నీ సంతోషం నీదే - అచ్చంగా తెలుగు
నీ సంతోషం నీదే....
-      యామిజాల జగదీశ్

ఓ ఊళ్ళో ఓ కోటీశ్వరుడు. అతనికి తెలియని విషయాలంటూ లేవు. అన్నీ పరిమితికి మించి ఉండేవి. కానీ సంతోషం, ప్రశాంతత మాత్రం లేవు. సరే, స్థానికంగా ఉన్న చోట ఉంటే ఇవి పొందలేకపోతున్నానేమో విదేశాలకు వెళ్తే పొందుతానేమో అని అనుకున్నాడు. అలాగే ప్రయాణమయ్యాడు. అయినా లాభం లేకపోయింది. అనుకున్నవి లభించలేదు. మనసులో ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన. ఏ ఊరికి వెళ్ళినా మరుసటి రోజే మనసు ఇంటిమీద మళ్ళుతుంది. అక్కడ ఎలా ఉందో ఏమిటో అని దిగులు. డబుబల పెట్టె పదిలంగా ఉందా...అనవసరంగా బఁదువులను ఇంట ఉండమని తాళం ఇచ్చేసొచ్చాను. వాళ్ళు ఆ డబ్బులు దోచుకోరుగా అని సవాలక్ష ప్రశ్నలు. ఇది మరచిపోవడం కోసం లేని పోని దురలవాట్లకు లోనయ్యాడు. అయినప్పటికీ తాననుకున్న మానసికశాంతి, సంతోషం కలగడం లేదు.
ఠీ ఏంటో ఈ జీవితం...సన్న్యసించడం మేలు...ఏ బాధ ఏ ఆలోచనా లేకుండా ఉండొచ్చు అనుకున్నాడు. సన్న్యసించడం వల్ల తప్పక సంతోషంతోపాటు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని ఎవరో చెప్పగా విని ఆ దిశలో ఆలోచించాడు. ఇంట్లో ఉన్న బంగారు, డబ్బు అంతా మూటకట్టి  సన్న్యాసి వద్దకు వెళ్లాడు.
ఓ ఊరు చివర చెట్టుకింద ఉన్న ఓ సాధువును చూశాడు. ఆయనకు నమస్కరించి తాను తీసుకొచ్చిన మూటను ఆయన పాదాల దగ్గర పెట్టి“గురువుగారూ, ఇదిగోనండి. నా దగ్గరున్న ఆస్తి. ఇవేవీ నాకక్కర్లేదు. నాకు ప్రశాంతత, సంతోషం కావాలి. తదుపరి ఏం చెయ్యాలి. చెప్పండి...”అని అడిగాడు.
అతను చెప్పిన మాటలన్నీ విన్న సాధువు ఆ మూట విప్పి చూశారు. సాధువు అందులోనివన్నీ చూసి మూటకట్టి తల మీద పెట్టుకుని కాళ్ళకు పని చెప్పాడు.  అది చూసి కోటీశ్వరుడికి విస్తుపోయాడు.
“అరెరె, ఇతనేదో పేదరికంతో కాషాయ వ్రస్త్రాలు కట్టుకున్న వాడిలా ఉన్నాడే....ఇతను నకిలీ సాధువా” అనుకున్నాడు కోటీశ్వరుడు. కోపమొచ్చింది. ఆ సాధువు వెంటపడ్డాడు.
సాధువు పరిగెత్తినంత వేగంగా కోటీశ్వరుడు పరుగులు తీయలేకపోయాడు. సాధువు ఇష్టమొచ్చినట్లల్లా పరుగులు తీస్తున్నాడు. అయినా కోటీశ్వరుడు ఆగలేదు. శాయశక్తులా పరుగెత్తాడు. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి సాధువు తన చెట్టుకిందకు వచ్చి కూర్చున్నాడు. కేస్సేపటికి కోటీశ్వరుడు అక్కడికి చేరాడు.
ఏంటీ భయపడ్డావా...ఇదిగో నీ ఆస్తి....నువ్వే ఉంచుకో....అని సాధువు కోటీశ్వరుడికి తిరిగిచ్చేశాడు.
ఆ మూట తిరిగి తన చేకితొచ్చేసరికి కోటీశ్వరుడిలో పూర్వపు సంతోషమంతా వచ్చేసింది. కిందా మీదా అయిపోతున్నాడు. ముఖమంతా నవ్వే నవ్వు.
ఇప్పుడు ఆ సాధువు అడిగారు...
“ ఇదిగో చూడు. ఎంతలా నవ్వుతున్నావో....ఇంతకుముందు ఈ సంపదంతా ఎక్కడుండేది. మీదగ్గరే కదా....కానీ అప్పుడు నీ దగ్గర సంతోషం లేదు. ఇప్పుడూ నీ దగ్గరున్నది అదే సంపద....కానీ సంతోషమూ, ప్రశాంతత నీ ముఖాన కనిపిస్తున్నాయి....” అని సాధువు మరొక్క నిమిషం అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు.
తనకంతా అర్థమైనట్లు కోటీశ్వరుడు ఆ మూటతో ఇంటికి చేరాడు.

                                                        ***

No comments:

Post a Comment

Pages