బాబాయి గారు - అచ్చంగా తెలుగు

బాబాయి గారు

Share This
బాబాయి గారు
సి.ఉమాదేవి

బాబాయి గారు “హాయ్ మామ్ వాట్సప్ ఫర్ డిన్నర్!” టెన్నిస్ రాకెట్ విసిరి పారేసి,బూట్లు,సాక్సులు వదిలించేసుకుని సోఫాకు అడ్డంపడ్డాడు బంటీ రిమోట్ అందుకుంటూ.
కొరుకుతున్న అప్పడం ముక్కను మరింత కరకరా నములుతూ బంటిని తీక్షణంగా చూసాడు ఆ రోజు ఉదయమే హైకోర్టు పని మీద దిగిన బంటీ బాబాయి.
“ష్..ష్ ” ఫ్రిజ్ నుండి పెరుగుగిన్నె అందుకుంటూ తల్లి చేసిన సైగలకు అటుతిరిగిన బంటి బాబాయిని గమనించి ఆయన మాట మొదలయేలోగానే బాత్రూంలోకి దూరాడు. నవ్వునాపుకుని బంటి పళ్లెంలో పూరీ,బాంబే చట్నీ వడ్డించి టీపాయ్ మీద పెట్టింది. చేతులు,ముఖం శుభ్రంగా కడుక్కుని జుట్టు ముఖంపై పడకుండా వెనక్కు దువ్వి ‘ఊ...బాబాయ్ నీతో బాబోయ్!’ అనుకుంటూ సోఫాలో రాముడు మంచి బాలుడు అన్న రీతిలో కూర్చున్నాడు.కూర,పూరీ చూడగానే బంటికి  ఆకలి రెట్టింపయింది.ఆతృతగా ప్లేటందుకున్నాడు.
“ఇక్కడికే వచ్చి కూర్చో..”.
“కాదు బాబాయ్ టి.విలో...”
మాట గొంతుదాటలేదు బంటికి బాబాయి చూసిన చూపుతో!
అక్క సునీత వేపు చూసాడు నోరు తెరచి తెరవకుండా పూరీని నోట్లోకి పంపే ప్రయత్నం చేస్తోంది.
‘అవును తినేటప్పుడు నోరు చిన్నగా తెరవాలి.నమిలేటప్పుడు నోరు తెరవకూడదు. మోచేతులు డైనింగ్ టేబిల్ పై పెట్టకూడదు.మధ్యమధ్యలో నీళ్లు తాగకూడదు.ప్రతి వాక్యానికి  వివరణ కూడా ఉంటుంది.వివరణ అరగంటకు తక్కువుండదు.అందుకే అందరు బాబాయి వద్దనగానే మానేస్తారు, చెయ్యమనగానే చేసేస్తారు. ఆ అరగంట వివరణ కంటే మనసుకు సర్దిచెప్పుకుని రాజీపడటం మేలని అందరు అనుకుంటారు. అలాకాదు అనుకుంటే బుర్రలోకి పంపిన విషయాన్ని వెళ్లిందా లేదా అని తనమాటలతో  ఊపి మరీ చూస్తాడు. అనుమాన మొచ్చిందా సరిగా వినలేదని,ఈ చెవిలోవిన్నది ఆ చెవిలో వదిలేస్తున్నారని మరతో బిగించినట్లు మాటలతో బిగిస్తాడు.అందుకే ఆయన్ను  అందరు బాబోయ్ గారు వస్తున్నారనో, వచ్చారనో చెప్పుకుంటుంటారు ఆయన పరోక్షంలో!
“ ప్రపంచంలో సగం జనాభా ఊబకాయానికి గురవడం ఇలా టి.వి ముందు కూర్చుని తినడమే.చూస్తున్నంతసేపు మనకు తెలియకుండానే లాగించేస్తామన్నమాట!”బాబాయ్ ఉపోద్ఘాతం ఊపందుకునేలోపు బంటి స్థానం మారింది. 
“ఇంతకీ జనాలు లావెందుకెక్కుతారు?”
అందరు ఓసారి తలలు పైకెత్తి మళ్లీ కూరలో  తగిలిన కరివేపాకు తీసిపారేసే పనిలో వున్నామన్నట్లు తలదించుకున్నారు.
“అలా తీసిపారేయకండి.”
తీసిపారేయకూడనిది ఆయన మాటలో,కరివేపాకో అర్థంకాక పళ్లెం అంచుకు తోసిన కరివేపాకును మళ్లీ పళ్లెంలోకి లాక్కున్నాడు బంటి.
“కొవ్వెక్కి!”
ఒక్కసారిగా పొలమారింది సునీతకు.
బొద్దుగుమ్మ అని చిన్నప్పటినుండి అంటుంటే ముద్దు పేరనుకుందిగాని ఇలా కసుక్కున కొవ్వని బాబాయ్ గారు అందరిలో అనేసరికి తింటున్న పూరీ ప్రక్కకు తోసి లేచింది అర్థాంతరంగా.
“పళ్లెంలో వదిలేస్తావా?అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు” అని మరో క్లాసు.కూతురు వదిలిన పూరీముక్కనందుకుని గబుక్కున తన పళ్లెంలోకి వేసుకుంది సునీత తల్లి.
***  
భోజనాలు పూర్తవగానే ఏ సామాను ఎక్కడచేరాలో అక్కడికి చకచకా చేరుకున్నాయి.
“ వదినా, అన్నయ్య సాయంత్రం ఆఫీసునుండి వచ్చేలోపు నా కోర్టుపని చూసుకుని వస్తాను.మళ్లీ సాయంత్రం కలుస్తాం బంటీ.”అని బాబాయి బైటకడుగేసాడో లేదో అంతవరకు ఉగ్గపట్టి కూర్చున్న బంటి టి.వి. రిమోట్ ను అమాంతం అందుకుని కళ్లను టి.వికి అప్పచెప్పాడు.సెలవులలోనైనా  టి.వి చూడకపోతే ఎలా అనుకున్న బంటికి కదులుతున్న కాలం తెలియడం లేదు. తండ్రి,బాబాయ్ కలసిరావడం చూసి ‘బాబోయ్’ అనుకుంటూ లోనికి పరిగెత్తాడు.
         “నన్ను చూసి  పిల్లలు భయపడేదానికన్నా నేను వారిగురించే ఎక్కువ భయపడతాను అన్నయ్యా, ఎందుకంటే వారి భవిష్యత్తు నిరాశకు,వత్తిడికి గురికాకూడదన్న ఆశ.” దృఢంగా అన్నాడు.
తమ్ముడి భుజంపై ఆప్యాయంగా చెయ్యివేసి,
“ నువ్వు బయటకు చెప్తావు,నేను మనసుకే పరిమితం చేస్తాను.ఎందుకంటే అన్నీ మాకు తెలుసు అనుకునేవారికి ఇంకా ఏం చెప్పగలం చేష్టలుడిగి చూడటం తప్ప?”నిస్పృహ తొంగి చూస్తోంది బంటి నాన్నలో.
“ అదేమన్నయ్యా అలా అంటావు? మన వాళ్లకు మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? అడుగడుగునా నేను చెప్పే మాటలు,జాగ్రత్తలు,మంచి అలవాట్లు వారికీవయసులో చేదుగుళికల్లా మింగుడుపడవుకాని ముందు ముందు అవే వారికి చక్కని మైలురాళ్లవుతాయని నా గట్టి నమ్మకం. వస్తువులైనా, నగలైనా,వస్త్రాలైనా చివరకు టెక్నలజీయైనా మితము తప్పక పరిమితులలో ఉన్నపుడే మనిషి విలువ పెరుగుతుంది. ఏమంటావన్నయ్యా?”
తమ్ముడి మాటలకు అవునన్నట్లుగా తలాడించాడు బంటి నాన్న.

 ***
బాబాయి మాటలు చేదనిపించినా, చాదస్తపు మాటలనిపించినా ఆ మాటల వెనుకనున్న ఆప్యాయత,ఆవేదనకు బంటి,సునీత తప్పుచేస్తున్నామన్న భావనతో తలలు దించుకుని ఆలోచిస్తున్నారు. బాబాయిని  అపార్థం చేసుకున్నామన్న బాధ ఇరువురిలోను మొదలయింది.
“ అన్నయ్యా నేనిక బయలుదేరుతాను.”అని తనతో తెచ్చుకున్న సంచికోసం అటు ఇటు చూసాడు.
బంటి తన వెనుక దాచుకున్న బాబాయి సంచిని మరింత వెనుకకు దాచుకుంటూ, “ లేదు బాబాయ్ నువ్వప్పుడే వెళ్లద్దు.నువ్వు చెప్పినట్లే అన్నీ వింటాము,నేర్చుకుంటాము.” అంటున్న పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు బాబోయ్ గారు కాదు బాబాయి గారు.

***

No comments:

Post a Comment

Pages