పుష్యమిత్ర - 38 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 38
- టేకుమళ్ళ వెంకటప్పయ్య

జరిగిన కధ: పుష్యమిత్రుడు తన కాలంలో దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు.  ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు.  ఇండియన్ గ్లోబల్ ఐ విషయం పాకిస్తాన్ వాళ్ళకు తెలిసిపోయిందన్న విషయం ప్రభుత్వం గమనిస్తుంది.  పాకిస్తాన్‌లోని ఉప్పుగనులకు టెండర్ వేసిన సుకేశ్ సుభానికి టెండర్ వచ్చిందని ఫోన్‌లొ మన ప్రధానికి పాక్ ప్రెసిడెంట్ శుభవార్త చెప్తాడు. పంచాపకేశన్‌ను అనుచరుడు వెంకటేశన్ ప్రభుత్వానికి లొంగిపోయి సాక్ష్యాధారాల్తో సహా పట్టించగా ఆర్ధికమంత్రి జైలుపాలవుతాడు. ఇండియన్ గ్లోబల్ఐ రహస్య విషయం అక్కడపనిచేసే అసాఫాలి ద్వారా ఎక్కువ విషయాలు రాబట్టాలని అతణ్ణి పాకిస్తాన్ కు తీసుకెళ్ళే పధకంలో ఇండియన్ అర్మీకి దొరికిపోతాడు.  (ఇక చదవండి)
ఉప్పుగనుల త్రవ్వకం చురుకుగా సాగుతోంది. అప్పటివరకూ మూడు షిఫ్ట్‌లు గా సాగుతున్న త్రవ్వకం ఆరోజునుండి రెండు షిఫ్ట్‌లు చేశారు. లోపల రిపేర్లు ఉన్నాయని కొద్దిరోజులు ఉదయం 8 గం.నుండి సాయంత్రం 4 గం.వరకు. మరలా సాయంత్రం 4 నుండి 12 గంటలవరకూ మాత్రమే ఉంటుందన్న నోటీసు బోర్డు పెట్టారు. ఆ మాదిరి ఒక నెలరోజులపాటు వారందరికీ షిఫ్ట్‌లు సర్దుబాటు చేశారు.
రాత్రి 12 గంటల తర్వాత రిపేర్ల పేరుతో ఓ పదిమందితో కూడిన బృందం ఒకటి లోపలికి వెళ్తోంది. తిరిగి ఉదయం 6 గంటలకు బయటికి వస్తున్నారు. ఆ సమయంలో లోపలకు ఎవ్వరూ వెళ్ళకుండా చాలా స్ట్రిక్ట్‌గా చెక్ చేస్తున్నారు. మొదటగా పుష్యమిత్ర తను కుడివైపు మూసివేయబడి  ఉన్న సొరంగం వారికి చూపించి అక్కడనుండి వంద గజాలు త్రవ్వాక ఒక సింహద్వారం లాంటిది వస్తుందని వారికి ఒక చిత్రం వేసి చూపించాడు. వారంతా భారత సైనిక దళంలో నమ్మకమైన సివిల్ ఇంజినీరింగు బృందం. వారందరికీ మనం చేసేది "ఆపరేషన్-నాజా నాజా" అని,  ఎప్పటికప్పుడు ఏమిచెయ్యాలో డైరక్షన్స్ వస్తాయని మాత్రమే చెప్పారు. పగలు పూట వారు వెళ్ళిపోయాక ఆ మార్గంలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ వారిని కాపలా ఉంచుతున్నారు. పగలుపూట యధావిధిగా ఉప్పు త్రవ్వకం సరఫరా జరుగుతోంది.
కొద్దిరోజులు ఆ సొరంగo లోని మట్టిని తీసి మార్గం తొలచగా అక్కడ ఒక దేవాలయం లాంటిది బయటపడింది. దాన్ని జాగ్రత్తగా నాలుగువేపులా చూసి సింహద్వారం వరకూ మాత్రమే త్రవ్వమని ఉత్తర్వులు వచ్చాయి. ఉత్తర దిశగా ఒక రాతిగోడను జాగ్రత్తగా పరిశీలించి సింహద్వారం కనిపించింది. ఒక పురాతన నాగాలయం లాంటి ఛాయలు కాన వచ్చాయి. నాలుగువేపులా సర్పాకృతిలో శిల్పాలు ఉన్నాయి. ఆరోజు రాత్రి పుష్యమిత్రుడు వచ్చి చూసి మరుసటిరోజు ఉదయం తెల్లవారు ఝామున 4-5 గంటల మధ్యకాలంలో ఒక అనుచరుడిని మాత్రం ఉండమని మిగతావారందరినీ వెళ్ళిపొమ్మంటాడు. అనుచరుడిని చాలా దూరంలో సెక్యూరిటీ గేట్ వద్ద కూర్చోమని, బ్రహ్మీ ముహుర్తంలో సంధ్యావందనం చేసి ధ్యానంలో కూర్చుంటాడు.
ఒకతెల్లటి ఛాయ ఒకటి గుహలోకి ప్రవేశించింది. క్రమంగా బాబాజీ ఆకారంలో నిలబడింది.
"పుష్యమిత్రా! నీ యీ అవతారానికి పరిపూర్ణత చేకూరే రోజు ఆసన్నమయింది. నీ పని త్వరగా పూర్తిచేసుకుంటే మనం పరమేశ్వర సన్నిధి చేరుకోవాలి"
సాష్టాంగ నమస్కారం చేసి "అవశ్యం. ఆ పరాత్పరుని అనుజ్ఞల మేరకే జీవిస్తున్నాను. నా విముక్తి ఎప్పుడో త్వరగా చెప్పండి. కలికాలం కనుక కొన్ని ఘోరాలు ఆపలేకపోతున్నాను."
"ఈ నిధి మొత్తం సక్రమంగా వినియోగించుకుంటే భరత ఖండానికి తిరుగులేదు. ఈ విశ్వంలోనే ఒక గొప్ప ఎదురులేని శక్తిగా అవతరిస్తుంది. సర్వదేశాలు భరతఖండానికి మోకరిల్లుతాయి. విశ్వం మొత్తం ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. దానికి భారతదేశమే ప్రధాన పాత్ర వహిస్తుంది. కృతయుగానికి అడుగులు చురుకుగా సాగుతాయి."
"బాబాజీ! నా కోరికా అదే! కానీ శతృదేశాల వాళ్ళు మనపై చేసే కుట్రలు ఎక్కువవుతున్నాయి."
"ఈ పాకిస్తాన్ వాళ్ళూ ఒకప్పుడు భరఖండ ప్రజలే నన్న విషయం విస్మరించకు"
ఒకప్పుడు మిత్రులు, మనదేశ ప్రజలే కావచ్చు బాబాజీ! ప్రస్తుతం మనదేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వారు కదా!"
"నిజమే! కానీ..మానవ వినాశనం మనం ఎట్టి పరిస్థితులలోను కోరుకోకూడడు. మానవ కల్యాణం కోసమే జీవించాలి"
"అవును. వేదాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులూ శాంతి మంత్రాలనే చెప్తున్నాయి. కానీ ఎవరు వింటున్నారు? ఒకవైపు వారిదృష్టి ఎంతో కష్టపడి నిర్మించుకున్న గ్లోబల్-ఐ పై పడింది. దాన్ని విధ్వంసం చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు"
బాబాజీ నవ్వి "పుష్యమిత్రా! నీకోవిషయం చెప్పడం మరచాను. ఈశ్వరాజ్ఞ ఏమిటో తెలుసా! నీవు ఎక్కడైతే మళ్ళీ ఈ భూమి మీదకు వచ్చావో.. అదే గ్లోబల్-ఐ దగ్గర నుండే మరలా త్వరలో ఆ సర్వే శ్వర సన్నిధికి నీ తిరుగుప్రయాణం జరుగుతుంది. ఈ నాగబంధం విడిపించేందుకు నా అదృశ్య శక్తులు నీకు సదా అండగా ఉంటాయి. విషవాయువులు రాకుండా ఉండే మంత్రాలు చెప్తాను. ఒకవేళ వస్తే వచ్చినప్పుడు నీ చుట్టూ ఓ రక్షణ వలయాన్ని నిర్మిస్తాను. నీవు ఈశ్వరాజ్ఞ అయేవరకూ మరణించడం అనేది ఉండదు"
"ధన్యోస్మి" 
"మన దేశ సంపదను గ్రీకు దేశానికి తరలించాలనుకున్న అలెగ్జాండర్ గురించి తెలుసుగదా! జూపిటర్ దేవత సర్ప రూపంలో ఒలింపియాకు ప్రత్యక్షమయ్యడు. అతని ఆశీస్సులతోనే అలెగ్జాండర్ జనించాడన్న విషయం నీకు తెలియంది కాదు.  అలాంటి యవనులకు భయపడే నీవు సంపద ఇక్కడ దాచావు. విచిత్రం కదా! నాగబంధం విప్పే విధానం నీకు  తెలుసు. అయినా కొన్ని వేల సంవత్సరాలయ్యాయి కనుక సదాశివాజ్ఞతో చెప్తున్నా విను. జనమేజయుడు సర్పజాతిని నిర్మూలించాలనే ధ్యేయంతో సర్పయాగం ప్రారంభించగా,యాగం చేస్తున్న సమయంలో పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి కాలిపోతుంటాయి. అయితే సృష్టిలో సర్పజాతి అంతం కారాదనే ఉద్దేశంతో కొందరు జరత్కారువు అనే ముని వద్దకు వెళ్ళి, ఈ యాగం ఆగిపోయే ఉపాయం ఆలోచించమని కోరారు. జరత్కారువు తన కుమారుడు ఆస్తీకుని జనమేజయుని వద్దకు పంపగా, అతడు జనమేజయుని వద్దకు వచ్చి, తన విద్యా నైపుణ్యం చూపించి, సర్పయాగం మంచిది కాదని నచ్చజెప్పి, ఆ యాగాన్ని ఆపు చేయించాడు. అందువల్లనే సర్పజాతి ఈ రోజు నిలిచి ఉంది. ఈ నిధిని కాపలా కాస్తోంది.  “వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, వరుణుడు, కుంజరుడు, కుముదుడు, దుర్ముఖుడు, పృథుశ్రవుడు, హ్రాదుడు, వక్రదంతుడు, క్రోధుడు, శంఖుడు, పుండరీకుడు, మిశ్రి” అనే వరుసలో నీవు మంత్ర ప్రయోగం గావించు. అంటే నీవు గతంలో వీటిని వ్యతిరేకదిశలో ఇక్కడ కావలి ఉండమని నీ ఉపాసనా బలంతో నియమించావు. కనుక ఇప్పుడు నేను చెప్పిన క్రమంలో వాటిని ఆవాహన చెయ్యి. మొదట అగస్త్య మహాముని చెప్పిన స్కంధ-స్తుతితో ప్రారంభించు. మనం ఎంత జాగ్రత్తగా చేసినా మంత్ర హీనం క్రియాహీనం ఉండవచ్చు. ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కారం అనే  రెండు ప్రధానమైన సర్ప పూజలు కూడా సంపూర్తిగా చేశాకే నాగబంధం విప్పడం ప్రారంభించాలి. చివరలో సుబ్రహ్మణ్య స్తవము, దండకములతో ముగించు. సర్పావాహన సమయంలో సర్వ సర్పాలు నీ ముందు  పడగవిప్పి భయంకరంగా నాలుకలు చాచి నీ అనుజ్ఞకోసం కూర్చుంటాయి. ఏ మాత్రం భయపడకు. గరుడోపనిషత్ ను సంపూర్తిగా పఠించాలి.  "ఓం తత్పురుషాయ విద్మహే స్వర్ణ పక్షాయ ధీమహి, తన్నో గరుడః ప్రచోదయాత్" అన్న గరుడ గాయత్రిని 1,001 సార్లు దీక్షగా జపిస్తే వ్యతిరేక శక్తి గదిలో ప్రవేశించి ఆ సర్పాల శక్తి క్రమేణా క్షీణిస్తుంది. నీ కర్తవ్యం నీవు నిర్వహించు. నీవు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ ఈ నాగబంధం విప్పలేరు. ఈ దేశంలో ఎన్నో దేవాలయాలలో ఉన్న సంపద అంతా సర్పబంధం ఎలా విప్పాలో తెలీక వృధాగా ఉండిపోయింది.   నేను అదృశ్యంగా ఉండి అన్నీ గమనిస్తాను. దీనికి నిన్ననే ఈశ్వరాజ్ఞ అయింది. ఆయన దక్షిణామూర్తిరూపంలో నాకు దర్శనమిచ్చి అడిగిన సందేహాలకు సమాధానమిచ్చాడు. సుబ్రహ్మణ్యునికి ఈ విషయాలన్నీ నివేదించాను. భయం లేదు. ప్రారంభించు. సింహద్వారం త్రవ్వించి, నాగబంధం ఉన్న తలుపులవరకూ శుభ్రం చేయించు. నీవు నీతో మంత్రజలం చల్లించుకున్న పురుషులు మాత్రమే లోనకు వెళ్లగలరు. మిగతా ఎవ్వరు ప్రవేశించినా మరుక్షణంలో విషవాయువులకు  మరణిస్తారు. శుభం" అని అదృశ్యమైపోయాడు.
*    *    *
"నాగులకు ముఖ్యమైన రోజు కార్తీకశుద్ధ చతుర్థి ఇంకో పదిరోజుల్లో వస్తుంది. ఆరోజున నా పని ప్రారంభిస్తాను."
"అవశ్యం. మీకు కావలసిన సామాగ్రి అంతా రెడీ చేస్తాము".
"ముందుగా అక్కడ శుభ్రం చేయించి అక్కడ ఎవ్వరూ లేకుండా చూడండి. వారంరోజులపాటు గనుల్లో నీరు వస్తుందని ఒక పుకారు పుట్టించి గనులన్నీ మూయించండి. శలవు ప్రకటించండి. "
"అలాగే"
"నేను గది తలుపులు చెరిచాక ఎవరో ఇద్దరు మా త్రమే లోపలికి రావాలి. ఎవ్వరికీ తెలియకూడదు. నిధి దొరికాక అక్కడకు ఎవ్వరికీ ప్రవేశం ఉండకూడదు. ఒక బలిష్టమైన గదిని నిర్మించి 24 గంటలు కాపలా ఉంచాలి."
"నేను, రిజర్వు బ్యాంక్ గవర్నర్ మాత్రమే వస్తాము. ఇక్కడ తూకం వేశాక తరలింపు ప్రారంభం. రోజూ కొంత కొంత తరలించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పినట్టు చెత్తా చెదారం ఉప్పు బస్తాల క్రింద పెట్టి పంపడం ప్రారంభించాము. ఒక 10 రోజులు చెకింగ్ చేసి తర్వాత "పాగల్ ఆద్మీ. మట్టీ మే క్యాహై" అంటూ చెక్‌పోస్టు వాళ్ళు చెకింగ్ ఆపేశారు.  
"అలా మట్టి పంపడం ఆపకండి. వాళ్ళకు విసుగొచ్చేవరకూ చెకింగ్ జరుగుతుంది. తరవాత మనపని సులువవుతుంది."
"అలాగే. మీకు సంపూర్తిగా తాళపత్రాలు వచ్చినట్టేనా?"
"కర్నాటక రాష్ట్రములో ఒక సుబ్రహ్మణ్య క్షేత్రము ఉంది. అది ఆదిసుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) క్షేత్రం. అక్కడ ఆశ్లేషబలిపూజ  చేసే పూజారిని ఆ మంత్రం పఠించే విధానం ఉన్న గ్రంధం నాకు వెంటనే పంపమని చెప్పండి. ఇది వెంటనే జరగాలి". కేరళలోని తాంత్రిక పూజారులలో బాగా అనుభవజ్ఞుడైన పూజారిని నా వద్దకు ఒకసారి రమ్మని చెప్పండి. అలాగే నాగర్‌కోయిల్ పూజారిని కూడా ఒకసారి చూసి మాట్లాడాలి. "
"ఈ పని ఇమ్మీడియెట్ గా చేస్తాను" అని ఎవరికో ఫోన్ చేసి విషయం చెప్పాడు.
"నేను కార్తీకశుద్ధ చతుర్థికి ముందు ఒక 3 రోజులపాటు మౌన దీక్షలో ఉంటాను. ఈలోపు అన్ని ఏర్పాట్లు అయిపోవాలి"
"అలాగే. శెలవు"(సశేషం) 
                                           *    *    *

No comments:

Post a Comment

Pages