"రెప్పలు "
తిమ్మన సుజాత
ఆకృతి దాల్చే అంకురాన్ని తన
గర్భంలో దాచుకునే అమ్మతనమే
కదూ! కంటి రెప్పలది ..
అమ్మ పేగుబంధంనుండి విడివడి
జన్మతీసుకున్న క్షణం నుండి
కంటి పాపలను కాపాడుతూనే ఉంటాయి రెప్పలు
అలసిన తనువును సేదతీర్చ
కళ్ళని కప్పేసి మరోలోకపు
నిద్రమ్మ ఒడిలో కలల జోలలు పాడుతాయి రెప్పలు
మండుటెండలకు ఛత్రమైనట్టే
జడివానల్లోనూ గొడుగులవుతూ
హోరుగాలుల ధాడి జరగనీయవు రెప్పలు ..
బహిర్గతంగా తమ కృషికి భంగం
రానీయకుండా నీలాల కనులకు రక్షణనిస్తాయి రెప్పలు ..
కానీ ...
చెదురుతున్న చూపులను
అదుపుజేయ రెపరెపలాడుతాయి రెప్పలు
ఆనందాతిశయాలతో పరవళ్లు ద్రొక్కే గోదారిలానో
లేక
వేదనాభరిత హృదయసంద్రంలో
కల్లోలమవు సంఘర్షణల ఉప్పెనలతో కన్నీళ్లు
చెంపల చేలను ముంచేస్తూ ఉంటే
ఆనకట్ట వేయలేక అసహాయమవుతాయి రెప్పలు ..
'సర్వేంద్రియానాం నయనం ప్రధానం ' అన్న
సూక్తి నిక్షిప్తం చేసుకున్న నిదర్శనమే రెప్పలు ..!
**********
No comments:
Post a Comment