ళదగ్గరికెళ్ళవని తెలుసు. పోనీ మరో పెళ్ళి చేసుకొనే ఆలోచనేమైనా వుందా?"
"అదికాదే..."
"మధ్యలో అడ్డుకోకు. నేను అడగడం అయ్యాక అప్పుడు చెప్పు సరేనా? మరో పెళ్ళి చేసుకొంటే అతడు సురేష్ లా వుంటాడనుకొంటున్నావా? నీ నోటి దురుసుతనం అతడు సురేష్ లా భరిస్తాడంటావా? నీ తప్పులెత్తి చూపుతూ అనుక్షణం హీనంగా మాట్లాడుతుంటే తట్టుకోగలవా? అందుకే నిన్ను సురేష్ వదిలేశాడని వ్యంగ్యంగా అంటుంటే విని భరించగలవా?" ఇలా ఇంకా ఎన్నో ప్రశ్నలు వేసి, "ఇప్పుడడుగు సందేహాలు. చెప్పు నాప్రశ్నలకు సమాధానం." అని ఆపింది రాధ.
ప్రీతి కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. గబాలున లేచి రాధను వాటేసుకొని భోరున ఏడవసాగింది. మౌనంగా చూస్తూ వుండిపోయింది రాధ. గుండెబరువు తగ్గే దాకా ఏడవనీ అనుకొంది.
కాసేపటికి తెప్పరిల్లి, రాధకు దూరంగా జరిగి చేతులు పట్టుకొని "రాధా నీ మేలు మరువలేనే. అర్థంలేని అహంకారం ఓవైపు ఆత్మనూన్యతా భావం మరో వైపు లాగుతుంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థమౌతుందే. సరైన సమయానికి వచ్చి నాకళ్ళు తెరిపించావు. కళ్ళకు కప్పిన పొరలు తొలగి పోయాయి. సురేష్ కెలా క్షమాపణలు చెప్పుకోవాలో తెలియడం లేదు. అసలు నన్ను క్షమిస్తాడా?" అని అడిగింది.
"తప్పకుండా క్షమిస్తాడు. క్షమకు మారుపేరు సురేష్. కలిసి వుంటే కలదు సుఖమన్నారు పెద్దలు. దురహంకారాన్ని తొలగించుకొని సురేష్ తో మనసు విప్పి మాట్లాడు. సమస్యేమిటో చెప్పు. అసలీ లోకంలో పరిష్కారం లేని సమస్య అసలుండదు తెలుసా? మూడోవ్యక్తి అవసరం లేకుండా నీకాపురాన్ని సరిదిద్దుకో. అంతా మేలే జరుగుతుంది," అని హితవు పలుకుతుండగా వేణూ ఆఫీసు ముగించుకొని వచ్చాడు. సురేష్ కూడ అదే సమయానికి ఓచేత్తో కూరలసంచితో మరోచేతులో మందులు, కొబ్బరిబోండాలతో లోపలికొచ్చాడు. వీలుచేసుకొని మాఇంటికి రమ్మంటూ," రాధ వేణూ వెళ్ళి పోయారు.
లోపలికి వచ్చిన సురేష్ ను చూస్తూ ఒక్క ఉదుటున, సోఫాలో నుంచి లేచివచ్చి అతన్ని గట్టిగా వాటేసుకొని, " ఏమండీ నన్ను నన్ను మనస్ఫూర్తిగా క్షమించగలరా? అసలు నువ్వేం తప్పు చేశావు?" అనడంతో తల సిగ్గుతో కుంచించుకు పోయింది.
"నేనేం చేశానో నాకు తెలుసండి. మిమ్మల్నెంత బాధపెట్టానో కూడా తెలుసు. మీలాంటి హిమవన్నగం ముందు నేనో గడ్డి పరకనండి. నన్ను నన్నూ..." ఇంక దుఃఖంతో మాట్లాడలేకపోయింది. సురేష్ అనునయిస్తూ "భార్యాభర్తలన్నాక ఒకరినొకరు భరించాలిగా," అనడంతో ప్రీతి మనసు దూది పింజలా తేలికై పోయింది.
*******
"రాధా వేడిగా పకోడీలు చేయరాదూ? హాయిగా కబుర్లాడుకొంటూ తిందాం?"
"ఆ ఆశ దోశ అప్పడం వడ. .ఆ పప్పులుడకవు మొలకెత్తిన పెసలున్నాయి. కారెట్, దోసకాయలు, మిరియాలపొడి, ఉప్పు వేసుకొస్తా. అవి తింటూ కబుర్లు చెప్పుకొందాం. సరేనా?"
"అమ్మా రాధా. మాక్కూడా కావాలి." అంటూ ఎదురుగా సురేష్ ప్రీతి నవ్వుతూ కనిపించారు.
రాధ నవ్వుతూ, "ఎలావున్నారు ? " అని అడిగింది.
"ఇదో ఇలా నీ దయ వల్ల బ్రహ్మండంగా ఉన్నాం. కళ్ళకు మనసుకు కప్పుకొన్న తెరలన్నీ తొలగిపోయాయి. నీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం."
రాధ నవ్వుతూ, "ఎలావున్నారు ? " అని అడిగింది.
"ఇదో ఇలా నీ దయ వల్ల బ్రహ్మండంగా ఉన్నాం. కళ్ళకు మనసుకు కప్పుకొన్న తెరలన్నీ తొలగిపోయాయి. నీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం."
"ఇందులో నే చేసిందేముందే? నీలో మార్పు రావాలని కోరుకొన్నాను. వచ్చింది. రా లోపలికెళ్ళి మాట్లాడుకొందాం." అంది రాధ.
లోపలికెళ్తున్న వారి వైపు మురిపెంగా చూస్తున్న సురేష్ మొహంలోని ఆనందాన్ని చూస్తూ వుండిపోయాడు వేణు.
******
No comments:
Post a Comment