జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 16
చెన్నూరి సుదర్శన్
ప్రిఫైనల్ పరీక్షలు ఆరంభమయ్యాయి. కాపీ జరుగ కుండా లెక్చరర్లకు తగిన సూచనలిప్పించాను రామనాథంతో.
రామనాథం ఒక ప్రక్క నన్ను ప్రశంసిస్తూనే.. కాపీకి అలవాటైన పిల్లలతో ఏం గొడవలు వస్తాయోనని మరో ప్రక్క భయపడ్తున్నట్లు గమనించాను.
కాని పరీక్షలన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. విద్యార్థుల్లో నూతనోత్సాహం కనబడుతోంది. ఫైనల్ పరీక్షలు సులభంగా రాయగలుగుతామనే ధీమా వారిలో కనబడుతోంది.
ఆరోజు జువాలజీ చివరి పరీక్ష..
ఫణీంద్రను ఒక కంట కనిబెట్టాలని నేను అతడికి పరీక్ష హాల్ అలాట్ చేయలేదు. ఇంద్రాణి,హిమజలకు
జువాలజీ హాల్లో ఇన్విజిలేషన్ వేసాను. మరో రెండు గదుల్లో కామర్స్ పరీక్ష.
మాణిక్యం అనే విద్యార్థి మూడు చక్రాల బండిపై రోజుకుమల్లె కాలేజీకి వచ్చాడు. సైకిలు దిగి రెండు కర్రల సహాయంతో వెళ్తున్నాడు. అతని కాళ్ళను చూస్తుంటే మా బాబు కాళ్ళు గుర్తుకు వచ్చేవి. మా బాబు కాళ్ళకు కాలిపర్స్ కట్టుకొని చేతి కర్ర సహాయం లేకుండా నడుస్తాడు. మాణిక్యం అలా నడువలేడా..? అనే ఆలోచన నా మదిలో మెదిలేది.
మామూలు కాలేజీ ఇంటర్నల్ పరీక్షలే గదా.. హాజరవుతాడో లేదో అని సందేహించాను. కాని అన్ని పరీక్షలూ చాలా శ్రద్ధగా రాస్తున్నాడు.
మాణిక్యం పరీక్ష హాళ్ళలోకి వెళ్ళడానికి సహకరించి వచ్చి అడిషనల్ పేపర్స్ సర్దుకుంటున్నాను.
ఇంతలో “నమస్తే సార్..” అని వినబడేసరికి వెనుదిరిగి చూసాను. ఎదురుగా నేను గత సంవత్సరం పనిచేసిన మునిపల్లి జూనియర్ కాలేజీ ఆఫీసు సహాయకుడు వీరయ్య.
“వీరయ్యా.. బాగున్నావా.. ” అంటూ కుశల ప్రశ్నలు వేసాను.
“మా అత్తగారిది ఇదే ఊరు సార్.. అత్త పానం బాగా లేదంటే సూసి పోదామని వచ్చిన. మునిపల్లికి పోతాన.. ఇంతట్ల మీరు యాదికచ్చి కలిసి పోదామని వచ్చిన.
కాలేజీ పిల్లలంతా మిమ్మల్నే యాదికి చేత్తాండ్లు సార్.. లెక్చరర్లు సుత బగ్గ యాది చెత్తరు. మీరున్న కాలేజీ శాన బాగుపడ్తది సార్..” మెచ్చుకోసాగాడు. “ఇక్కడ సుత పరీచ్చలు శురుచేసిండ్లు కదా సార్..” అంటూ నా చేతిలోని అడిషనల్ పేపర్స్ తీసుకొని లెక్కించసాగాడు.
“రాములు ఎలా ఉన్నాడు.. సామ్యుల్ సరిగ్గా నీళ్ళు తెస్తున్నాడా?” అంటూ మిగతా ఆఫీసు సహాయకులను జ్ఞప్తికి తెస్తూ.. అక్కడి కాలేజీ విశేషాలడిగాను.
“ఇంకెక్కడి రాములు సార్.. ఆపొద్దే సచ్చే..”
నిర్ఘాంతపోయాను.
“ఎలా..? ఎప్పుడు” అడిగాను. అయ్యో పాపం అని మనసు జాలిపడింది.
“కమస్కం రెన్నెల్లైతాంది సార్. అత్తగారింటికి పోయిరాంగ తొవ్వల తాటి కల్లు తాగిండు. మీదికెల్లి గుడుంబ పాకెట్ పట్టించిండట. ఎండకాలమాయే.. చెట్టూ చేమ లేకపాయే.. ఇండ్లూ లేకపాయే.. దూపై నాలికె పిడుసగట్టుక పోయిందట. మంచినీళ్ళు దొర్కక సచ్చిండని అంటరు” అని నిట్టూర్చాడు. తన చేతిలోని అడిషనల్స్ రూంవైజ్ సర్ది టేబుల్‍పై పెట్టి “మల్ల వత్త సార్.. పరీచ్చలైనంక వత్త తాత్పరంగా మాట్లాడుకోవచ్చు“ అంటూ అభివాదం చెబుతూ వెళ్ళబోతుంటే ఆగమని సంజ్ఞచేసాను.
రాములు జ్ఞాపకాలే ఇంకా నా మస్తిష్కంలో కదులుతున్నాయి. తాగడం మానుమని నచ్చజెప్పినప్పుడల్లా, ఇక తాగనని ఒట్లు పెట్టుకుంటాడు. మళ్ళీ బాటిల్ కనబడితే చాలు.. దానికి బానిసై పోతాడు.
అతడికి ఇద్దరమ్మాయిలు.. చిన్న వయస్కులు.. నా శ్రీమతి మందుల కోసమని ఉదయం ఏ.టి.ఎం.లో డ్రా చేసిన పది వేలు వీరయ్య చేతిలో పెడుతూ.. రాములు కుటుంబానికి ఇవ్వమన్నాను. వీలు చూసుకొని వచ్చి మరి కొంత సాయం చేస్తానని చెప్పమన్నాను. వీరయ్య కళ్ళల్లో కృతజ్ఞతాశ్రువులు.. రెండు చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయాడు.
ఇంతలో మా అటెండర్ నాగయ్య పరుగు పరుగున వచ్చి” సార్ ఫోర్త్ రూంలో పిల్లలు గొడవ చేస్తున్నారు” అంటూ చెప్పాడు. ఆలోచనల్లో నుండి తేరుకొన్నాను.
“అడిషనల్స్ పేపర్స్ తీసుకొనిరా” అంటూ నాగయ్యను పురమాయించి ఫోర్త్ రూమ్ వైపు వడి, వడిగా అడుగులు వేసాను. ఇంద్రాణి బిక్కు బిక్కు మంటూ నాకెదురుగా వచ్చింది. హిమజ పరీక్ష హాల్లో లేదు.
పిల్లలు యధేచ్చగా కాపీ కొడ్తున్నారు. నేను వెళ్లి ఒక పిల్లవాడిని పట్టుకున్నాను. అంతలో ఒక్క సారిగా విద్యార్థులంతా నా మీదకు లేచారు.
“ఇందులో జువాలజీ సార్ చెప్పింది ఒక్క ముక్కా లేదు” అని ఒక విద్యార్థి..
“కాపీ కొట్టడం ప్రాక్టీసు లేకుంటే రేపు ఫైనల్లో ఎలా కాపీ కొడతాం సార్..” అంటూ మరో విద్యార్థి అతి తెలివిగా మాట్లాడ సాగారు.
లెక్చరర్లకు ప్రశ్నాపత్రం తయారు చేసే అవకాశమివ్వ లేదు నేను. గత సంవత్సరం తాలూకు బోర్డు ప్రశ్నా పత్రాలనే వాడాను. దాంతో లెక్చరర్లు సిలబస్ ఎంత వరకు పూర్తి చేసారో..! వారి భండారం బయట పడ్తుందని నా ఐడియా.. అన్ని పరీక్షలు సవ్యంగా జరిగినప్పుడు..జువాలజీకి ఏమొచ్చిందనుకుంటూ..
“జువాలజీ సార్ ఎక్కడ?” అంటూ కాస్త తీవ్రంగా అడిగాను.
“పక్కరూంలో హిందీ మేడంతో..” అంటూ ఒక విద్యార్థి నడుంతిప్పుతూ.. “అబ్బ నీ తీయని దెబ్బ.. ఎంత కమ్మగా ఉందిరో యబ్బా..” అంటూ పాడసాగాడు.
మిగతా పిల్లలంతా కోరస్ అందుకున్నారు. హాలు మారు మ్రోగి పోతోంది.. చెయ్యి చేసుకుందామంటే మానవత్వమనిపించుకోదు. నాగయ్య తెచ్చిన అడిషనల్స్ తీసుకొని బల్లపై గట్టిగా మోదాను. అ శబ్దానికైనా తేరుకొని ఫణీంద్ర, హిమజలు వస్తారని అనుకున్నాను. కాని రామనాథం వచ్చాడు.
ఫణీంద్ర, హిమజ మన స్పృహలో ఉన్నారో.. లేదో..! తెలియదు.
“ఏమిటి గొడవ..” అంటూ ప్రిన్సిపాల్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. పిల్లలు మరీ రెచ్చి పోయారు.
“ఏమిటా..” అంటూ ఒక విద్యార్థి కళ్ళు పెద్దవి చేసుకొని తలను బండి చక్రంలా తిప్పాడు.
“తమరు ధృతరాష్ట్రుల వారు.. నీ కళ్ళకేదీ కనబడదు. ఇప్పుడు నీ కళ్ళు తెరిపిస్తాం.. చూడు” అంటూ పది మంది పిల్లలు పక్క రూంలోకి పరుగు తీసారు. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయి వారి వెనకాలే ప్రిన్సిపాల్, నేనూ పరుగెత్తాం.
ఫణీంద్ర, హిమజలు కూర్చున్న దృశ్యం ఎబ్బెట్టుగా కనబడుతోంది.
మమ్మల్ని చూడగానే ఫణీంద్ర, హిమజను తోసేసి నిలబడ్డాడు.
(సశేషం)
No comments:
Post a Comment