పేరిణి నాట్యం
( భాగం - 2 )
శ్రీరామభట్ల ఆదిత్య
నాటరాజ రామకృష్ణగారు ఒకసారి రామప్ప దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చెక్కబడిన శిల్పాల యొక్క నాట్య భంగిమల వలన ఆయనకు ఈ పేరిణి నాట్యానికి సంబంధించిన ప్రేరణ దొరికింది. ఆ తరువాత ఆయన రామప్ప ఆలయాన్ని ఎన్నో సార్లు సందర్శించి పేరిణి నాట్యంలో చాలా భాగాన్ని పునః సృష్టించారు. పేరిణి అనే పదం కూడా 'ప్రేరణ' అనే పదం నుండి వచ్చనదిగా చెబుతారు. ఆ ప్రేరణే యుద్ధ సమయాలలో సేనలను ఉత్తేజపరచేది. కాకతీయుల సైన్యాధికారులలో ఒకరైన జాయపసేన నృత్తాన్ని ఆధారంగా తీసుకొని పేరిణి నాట్యాన్ని అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ జాయపసేనే 'నృత్త రత్నావళి అనే గ్రంథాన్ని రాశాడు. నందికేశ్వరుడు రాసిన భరతార్ణవం గ్రంథం నుండి కొంత ఈ నాట్యం గురించి గ్రహించారు నటరాజ రామకృష్ణ గారు.
కాకతీయులు వీరశైవులు కాబట్టి ఈ నాట్యం ప్రధానంగా శైవసంబంధ దేవతలపై ప్రదర్శించేవారు. పార్వతిదేవిపై 'లాస్యం' భాగాన్ని, శివుడు, గణపతి, కుమారస్వామి, వీరభద్రుడు, కాలభైరవుడు వీరందరి కథలని 'తాండవ' భాగానికి ఆధారంగా తీసుకొని పేరిణి నాట్యం చేస్తారు. తాండవలాస్యాలలో మొత్తం ఒక చేత్తో వేసే ముద్రలు 27 వీటినే అసంయుత హస్తాలు అంటారు. రెండు చేతులతో కలిపి వేసేవి 16 ముద్రలు వీటినే సంయుత హస్తాలు అంటారు.
ఈ నాట్యం పంచఅంగాలతో కలిసి ఉంటుంది. అవే
1) గర్ఘరం - నాట్యంలో అనేక విధాలుగా గజ్జెలను పలికిస్తూ ఆడటం.
2) విషమం - పక్షులు, జంతువుల విన్యాసాలతో వివిధ మృదంగ జతులకు చేసే నృత్యం.
3) భావాశ్రయం - ముద్రలు, హావ భావ ప్రకటనను సూచించడమే.
4) కవివారం - భగవంతుని కీర్తన చేసే గీతాలకు నృత్యాన్ని నర్తకులు ప్రదర్శిస్తారు
5) గీతం - ప్రబంధ గీతాలకు నృత్త, నృత్యాలను ప్రదర్శిస్తారు.
మన దురదృష్టమో కానీ చాలా ఆలయాల్లో నృత్యరీతులను తెలియచెప్పే
శిల్పాల యొక్క కాళ్ళు లేక చేతులు తొలగించబడ్డాయి. ఇంకా సారంగదేవుడు రాసిన ' సంగీత రత్నాకరం' లో కూడా ఈ నాట్య విశేషాలు ఉన్నాయట.
మొట్టమొదటిసారి 1975లో జరిగిన తొలి 'ప్రపంచ తెలుగు మహాసభల'లో తన ముగ్గురు శిష్యులతో ఈ నాట్యాన్ని నటరాజ రామకృష్ణ గారు ప్రదర్శింపజేశారు. ఆ తరువాత మెల్లగా ఈ నాట్యాన్ని నేర్చుకునే వారి సంఖ్య పెరగసాగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం పేరిణి నాట్యాన్ని ' రాష్ట్ర అధికారిక నాట్యం'గా ప్రకటించింది. ముఖ్యంగా ఈ మధ్య ఈ నృత్యాన్ని పేరిణి శివతాండవంగా పిలుస్తున్నారు. ప్రభుత్వ నాట్య కళాశాలల కోర్సులో కూడా పేరిణి నాట్యాన్ని జత చేయడం జరిగింది. (సమాప్తం)
No comments:
Post a Comment