మనిషిలో మ’నీ’షి
(ఉగాది కధల పోటీలో ప్రధమ బహుమతి పొందిన కధ)
(ఉగాది కధల పోటీలో ప్రధమ బహుమతి పొందిన కధ)
పోలంరాజు శారద
"ఏమిటే ఇది? నీకేమైనా బుద్ధి ఉందా అసలు. ఎంతకాలం ఇట్లా చస్తూ బతుకుతావు? ఆ పిల్లముండను చూడవే. దాన్ని బతుకు అట్లా నాశనం చేయటానికి నీకు మనసెట్లా ఒప్పుతున్నదే?" ఆవేశంలో అరుస్తున్న భార్గవి వైపు దీనంగా నీళ్ళు నిండిన కళ్ళతో చూసింది సంజన.
పక్కనే మట్టిగొట్టుకు పోయిన బట్టలు, తల స్నానం చేయించి ఎంత కాలమయిందో,చేతిలో ఒక బ్రెడ్ ముక్క కొరుకుతూ నేలన దొర్లుతున్న పాపను గబుక్కున ఎత్తుకొని సంజన ఎదురుగా నిలబడ్డది.
"ఇదేమీ బాగ లేదు సంజనా! మరీ అట్లా ఎన్నాళ్ళని ఇంట్లో కుళ్ళిపోతావు? పిల్ల చూడు నిన్ను చూసి ఎట్లా బెంగటిల్లి పోతున్నదో?"
"పోయిన వాళ్ళు చులాగ్గా గుండె పట్టుకొని పోయినారు. ఈ పిల్ల కుంకను పెట్టుకొని ఏడుస్తూ బతికే కన్నా ఒక్కసారిగా......."
కళ్ళల్లో ఉబికి వస్తున్న నీళ్ళు తుడుచుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా కుళ్ళి కుళ్ళి ఏడవ సాగింది.
"చాల్లే నోర్మూయ్. మళ్ళి అట్లాంటి ఆలోచనలు వచ్చాయంటే చూసుకో......"ఆవేశంతో భార్గవికి కూడా మాటలు రాక కన్నీళ్ళు వరదలైపోయాయి.
సంజన భార్గవి భర్త నడిపే కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నది. అనుకోకుండా వారిద్దరికి అనుబంధం స్నేహం ఏర్పడ్డాయి.
నాలుగు నెలల క్రితం సంజన భర్త హఠాత్తుగా మరణించాడు. ఇంకా ఆ దుఃఖం లోంచి తేరుకోలేక పోతోంది.
భార్గవి రెండు రోజులకొకసారి వచ్చి స్నేహితురాలి బాగోగులు విచారిస్తూ,వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి వండి తీసుకొస్తూ అండదండగా ఉంది.
ఇంత చిన్న వయసులోనే స్నేహితురాలు అట్లా మోడుగా మారిపోవటం చూసి సహించలేక పోతోంది.
**********
భార్గవి చాలా ఆదర్శ భావాలు కల యువతి. ఆమె పెరిగిన వాతావరణం కూడా అటువంటిదే. తాత ముత్తాతల నుండి దేశసేవకే అంకితమైన కుటుంబం. తల్లికి ఇటువంటి ఏక్టివిటీస్ మీద అంతగా ఇష్టం లేదు కాని భర్తకు సహకరిస్తూనే ఇంటి సాంప్రదాయాలు ఆచారాపు పాటిస్తూ ఉంది. తల్లి తండ్రి ఇద్దరి ఆదర్శాలలో పెరిగింది భార్గవి.
తండ్రి ఉన్నంత కాలం ఆయనతో సభలకు వెళ్ళటం తనకు చేతనైనంత సమాజసేవలో పాల్గొనటం చేస్తూ దూరపు బంధుత్వమున్న దినేశ్ తో పరిచయం వివాహం జరిగాయి.
దినేష్ బిజినెస్‌లలో భాగంగా ఒక డిగ్రీ కాలేజీ , ఒక ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో బిజినెస్ పార్ట్‌నర్ కూడా.
**********
ముందు రోజే అనుకోకుండా బిజినెస్ పని మీద భర్తతో సింగపూర్ చేరిన భార్గవి మొబైల్ రింగుతో హఠాత్తుగా మేలుకొంది. ఆ రింగ్ టోన్ సంజన నుండి అని తెలుస్తోంది.
కంగారుగా టైం చూసుకుంటే ఐదున్నర ఇండియా సమయం.
"ఏమిటి సంజనా? ఈ వేళ్టప్పుడు ఫోన్ చేసావు?" గొంతులో కంగారు స్పష్టంగా ఉంది.
"భార్గవీ, " అవతల నుండి వెక్కిళ్ళ మధ్య,"భార్గవీ.....మిన్నీకి రాత్రి నుండి విపరీతమైన జ్వరం. మూసిన కన్ను తెరవటం లేదు. నాకు చాలా భయంగా ఉంది." సగం ఏడుపు సగం మాటలు కలగలిపి వినిపించాయి.
భార్గవి పరిస్థితి అర్ధం చేసుకున్నది.
"అయ్యో సంజూ, నేను నిన్న రాత్రే సింగపూర్ వచ్చాను. అయినా భయపడవాక. నిట్టుకి చెప్పి మా డాక్టర్ గారితో మాట్లాడుతాను. ఒక్క పదిహేను నిమిషాలలో వాడొస్తాడు. మిన్నీకి ఏమీ కాదు. ఆఁ ఒకవేళ నర్సింగ్ హోమ్‌లో చేర్పించాల్సి ఉంటుందేమో, నీకు మిన్నికి కావలసిన అవసరమైన వస్తువులు ఒక బాగ్‌లో పెట్టుకో." బిజినెస్‌లో మేనేజి చేసే అలవాటు చొప్పున చకచక నిర్ణయాలు తీసుకోవటమే కాక అమలులోకి కూడా తీసుకొచ్చేసింది.
ఫోన్ కట్ చేసి, తమ్ముడు నితిన్‌కు ఫోన్ చేసింది. ఆ పాటికే అతను లేచి యోగా పూర్తి చేసుకున్నాడు, ఇంక జాగింగ్ కెళ్ళాలని సిద్దమౌతున్నాడు.
"అరే నిట్టూ, సంజన పాపకు బాగా లేదట. ఒక్కతే ఉంది ఏడుస్తోంది. కాస్త వాళ్ళింటికి వెళ్ళి మన నర్సింగ్ హోంకు తీసుకెళ్ళరా......నేను ఓ పదిరోజుల దాకా కదిలేందుకు లేదు. కాస్త చూడరా నాయనా....." బ్రతిమిలాడుతున్నట్టు చెప్పింది.
"అయ్యో అట్లాగా నేను ఇప్పుడే వెళ్తాను."
కారు కీస్ తీసుకొని బయల్దేరాడు. అడపాతడపా అక్కతో సంజన ఇంటికి వెళ్ళి ఉండటాన బాగానే ఇల్లు గుర్తు పట్టాడు.
చేరవేసిన తలుపు తోసేటప్పటికి అక్కడ కనిపించిన దృశ్యం మనసు కదిలించింది.
సోఫాలో పాపను పడుకోబట్టి కింద పాప చేయి పట్టుకొని శోకమూర్తిలా కనిపిస్తూన్న సంజన రాత్రంతా నిద్ర పోయినట్టు లేదు. ఏడ్చి మొహమంతా ఉబ్బిపోయి ఉంది.
నితిన్‌ను చూడగానే లేవబోయింది. అతను గబుక్కున ముందుకు వచ్చి పాపను భుజాన వేసుకొని, "పదండి మిన్నీని మా నర్సింగ్ హోంకు తీసుకెళ్దాము." అంటూ పెద్దపెద్ద అంగలతో బయటకు దారి తీసాడు.
సర్ది పెట్టుకున్న బాగ్ చేతిలోకి తీసుకొని ఇంటికి తాళం పెట్టి వెనకనే వచ్చి కార్లో కూర్చున్నది సంజన.
**********
ఆ పాటికే బార్గవి ఫోన్ చేసి ఉండటంతో నితిన్‌ను చూడగానే సిబ్బందితో సహా డాక్టర్ కూడా ఎదురొచ్చి స్ట్రెచర్‌లో పాపను ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళి ట్రీట్‌మెంట్ మొదలెట్టారు. ఒక పది నిమిషాల తరువాత డాక్టర్ బయటకు వచ్చి, "మరేమీ భయం లేదు నిట్టూ. టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉండటంతో నీరసం మీద పాప అపస్మారకంగా పడి ఉంది. సెలైన్ పెట్టాము. చేయి కదిలించకుండా చూడండి. ఒక గంటలో జ్వరం తగ్గుతుంది. కాని కొంత కాలం ఇక్కడే ఉంటే మంచిది." అని చెప్పి స్పెషల్ రూం ఏర్పాటు చేసేసారు.
ఎప్పటికప్పుడు భార్గవికి జరుగుతున్నడెవలప్‌మెంట్స్ వివరిస్తూ మూడు రోజులు అక్కడే ఉండి పోయింది సంజన. నితిన్ తన లాప్‌టాప్ అక్కడికే తెచ్చుకొని పని చేసుకుంటూ ఆమె ఒంటరితనం ఫీల్ అవకుండా పగలంతా గడుపుతూ సాయంగా ఉన్నాడు.
సంగతి తెలిసిన భార్గవి తల్లి సుభద్ర వచ్చి చూసి తన ఇంటి నుండే తల్లి బిడ్డలకు భోజనాలు ఏర్పాటు చేసి సాయంత్రాలు కాస్సేపు కూర్చొని పోతోంది.
కోలుకుంటున్న మిన్నీకి నితిన్ సుభద్రమ్మ బాగా చేరువయ్యారు. సంజనకు వారి ఆప్యాయత కలుపుకోలుతనంతో మొహమాటం లేకుండా సుభద్రమ్మతో కష్టసుఖాలు చెప్పుకోసాగింది.
పాప ఒక్క రోజు నితిన్ కనబడక పోయినా బాగా మారాము చేయటమూ, అతను వెళ్ళి పోతుంటే ఏడుపు మొదలెట్టగానే రకరకాలగా కథలు కబుర్లు చెప్పి మాయబుచ్చి వెళ్ళవలసి వచ్చేది.
సంజన కొద్ది రోజులలోనే ఇంతకు ముందు ఉన్న దుఃఖం లో నుండి బాగా తేరుకొని దాదాపు మామూలు మనిషిగా అయింది.
**********
పదిరోజులు అనుకున్న భార్గవి ప్రయాణం పొడిగించి అక్కడి నుండి విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది. వాట్సాప్‌లో నితిన్ వీడియోలు పంపించాడు. కిలకిలమని నవ్వుతున్న మిన్నిని ఆడిస్తూన్న తమ్ముడు పక్కనే నవ్వుతూ ఆనందంగా చూస్తున్న సంజనను చూసేటప్పటికి మనసులో ఉన్న కలవరం మొత్తం పోయింది.
మిన్నీకి అనారోగ్య కారణంగా పెట్టిన సెలవులు పూర్తయి కాలేజీకి వెళ్ళే రోజు వచ్చేసింది. పాపను స్కూల్ తరువాత కేర్ సెంటర్‌కి పంపించటానికి ఏర్పాట్లు చేస్తూండగా సుభద్రమ్మ వారించింది.
"ఇప్పుడు అది చదివే చదువులు ఏమీ మునిగి పోవు. మొన్న మొన్న అంత జబ్బు పడి లేచిన పిల్ల. ఇంకా కొన్నాళ్ళు బడి వద్దు పాడూ వద్దు. రోజూ కాలేజీకి వెళ్ళే ముందు మా ఇంట్లో దింపేసి పో." అంటూ మాటల్లో పెట్టి మిన్నీని పగలంతా చూసుకో సాగింది.
మిన్నీ కూడా ఎటువంటి వెర్రి అల్లరి లేకుండా చక్కగా ఆడుకున్నంత సేపు ఆడుకొని పెట్టింది తిని చక్కగా నిద్ర పోయేది.
మిన్నీ వల్లనే కాని మరే కారణం వల్లనే కాని సంజనకు ఆ ఇంటితో ఇంట్లోని మనుష్యులతో బాగా చనువు అనుబంధం ఏర్పడ్డాయి.
ఇంట్లోకి రాగానే కాళ్ళూ చేతులు కడుక్కొని సరాసరి వంటింట్లోకి వెళ్ళటం కాఫీలు టిఫిన్లు చేయటంతో పాటు తల్లి కొడుకుల రుచులు కూడా తెలుసుకొని అడపాతడపా వంట కూడా చేసేసేది.
ఆ తల్లీ కూతుళ్ళు అట్లా ఇంట్లో తిరుగుతూంటే ఈ తల్లి కొడుకు మనసులు పరిపరి విధాల పోసాగాయి.
**********
"పాపం సంజన. ఇంత చిన్న వయసులోనే ఈ గతి. భార్గవి రాగానే ఏదైనా మంచి సంబంధం చూడమని చెప్పాలి." తల్లి ఆలోచన అట్లా ఉంది.
ఆ మాటే నితిన్‌తో అనగానే,
"అమ్మా మిన్నీని మనింట్లో ఉంచేసుకుందామమ్మా." నిట్టూ అనేసాడు.
"అదెట్లా వీలవుతుంది నాన్నా, తల్లి మనసు ఊరుకుంటుందా?"
"తల్లిని కూడా తెచ్చేసుకుందామమ్మా......"
"నిట్టూ! ఏమంటున్నావురా?"
"అవునమ్మా..... నాకు సంజనను పెళ్ళి చేసుకుందామని బలంగా అనిపిస్తోంది. ఈ మధ్య పెళ్ళి అంటేనే భయమేస్తోంది. అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయ్యారు. మనింట్లో నీకునేను, నాకునువ్వుగా ఉన్నాము. నీకు గుర్తుందిగా అక్కతో వాళ్ళ సర్కిల్ లో పార్టీకంటూ తీసుకెళ్ళింది.
నన్ను పెళ్ళికొడుగ్గా మార్కెట్లో పెట్టిందని అక్కడ వాళ్ళ ప్రవర్తనతోటే తెలిసింది. నలుగురు అమ్మాయిల మధ్య నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు వాళ్ళ మాట తీరు చిరాకేసింది. మొహం మీదే అడిగేసారు. మీ అమ్మగారు మీ దగ్గరే ఉంటారా? అంటూ. అవును నేను మా అమ్మ తోటే ఉంటానని చెప్పేటప్పటికి వాళ్ళకు నా మీద ఇంటరెస్ట్ పోయినట్టు తెలిసి పోయింది. తరువాత అక్క క్లాసు పీకింది. అట్లా ఎందుకన్నావురా?తరువాత ఏదో చూసేవాళ్ళము కదా. నిక్షేపం వంటి అవకాశాలు పోగొట్టావు అని ఒకటే గొడవ.
అమ్మా ఈ హై క్లాస్ సీతాకోక చిలుకలు నాకొద్దమ్మా. రెండు నెలలనుండి సంజనను చూస్తూనే ఉన్నావు కదా. ఆమె అవివాహితురాలే అయి ఉంటే ఎగిరి గంతేసి ఒప్పుకోకపోయినావా? హడావుడి ఏమీ లేదు. నీకు మనస్పూర్తిగా సమ్మతం అనిపిస్తేనే,"
"నాన్నా. ఇట్లాంటివి మన ఇంటా వంటా లేదురా. ఆమె అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు కూడా ఉన్నారు. మిన్ని మీద వాళ్ళకు కూడా అధికారం ఉంటుంది కదా. ఆనిక్కి ఏ గొడవైనా వస్తుందేమో చూసుకోవాలి కద నాన్నా. తొందర పడి ఆశలు వెంచుకో వద్దు."
అంటే అమ్మ పూర్తిగా కాదు వద్దు అనలేదు. సాంప్రదాయాలు పాటించే అమ్మ భర్తను పోగొట్టుకొని ఒక బిడ్డ తల్లి అయిన అమ్మాయితో వివాహానికి ఒప్పుకుంటుందని ఏ మాత్రమూ ఆశ లేని నితిన్‌కు ఏ మూలో ఆశ కలిగింది. ముందు సంజన ఒప్పుకుంటే అమ్మను ఏదోవిధంగా ఒప్పించ వచ్చు.
సంతోషంతో ఈల వేసుకుంటూ వెళ్తున్న కొడుకును చూసి తల్లి ఆలోచనలో పడింది.
"సంజన తనను అంత ఆప్యాయంగా అమ్మా అని పిలుస్తూ మాట్లాడుతూ ఇంట్లో తిరుగుతూ ఉంటే తెలియని వాళ్ళు ఈ ఇంటి మనిషనే అనుకునేట్టు ఉంది. పాపం మిన్ని ఇంత చిన్న వయసులో తండ్రి లేకుండా పెరగటం మనసు కలిచి వేస్తున్నది."
**********
సుభద్రమ్మ భర్త ఉండగా ఎన్నో కులాంతర మతాంతర వివాహాలు చేయటం చూసింది. భార్గవి భర్తలను పోగొట్టుకున్న మహిళలకు భార్యలను పోగొట్టుకున్న పురుషులకు విడాకులు పొందినవారికి వివాహాలు జరిపించేది.
మిన్ని తన ఇంట్లో నడయాడుతుందన్న ఆలోచన ఒక పక్క ఆనందమే కాని...........మనవరాలుగా.......ఊఁహు...మనసు డోలాయమానంగా ఉంది.
కన్నతల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటున్న సంజన మీద పుత్రికా వాత్సల్యం కలిగింది. భార్గవికి చెప్పి ఎట్లాగయినా ఆ అమ్మాయికి ఒక నీడ ఏర్పరచాలని చూసిన మరుక్షణమే అనిపించింది.
నితిన్ తన అభిప్రాయం వెలిబుచ్చేటప్పటికి ఒక్క క్షణం అవాక్కయింది. నిజమే తామిద్దరూ మిన్ని మీద అంతలా అభిమానం పెంచుకున్నారు. వేరే వాళ్ళు పాపను అంత బాగా చూసుకుంటారా? సరే ఏది ఎట్లా జరగాలో అట్లాగే జరుగుతుంది. ముందరే అడ్డు చెప్పటం దేనికి? భార్గవి వచ్చాక చూడవచ్చు.
**********
మిన్ని మారాము చేస్తూంటే సంజన ఫోన్ చేసి పార్కు కెళ్దాము రావటానికి వీలవుతుందా అని అడిగింది.
బాల్స్ అమ్మే అబ్బాయి వద్ద ఒకటి కొనిపించుకొని మిన్ని ఆటల్లో పడింది. బాల్ వెనుక పరిగెడ్తూ పోతున్న మిన్నికి ఒక ఫారినర్ జంట దగ్గర పడ్డ బాల్ తీసుకోబోతూండగా వాళ్ళు ముద్దుగా ఎత్తుకో బోయారు. బిడియంగా బాల్ అక్కడే వదిలేసి నితిన్ సంజన కూర్చున్న బెంచి వద్దకు ఒక్క పరుగున వచ్చి అమాంతం ఎగిరి ఇద్దరి కాళ్ళ మీద మోకాళ్ళు పెట్టి రెండు చేతులతో ఇద్దరి మెడలూ కరుచుకొని భుజాల మీద తల పెట్టి, కొత్తవారి వంక పక్కగా వంగి చూడసాగింది. ఆ ప్రయత్నంలో అనుకోకుండా గట్టిగా లాగేప్పటికి ఇద్దరి మొహాలు దాదాపు ఆనుకుంటున్నట్టు దగ్గరికి వచ్చాయి.
నవ్వుతూ చూస్తున్న ఆ విదేశీ వ్యక్తి పోలరాయిడ్ కెమెరాతో ఫోటో తీసి, "వావ్ వాటె బ్యూటిఫుల్ ఫామిలీ" అంటూ ఆ ఫోటో చేతిలో పెట్టి వెళ్ళి పోయినారు.
అనుకోని ఈ సంఘటనకు ఇద్దరి మొహాలు ఎర్రగా అయిపోయినాయి.
"బయల్దేరుదామా సంజనగారూ." ఫోటో జేబులో పెట్టుకొని తానే ముందుగా మాట్లాడి లేచాడు నితిన్. అతని వెనకనే పాపను తీసుకొని బయల్దేరింది.
కారులోనే నిద్ర పోతున్న మిన్నీని ఎత్తుకొని గదిలో పడుకోబెట్టి ఇంక ఇంటికి పోదామని బయలు దేరబోతూండగా, వెనక నుండి,
"సారీ నితిన్ గారూ, అనవసరంగా మా మూలకంగా......."
చటుక్కున వెనక్కు తిరిగి,
"ఇందులో ఎవరి తప్పూ లేదు. అయినా వాళ్ళే కాదు, మనల్ని పార్కులో చూస్తున్న ప్రతి ఒక్కరూ అదే అనుకుంటారు. అయినా అందులో మీరు సారీ చెప్పవలసిందేముంది?"
ఒక్క క్షణం ఆగి, "నాకైతే వాళ్ళ మాటలు నిజం చేద్దామనిపిస్తోంది........మిన్ని భవిష్యత్తు కోసమైనా. ఆలోచించుకోండి." జేబులోంచి ఫొటో తీసి ఆమె చేతిలో పెట్టి గబగబా వెళ్ళిపోతున్న అతని మాటలు అర్ధం కాని సంజన మాట లేకుండా నిలబడి పోయింది.
కార్లో పోతూ రేర్ వ్యూ మిర్రర్‌లో ఆమెను చూసిన నితిన్ ఆలోచించుకోవటానికి సమయం కావాలి అనిపించి వెళ్ళిపోయినాడు.
ఇంక ఆ రాత్రి సంజనకు నిద్ర కరువయింది.
"ఏమిటి? తన బ్రతుకు ఎటు మళ్ళబోతోంది? పక్కన ఏమీ తెలియని అమాయకురాలి భవిష్యత్తు ఏమిటి? ఒంటరిగా ఎంత కాలము గడపాలి?" ఆ ఫొటో చూడగానే మనసులో ఆలోచనలు, మళ్ళీ సమాజం ఏమంటుందో అన్న అనుమానం. **********************************************
వాట్స్ ఏప్ లో ఒక ఫోటో చూడంగానే భార్గవి మొహం ముడుచుకు పోయింది.......ఏమిటి ఇట్లా జరగబోతోంది?
మధ్యలో మిన్ని అటూఇటూ నితిన్ సంజన దగ్గరగా ఆనుకొని కూర్చొని ఉన్నారు. మిన్ని వెనక నుండి వాళ్ళిద్దరి భుజాల మీద చేతులు వేసుకొని ఉంది.
భార్గవిలో ఆడమనసు మేలుకుంది. ఎంత సమాజ సేవ కోసం పాటుపడ్డా తనదాకా వచ్చేటప్పటికి ఊహూఁ మనసు ఒప్పుకోవటం లేదు.
"ఒక్కగానొక్క తమ్ముడు. తమ అంతస్థుకు తగ్గట్టు ఊరంతా చెప్పుకొనేట్టు పెళ్ళి చేయాలని తన చిరకాల కోరిక. అటువంటిది........"
అయినా తాను అనవసరంగా కంగారు పడటమే కాని సాంప్రదాయాలకు విలువ ఇచ్చే అమ్మ ఎట్లా ఒప్పుకుంటుంది?
తండ్రితో కాని తరువాత తనతో కాని ఇట్లాంటి వివాహాలకు వచ్చేది కాదు. అటువంటిది తన కొడుక్కు భర్తపోయిన పిల్లతల్లితో వివాహం.........ఊహు...శాఖాంతరానికే ఒప్పుకోని అమ్మ ఇటువంటి పనికి చచ్చినా అనుమతించదు? తాను అనవసరంగా కంగారు పడుతోంది.
**********
ఫ్లైట్ దిగి సరాసరి పుట్టింటికి వచ్చిన భార్గవికి తల్లి ఎదురుపడింది.
"ఎప్పుడొచ్చావే భార్గవీ? వచ్చినట్టు ఫోనన్నా చేసావు కాదు?" తల్లి ఆశ్చర్యం. "అల్లుడు గారేరి?"
"ఇప్పుడే ఫ్లైట్ దిగానమ్మా. సామాను తో సహా దినేష్ ఇంటికి వెళ్ళారు. నిన్ను చూడాలనిపించి ఇదిగో ఎయిర్ పోర్ట్ నుండి సరాసరి ఇక్కడికే వచ్చేసాను. నిట్టు ఏడి అప్పుడే ఆఫీసుకు వెళ్ళిపోయాడా?" ఇల్లంతా కలయ చూసింది.
"ఓసినీ అప్పుడే అమ్మ మీద తమ్ముడి మీద బెంగా. పిచ్చి తల్లి. పో పోయి స్నానం చేసిరా ఎప్పుడనంగా తిన్నావో ఏమో? వేడిగా అన్నం తిందువు కాని."
ఆ పాటికే మధ్యాహ్నం అవుతోంది. వేడివేడిగా అన్నం తినేప్పటికి మాంచి నిద్ర పట్టేసిన భార్గవికి ఒక్కసారి గలగలమంటూ మాటలు నవ్వులతో మెళుకువ వచ్చింది. గదిలోంచి బయటకు రాగానే కనిపించిన దృశ్యం చూసి నోట మాట రాలేదు.
తల్లి మెడ చుట్టూ చేతులు చుట్టేసి ఉయ్యాల ఊగుతున్న మిన్ని, బల్ల మీద పెట్టిన పాకెట్లలోంచి బొమ్మలు తొంగి చూస్తున్నాయి. కళకళ్ళాడుతూ నవ్వుతూ చేతిలో టీ కప్పుల ట్రేతో వంటింట్లోంచి వస్తున్న సంజన.
గదిలోంచి ప్రత్యక్షమయిన భార్గవిని చూసి, "హేయ్ భార్గవి ఎప్పుడొచ్చావోయ్?" ట్రే టేబిల్ మీద పెట్టి, దగ్గరికి వచ్చి గట్టిగా కౌగలించుకుంది. "ఇదిగో వేడిగా టీ తాగు. మరో కప్పు తెస్తా." అంతే వేగంతో లోపలికి పరిగెత్తింది.
హటాత్తుగా తనింట్లో తానే పరాయి అయిపోయినట్టుగా కొత్త చోటికి వచ్చినట్టుగా అనిపించింది.
"ఏమిటక్కయ్యా అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనా చెప్పా పెట్టకుండా వచ్చేసావు!"
"అత్తా!" అంటూ పరుగున వచ్చిన మిన్నీని ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి దించేసింది...........
మళ్ళీ మిన్ని వెళ్ళి తల్లి ఒళ్ళో కూర్చొని కబుర్లు చెప్తూంటే గుండెలోంచి ఎక్కడో ఒక మూల మంటలాగా మొదలయింది.
"అరే నిట్టూ చీకటి పడేట్టుంది. సంజన మిన్నిని ఇంటి వద్ద దింపేసి రారా" సుభద్రమ్మ మాటలకు అందరి వద్ద సెలవు తీసుకొని మిన్నీతో సహా బొమ్మల సంచులు తీసుకొని బయల్దేరింది సంజన.
"అమ్మా సంజనా! రేపు కాలేజీకి వెళ్ళే ముందు రోజూలాగానే మిన్నీని ఇక్కడ దింపేసిపో. మరో వారం దాకా స్కూల్‌కు పంపించవద్దన్నారు డాక్టర్ గారు." తల్లి మాటలకు ఇంకా విస్తుపోయింది భార్గవి.
అంటే ఇన్నాళ్ళూ మిన్నీ అమ్మదగ్గరే ఉంటోందన్నమాట. ఇంక లాభం లేదు. అమ్మతో ఈ వేళే మాట్లాడాల్సిందే.
**********
"నిట్టూ చాలా థాంక్స్‌రా. అడగగానే నా ఫ్రెండ్‌కు అండగా నిలబడ్డావు. ఇంక తనకంటూ ఒక దారి చూపించి లైఫ్ సెటిల్ చేసేయాలి. అమ్మా మొన్న సింగపూర్ లో ఒక ఫామిలీని చూసాక ఒక నిశ్చయానికి వచ్చాను, సింగపూర్‌లో మా బిజినెస్ బిజినెస్ చూసుకుంటున్న ప్రతాప్ భార్య పోయినేడు మరణించింది. ఒక కొడుకు ఉన్నాడు ఆయనకు. మళ్ళీ పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాడు. ఆయనకు మన సంజనను ప్రపోజ్ చేద్దామనుకుంటున్నాను. ఇద్దరికి ఈడూజోడూ బాగుంటుంది. సంజనకు కూతురు అతనికి కొడుకు సరిపోతుంది. రేపే దానితో మాట్లాడుదామనుకుంటున్నాను. ఈ లోగా సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను."
"బాగా పొద్దుపోయింది. నేనింక బయల్దేరుతాను. రేపు సంజనతో మాట్లాడి వెంటనే దానిని ఒప్పించి ఏర్పాట్లు చేయాలి". లేవబోయిన కూతురిని ఆపి.
"అమ్మాయి భార్గవీ ఇట్లాంటి విషయాలలో తొందరపడవాక. సంజన అభిప్రాయం తెలుసుకోకుండా ఎవరికీ మాటివ్వవాక."
"అమ్మా! దానికి మళ్ళీ పెళ్ళి చేస్తానని ఎప్పుడో చెప్పాను. కాస్త టైం కావాలంది. ఇంక పాపం దాన్ని ఒంటరిగా వదిలేది లేదు."
"అవునక్కా.....నేను కూడా అదే అనుకుంటున్నాను. నీ కోసమే ఇద్దరం ఇన్నాళ్ళు ఆగాము. సంజనను మన ఇంటి కోడలిగా తెచ్చుకుందామనుకుంటున్నాను."
"నిట్టూ......"గావు కేక పెట్టినంత పని చేసింది. "సంజనను మన ఇంటి కోడలేమిట్రా?"
"అక్కయ్యా, నేను సంజనను ఇష్టపడుతున్నాను. తనకు కూడా అభ్యంతరం లేదు. నీ రాక కోసమే ర్దురు చూస్తున్నాము."
అరేయ్... ఆమె ఒక బిడ్డ తల్లిరా. చేసుకొనే వారు కూడా అట్లాంటి రెండవ పెళ్ళి వారైతే బాగుంటుంది. నువ్వు చేసుకోవడం ఏమిట్రా? అయినా నీకేం ఖర్మరా భర్తపోయిన పిల్లతల్లిని చేసుకోవాల్సిన అగత్యం ఏమిట్రా? నీ కోసం మంచి సంబంధాలు ఎదురు చూస్తున్నాయి. మీ బావగారికి బాగా కావలసినవాళ్ళు. ఇదిగో ఇంక నీతో అమ్మతో మాట్లాడి నిశ్చయమ్ చేసేద్దామనుకుంటుంటే.... నీకు సంజనకు చీ ఛీ....అయినా అమ్మ ఎట్లా ఒప్పుకుంటుందనుకున్నావు?" తల్లి వైపు ఆశగా చూసింది.
"భార్గవీ! నువ్వేనా ఇట్లా మాట్లాడేది? నాన్న ఉండగా ఎన్నెన్ని పెళ్ళిళ్ళు చేసారు?నువ్వు మాత్రం తక్కువా? నెలకొకటో రెండో పెళ్ళిళ్ళు చేసినదానివి. హఠాత్తుగా ఈ మాటలేమిటే." తల్లి మాటల్కు ఇంకా ఆశ్చర్యానికి అంతు లేదు.
"అదికాదమ్మా....బయట అభాగినులకు ఎన్నో చేస్తాము. కాని మనింట్లో.........
పురందర్ గారి అమ్మాయిని ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. పెళ్వవగానే ఇద్దరిని అమెరికాకు పంపిస్తారట. ఎంతో గ్రాండుగా ఊరూవాడా చెప్పుకునేలాగా పెళ్ళి చేస్తారట. బొంబాయి నుండి ఫిల్మ్ సెటింగ్ వేసే వాళ్ళను పిలిపిస్తామన్నారు. మొత్తం డైమెండ్ సెట్ పెట్తారట." ఆవేశంగా చెప్పుకు పోతున్న భార్గవిలో ఈ ఆలోచనలకు తల్లి విస్తుపోయి చూసింది.
సాంప్రదాయం అంటూ ప్రాకులాడే తల్లి తన కొడుక్కు ఒక బిడ్డ తల్లితో పెళ్ళి చేయటానికి ముందుకు రావటం చూసి అంతే విస్తుపోయింది భార్గవి.
"ఓసి పిచ్చి అక్కా.....పురందర్ గారి అమ్మాయి వీణ గురించేనా నువ్వు చెప్పేది! ఆ అమ్మాయి తన కొలీగ్ ఒక ముస్లిం అబ్బాయిని పెళ్ళి చేసుకోబోతోంది. అతన్ని మా అందరికీ పరిచయం చేయడానికి ఒక పార్టీ ఎరేంజి చేసి ఎనౌన్స్ చేసింది. మతాంతర వివాహం కాబట్టి మీ సమాజం తరఫున దండలు మార్పించి పెళ్ళి రిజిస్టర్ చేయించాలి. కనుక ఇంక వీణతో నా పెళ్ళి అన్న మాట మర్చిపోయి ఆ వేదిక మీదే నాకు సంజనకు కూడా నీ చేతుల మీదుగా చేయాలని ఎదురు చూస్తున్నాము."
ఇంటికి వెళ్ళిందే కాని ఒకదాని తరువాత ఒకటిగా షాక్‌లు తట్టుకోవటం కష్టంగా ఉంది భార్గవిలోని ఆడ మనసుకు. తమ్ముడి పెళ్ళిలో తనకు ఘనంగా ఆడబడుచు లాంఛనాలు లభిస్తాయని, అట్లాగే సంజనకు తన చేతుల మీదుగా పెళ్ళి చేసి అందరిలో మరో ఘనకార్యం చేసినట్టు క్రెడిట్ కొట్టేద్దామనుకుంది. కాని తన తమ్ముడితో....ఊఁహు మనసు ఒప్పుకోవటం లేదు.
**********
పరువు కాపాడుకోవటానికి కాలేజీ స్టాఫ్ ముందు సంజన నితిన్‌లకు ఘనంగా దండలు మార్పించి వివాహం చేసి రిసెప్షన్ ఇచ్చిన భార్గవిని వచ్చిన వాళ్ళంతా ఎంతగానో కొనియాడారు.
సంస్కరణ తన ఇంట్లోనే చేసిన ఆదర్శ మహిళ అంటూ తెగ పొగిడేసారు.
"భార్గవీ నిజంగా నేను అదృష్టవంతురాలిని. నీకున్న ఆదర్శాలే నీ తమ్ముడికి కూడా. ఈ ఇంటి కోడలినవటం ఏ జన్మ సుకృతమో! గరికనైన నన్ను వినాయకుడి పాదాల వద్ద పెట్టినట్టు ఉంది"
పూలదండలతో తన కాళ్ళకు నమస్కరించి లేచి గట్టిగా కౌగలించుకున్న సంజనను చూసిన భార్గవి మనసు అపరాధ భావంతో మూలిగింది.
గమనిస్తూన్న నితిన్ ఆశ్చర్యపోయినాడు.
అన్ని సాంప్రదాయాలున్న అమ్మ, సమాజ సేవ అంటూ తిరిగే అక్క లోపలి మనుషులు సందర్భం రాగానే ఎంత బాగా బైటపడ్డారో కదా అనుకున్నాడు.
*****
ఉగాది కథలపోటీలో ప్రధమ బహుమతి పొందిన కథ మనిషిలో మ"నీ"షి రచయిత్రిగారికి అభినందనలు.
ReplyDeleteమన చుట్టుపక్కల చూస్తున్న వ్యక్తుల మనస్తత్వాలను ఒక కథా వస్తువుగా తీసుకుని ఆయాపాత్రల బహిర్గత ఆంతరంగిక స్వభావాలను తెలియజేస్తూ, చక్కని ముగింపు నిచ్చారు. పేరుప్రఖ్యాతులకోసం ,పదిమందిచే పొగిడించుకునేందుకు , స్వలాభంకోసం అనేకరకాల సేవాకార్యక్రమాలు చెసేవారుంటారు.మేము గొప్ప అని చెప్పుకోవటానికి ఉపయోగించుకునే సంప్రదాయాలు,సమాజసేవలు తమదాకావస్తే ఎదురుతిరుగుతాయి. తమవారివిషయంలోనే మనిషిలో ఉన్న అసలు మనీషి నైజం వెలుగుచూస్తుంది.స్వార్ధం సేవలముందు తలవంచుకుంటుంది. అని స్పష్టంగా తెలియజేశారు. ఆదర్శభావం,అభిమానం గూడి ఒకరి జీవిత భాగస్వామిని, , తల్లీబిడ్డలకు జీవితాన్ని యిచ్చాయి.కథలో ఎవరినీ నొప్పించకుండా ముందుకునడిపిన ఉన్నతమైన తీరుకు అభినందనలు.
ఉగాది కథలపోటీలో ప్రధమ బహుమతి పొందిన కథ మనిషిలో మ"నీ"షి రచయిత్రిగారికి అభినందనలు.
ReplyDeleteమన చుట్టుపక్కల చూస్తున్న వ్యక్తుల మనస్తత్వాలను ఒక కథా వస్తువుగా తీసుకుని ఆయాపాత్రల బహిర్గత ఆంతరంగిక స్వభావాలను తెలియజేస్తూ, చక్కని ముగింపు నిచ్చారు. పేరుప్రఖ్యాతులకోసం ,పదిమందిచే పొగిడించుకునేందుకు , స్వలాభంకోసం అనేకరకాల సేవాకార్యక్రమాలు చెసేవారుంటారు.మేము గొప్ప అని చెప్పుకోవటానికి ఉపయోగించుకునే సంప్రదాయాలు,సమాజసేవలు తమదాకావస్తే ఎదురుతిరుగుతాయి. తమవారివిషయంలోనే మనిషిలో ఉన్న అసలు మనీషి నైజం వెలుగుచూస్తుంది.స్వార్ధం సేవలముందు తలవంచుకుంటుంది. అని స్పష్టంగా తెలియజేశారు. ఆదర్శభావం,అభిమానం గూడి ఒకరి జీవిత భాగస్వామిని, , తల్లీబిడ్డలకు జీవితాన్ని యిచ్చాయి.కథలో ఎవరినీ నొప్పించకుండా ముందుకునడిపిన ఉన్నతమైన తీరుకు అభినందనలు.