నేను గెలిచాను - అచ్చంగా తెలుగు

నేను గెలిచాను

Share This

"నేను గెలిచాను"
వాసం నాగరాజు 

నాకెంతో గర్వంగా ఉంది
నేనోడిపోయాను.

గెలిచిన నేను
నాచుట్టూ సమూహం
కరతాళధ్వనులతో
పూలవాన 
పొగడ్తల అత్తరు జల్లు
గాలిలో తెలాడే నేను...

కాళ్ళకింది నేల
క్రమంగా మాయమైంది.
పూలదండలు, శాలువాలు,
సత్కారాలు, ఆలింగనాలు
నేను లేను.
కనుమరుగయ్యాను.
నేనోడిపోయాను.

నా చుట్టూ అంతా ఎడారి
నాతోడుగా
నేనొక్కడినే నిశ్చలంగా!

దూరంనుండి వీస్తున్న పవనాలు
నా పేర పలికే భయానక
ధ్వనులు !!  కఠోర వాస్తవాలు
మాటల తూటాలు
ఒక్కొక్కటిగా నా ఒంటిమీది
వలువలు ఒలిచేసాయి.
ఇప్పుడు స్పష్టంగా నేను 
నగ్నంగా ఇప్పుడు నేను.

నన్ను తెలుసుకున్న నేను
నిన్ను తెలుసుకున్న నేను
సమూహంలో ఏకాకినై
ఏకాకిగా సమూహాన్నై
నన్ను గెలిచిన నేను.

ఇప్పుడు నేను
ఎప్పటికి ఓడిపోను!!!
 ***

No comments:

Post a Comment

Pages