తెలుగు సంప్రదాయం అవుట్ సోర్సుడ్ - అచ్చంగా తెలుగు

తెలుగు సంప్రదాయం అవుట్ సోర్సుడ్

Share This
తెలుగుసంప్రదాయం అవుట్ సోర్సుడ్!
సదాశివుని లక్ష్మణరావు 

రాత్రి 12 గంటలయ్యింది.వాట్సాప్ లో చివరిమెసేజ్ చదివి నవ్వు ఆపుకోలేకపోయింది కీర్తి. మరునాడు ఆదివారం. సెలవు. అందుకని ఇంతవరకు నిద్రపోకుండా ఉండిపోయింది.ఎలాగూ 12గం దాటిందికదాని ముఖ్యమైనవాట్సాప్ గ్రూపుల్లో "గుడ్ మార్నింగ్ " పెట్టేసి పడుకుంది.
పడుకోబోయేముందు చివరగా చదివిన యీ మెసేజ్ గుర్తుకొచ్చి నవ్వుకుంది.

"అడుక్కునే వాడు ఫ్లాట్ బెల్ కొట్టాడు.  ఆవిడ తలుపుతీసిoది బిక్షవేయడానికి.  " కొద్దిగా బయటకు వచ్చి వేయండి " అన్నాడు. ఆమె బయటకు రాగానే "అహ్హహ నేను రావణుడిని నిన్ను ఎత్తుకు పోవడానికి వచ్చాను" అన్నాడు. అంతకంటే గట్టిగా నవ్వి "నేను సీత ను కాదు పనమ్మాయిని"అంది. "అయితే ఇంకా మంచిది. సీత అయితే నా మండొదరి ఏడుస్తుంది. నువ్వైతే దాసిని తెచ్చానని సంబరపడుతుంది" అన్నాడు.
"నీ మొహం, సీత అయితే రాముడు ఒక్కడే నిన్ను చంపడానికి వస్తాడు. నన్ను తీసుకెళితే ఆపార్ట్‌మెంట్ వాళ్ళందరూ వెతుక్కుంటూ వచ్చి నిన్ను చంపేస్తారు" అని వికటాట్టహాసం చేసింది."
****
అక్కడ వైకుంఠంలో ... ఎపుడూ లేనిది ఆ రోజు పెందరాళే మూడుగంటలకు నిద్రలేచి తలంటుపోసుకుని , కురులను వదులుగా కట్టుకుని..ఆభరణాలను అలంకరించుకుని రెడీ అవసాగింది శ్రీ లక్ష్మీదేవి. ఆశ్చర్యంగా గమనిస్తున్న శ్రీ మహావిష్ణువుని చూసి "నాథా! గుడ్ మార్నింగ్ . కొంతకాలము క్రితము మీతో ముచ్చటించిన విషయం . అదే మన తెలుగురాష్ట్ర ఆడపడుచులను నేను స్వయంగా చూచి కుశలమడిగి వచ్చెదను. ఈ దినము సంక్రాంతి పర్వదినముకూడా కదా. ప్రతీ ఇంటినీ సందర్శించి , వాకిళ్ళనూ గుమ్మాలను అలంకరించిన తీరును చూసి , ఇల్లాల్లను కలిసి అభినందించి వచ్చెదను. పనిలో పనిగా గుమ్మంలో ముగ్గులు వేసిన ప్రతీ ఇల్లాలికి లలితాజ్యూయలరీ వారి బంగారు నెక్లెస్ ని బహుమతిగా అందజేసి వచ్చెదను. ఆనతీయుడు" అనగా ప్రసన్నచిత్తుడై "అవశ్యము. నీ పనిలో సాయానికి మన జెమిని టివి లో "లక్ష్మీదేవి తలుపుతట్టింది" కార్యక్రమం యాంకర్ సుజనని, కెమేరామేన్ యాదగిరి నీ తోడు తీసుకువెళ్ళు. మన గరుడవాహనంపై వెళ్ళు. జాగ్రత్త ఆర్టీసి స్టాండులో మాత్రం మన "గరుడ"ని పార్కు చేయకు. సంక్రాంతి రష్ గరుడ బస్ అని ప్రయాణీకులు కన్ఫ్యూజవుతారు. ఆల్ ద బెస్ట్ "
మరీ ఎక్కువ ఆలస్యము కాకుండా ఆరు గంటలకల్లా గచ్చిబౌలి లోని "లక్ష్మీ పెరల్స్ " అపార్ట్ మెంట్ 101 ఫ్లాట్ గుమ్మందగ్గర ప్రత్యక్షమైంది శ్రీ లక్ష్మీదేవి. ఆ గుమ్మం ముందు చక్కటి  పద్మం ముగ్గుని, ఆ పక్కనే లక్ష్మీదేవి పాదాలముగ్గుని చూసి ఆశ్చర్యపోయింది. యాంకర్  సుజన ముందువెళ్ళి డోర్ బెల్ నొక్కింది. "ఎవరూ?" అంటూ డోర్ తెరిచింది జయప్రదగారు. అపుడే నిద్రలేచిన ముఖంతో కురులు ముడివేసుకుని నైటీలో ఉన్న ఆవిడని చూసి "జయప్రదగారూ. సంక్రాంతి శుభాకాంక్షలు. సాక్షాత్తూ శ్రీ లక్ష్మీదేవి గారు వచ్చారు. గుమ్మంలో ముగ్గుబాగావేశారు. అందుకని మీకు బహుమతికూడా తెచ్చారు. ఎలా వేశారు? దేనితో వేశారు? చెప్పండి" అనగా
జయప్రద గారు" నాకెక్కడ ముగ్గులొచ్చండి. నా ఒబెసిటి బాడీ తో నేను వంగి ముగ్గులు వేయలేనుకూడా.ఆ ముగ్గులు మా పనమ్మాయి లక్ష్మి వేసింది.ఇపుడే వెళ్ళింది"
అంతే లక్ష్మీదేవి వెనుతిరిగింది.
వెళ్ళి 302 ఫ్లాట్ గుమ్మంముందు మంచి నెమళ్ళ ముగ్గువేసి ఉంటే ఆ డోర్ బెల్ నొక్కమంది. వెంటనే ఆ ఇంటి ఇల్లాలు అనసూయ తలుపుతీసి చూసి ఆశ్చర్యపోయింది. స్నానంచేస్తుండగా తడిబట్టలతో తలుపుతీయడానికి వచ్చినట్టుంది. "సారీఅండి ..కూచోండి బట్టలు మార్చుకొస్తాను"..ఏవండీ నాలుగు టీ పెట్టండి అని వాళ్ళాయనకు ఆర్డరిచ్చింది. వచ్చిన అనసూయతో సుజన"ఈ నెమళ్ళ రంగవల్లి బాగా వేశారండి..బియ్యంపిండి వాడారా?"అడిగింది
"అబ్బే నే వేయలేదండి.మా సర్వెంట్ మెయిడ్ లక్ష్మి వేసింది.ఇపుడే వెళ్ళింది"
శ్రీ లక్ష్మీదేవికి ఈ ఇల్లాల్లను చూసి ఆశ్చర్యపోయింది.ఇప్పటివరకు చూసిన రెండు గుమ్మాలలో ముగ్గులు ఆ ఇంటి ఇల్లాల్లు వేయలేదు. అయినా మాట తప్పడానికిలేదు.ఈ కార్యక్రమంలో ముగ్గులు వేసిన వారిని న్యాయంగా అందవలసిన బంగారునెక్లెస్ లు వారికే అందజేయాలని శ్రీ మహావిష్ణువు గారి హుకుం.
సరి ఇక పక్కనే ఉన్న 301 గుమ్మం ముందు లతలముగ్గుచూసి సరదాపడి ముందెళ్ళి తనే బెల్ కొట్టింది."ఆ వస్తున్నా.." అంటూ లుంగీ పైకి కట్టుకుంటు తలుపుతీసి ఆశ్చర్యపోయాడు సుబ్బారావు.."సార్ ..మీ ఇంటిముందు ముగ్గుచూసి సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవిగారే ముచ్చటపడ్డారు. ఇది వేసిన మీ ఆవిడని పిలవండి." అంది యాంకర్  సుజన
"అవిడెక్కడుంది.ఎప్పుడో పోయింది."
"ఆ అలాగా, జబ్బుపడి పోయారా?"
"అబ్బే అదేంకాదండి. విడాకులిచ్చి వాళ్ళ పుట్టింటికి పోయింది. ఆ ముగ్గు నేనే వేశాను. నా ఆఫీసు టైములు కుదరక పనమ్మాయిని పెట్టుకోలేదు.మా ఊళ్ళో ఉన్న మా అమ్మగారు గుమ్మంముందు ముగ్గు ఎపుడూ ఉండాలి అని మాటతీసుకుంది. అందుకే నేనే వేస్తున్నాను"
పక్కన "విష్ణు హైట్స్ " అపార్ట్ మెంట్ కి వెళ్ళి G-1 గుమ్మంముందు మంచి ముగ్గువేసుంటే అక్కడ ఆగి అక్కడే బయట ఉన్న కామేశ్వరిని "ఎవరేసారమ్మా ముగ్గుని" అని అడుగగా "మా పనమ్మాయి లక్ష్మి అమ్మా. అదిగో ఆ పరుగులాంటి నడకతో వెళ్తున్నదే అదే లక్ష్మి" అనగా వెంటనే ఆ లక్ష్మీ వెనకే శ్రీలక్ష్మిదేవి..సుజన..యాదగిరి వెళ్ళారు..అలా వెళ్ళి వాంబే (VAMBAY-valmiki ambedkar awas yojana పథకంలో కట్టిన ఇళ్ళు) కాలనీ లో ఉన్న లక్ష్శి ఇంటికి వెళ్ళారు.వారి గుమ్మం ముందు చిన్న అష్టదళపద్మం ముగ్గు బియ్యంపిండితో వేసి ఉంది. వారింటి తలుపు నిజంగానే శ్రీ లక్ష్మీదేవే  తట్టింది. వెంటనే లక్ష్మి తలుపు తీసింది. లక్ష్శి వెంటనే తన ఇద్దరు చెల్లెల్లు, అమ్మగారు, వదిన మొత్తం ఐదుగురు ఆడవాళ్ళు ముందుకొచ్చారు. అపుడు సుజన " లక్ష్మీ నీవు అదృష్టవంతురాలివి. శ్రీలక్ష్మీదేవి నిర్ణయం ప్రకారం ఈ సంక్రాంతి పర్వదినమునాడు గుమ్మములలో ముగ్గులు వేసిన ఆడువారికి బంగారు నెక్లెస్ బహుమతిగా ఇవ్వడానికి నిశ్చయించారు. నీవు పనిచేస్తున్న ఫ్లాట్లలో 101 , 302 , G-1 ల గుమ్మాలముందు నీవే ముగ్గులువేసినట్టు తెలిసింది. అందుకని ఆ మూడు బంగారు నెక్లెస్ లు నీకే అందజేస్తున్నారు." అనగా శ్రీ లక్ష్మీదేవి మూడు బంగారు నెక్లెస్ లను అందించింది.
లక్ష్మీ ఎంతో సంతోషించి "మాకు ముగ్గులేయడం మా అమ్మ నేర్పిందమ్మా..మా గుమ్మం ముందు ఉన్న ఈ  ముగ్గు మా అమ్మే వేసింది" అంటూ వాళ్ళమ్మని గట్టిగా పట్టుకుంది "మంచి అమ్మ" అని.
"అలానా ఐతే మీ అమ్మగారికి ఇదిగో మరో బంగారు నెక్లెస్ .." అంటూ అందజేసింది.
"అమ్మా నా డ్యూటీ ఐపోయిందా? ఇక నే వెళ్ళచ్చా? " అని అడిగిన సుజనతో శ్రీ లక్ష్మీదేవి "అపుడే కాదు. మనం ఆ 301ఫ్లాట్ సుబ్బారావు గారి అమ్మగారి ఊరు వెళ్ళి ఆవిడకు ఒక బహుమతి ఇవ్వాలి"
అలాచెప్పి పక్కనే ఉన్న చర్లపల్లి గ్రామంలో శ్యామలగారింటికి వెళ్ళారు. ఆ వాకిలిలో పేడతో శుభ్రంగా అలికి వాకిలి అంతా ముగ్గులు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు..చూరులో పిచ్చుకలకోసం కట్టిన ధాన్యంకంకులు..ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదం అక్కడే ఉన్నాయా అన్నట్టుంది.
"మీరు 301 సుబ్బారావు అమ్మగారు శ్యామలగారా? శ్రీలక్ష్మీ మిమ్మల్ని కలిసి కానుక ఇస్తారట.అనగా వెంటనే వచ్చి ప్రణామంచేసి..ఆమె చేతులమీదుగా  బంగారు నెక్లెస్ అందుకుని ఆనందపడింది. మీ అబ్బాయికి "శీఘ్రమేవ ద్వితీయకళత్ర ప్రాప్తిరస్తు" అని దీవించింది. సమయం మించిపోతుండగా బయల్దేరబోతుంటే ..కుంకుమ భరిణె లో కుంకుమతీసి బొట్టుపెట్టింది..తనూ బొట్టు పెట్టించుకుంది శ్యామల.
*****
కల ఇలా అయిపోగానే గబుక్కని మెలకువవచ్చింది కీర్తికి. ఉదయం ఆరయిపోయింది. అలారం కొట్టగా లేచి ఆదివారమయినా వెంటనే స్నానంచేసి వాకిలి కడిగి ముగ్గు పెట్టింది. "నేను పెడతాలే అమ్మగారూ" అంటున్న పనమ్మాయి మాట పెడచెవిన పెడుతూ......
***

No comments:

Post a Comment

Pages