సేకరణ
పిల్లలూ! ఎలా ఉన్నారర్రా!!
మీకు సేకరణ (collection)అంటే తెలుసా? ఏదైనా మనకు నచ్చేది.. దొరికింది దొరికినట్టు భద్రపరచుకోవడం.
కొన్ని సేకరణలు చూద్దామా!
కరెన్సీ: నోట్లని, చిల్లరని పాతకాలం నుంచి ఈకాలం దాకా, మనదేశం నుంచి విదేశాల దాక సంపాదించి భద్రపరచడం.
స్టాంపులు: పోస్టాఫీసులు వెలువరించే రకరకాల స్టాంపులు సేకరించి భద్రపరచుకోవడం. ఇందులోనూ విదేశీవి ఉంటాయి.
పురాతన వస్తువులు: కొంతమంది పురాతన వస్తువులు సేకరించి భద్రపరుస్తారు.
ఆకులు, పూలు: కొన్ని ఆకులు ఎంతకాలం భద్రపరచినా ఆకారం మార్చుకోకుండా, రంగు కోల్పోకుండా ఉంటాయి. వాటిని సేకరిస్తారు.
రాళ్లు: కొన్ని ఊళ్లలో దొరికే ప్రత్యేకమైన రంగుల రాళ్లు సేకరిస్తారు కొంతమంది.
అంశాలు: పేపర్లలో వచ్చే ఆసక్తికర అంశాల పేపర్ కటింగ్లు.
ఫోటోలు: తమకిష్టమైన నటులు, ఆటలాడెవాళ్లు, చిత్రకారుల ఫోటోలు.
ఇవేకాకుండా పెన్నులు, పుస్తకాలు, ఆటబొమ్మలు, ఫోన్లు ఇత్యాదివి సేకరిస్తారు.
అన్నట్టు ఇలా కొన్ని సంవత్సరాలపాటు భద్రపరిచాక, అవి బయట ఎక్కడా లభ్యం కానప్పుడు కొంతమంది, కొంత ఖరీదు చెల్లించి మన దగ్గర నుంచి కొనుక్కుంటారు కూడా!
ఒక్కసారి నేను చెప్పేది ఊహించండి.మొన్ననే మన ప్రధాని మోడీగారు డీమోనిటరైజేషన్ తో రూ. 500/- రూ. 1000/- నోట్లని మార్చారని మీకు తెలుసు. మీ అమ్మానాన్నలు బ్యాంకుల ముందు క్యూలో నిలబడి మరీ పాత నోట్లిచ్చి కొత్త నోట్లు తెచ్చుకున్నారన్న విషయమూ మీకు తెలుసు. కొన్ని సంవత్సరాల (అప్పటికి మీరు బాగా పెద్దయిపోయి ఉంటారనుకోండి) తర్వాత మీరు ఆ పాత రూ. 500/- రూ. 1000/- నోటు తీసి చూపించారనుకోండి ఎంత విచిత్రంగా ఉంటుంది చూసేవాళ్లకి!
కాదేది సేకరణకు అనర్హం. ఇలా మీరూ మీకు నచ్చినవి సేకరించండి.
సేకరించి నాకు చూపిస్తారు కదూ!
ఉంటానర్రా మరి.
మీ సుబ్బుమామయ్య!
No comments:
Post a Comment