హోలీ||
సుజాత పి.వి.ఎల్
వేకువెరుగని నిశిలా
అక్కడి జీవితాలు అస్తవ్యస్తం
ఎవరైనా కొంచెం
మంచిని దానం చేస్తే బావుణ్ణు!
నవ్వుతూ పలకరించే
పెదాల కోసం ఎదురు చూపు,
ఆప్యాయతానురాగాలు పంచన
బతకాలనే ఆశగా నిరీక్షణ
నేటి పరిస్థితుల్లో ఇవన్నీ
అత్యాశలా అనిపించే కోరికలే!!
విద్వేషం నిరంకుశ శిశిరంలా
సమైక్యతా వసంతాన్ని
రక్తసిక్తం చేస్తుంటే
ఉన్మాద వాదం ఉప్పనై
ప్రాణాల్ని హరిస్తుంటే
మతం మానవత్వాన్ని
రక్తంలో ముంచి తేలుస్తుంటే
మనం పండగెలా చేసుకుంటాం?
విశృంఖలంగా కురుస్తున్న నెత్తుటి వానలో
తడుస్తూ "హోలీ" ఎలా జరుపుకుంటాం?
మతాలు మరణించిన నాడే
మనుషులకి నిజమైన పండుగ
యుధ్ధాలు, సరిహద్దులు
కాముడితో కలిసి దహనమైన రోజే
మనకి అసలైన హోలీ!
***
No comments:
Post a Comment