అన్నమయ్య- నృసింహ విజయం
పొన్నాల వెంకటేష్
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। (4- 8)
శిష్టులను రక్షించుట, దుష్టులను సంహరించుట , ధర్మాన్ని స్థాపించుట కొరకు నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను .
ఇది భగవానుని వచనము. పరమాత్మ తాను చెప్పినట్టు గానే,కాలగమనంలో అనేక లోక కంటకులను సంహరించి, లోకంలో తిరిగి ధర్మస్థాపనకై, పలుమార్లు అవతరించాడు. వాటిలో ముఖ్యంగా దశావతారాలను చెప్తారు ,పెద్దలు.
మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః ।
రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధః కల్కిరేవచ ।।
ఈ దశావతార క్రమంలో నాలుగవదిగా శ్రీ నృసింహావతారం చెప్పబడింది.భాగవతాది మహాకావ్యాలలో , పురాణేతిహాసాలలో ఈ నృసింహావతారఘట్టాన్ని వర్ణించిన తీరు అందరికీ తెలిసినదే.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన , శ్రీ వేంకటేశ్వరుని పాద పద్మాలను, తన సంకీర్తనాసుమాలతో అర్చించి తరించిన , తొలి తెలుగు వాగ్గేయకారుడు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు.క్రీ.శకం 15వ శతాబ్దం , కడప జిల్లా రాజంపేట తాలూకా తాళ్ళపాక లో ; లక్కమాంబ, నారాయణ సూరి పుణ్య దంపతులకు జన్మించిన గారాల పట్టి మన అన్నమయ్య.
శ్రీహరి నందకాంశ సంభూతునిగా పెద్దలు చెప్పే అన్నమయ్య,తిరుమలలో ఘన విష్ణువు అనే యతి ద్వారా పంచసంస్కారాలు పొంది, అహోబిల మఠం స్థాపనాచార్యులైన ఆదివన్ శఠగోపయతుల వద్ద నుండి 32 బీజాక్షరములు కలిగిన శ్రీ నారసింహ మంత్రరాజమును ఉపదేశమును పొంది , వైష్ణవ ఆగమాలన్నీ నేర్చుకుని, విష్ణు తత్వాన్ని అర్ధం చేసుకుని , 32వేల సంకీర్తనలు రచించాడు.దేవదేవుని పరమ మంత్రాలుగా భాసికెక్కిన ఆసంకీర్తనలలో, శ్రీ వేంకటేశ్వరుని తరువాత నరసింహుని మీద రాసిన సంకీర్తనలు పెక్కు.
108 శ్రీవైష్ణవ దివ్యదేశాలలో శ్రీ నరసింహుడు, భావనాశినీ తీరాన, నవనారసింహులుగా వెలసిన అహోబిలం (అహోబలం) క్షేత్ర మహిమని,శ్రీ లక్ష్మీనృసింహుని దివ్య స్వరూపాన్ని,నారసింహుని అవతారఘట్టాలను అత్యద్భుతంగా వర్ణించాడు.
వైశాఖమాసం శుద్ధచతుర్దశి నాడు జరుపుకునే , శ్రీ నారసింహజయంతి ని గురించి చెప్పే సంకీర్తనని చూద్దాం.
నరులార నేఁడువో నారసింహజయంతి
సురలకు నానందమై శుభములొసఁగెను
సందించి వైశాఖ శుద్ద చతుర్దశి శనివార -
మందు సంధ్యాకాలమున నౌభళేశుఁడు
పొందుగాఁ గంభములోనఁ బొడమి కడపమీఁద
కందువ గోళ్ళఁ జించెఁ గనక కశిపుని
నరమృగరూపము నానాహస్తముల
అరిది శంఖచక్రాది ఆయుధాలతో
గరిమఁ బ్రహ్లాదునిఁ గాచిరక్షించి నిలిచె
గురుతర బ్రహ్మాండ గుహలోనను
కాంచనపు గద్దె మీఁద గక్కనఁ గొలువై యుండి
మించుగ నిందిరఁ దొడమీఁద బెట్టుక
అంచె శ్రీవేంకటగిరి నాదిమపురుషుండై
వంచనసేయక మంచివరాలిచ్చీనదివో
(రాగము: ముఖారి,రేకు: 0353-02,సంపుటము: 4-310)
ఓ నరులారా! నేడు నారసింహ జయంతి.(రాక్షన సంహారం వల్ల)సురలకు ఆనందమై శుభములొసగిన రోజు. వైశాఖ శుద్ద చతుర్దశి, శనివారమునాడు,సంధ్యాకాలంలో,స్ఠంభమునందు ఆవిర్భవించి, కడపమీద కూచుని ,తన పదునైన గోళ్ళతో హిరణ్యకశిపుని పొట్ట చీల్చినాడు.
నరుడు,మృగము(సింహము) కలసిన రూపముతోను,చాలా చేతులను కలిగి ఉండి ,వాటిలో శంఖ చక్రాది ఆయుధాలను ధరించి, ప్రహ్లాదుని రక్షించి, బ్రహ్మాండపు గుహలో వెలసియున్నాడు.
బంగారు గద్దె మీద, ఇందిరాదేవిని తన తొడపై కూచోబెట్టుకుని కొలువై ఉన్నాడు. ఈతడే శ్రీ వేంకటాద్రి మీద ఆదిమపురుషుడై అందరికీ వరములను ఇస్తున్నాడు.
(ఇక్కడ శ్రీ వేంకటేశ్వరునికి, అహొబిల నారసింహునికి అబేధాన్ని చెపుతున్నాడు అన్నమయ్య.తాను ఏ క్షేత్రానికి వెళ్ళినా,ఏ మూర్తిని చూసినా , వారిలో వేంకటెశ్వరున్నే దర్శించుకుంటాడు. అందరిలో ఉన్న ఆ విష్ణువుని చూడటమేకదా కదా వైష్ణవము. “సర్వం విష్ణుమయం”బను భావము సత్యం సత్యంబిన్నిటను (04-90) అని అంటాడు అన్నమయ్య.)
మరొక సంకీర్తనలో కూడా నారసింహుని ఆవిర్భావాన్ని బహుచక్కగా వర్ణించాడు.
జగతి వైశాఖశుద్ధచతుర్దశి మందవార-
మగణితముగఁ గూడె నదె స్వాతియోగము
(రాగము: గుండక్రియ,రేకు: 0349-01,సంపుటము: 4-285)
శ్రీ నారసింహుని అవతారకథాఘట్టాలను, హిరణ్యకశిపుని సంహారలీలను "నరసింహ విజయము" గా 11 చరణాలతో ,పెద్ద సంకీర్తనగా గానం చేసాడు.
చాలా సరళంగా ,వివరముగా ,రాసారు.అభినందనలు.
ReplyDelete