వేములవాడ శ్రీరాజరాజేశ్వర శతకము - ఫోతేదార్ కేశవాచార్య
దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవిపరిచయం
ఈ శతకకర్త శ్రీకేశవాచార్యులవారు ' రసప్రియ ' అనే కలంపేరుతో సుప్రసిద్ధులు. ఆధినిక కవి. వీరి పూర్వీకులు వనపర్తి ప్రభువుల వద్ద ఫోతేదారులుగా పనిచేసి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు. వీరి జన్మగ్రామము శ్రీరంగాపురం, వనపర్తి తాలూకా, మహబూబ్ నగర్ జిల్లా. కవి ఈ శతకాంతంలో ఈ విధంగా తననుగూర్చి చెప్పికొనినాడు.
శ్రీరంగాపురి వాసులౌచు వనపర్తిన్ రాజుచెంతన్ సదా
చారోదార పరోపకారులయి విశ్వబ్రహ్మ వంశీయులై
ధీరాగ్రేసరులై ధనాడ్యులి ఫోతేదారులై సద్యశ
శ్రీరంజిల్లిరి నాదుపూర్వీకులు మున్ శ్రీరాజరాజేశ్వరా!
ఆంధ్రాంగ్ల ఉర్దూ హిందీ భాషలలో పరిచయ పాండిత్యములు గల ఈ కవి ఆర్ధిక శాస్త్రంలో పట్టభద్రుడు. గణాంకశాఖలో ఉద్యోగం చేసిన ఈ కవి బహుగ్రంధకర్త. వారి రచనలు ...
(ముద్రితాలు) 1. శ్రీరామలింగేశ్వర రత్నమాల, 2. అమరస్మృతులు, 3. శ్రీసీతారామ తారావళి, 4. శ్రీరాజరాజేశ్వర శతకము, 5. బుద్ధ చరితము. (అముద్రితం) 1. శ్రీరంగ శతకము, 2. మాతృశ్రీ, 3. గేయకథలు, 4. భద్రగిరి శతకము, 5. పర్ణశాల (గేయకావ్యం), 6. గణాంకదర్శని, 7. దైవదండన, 8. The Economic History of Ancient Andhra. వీరి గురించిన ఇతరవివరాలు తెలియలేదు.
శతకపరిచయం:
వేములవాడ రాజరాజేశ్వరునిపై చెప్పిన ఈశతకము భక్తిరస ప్రధానమైనది. ఈశతకంలో మొత్తం 147 పద్యాలను వ్రాసినారు. శబ్ధాలంకారాలయిన అంత్య్ప్రాసలతో యతిప్రాసలతో అలరారే ఈశతకంలొ కొన్ని స్తుతి పద్యాలుగా కొన్ని విన్నపం తో కూడినపద్యాలుగా ఉన్నవి. వేములవాడ క్షేత్రమాహత్య్మముని ఈశతకంలో మనం చదువవచ్చును. భావసరోపేతమైనది ఈశతకము.
కొన్ని పద్యాలను చూద్దాము.
ఓ గంగాధర! ఓ సుధాకరధరా! ఓ సర్వలోకేశ్వరా!
ఓ గౌరీవర! ఓరమాధవశరా! ఓ భక్త హృన్మందిరా!
ఓ గంభీర దయాకరా! శుభకరా! ఓ దోష నాశంకరా!
శ్రీగూర్పంగదె నీకు మ్రొక్కెద హరా! శ్రీరాజరాజేశ్వరా!
రవి భాస్వత్కిరణంబులన్ విమల తారాపుంజముల్ వర్ష బిం
దువులున్ లెక్కిడ వీలుకాని గతి నిర్దోషాంచితంబైన సం
స్థవనీయంబగు నీ గుణంబులును సాధ్యంబౌనె లెక్కింపగన్
శివ! గౌరీధవ! కేశవార్చితపదా! శ్రీరాజరాజేశ్వరా!
అర్థనారీశ్వర తత్వము:
ఒక పార్శ్వమ్మున ఆడురూపమయి చెల్వొప్పన్ విలోకింప వే
రొకవంకన్ బురుషాకృతిన్ వెలసితోహో! సర్వలోకాల కీ
కడే తల్లివి దండ్రివై తనర నేమో అర్థనారీత్వమో
ర్చి కృపన్ దాల్చితివో జగత్ప్రభువరా! శ్రీ రాజరాజేశ్వరా!
హరి వక్షంబున లక్ష్మికిన్, నలువ జిహ్వన్ వాణికిన్, స్థాన బం
ధుర మర్యాద నొసంగ నీవు సగ మేనున్ గౌరికిన్ స్త్రిసమ
త్వరమావైభవమొప్ప నిచ్చితివి వాహ్వా నిన్ను బోల్దేవు డీ
స్థిరనెవ్వండు దలంచి చూడగ హరా! శ్రీరాజరాజేశ్వరా!
హాలాహల భక్షణము:
క్షీరాబ్ధిన్ దరచన్ జనించిన మహా క్ష్వేళంబునున్ ద్రావి దు
ర్వారాపద్దవ వహ్ని మాపి సురలన్ రక్షించితౌ నేడు సం
సారాంబోధి జనించు కష్ట విషమాస్వాదించి నిత్యంబు తం
డ్రీ రక్షింపవదేల మమ్ము దయతో శ్రీరాజరాజేశ్వరా!
విన్నపము:
నిరుపేదన్ శిధిలంబు నాగృహము తండ్రీ! జీవితంబెన్న సా
గరమై యొప్పును దానియందుగల పంకంబందె పంకేజముల్
విరియన్ బూచెను నీదు పూజకయి సంప్రీతిన్ గటాక్షించి నా
చిరుకాన్కల్ గయికొమ్ము వేగమె ప్రభూ! శ్రీ రాజరాజేశ్వరా!
పలుమార్లెంత నోరు నొవ్వగను దేవా! యంచునిన్ బిల్చినన్
పలుకే బంగారమాయె నీఘనతకున్ భంగంబు వాటిల్లునో
అలుకన్ బూనితో మారుపల్కవు మహేశా! దోషమేమైన వ
ర్తిల్లెనో నాయెడలన్ క్షమిణ్చ వలదా శ్రీరాజరాజేశ్వరా!
అధిక్షేపము:
పాలున్ బోసియు బెంచినంగఱచు సర్పాలన్ ధరించన్ బ్రియం
బేలాగయ్యె? విషం మ్రింగగ మనం బెట్లొప్పె? నారీతిగా
నాలో గల్గిన పాపహాలాహల మూనన్ బ్రీతి చిత్తాన యే
లీలన్ లేదకొ? ఆశ్రితావన దయా శ్రీరాజరాజేశ్వరా!
హిమవంతంబున శీత బాధ బడలేకే వ్యాఘ్ర మత్తేభ చ
ర్మము లెన్నేనియు గప్పుకొన్న చలికౌరా తట్టుకో నీకు సా
ధ్యమె? నా వెచ్చని గుండెలోపల్ను నీ కభ్యంతరమేమి? పే
రిమితోడన్ వసియింపు చుండగదవే శ్రీరాజరాజేశ్వరా!
క్షమా క్షోబిత లోకమందిపుడు బిక్షంబెత్త నీకెట్లగున్
స్వామీ నాయెద బీడు వడ్డయది నీబల్ కోడెకున్ జోడుగా
వ్యామోహంబను కోడెనిచ్చెదను సేద్యంబీవు సాగించుకో
క్షేమంబౌనుభయత్ర భక్త వరదా శ్రీరాజరాజేశ్వరా!
పులి తోల్గట్టి కరంబునందు మహితంబున్ బట్టి కంఠాన పా
ముల నింపారగ జుట్టి మేనభసితంబున్ బూసికొన్నట్టి నిన్
దిలకింపన్ దలపెట్టి నిత్యమును ప్రీతిన్ గొల్తు గాబట్టి భా
సిల జూపట్టి ముదంబు గూర్చగదవే శ్రీరాజరాజేశ్వరా!
ఇటువంటి చక్కని శతకం మీరూ చదవండి మీ మిత్రులచే చదివించండి.
No comments:
Post a Comment