నెత్తుటి పువ్వు - 7 - అచ్చంగా తెలుగు

నెత్తుటి పువ్వు - 7

Share This
నెత్తుటి పువ్వు - 7
మహీధర శేషారత్నం

(జరిగిన కధ :రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను ఏదైనా పనిలో పెట్టాలని చూస్తూ ఉంటాడు రాజు.)
 “సరేలే! చాన రోజులయింది. కాస్త... అప్పుడప్పుడు... కొద్దిగా అలవాటు..." తలవంచుకుని అంది.

            కనుబొమలు చిట్లించేడు.... "ఏమిటలవాటు.... “మాట్లాడలేదు.
            “ఏమిటో చెప్పు నాకెలా తెలుస్తుంది, నీ అలవాటేమిటో..."       
            “అదే... కొద్దిగా..."
            “ఏమిటి కొద్దిగా...? ఏం కావాలి?...."
            అలా సీరియస్ గా ఉంటే ఏం చెప్పేదబ్బా గట్టిగా అంది.
            “బాగానే ఉంది, చెప్పకుండా దబాయింపొకటి.
            " కొద్దీగా ఒక గ్లాసు.. లేకపోతే స్టేజి ఎక్కలేను, అందుకే కొద్దిగా...  నీ దగ్గరుంటాదిగా..."
          అర్థమయింది నాగరాజుకి.
          "చూడు. నేనలాంటోన్ని కాదు, మొగాణ్ణి, పోలీసోడిని నాకే లేదలవాటు. ఎంత దైర్యం నీకు, అడగడానికి?”గద్దించాడు.మాట్లాడకుండా తలవంచుకు నిలుచుంది.
            చూడు పిచ్చి పిచ్చి వేషాలెయ్యకు, అలవాట్లు మానుకో, అలా అనిపించినప్పుడల్లా గ్లాసడు మంచి నీళ్ళు తాగు. కుందేడు నీళ్ళు ఉన్నాయి. తేడా వచ్చిందా! లాఠీ విరుగుద్ది... మంచిగా ఉన్నాననుకొంటున్నావు. జాగ్రత్త..     విసురుగా కాలుతో తలుపు దగ్గరగా తోసి బయటిక్ళెడు. వీధి మలుపు తిరగ్గానే అంతవరకు ఆపుకున్న నవ్వు నవ్వాడు. ఈ పిల్ల తెలివి తక్కువదో, తింగరిదో, అర్థం కావడం లేదు. ఏమైనా రెండ్రోజుల్లో ఈ వ్యవహారం తేల్చేయాలి... తనలో తనే నవ్వుకున్నాడు.
          "ఇదుగో! ఇప్పుడే వస్తానని ఎక్కడికి పోయావ్! పిల్లాడి బట్టలు కొనాలిగా దీపావళి వస్తోందిగా..." గుమ్మంలోనే ఎదురయింది నాగరాజు భార్య లక్ష్మీ
            “ఊఁ! వెడదాం . తలనొప్పిగా ఉంది. కాస్త టీ పెట్టు"
          కొత్త బట్టలు, టపాసులు లేకపోతే పిల్లాడూరుకోడు. టీ తాగి బయల్దేరుదాం. సరేనా!” అంది లక్ష్మీ
          “వాడి సంగతలా ఉంచు. ముందు నువ్వు ఊరుకోపుగా. టీ పెట్టు" విసుగ్గా ఇన్నాడు.
            “పొద్దుగూకులూ ఊళ్ళ వాళ్ళకి సహాయాలే! ఇంటి విషయం అంటేచాలు ఎక్కడలేని విసుగూ, చిరాకు",గొణుక్కుంటూ వెళ్ళింది. టీ తాగి ఆదినారాయణ కొట్టుకెళ్ళారు. ఎప్పుడూ అక్కడే అలవాటు మరి.
            “రండి రాజుబాబూ! రండి, అమ్మగార్ని కూడా తెచ్చేరే? ఒరేయ్! రెండు టీ లు చెప్పు"
            ఆది నారాయణ హడావుడి చేసేడు,
            “సరే! అమ్మగారికీ, చీరలు, పిల్లల బట్టలు చూపెట్టమను".
            ఆదినారాయణ దగ్గరే భైఠాయించేడు నాగరాజు, లక్ష్మి షాపులోకి వెళ్ళింది.
            ఆదినారాయణ సేల్స్ మెన్ కి  చెప్పి కౌంటర్ దగ్గరకు వచ్చేడు
            “షాపునిండా జనం, చేతి నిండా పని, కాని చూసారా బాబూ! పనిలేకపోతే పనిలేదో అని గోల, ఉంటే ఎగొట్టడం. నలుగురు కుర్రాళ్ళుండాల్సినచోట ఇద్దరు. ఏం చెయ్యను?దేవుడు ఇంకా రెండు చేతులెట్టినా బాగుండు.
            'ఇంకో ఇద్దర్ని పెట్టుకో.. అంటూండగానే నాగరాజు మనసులో ఏదో ప్లాను మెదిలింది,
          "ఆడపిల్లల్ని పెట్టుకుంటావా?"
            “ఎవరైతే ఏంది బాబూ! ఆడాళ్ళే నయం, కాస్త గదమాయిస్తే గమ్ము నుండి పనిచేసుకుంటారు. ఎవరైనా ఉన్నారేంటి?...." పసిగట్టాడు. “ఊఁ! పెద్దపని అలవాటులేదు. నేర్చుకోవాలి. ఏదో నీకు తోచింది అందరిలాగే.... తన అవసరానికి ఎవర్నీ ఏదీ అడిగే అలవాటులేని నాగరాజు చిన్నగా అడిగాడు
            “అలాగే! నే నేర్చుకుంటా, రేపు తీసుకురాండి"అన్నాడు. ఆనందంగా ఆదినారాయణ.
(సశేషం)

No comments:

Post a Comment

Pages