భాష - ఒక పరిశీలన - అచ్చంగా తెలుగు
   భాష – ఒక పరిశీలన
  రచన –బండ్లమూడి పూర్ణానందం.   

                  భాషింపబడేది భాష.భాష సజీవమైనది.వాగ్రూపమైన భాష,తదనంతరకాలములో లిఖితరూపాన్ని సంతరించుకొన్నది. ప్రవాహినీ దేశ్యా  – అంటే దేశభాషలు నీటి ప్రవాహము వంటివి.నిరంతరము మార్పుచెందుతూ ఉంటుంది భాష.మానవుల  భావ  ప్రకటనకు భాష అవసరము.అక్షరముల సముదాయము పదములుగా శబ్దములు గా ఏర్పడి తదుపరి కొన్ని పదముల సమూహము వాక్యమైనది.వాక్య సమూహము భాష. లింగ్వా నుంచి లింగ్విస్టిక్స్ అను పదము వచ్చినది.అనగా భాషాశాస్త్రమని అర్థము.ప్రపంచము లోని భాషలన్నింటిని కలిపి భాషాశాస్త్రజ్ఞులు పది భాషాకుటుంబములుగా విభజించి అధ్యయనము చేశారు.భారతీయ భాషలను1.ఔత్తరాహ భాషలు2.ద్రవిడభాషలు అని విభజించారు.నేడు మనకు 27 ద్రవిడభాషలు కల్పిస్తున్నాయి. వ్యవహర్తలు కలిగిన భాషలు ఇవి.భాషలను అధ్యయనము చేయు శాస్త్రమును లింగ్విస్టిక్స్ (భాషాశాస్త్రము ) అందురు. విశ్వవిద్యాలయ స్థాయిలో మనము ఈ కోర్సులను చదువుకోవచ్చును .మానవుడు ప్రాచీనకాలములో అనగా భాషలేని కాలములో కొన్ని గుర్తులు అనగా సంజ్ఞలు లేదా సైగల ద్వారా తమ భావప్రకటనను ఇతరులకు తెలియజేసేవారు.అసలు భాష ఏదైనా ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు.ఇది చరిత్ర చెప్పిన సత్యము.శబ్దార్థములకు గల అనుబంధము పార్వతీపరమేశ్వరుల వంటి దని కవికులగురువైన కాళిదాసు అభిప్రాయము.వ్యవహర్తలను అనుసరించి భాష పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది.ఇది నిత్యసత్యము.భాషలేని కాలములో భాషేతర సాధనముల పాత్ర చాలా గొప్పది.ఇంత ఆధునిక విజ్ఞానశాస్త్రము పెరిగిన ఈ రోజులలో కూడా భాషేతర సాధనముల పాత్ర కూడా చాలా గొప్పదని చెప్పవచ్చును .ఉదాహరణకు రోడ్లపైన, రైళ్ళు ,ఓడలు ,వినానముల యొక్క గమనాగమనములను దూరము నుంచే నియంత్రించే ఎరుపు, ఆకుపచ్చ, పసుపు దీపాలను గుర్తులుగా,జెండాలను భాషేతర సంకేతాలుగా పగలు,రాత్రి మనము వాడుకొను చున్నాము.ఎరుపు జెండా,ఆకుపచ్చజెండాలుకూడా మనము కొంతభావప్రకటనకు అనుకూలముగా, ప్రతికూలముగా ఉపయోగించుకొనుచున్నాము.నేడు మనము భాషలను  లిఖితభాషలు, వాగ్రూపభాషలని రెండు విధములుగా విభజించి పరిశీలింపవచ్చును.ప్రపంచములోని ఏ భాషాపదమునైనా రాయటానికి అనువుగా ఐ.పి.ఏ (ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్ వారు )ఒక లిపి ఏర్పాట చేశారు.దానిని అందరూ నేడు వాడుచున్నారు.ఒకజాతి సంస్కృతిని అద్దం పట్టి చూపిస్తుంది భాష. సంస్కృతి నుండి నాగరికత వరకు మనిషిని నడిపించేది భాషే.మన చరిత్రను పరిశీలిస్తే ఇంకా కొన్ని విషయాలు మనకు తెలియక తెలుస్తాయి.అవి శాసనభాష. కావ్యభాష ,వ్యాకరణభాషలు. నేడు మనము వాడుతున్న వాడుకభాష ,నాటకీయభాష,మాండలికభాష, చట్టపరమైన భాష మొదలైనవి.


దేశాలకు ఎల్లలు ఉండుట సహజము.కానీ భాషకు ఎల్లలు లేవు.భాష విశ్వజనులకొరకు ఉద్భవించినదిగా మనము చెప్పవచ్చు.శిలాశాసనములపై లిఖితమైనభాష,తదనంతర కాలములో తాళపత్ర గ్రంథాలలో భద్రపరుపబడి పిమ్మట, అచ్చు కాగితములపై ముద్రింపబది పుస్తకరూపమును పొంది,పలువురను విజ్ఞానవంతులుగా చేసి నేటి ఆధునిక కాలమున కంప్యూటర్ యంత్రములలో సైతము ప్రవేశించి సి.డి. , డి.వి.డి  ల రూపములో శాస్త్రవిజ్ఞానము భద్రపరచుటకు సహాయపడుచున్నది.మరి రాబోవు కాలములో ఇంకెన్ని మార్పులకు లోనగునో తెలియదు.అది భవిష్యత్ తరాలవారికి వదిలేద్దాం. చక్కని భాషను చక్కని పద్యాలలో,పాటలలో ,పదాలలో ,వచనంలో కూర్చిన కవులు , పండితులు,విమర్శకులు, గాయకులు,వదాన్యులు కీర్తిశరీరులు అనుటలో అతిశయము లేదు.భాష సరస్వతికి ప్రతిరూపము.భాష మనిషిని ఆపదలో రక్షించును.మన మనస్సులకు శ్శాంతిని చేకూర్చుటకు సహాయపడును. అనర్గళముగా భాషించువారు మనకు నిత్య పూజనీయులేకదా .వేద భాష అనాది.వేద ఘోష అనాది.వేదం ఒక నాదం.మన జీవన వేదం.సంస్కృత భాష .మిక్కిలి ప్రాచీనమైనది. ప్రకృతిజనులు వ్యవహరించు భాష ప్రాకృతభాష. దీనిని సంస్కరింపగా ఏర్పడినదే సంస్కృతమని కొందరి అభిప్రాయము.మనిషికి సుఖ దుఃఖాలను కలిగించేది భాష. మనిషిని మనీషిగా తీర్చిదిద్దినది భాషే. భాష మానవుల అవసరాలను తీరుస్తూ నిరంతరం మనిషిని పరిపూర్ణునిగా చేయుటకు సహాయపడుచున్నది.భాష లేనిదే శాస్త్రము లేదు అన్నాడొక మహానుభావుడు. భూమిపైనుండి 
అంతరిక్షము లోనికి రాకెట్లు,శాటిలైట్లు, వెళుతున్నాయంటే  శాస్త్రవిజ్ఞానము పెరుగుదలకు భాష ఎంతగా (మనిషికి,మానవాళికి ) దోహదపడినదో మనము గమనింపవచ్చు.నేడు అంతరిక్షములోని వాతావరణము ను కోడింగ్  మరియు డీ కోడింగ్ పద్ధతి ద్వారా కంప్యూటరుకు అనుసంథానము గావించుటద్వారా ఎప్పటికప్పుడు వాతావరణం మార్పులు ప్రజలకు తెలియజేయుటద్వారా ప్రకృతి ఉపద్రవములను ముందుగా తెలుసుకొనుచూ మానవులను రక్షించుకొనుటకు భాష ఎంతగానో సహాయకారిగా ఉన్నది.ప్రపంచములోని నలుమూలల వార్తలను సేకరించు పత్రికారంగపుభాష మనలను నిరంతర జాగరూకులను చేయుచూ విశ్వమే ఒక  కుటుంబముగా అనగా వసుధైక కుటుంబము గావించుచు విశ్వశ్రేయస్సును కలిగించుచున్నది అని చెప్పవచ్చును.అటువంటి భాషామతల్లి రుణముతీర్చుకొనుటకు మనము ప్రతిరోజూ మాతృభాషలో  సద్భాషణ చేద్దామా , చేద్దాము మరి.
***

No comments:

Post a Comment

Pages