జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 17
చెన్నూరి సుదర్శన్
(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి అనుభవాలను వారితో పంచుకుంటూ ఉంటాడు.)
పిల్లలు తలా ఓ చెయ్యి వేసారు. ఫణీంద్ర దవడ పగిలింది. రామనాథం భయంతో గజ, గజ వణకి పోయాడు.
“పోలీసులకు ఫోన్ చేస్తాను” అనుకుంటూ తడబడుతూ వెళ్ళాడు. గురుడు అప్పుడే మందు కొట్టాడను
కున్నాను మనసులో..
అతడి వెనకాలే హిమజ పరుగెత్తి స్టాఫ్ రూంలో దూరింది.
“సార్ కాలేజీ బాగు పడాలంటే కాపీ కంట్రోల్ చేయడమొక్కటే కాదు సార్.. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి” అంటూ పిల్లలు కోపంగా ఊగి పోతున్నారు.
నేను వారిని సమాధానపర్చి ప్రిన్సిపాల్ చాంబర్‍కు పరుగెత్తాను. అక్కడి దృశ్యం నన్ను మరింత నివ్వెర పర్చింది. రామనాథం ఫోన్ చెయ్యడం లేదు సరికదా.. తన గదిలో మరో పెగ్గు ఫుల్లు వితౌట్ నీళ్ళు లాగిస్తున్నాడు.
అతడికి తెలుసు.. పోలీసులు వస్తే తన పరువే పోతుందని.
ఫణీంద్ర దవడకు కర్చీఫ్ అదిమి పట్టుకొని తన ల్యాబ్‍కు వెళ్ళడం గమనించాను.
నేను తిరిగి పరీక్ష హాలుకు వెళ్లాను. పిల్లలు నిజంగా పోలీసులు వస్తారేమో..! ననే భయంతో హాల్లో కూర్చొని బుద్ధిగా పరీక్ష రాస్తున్నారు. పిల్లల్లో భయం ఉంది. కాని పాఠాలు పూర్తిగాని వైనం.. కొందరి లెక్చరర్ల ప్రవర్తన.. వారి ఉద్రేకానికి కారణమనుకున్నాను.
పరీక్ష పూర్తి కాగానే నేను పిల్లలతో కాసేపు ముచ్చటించాను.
వారి ప్రవర్తనకు సారీ చెప్పారు. ఇకముందు అలా చెయ్యి చేసుకోమనిప్రమాణం చేసారు. నేనూ స్టాఫ్‍తో మాట్లాడుతానని నచ్చజెప్పాను.
కాపీ కొట్టడం మా జన్మ హక్కు అనే రీతిలో వ్యవహరించడం మంచిది కాదని.. అది వాళ్ళ వారి భవిష్యత్తుకు కలిగే ప్రమాదాన్ని వివరించాను. అదనపు తరగతులు నిర్వహించి సిలబస్ పూర్తి చేయించే బాధ్యత ప్రిన్సిపల్ గారిది. వారితోనూ మాట్లాడుతాను.
కాలేజీ బాగు కోసం మీవంతు కృషి.. సహకారం అందించాలని ప్రబోధించాను.
ఈ గొడవలో మాణిక్యం కామర్స్ పరిక్ష ఎలా రాసాడో ఏమో..! నని సరాసరి మాణిక్యం వద్దకు వెళ్లాను. పరీక్ష బాగా రాసానన్నాడు. విద్యార్థులంతా వెళ్ళిపోయారు.
“మాణిక్యం సంక్రాంతి సెలవులు కదా.. ఏదైనా ఊరెళ్ళే ప్లాన్స్ ఉన్నాయా? ” అడిగాను.
మాణిక్యం తలవంచుకున్నాడు.. మౌనంగా ఉండిపోయాడు.
“సరేలే.. పద.. రిక్షా ఎక్కిస్తాను” అంటూ రెండు కర్రలు అందివ్వబోతుంటే.. బొట బొటా రెండు కన్నీటి చుక్కలు నా చేతిపై పడ్డాయి. మ్రాన్పడిపోయాను.
“మాణిక్యం ఏమైంది?”
నేను కంగారుపడడంతో తలెత్తి చూసాడు.
కళ్ళు జలపాతాలయ్యాయి. కర్చీఫ్‍తో కళ్ళు తుడవబోతుంటే తన అరచేత్తో కళ్ళు ఒత్తుకుంటూ తుడ్చుకున్నాడు. కనురెప్పల చివర్లో అక్కడక్కడ వర్షించిన కన్నీటి తుషార బిందువుల్లా మెరుస్తున్నాయి.
“సార్.. నేను ఎక్కడికీ వెళ్ళను. ఈ కుంటోన్నెవరూ తీసుకెళ్ళరు. ఇల్లు కాలేజీ తప్ప నాకు వేరే లోకం లేదు”
ఆమాటలు నాగుండెలో బాణాలయ్యాయి. అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. మాణిక్యం కళ్ళు తుడుద్దామని
తీసిన కర్చీఫ్ నా కళ్ళు తుడిచింది.
“అదేంటి.? మీ ఇంట్లో ఎవరూ లేరా..”
“లేకేం..సార్.. ఉన్నారు. ఎవరి పనులల్లో వారు బ్యుజీ.. నేను నానా తంటాలు పడి నా స్నేహితుల సాయంతో రిక్షా సంపాదించుకున్నా కాబట్టి ఈ మాత్రం చదువుకో గల్గుతున్నా..” అంటూ తన బాధలన్నీ చెప్పుకొచ్చాడు.
(సశేషం)
No comments:
Post a Comment