అటక మీది మర్మం - 17 - అచ్చంగా తెలుగు
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- (17)
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
 

(కనిపించకుండా పోయిన తన కుమారుడి సాహిత్యాన్ని వెతికి పెట్టమని నాన్సీ తండ్రిని సాయమడుగుతాడు ముసలి మిలిటరీ ఉద్యోగి మార్చ్. తన స్నేహితురాళ్ళతో అతని యింటికి వెళ్ళిన యువగూఢచారి అతని యింటిని్, అటకని గాలించినా ఫలితం శూన్యం. తట్టురోగంతో యింటికి తిరిగి వచ్చిన మార్చ్ మనుమరాలి సంరక్షణకు ఎఫీ అన్న అమ్మాయిని నియమిస్తుంది. ఆమె ద్వారానే ఆ యింటిలో ఆగంతకుడెవరో తిరుగుతున్నట్లు తెలుసుకొంటుంది. ఒకరోజు అటక మీద ఆమెకు బీరువాలో ఒక అస్తిపంజరం కనిపిస్తుంది. ఇదే సమయంలో తండ్రి తనకు అప్పజెప్పిన మరో కేసులో డైట్ కంపెనీలో దూరి బుషీట్రాట్ అన్న వ్యక్తిని కనుక్కోవటమే గాక, ఆ లాబ్ నుంచి రెండు సీసాల్లో పట్టు పరికిణీలు తయారుచేసే రసాయనిక ద్రవాల నమూనాలను రహస్యంగా సంపాదించి, తన తండ్రికి యిస్తుంది. ఆగంతకుడు తరచుగా కనిపించటంతో భయపడుతున్న ఎఫీని ఒక రోజు యింటికి వెళ్ళమని చెప్పి, తన స్నేహితురాళ్ళతో కలిసి ఆ రాత్రికి మార్చ్ భవంతిలో ఉండిపోతుంది నాన్సీ. ఆ రాత్రి ఒక ఆగంతకుడు భవంతి వెనుకకు వెళ్ళటం గమనించి అతన్ని అనుసరిస్తుంది. కానీ అతను అకస్మాత్తుగా మాయమవుతాడు. తన స్నేహితురాళ్ళను భవంతి బయట కాపలా ఉంచి, తాను మార్చ్ తో కలిసి అటకమీదకు వెడుతుంది. ఈ లోపున బయటినుంచి స్నేహితురాళ్ళ కేకలు వినిపించి వాళ్ళకు సాయపడటానికి బయటకు వెడుతుంది. వాళ్ళు ముగ్గురు ఎంత వెంబడించినా, సమయానికి అతనికి ఒక కారు సాయంగా రావటంతో, అతను దాన్ని ఎక్కి పారిపోతాడు. బెస్ రేడియోలో వచ్చిన సంగీతాన్ని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూండగా, ' మళ్ళీ అదే తప్పు చేసారంటూ' మార్చ్ అరుస్తాడు. తరువాత జరిగిందేమిటంటే. . . ..)
@@@@@@@@@@@@@@@@
అతని అరుపుకి త్రుళ్ళిపడిన బెస్ కళ్ళు తెరిచింది. " ఏం చేశారు?" అయోమయంగా అడిగింది.

అతను బదులిచ్చేలోపునే రేడియోలోని సంగీతం ఆగిపోయింది. రేడియో ఎనౌంసర్ గొంతు స్పష్టంగా, స్ఫుటంగా వినిపిస్తోంది. బెన్ బాంక్స్ అని వినవచ్చని నాన్సీ పూర్తిగా ఆశ పెట్టుకొంది. కానీ రేడియోలో వచ్చిన ప్రకటన విని విస్తుపోయింది.

" ఇంతవరకూ హారీహాల్ కూర్చిన కొత్త సంకలనాన్ని విన్నారు. మాజిక్ హవర్ అన్న ఈ కార్యక్రమాన్ని యింతటితో ముగిస్తున్నాం. రేపు మళ్ళీ యిదే సమయానికి యిక్కడే వినండి."

మార్చ్ దూకుడుగా వెళ్ళి రేడియో కట్టేశాడు. " ఇప్పటికే చాలా విన్నాం" అంటూ ఆవేశంతో బుసలు కొట్టాడు. " నిజంగా హారీ హాలేనా? దానిలోని ప్రతిస్వరం మా అబ్బాయి వ్రాశాడు. నాకు డబ్బులు విరజిమ్మే శక్తే ఉంటే, వీళ్ళందరినీ కోర్టుకి లాగేవాణ్ణి" అంటూ చిందులు తొక్కసాగాడు.

అకస్మాత్తుగా కోర్టులో చూపటానికి తగిన సాక్ష్యం తన దగ్గర లేదని గుర్తుకొచ్చి నీరుగారిపోయాడు. కుంగిపోతూ కుర్చీలో కూలబడ్డ అతనికి ధైర్యం చెప్పటానికి యువ గూఢచారి పూనుకొంది.

" మీ కుటుంబంలో వాళ్ళు గాక ఫిప్ పాటలను విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిస్సంశయంగా మీ అబ్బాయిని స్వరకర్తగా గుర్తించినవాళ్ళు ఎవరైనా ఉన్నారా?"

" నాకు తెలిసి ఎవరూ లేరు" మార్చ్ ఒప్పుకొన్నాడు. " పీబడీ అన్న ఆమె మాత్రం ఫిప్ పియానో వాయిస్తూంటే వినటానికి మా యింటికొచ్చేది. కానీ ఆమె నిరుడే చనిపోయింది."

" ఫిప్ స్నేహితుల్లో చిన్న వయసువారు లేరా?"

" చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళు ప్రపంచంలోని మూలమూలలకు వెళ్ళిపోయారు. ఎవరెక్కడ ఉన్నారో నాకు తెలియదు."

నాన్సీ అతన్ని మరొక రకంగా ప్రశ్నలు వేసింది. " మీ అబ్బాయి తన బాణీలను అమ్మలేదని మీరు ఖచ్చితంగా చెప్పగలరా?"

" ఫిప్ తన సంగీతాన్ని అమ్మలేదు. బాణీలను కట్టడమంటే వాడికి యిష్టం. వాడు నిజంగా తన పాటలను అమ్మి ఉంటే, ఆ విషయాన్ని తన భార్యకు చెప్పి ఉండేవాడు కదా!"

పెద్దాయనకు చెప్పకపోయినా, ఆ రాత్రి మరొక పాట అటకమీద నుంచి దొంగిలించబడిందని నాన్సీ భయపడింది. ముగ్గురు అమ్మాయిలు నిద్రకు సిద్ధమవుతున్న సమయంలో అటక మీద వచ్చిన పొగ వాసన గురించి తన స్నేహితురాళ్ళకు ఆమె చెప్పింది.

" మనం తరిమిన అతని చేతిలో కాగితం చుట్ట ఉందని ఖచ్చితంగా చెప్పగలరా?" యువ గూఢచారి వాళ్ళను అడిగింది.

వాళ్ళు అవునని తలూపారు.

" అది పాట ఉన్న కాగితమే అంటావా?" బెస్ అడిగింది.

" అదే నేను భయపడుతున్నా" ఆమె బదులిచ్చింది. " ఇక్కడ ఈ పాటల దొంగతనం ఎంతకాలం నడుస్తుందో చెప్పలేను. సరే! నేను యిక్కడ సంగీతం ఉన్న ప్రాంతాన్ని కనిపెట్టలేకపోయినా, కనీసం దొంగకు ఈ యింట్లో దొరికిన ఆధారాన్నయినా కనిపెట్టగలను."

" ఎలా?" జార్జ్ అడిగింది.

" నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఉదయం దానితో ప్రయత్నిద్దాం."

ఆమెను వారు బాగా ఒత్తిడి చేయగా, అటకమీదకు రహస్యమార్గమేమన్నా ఉందేమోనన్న తన అనుమానాన్ని బయటపెట్టింది.

" దొంగ అదే మార్గంలో బయటకు వచ్చాడని అనుకొంటున్నావా?" బెస్ అడిగింది.

" నేను దాన్నే నమ్ముతున్నాను. తన రాకపోకలకు వాడు ఆ రహస్యమార్గాన్ని వాడుతున్నాడు. ముసలాయన, నేను నేలమీద చెక్కలు కిర్రుమన్న శబ్దం విన్నాం. నేను ఎవరో పొగ పీల్చిన వాసనను పసి కట్టాను."

మరునాడు ఉదయం ఎఫీ రాగానే ఆమెకు యింటిపనులను అప్పజెప్పి, ముగ్గురు అమ్మాయిలు ఆ పాతభవనం లోపలకు వెళ్ళటానికి రహస్యమార్గమేదన్నా ఉందేమో చూడటానికి బయటకొచ్చారు.

" ఇంట్లోకి వెళ్ళటానికి, బయటకు రావటానికి ఆ భవనం బయట గోడలకి, తీసి తిరిగి అమర్చే సన్నటి చెక్కలేమన్నా ఉన్నాయేమో వెతకండి. అంతేగాక అసలు ద్వారాలకి ఆనుకొని ఈ రహస్య ద్వారాలు ఉండే అవకాశం ఉంది " అంటూ నాన్సీ స్నేహితురాళ్ళకు ఉత్తర్వులు జారీ చేసింది.

" కిటికీల మాదిరి భ్రమ పుట్టించే ద్వారాలు ఉండవచ్చు. ఇవి గాక రహస్య. . ." ఆమె మాటలకు జార్జ్ అడ్డు తగిలింది.

" ప్రస్తుతానికి వెతకటానికి యివి చాలు తల్లీ!" నవ్వుతూ అందామె.

ముగ్గురమ్మాయిలు విడిపోయారు. పునాది, భూతలం(గ్రౌండ్ ఫ్లోర్) గోడల్లో ప్రతి అంగుళాన్ని చేతులతో తడిమి చూశారు. నాన్సీ వచ్చిన దొంగ పాత కూలీల నివాసాలవైపు వెళ్ళటం చూసింది, గనుక అక్కడే చాలా సమయం గడిపింది. అక్కడనుంచి మార్చ్ యింటిలోని ప్రధాన భాగానికి దారినిచ్చే రహస్య ద్వారం దొరుకుతుందేమోనని తీవ్రంగా ప్రయత్నించింది. కానీ వాళ్ళెవరికీ రహస్య ద్వారమొక్కటైనా కనపడలేదు.

" ఇక మనకు మిగిలిన మార్గమొక్కటే" యువ గూఢచారి చెప్పింది. " ఈ రాత్రి ఆ పొదల్లో నక్కి ఆగంతకుడి కోసం ఎదురుచూడాలి."

" ఈ మధ్యలో మనమేం చేద్దాం? నిద్రపోదామా?" జార్జ్ అడిగింది.

" ప్రస్తుతం అటక మీదకెళ్ళి అక్కడేమన్నా రహస్యద్వారం ఆచూకీ దొరుకుతుందేమో చూద్దాం" నాన్సీ ప్రకటించింది. " మనం ఒక కొవ్వొత్తిని తీసుకోవాలి. నేను ఊళ్ళోకెళ్ళి ఫ్లాష్ లైట్ కి బాటరీ కొనే అవకాశం లేదు."

ముగ్గురు స్నేహితురాళ్ళు అటక మీదకి చేరుకొన్నారు.

" ఇక్కడే ఒకసారి దేన్నో మెల్లిగా తట్టుతున్న శబ్దాలు విన్నాను. ఇక్కడే ఎక్కడో మెల్లిగా చేతితో తడితే తెరుచుకొనే రహస్య పలక ఉండి ఉండాలి." ఆమె స్నేహితురాళ్ళకు చెప్పింది.

నాన్సీకి దగ్గరగా నిలబడ్డ బెస్ ఏటవాలుగా ఉన్న పైకప్పు క్రింద ఉన్న గోడలపై తన వేలి కణుపులతో మెల్లిగా తట్టసాగింది. జార్జ్ ఒక పాత డెస్క్ లో వెతకాలని నిశ్చయించుకొంది. పెద్దాయనకు డబ్బు అవసరం బాగా ఉంది గనుక అమ్మటానికి వీలయ్యే వస్తువులపై కూడా కన్నేసింది.

" ఇక్కడ అందమైన లేస్ ఉంది" వాళ్ళను పిలుస్తూ డ్రాయర్ లోంచి అల్లిన గుడ్డ ముక్కను జార్జ్ బయటకు తీసింది.

" ఏదీ? చూడనీ!" అంటూ బెస్ ఆమె దగ్గరకొచ్చింది.

జార్జ్ అనేక రకాల రమ్యమైన, నాజూకైన అల్లికలను పైకి తీసింది. అవి పట్టుబట్టపై అనేక రకాల డిజైన్లలో అల్లిన అల్లికలు. "పాతకాలపు అల్లికలు చాలా ఖరీదు చేస్తాయి. అందమైన వస్తువులను మెచ్చుకొనేవారు వీటి పనితనానికి మార్చ్ కు బాగానే చెల్లిస్తారు."

" నీకు తెలిసినవాళ్ళు ఉన్నారా?" బెస్ అడిగింది.

"" ఉన్నారు" జార్జ్ బదులిచ్చింది. " మేడం పారీ. దర్జీ ఆమె. వీటిలో కొన్నింటిని ఆమె డయానె డైట్ బట్టలపై ఉంచి కుట్టవచ్చు" చిరునవ్వుతో చెప్పింది.

" ఓ! దాన్ని పక్కకు తీసెయ్యి" అకస్మాత్తుగా బెస్ అరిచింది.

ఆమె కొయ్యబారిపోయింది. జార్జ్ బట్టల బీరువాకు దగ్గరగా వెనక్కి జరిగినప్పుడు, దాని తలుపు అకస్మాత్తుగా తెరుచుకొని వేలాడింది. దానిలో ఉన్న అస్తిపంజరపు పొడవైన ఎముక వేళ్ళు జార్జ్ జుట్టులోకి చొచ్చుకుపోయాయి.

జార్జ్ త్వరగా వాటి పట్టు నుండి విడిపించుకొంది. బెస్ వణికిపోతూ దగ్గరలో ఉన్న పెట్టెపై పడింది.

" బీరువా వెనుకభాగానికి వీపుని చూపేలా అస్తిపంజరాన్ని ఎలా వేలాడదీశారో చూడండి. తన రెండవ ఎముక చేతిని సగం వరకూ ఎలా పైకెత్తిందో?" తన చూపుడువేలుతో చూపిస్తూ బెస్ అంది. " మనల్ని బీరువా లోపలకు రమ్మన్నట్లు సైగ చేస్తున్నట్లు లేదూ?"

" ఎందుకు? అలాగే చేస్తోంది! " నాన్సీ అంగీకరించింది. బెస్ భయస్తురాలే కావచ్చు. కానీ క్షణంలో అస్తి పంజరాన్ని అక్కడ ఉంచటంలో ఆంతర్యాన్ని కనిపెట్టింది. ఇన్నాళ్ళుగా దాన్ని చూస్తున్నా ఆ ఆలోచనే తనకు తట్టలేదు. రెట్టించిన ఉత్సాహంతో నాన్సీ బీరువా దగ్గరకెళ్ళింది.

" బహుశా ఫిప్ మార్చ్ తన కుటుంబానికి ఒక సందేశం యిచ్చేలా ఈ అస్తిపంజరాన్ని యిక్కడ యిలా అమర్చి ఉండొచ్చు. దీనిలోనే రహస్యంగా దాక్కొనే ఒక ప్రదేశమేదో. . ."

" ఓ నాన్సీ! ఆ తలుపు మూసెయ్యి" బెస్ అర్ధించింది.

బెస్ అయిష్టంగా చూస్తూంటే, యువ గూఢచారి ఆ భారీ బీరువాను పరిశోధించటం మొదలెట్టింది. గతంలో ఎన్నో సార్లు లోపల శోధించింది కానీ ప్రస్తుతం ఆమె అస్తిపంజరం దిగువన ఉన్న భాగంలో ప్రత్యేకశ్రద్ధతో వెతకసాగింది. ఆ భారీ బీరువా దిగువ తలంలో ప్రతి అంగుళాన్ని తన చేతితో తడిమి చూస్తోంది.

" జార్జ్ ! ఈ కొవ్వొత్తిని పట్టుకో! "

యువ గూఢచారి కోరికతో ఆ అమ్మాయి ముందుకొచ్చింది.

" నా చేతివేళ్ళకు ఏదో తగులుతున్నట్లు అనిపిస్తోంది" అంటూ ఆమె హుషారుగా ఆ ప్రాంతాన్ని తడుముతోంది. " ఆ! ఇక్కడేదో గుండ్రంగా, ఎత్తుగా అనిపిస్తోంది. ఇదేదో రహస్యద్వారానికి అమర్చిన పిడి అదే నాబ్ " ఉన్నట్లుండి అరిచిందామె. " అమ్మాయిలూ! నేనొక రహస్యప్రదేశాన్ని కనుగొన్నాను."
(తరువాయి భాగం వచ్చే నెలలో)

No comments:

Post a Comment

Pages