సుబ్బుమామయ్య కబుర్లు - అచ్చంగా తెలుగు
ఆట అంటే...

పిల్లలూ..ఎలా ఉన్నారు?
మీరు జనరల్ నాలెడ్జ్ అనే పదం వినే ఉంటారు. అంటే ఏమిటి?
మనకు సాధారణంగా ఉండాల్సిన పరిజ్ఞానం అన్నమాట. 
జాబ్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్లు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కొనుక్కుని వాటితో కుస్తీ పట్టడం చూసే ఉంటారు. ఏదైనా ఒక్క రాత్రిలో రాదర్రా. పరిశీలన, సాధనా ఉండాలి.
నా చిన్నప్పుడు మా అమ్మనాన్నలు నన్ను పేపర్ చదవమని ప్రోత్సహించేవారు. మా స్కూళ్లో కూడా అసెంబ్లీలో మైకు ముందు రోజుకో విద్యార్థి నుంచుని ఆరోజు పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలను చదివేవారు. మీరు కూడా పేపర్ చదవడమో లేదా టీ వీలో వచ్చే వార్తలు చూడ్డమో శ్రద్ధగా చేయాలి. 
ఎన్నికలయ్యాక ముఖ్య పదవులకు ఎంపికయి ప్రమాణ స్వీకారం చేసే నాయకుల పేర్లు, వాళ్లు నిర్వహించే శాఖలు ఒక నోట్ బుక్కులో రాసుకోవాలి. అలాగే వివిధ క్రీడల్లో గెలుపొందే క్రీడాకారుల పేర్లు, వాళ్లు  ఏ క్రీడలో ఏ స్థానంలో ఉన్నారో నమోదు చేసుకోవాలి. ఇంతే కాకుండా ఇతర కళల్లో (Arts) రాణించిన వాళ్ళు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంపికయ్యే సినిమాలు, అవి ఎలా, ఎందుకు ఎంపికయ్యాయో, నటీ నటుల వివరాలు చక్కగా రాసుకోవాలి. అన్నట్టు ముందుగా మన పుస్తకాన్ని వీటన్నిటి కోసం విభాగాలుగా చేసుకుని వివరాలు పొందుపర్చుకోవాలి.
ఇవి కాకుండా, మనం ఎక్కడికైనా రైలులో వెళుతున్నప్పుడు స్టేషన్లు, జంక్షన్లు, జోన్లు అడిగి తెలుసుకోవాలి.
రైలు పట్టాల్లో, రైళ్లలో ఎన్ని రకాలుంటాయి.   
విమానాన్ని నడిపే ఇంధనం పేరేమిటి? 
ఓడ తనకు ఎదురయ్యే బలమైన కెరటాలక్కూడా తలొంచకుండా ముందుకు సాగిపోడానికి కారణమేమిటి? ఇత్యాదివన్నీ ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుని ఆ వివరాలు రాసుకోవాలి.
ఇప్పుడు మీరు బాల్యంలో చేసే కృషి మీరు పెద్దయ్యాక ఎంతగానో ఉపయోగపడుతుంది.
కౌన్ బనేగా కరోడ్ పతీ లాంటి ప్రోగ్రాములు మీ ప్రతిభకి పట్టంగట్టడమే కాకుండా, తగిన బహుమతులు కూడా ఇస్తాయి.
మనలో మనమాట..వీడియో గేమ్స్, సెల్ గేమ్స్ ఆడితే ఉపయోగమేమిటి? మన టైం వేస్టవడం తప్ప. మీకు సరదా అంటారా! ఆడండి కాని కొంత సమయమే వాటికి కేటాయించండి. మిగతాదాన్ని నేను పైన చెప్పిన దానికి వినియోగించండి. తేడా మీకే తెలుస్తుంది. మీ స్కూళ్లో మీరే నాయకులవడం ఖాయం. 
మరి మీ మామయ్య మాట వింటారుగా!
ఇట్లు 
మీ 
సుబ్బుమామయ్య.
***

No comments:

Post a Comment

Pages