ఉక్కు మహిళ - అర్చన చిగుళ్ళపల్లి - అచ్చంగా తెలుగు

ఉక్కు మహిళ - అర్చన చిగుళ్ళపల్లి

Share This
ఉక్కు మహిళ - అర్చన చిగుళ్ళపల్లి 
భావరాజు పద్మిని 

స్త్రీలో అపరిమితమైన శక్తి సామర్ధ్యాలున్నాయి. ఒక జీవనది సాగరాన్ని చేరేముందు, ఎన్ని కొండలు, రాళ్ళు అడ్డు వచ్చినా, కొత్త దారిని వెతుక్కుంటూ సాగిపోయినట్లు, స్త్రీ కూడా తన పయనంలో ఎన్ని మలుపులు ఎదురైనా, వాటికి తగ్గట్టుగా తనను తాను మలచుకుని,  తన గమ్యం వైపుగా సాగిపోతూ ఉంటుంది. ముప్పై ఏళ్ళకే బెంజి నుంచి గంజి దాకా జీవితపు లోతులన్నీ చూసి, ఎన్నో రంగాలలోకి మారి, సాటి స్త్రీలకు ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్న సాహసి... చిగుళ్ళపల్లి అర్చన గారి గురించిన ప్రత్యేక వ్యాసం మహిళా దినోత్సవం సందర్భంగా మీకోసం...

బాల్యం నుంచే...
సాధారణంగా ‘సేవా భావం’ అనేది పిల్లలకు తల్లిదండ్రుల నుంచి అబ్బుతుంది. అర్చన గారి చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ఆమె మనసుపై బలమైన ముద్ర వేసింది. స్కూల్ లో చదివేటప్పుడు, ఆమె స్నేహితురాలు రోజు విడిచి రోజు బాక్స్ తెచ్చేదట. ఆమె బాక్స్ తీసుకుని రాని రోజున చిన్నారి అర్చన తన బాక్స్ లో సగం ఆమెకు పెట్టేదట. ఈ విషయాన్ని అర్చన తన తల్లి వద్ద ప్రస్తావించినప్పుడు, ఆమె ఏమీ మాట్లాడకుండా మర్నాటి నుంచి అర్చనకు రెండు బాక్సులు ఇవ్వడం మొదలు పెట్టిందట. కాస్త పరిణితి వచ్చాకా, అర్చన ఈ సంఘటన గురించి ఆలోచించినప్పుడు, తన స్నేహితురాలి గురించి, ఆమె పేదరికం గురించి చెప్పకుండానే తల్లి మౌనంగా ఆమెకు సహాయపడినప్పుడు, ‘తాను కూడా అలా సేవ ఎందుకు చెయ్యకూడదు?’ అన్న బలమైన భావన ఆమె మనసులో నాటుకుంది. అప్పటినుంచి ఆమె అవసరంలో ఉన్నవారికి తనకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండేది.


ఎయిర్ హోస్టెస్ గా...
అర్చన డిగ్రీ చదువుతూ ఉండగానే ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ లో చేరి, శిక్షణ పూర్తి చేసుకుంది. అనుకోకుండా లో ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం లభించింది. చదువుతో పాటు ఉద్యోగం చేస్తూనే ఎం.బి.ఎ పూర్తి చేసింది. ఆ సమయంలోనే ఆమెకు వివాహం జరిగింది.
"ఎయిర్ హోస్టెస్ ల పని వేళలు వాళ్ళ చేతిలో ఉండవు. ఫ్లైట్ లు డిలే అయినప్పుడు ఒక్కోసారి అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. తిరిగీ తిరిగీ అలసిపోయి, ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తే, ఇక ఇల్లాలిగా నా బాధ్యతలు నెరవేర్చే సమయం, జీవితాన్ని ఆస్వాదించే సమయం ఎక్కడ దొరుకుతుంది? ఇదంతా ఆలోచించిన నేను,  ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను.” అని చెబుతుంది ఆమె. ఆ తర్వాత అర్చన ఐ.టి కంపెనీ లో, మార్కెటింగ్ మానేజ్మెంట్ రంగంలో పనిచేసి, తన సత్తా చాటారు.
  ఇల్లాలిగా, ఇద్దరు ముద్దుల పాపాలకు తల్లిగా ఉంటూ, అనుకోకుండా అపరిమితమైన బరువు పెరిగింది అర్చన. కాని పట్టుదలగా, భర్తతో ప్రోత్సాహంతో సాధన చేసి, బరువు తగ్గి చూపింది. భర్త చేసే ‘వాన్ హ్యుసేన్’ కంపెనీ డీలర్ షిప్ నడిపేందుకు ఆయనకు తోడ్పడుతూ, మిగతా సమయం గృహిణిగా తన బాధ్యత నిర్వర్తించసాగింది. దానితో పాటుగా తన స్నేహితులకు, అవసరంలో ఉన్నవారికి కౌన్సిలింగ్ చెయ్యడం, వేడుకలను బ్లైండ్ స్కూల్, డంబ్ స్కూల్ పిల్లలతో జరుపుకోవడం చేస్తూ ఉండేవారు.

“రాబిన్ హుడ్ ఆర్మీ” తో పయనం...
పెద్ద పెద్ద వేడుకల్లో, హోటల్స్ లో మిగిలిపోయిన పదార్ధాలను సేకరించి, వాటిని చక్కగా ప్యాక్ చేసి, ఆర్తులకు అందించే స్వచ్చంద సంస్థ – రాబిన్ హుడ్ ఆర్మీ. విశ్వ వ్యాప్తంగా ఉన్న ఈ సంస్థలో ఎవరైనా సభ్యులు కావచ్చు, సేవ చెయ్యచ్చు. ఈ సంస్థ పట్ల ఆకర్షితురాలైన అర్చన ఇందులో చేరింది. 

టూ వీలర్, ఫోర్ వీలర్ నడిపే సత్తా ఉండడం ఆమెలో సేవాభావానికి జతకూడింది.  ఎక్కడ ఆహారం మిగిలి ఉందని ఫోన్ వచ్చినా, వెంటనే అక్కడకు వెళ్లి, తెచ్చిన పదార్ధాలు చక్కగా ప్యాక్ చేసి, అన్నార్తులకు అందించసాగింది. తక్కువ పదార్ధాలు ఉంటే ప్లాట్ఫారం పై నిద్రిస్తున్న వారికి, ఎక్కువ ఉంటే, బస్సు స్టాండ్ లలో, హాస్పిటల్స్ బయట వేచి ఉన్నవారికి పంచుతారు. అర్ధరాత్రి అయినా కూడా పదార్ధాలు పూర్తిగా పంచేదాకా ఆమె పయనం ఆగదు. ఇలా నిరవధిక సేవతో ఇప్పుడు సిటీలో పలు చోట్ల దీనుల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకుంది అర్చన. ఆమె కనిపించగానే ఆత్మీయంగా పలకరించేవారు, దేవతలా ఆరాధించేవారు ఈ నగరంలో కోకొల్లలు.

ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు...
రాబిన్ హుడ్ ఆర్మీ తో పాటు ఆహారం పంచుతూ ఉండగా ఒక మర్చిపోలేని సంఘటన జరిగింది... అదేమిటో అర్చన మాటల్లోనే...
“ఒక రోజు రాత్రి ఒక గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని ‘అన్నం తింటావా?’ అని అడిగితే తింటానన్నాడు. మిగిలిన ఆహారాన్నంతా, ఒక ప్లేట్ లో చక్కగా పెట్టి అందిస్తే, ఉన్నట్టుండి కళ్ళ నీళ్ళు పెట్టుకోసాగాడు. ‘అన్నం తిని రెండు రోజులైందమ్మా. ఆకలి వేసినప్పుడల్లా, నీళ్ళు తాగి కడుపు నింపుకుంటున్నా. దేవతలా వచ్చావు, పైగా ప్లేట్ లో చక్కగా వడ్డించి ఇచ్చావు’ అంటూ దణ్ణం పెట్టగానే  నా మనసు కరిగిపోయింది.
అలాగే మరోసారి స్కూల్ పిల్లలకు పాలు పంచే కార్యక్రమంలో భాగంగా ఎల్.బి.నగర్ లో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాము. అక్కడ ఉన్న ఒక నాలుగేళ్ల బాలుడు, మేమిచ్చిన ఒక గ్లాసు పాలు తాగేసి, ‘ఇంకో గ్లాసు పాలిస్తారా?’ అని అడిగాడు. వివరం కనుక్కుంటే, అతని తల్లి అతని కళ్ళ ముందే నిప్పంటించుకుని చనిపోయిందట. అతని తండ్రి మరో పెళ్లి చేసుకుంటే, ఆ సవతి తల్లి ఇతనికి అన్నం పెట్టదట. అన్నం కోసమే స్కూల్ కు వస్తాడట. సోమవారం నుంచి శుక్రవారం వరకూ అతనికి స్కూల్ లో భోజనం దొరుకుతుంది. శని, ఆదివారాలు పస్తు. అందుకే ఆకలి తట్టుకోలేక ఇంకా ఇమ్మని అడిగాడట. ఇటువంటివి చూస్తున్నప్పుడు నేను నిలువెల్లా కరిగిపోతాను.
భగవంతుడు మనకు ఎన్నో ఇచ్చినా, ఇంకా ఏదో కావాలన్న అసంతృప్తి తోనే మనం బ్రతుకుతూ ఉంటాము. కాని, అలా మనం అనుకునే ప్రతి సారి, ఈ దేశంలో కడుపుకు పట్టెడన్నం లేక, అభిమానం చంపుకుని అడుక్కోలేక, ఆకలితో అల్లాడుతున్న వారు ఎంతోమంది ఉన్నారని మనం మర్చిపోకూడదు.” అంటారు అర్చన.

ఎన్నో ఎదురు దెబ్బలు...
నేను స్త్రీనైనా నాలో పురుషులకు ఉండేంత స్థైర్యం ఉంది. కాలేజీ రోజుల నుంచే నాకు వాహనాలు నడపడం సరదా. అప్పట్లోనే బైక్ నడపడం నేర్చుకున్నాను. ఏదైనా బాధ కలిగినప్పుడు, వర్షం పడినప్పుడు బైక్ మీద అలా వెళ్ళిపోవడం నాకు అలవాటు. ఒకసారి నేను టు వీలర్ నడుపుతూ ఉండగా ఒక ఆటో వచ్చి, నన్ను గుద్దేసింది. నా కుడి కాలు విరిగిపోయింది, డాక్టర్లు స్క్రూ లు వేసి, తిరిగి కాలును అమర్చారు. తెలిసినవారంతా ఇక నేను అవిటి దాన్ని అయిపోయానని తీర్మానించేసారు. వాళ్ళ మాటలు అబద్ధమని నిరూపించాలని పట్టుదలగా, కృషి చేసి, తిరిగి మామూలు స్థితికి వచ్చాను. అలాగే, మరోసారి ఇంట్లో మెట్లు దిగుతూ ఉండగా పడిపోవడం వలన ఎడమ కాలు పూర్తిగా వెనక్కు తిరిగిపోయి, ఎముకలు కూడా బయటకు వచ్చాయి. నరకం లాంటి బాధను తట్టుకుని తిరిగి యధా స్థితికి వచ్చాను. జీవితం ఎవరికీ పూలబాట కాదు. అవసరమైనప్పుడు మనలో ఉన్న బలీయమైన సంకల్పాన్ని వెలికి తీసి, చూపాల్సి ఉంటుంది.

ప్రస్తుతం టు వీలర్/బైక్ రైడింగ్ శిక్షణ ఇస్తూ...
పలువురు మహిళలకు గత ఆరు నెలల నుండి ద్విచక్ర వాహనం నడపడంలో శిక్షణ ఇస్తున్నారు అర్చన. విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆమె వద్ద బైక్ నేర్చుకునేందుకు మహిళలు రావడం నిజంగా ప్రశంసనీయం. ఈ ప్రయాణం గురించి ఆమె మాటల్లో...
“స్కూల్ లో చదివేటప్పటి నుంచే మహిళలకు బైక్ నేర్పడం మొదలుపెట్టాను.  ద్విచక్ర వాహనం నేర్పడంలో మహిళలకు ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే, ఆక్షిలేటర్ ఎంత రైజ్ చెయ్యాలో తెలియకపోవడం. వెనుక ఎవరైనా కూర్చుని, నడుపు, పద... అంటూ ఉంటారే తప్ప, సరిగ్గా నేర్పరు. భయం, కంగారుతో నడిపి, దేన్నైనా గుద్దుకుని, దెబ్బలు తగిలి, బండి మానేసిన మహిళలు అనేకమంది ఉంటారు. నావద్దకు 50-60 ఏళ్ళ వయసున్న మహిళలు కూడా కొందరు వచ్చారు. నేను శిక్షణ ఇచ్చేటప్పుడు వెనకాల కూర్చోను.  వాళ్ళలో భయం పోగొట్టేలా ఓపిగ్గా చెప్తాను. రెండు రోజులు ప్రయత్నం చేసి, మూడో రోజున వాళ్ళ ఇంటి నుంచే వాళ్ళు బండి నడుపుకుంటూ వస్తారు. కొందరు ఒక్క రోజులోనే నేర్చుకుంటారు. ఒకాయన గత 25 ఏళ్ళ నుంచి భార్యకు బండి నేర్పాలని ప్రయత్నించి విఫలమయ్యారు, ఆమెకు నేను మూడు రోజుల్లో నేర్పే సరికి, వేరే ఊరు నుంచీ వచ్చి మరీ నన్ను అభినందించారు. ఈ విధంగా నేర్పగలగడం చాలా ఆనందంగా అనిపిస్తుంది.
ద్విచక్ర వాహనం నడపడం వచ్చిన మహిళలు కొత్తగా తమకు రెక్కలు వచ్చినట్లు అనుభూతి చెందుతారు. ఇకపై తమ పనులు తాము చేసుకోగలమని, ఎవరి మీదా ఆధారపడక్కర్లేదని ఆనందిస్తారు. ఇక్కడ మీకు మరో మాట చెప్పాలి, ఇంత వరకు నా స్టూడెంట్స్ లో ఒక్కరికైనా, ఒంటి మీద చిన్న గీత పడడం కాని, దెబ్బలు తగలడం కాని జరగలేదు. అందుకే వాళ్ళు సోషల్ మీడియా లో రివ్యూస్ పెట్టారు, అది చదివి, ఎంతోమంది నాదగ్గరకు వస్తున్నారు. ఇది నాకు పెద్ద విజయమని చెప్పవచ్చు. ఎవరికైనా బండి నేర్చుకోవాలని అనిపిస్తే, క్రింది fb ఐ.డి లో కాని, లేక ఇన్స్టాగ్రాము లో కాని నన్ను సంప్రదించవచ్చు.
https://www.facebook.com/ArchanaChigullapally
https://www.instagram.com/archana_chigullapally/  

నేటి మహిళల కోసం ఒక చిన్న మాట ...
“మహిళలలో ఆత్మవిశ్వాసం ఉండాలి. దేన్నైనా ప్రయత్నించాలి. కాని చాలామంది ప్రయత్నించే ముందే భయపడతారు. ప్రయత్నించక పోవడానికి చాలా కారణాలు చెబుతూ, అక్కడే ఆగిపోతారు. దీన్ని అధిగమిస్తే తప్ప, ఏదైనా సాధించడం వీలు కాదు.
నన్నే చూడండి, రెండు కాళ్ళకు ఆక్సిడెంట్ అయినా కూడా ప్రయత్నించి, ఈ విజయం సాధించాను. దీనితో పాటు సేవ కూడా చేస్తూ మాటల్లో చెప్పలేని ఆనందం పొందుతున్నాను. నేను ఏ పని చేసినా అందులో విజయం సాధించాలని నా కోరిక. నా వల్ల పదిమంది ఆనందించాలి, అదే నా కోరిక. నా కుటుంబ సభ్యుల సహకారం, భర్త ప్రోత్సాహం వలన ఇలా ముందుకు వెళ్తున్నాను. నా కధ ఎందరికో ప్రేరణ కావాలి. మరింత మంది మహిళలు నన్ను చూసి, స్పూర్తిని పొంది ముందుకు రావాలన్నాదే నా కోరిక “ అంటారు అర్చన.
అర్చన ఏ రంగాన్ని ఎంచుకున్నా, అందులో అఖండ విజయాన్ని సాధించాలని, సాటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని మనసారా ఆకాంక్షిస్తోంది ‘అచ్చంగా తెలుగు’. 
***

No comments:

Post a Comment

Pages