నాన్నమ్మ - అచ్చంగా తెలుగు
నాన్నమ్మ 
డా. లక్ష్మి రాఘవ 

“కేంటీన్ కి వెడదాం వస్తావా” అని అడిగాడు రామారావు శేషగిరి టేబల్ దగ్గరికి వచ్చి. చూస్తున్న ఫైల్ క్లోజ్ చేసి,
“పద..నాక్కూడా బ్రేక్ కావాలి” అని లేచాడు. ఇద్దరూ ఆఫీసు కు ఆనుకుని వున్నకేంటీన్ లోకి వెళ్లి టీ తీసుకుని ఒక మూలగా కూర్చున్నారు. రామా రావు సిగరెట్టు వెలిగించు కున్నాడు. 
“సిగేరెట్టు మానేసావు కదా మళ్ళీ ఏమిటి” అడిగాడు శేషగిరి.
“చాలా చికాకుగా వుంది. అప్పుడప్పుడూ తాగటం మొదలు పెట్టాను.”
“చికాకు ఎందుకు? ఆఫీసు లో వర్క్ ప్రెషర్ ఏమంత ఎక్కువ కూడా లేదు...”
“ఆఫీసులో పరవాలేదు. ఇంట్లోనే పరిస్థితి బాగా లేదు. …”
“అదేంటి? మీ అమ్మ గారిని కూడా తీసుకొచ్చానని అన్నావు ఆరోజు ఎంతో సంతోషంగా...”
“అమ్మ తోనే ప్రాబ్లం...”
‘ఏమి ప్రాబ్లం...అత్తా కోడళ్ళ దేనా?”
“కాదు శేషూ. అదొక విచిత్ర సమస్య...నీతోనే చెప్పుకోవాలని అనుకున్నా...ఆఫీసు తరువాత కాస్సేపు బయటకు వెడదామా?” టీ కప్పు కింద పెడుతూ లేచాడు రామారావు.
“తప్పకుండా...మా ఇంటికే వెడదాం... మా ఆవిడా,పాపా పెళ్ళికి వూరికి వెళ్లారు. సరేనా???” అని లేచాడు శేషు.
సరే నంటూ రామారావు తలఊపి ఆఫీసు వైపు నడిచారు ఇద్దరూ.
సాయంకాలం ఆఫీసు సు నుండి శేషగిరి ఇంటికే వెళ్లారు.
“కూర్చో రామూ, బాత్రూం కెళ్ళి ఫ్రెష్ అయి రా. నేను కాఫీ పెడతాను’ అని వంటింట్లోకి వెళ్లి పోయాడు శేషు.
ముఖం కడుక్కుని వచ్చిసోఫాలో కూర్చోగానే వేడి, వేడి కాఫీ తెచ్చి ఒక కప్పు రామారావు కిచ్చి,తనూ కాఫీ కప్పుతో పక్కన కూర్చున్నాడు శేషు.
రామారావుకు చాలా రిలాక్స్ అనిపించింది. “అబ్బా ఇలా హాయిగా కాఫీ తాగి ఎన్ని రోజులైందో...”అన్నాడు.
“ఇప్పుడు చెప్పు, నీ విచిత్ర సమస్య ఏమిటో “అన్నాడు శేషు.
“నేను చెప్పినది విన్నాక నాది విచిత్ర సమస్య అవునో కాదో నీవే చెప్పాలి...” అని మొదలు పెట్టాడు రామారావు సినిమా లా చెబుతూ ...
*****
‘ఇన్ని రోజులకి మన మాట మన్నించి అత్తగారు ఇక్కడకు రావటం ఎంత సంతోషంగా వుందోనండీ“ఆనందంగా చెప్పింది సంధ్య. అత్తగారు రావటం సంతోషం అని చేబుతూన్న భార్య సంధ్యను ఆరాధనగా చూశాడు రామారావు.
నాన్నగారు పోయాక పల్లెలోనే ఉంటానని మొండికేసిన తల్లిని హైదారాబాదు కు తీసుకు రాలేక పోయాడు ఈ రెండేళ్ళూ...పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు తప్పకుండ అందరూ పల్లెకు వెళ్లి వచ్చేవారు..
ఇంటికి వస్తూన్న అత్తగారికి గెస్ట్రూమ్ లో  అన్ని  విధాలా అనుకూలంగా అమర్చింది సంధ్య.
పొద్దున్న రామారావు ఆఫీసుకు వెళ్ళటానికి తయారవగానే “వేడుతున్నవా రామూ “అని అడుగుతూంటే. తానే ఆవిడ రూ౦ కెళ్ళి “అమ్మా ఆఫీసుకు వెళ్ళొస్తా” అని చెప్పడం అలవాటు చేసుకున్నాడు.
తొమ్మిదో తరగతి లో వున్నకూతురు ఆశ స్కూలుకు వెళ్ళాక ఇల్లంతా సర్డుకునేది సంధ్య. కొడుకు రాహుల్ ను ఎంసెట్ కోచింగు కని హాస్టల్లో ఉంచారు. వాడు సెలవులున్తేనే ఇంటికి వస్తున్నాడు.
మొదట మనమరాలు ఆశ నాన్నమ్మకు తోడుగా పడుకునేది...తరువాత ఎక్జామ్స్ రావటం తో చదువుకుంటూ చాలా సేపు హాలులోనే కూర్చునేది.
రాత్రి ఎన్ని గంటలవరకూ మేలుకుంటూ వుందని గమనించేది భారతమ్మ. 
ఒక రోజు పొద్దున్న సంధ్యకు చెప్పింది ”అంతసేపు మేలుకుని చదవటం ఏమిటి? అది చదువుతూ ఉందా..లేక ఆపాడుఫోను పెట్టికుని ఏదైనా చేస్తూ ఉందా? అని మీరు గమనించాలి కదా. మీరేమో లేచి చూడను కూడా చూడరు” అంది నిష్టూరంగా 
“పర్వాలేదు అత్తయ్యా. ఆశ ఎప్పుడూ క్లాసు ఫస్ట్ వస్తుంది. ఫోను చూస్తే ఏదైనా డౌట్ వచ్చివుంటుంది. ఈ మధ్య ఆ సులువులు అన్నీ వున్నాయి..”అని నవ్వేసింది సంధ్య.
మధ్యాహ్నం బయటకు వెళ్లి షాపింగ్ వెళ్లి ఇంటి కి కావాల్సినవి తెచ్చుకోవడం చేసేది సంధ్య. అత్తగారితో చెప్పి తలుపులు వేసుకోమని చెప్పి వెళ్ళేది. కొన్నిరోజుల తరువాత ‘ఏమిటీ ఇంత ఆలస్యం అయ్యింది ఇవ్వాళ ‘అని అడిగితే బిల్లు కట్టడం కోసం కరెంటు ఆఫీసుకు వెళ్ళాల్సి వచ్చింది అని సమాధానం చెప్పేది. 
అలాగే ఆశ రావటం ఒక్క అరగంట ఆలస్యం అయినా ప్రశ్నలతో వేదించేది. ఆశ నాన్నమ్మతో మాట్లాడ్డం తగ్గించింది. 
ఒక రోజు రామారావు అఫీసునుండీ రావటం ఆలస్యం అయ్యింది. “ఎందుకురా ఇంతసేపు అయ్యింది??నాకు ఎంత గాబరా వేసిందో తెలుసా “అని అడిగింది కొడుకును.
“ఎప్పుడైనా మీటింగ్స్ వుంటాయి అమ్మాలేట్ అవుతుంది”అన్నాడు.
“ఏమిటో ఈ ఇంట్లో దేనికీ రీతీ,రంగం లేదు. ఎవరి ఇష్టం వారిది. పెద్దదాన్ని ఇంట్లో వున్నాను కదా అని ఒక్కరికైనా వివరంగా చెప్పాలని అనిపించదు...” అని గొణుక్కోవడం స్పష్టంగా సంధ్య చెవిలో పడింది.
భారతమ్మ కు వేరే కాలక్షేపం లేక అలా ఫీల్ అవుతుందేమో నని..టి.వి. సీరియల్స్ చూద్దాం అని అలవాటు చేసింది. అది చూడ్డం మొదలు పెట్టాక ఒక గంట సేపు కాలక్షేపం తో చుట్టూ పక్కల ఏమవుతోందో గమనించడం మానుతుంది అనుకున్నా,అవి చూస్తూనే ఇంట్లో ఎవరెవరు ఎక్కడ వున్నారు? ఏమి చేస్తున్నారు అని గమనించడం ఆశ్చర్యంగా అనిపించింది సంధ్యకు.
ఇంట్లో ఎవరూ ఏపని ఎప్పుడు చేస్తారో చూసి అందులో కొంచెం తేడా వచ్చినా ‘ఈ రోజు ఎందుకు ఇట్లా చేస్తున్నారు?’అని ప్రశ్నించడం తో అందరికీ ఇష్టానుసారం ఉండటానికి వీలయ్యేది కాదు.
ఆవిడ వయసు ఎక్కువ కావటం వలన నిద్ర తక్కువ అవటం తో రాత్రి పూట కూడా ప్రైవసీ తగ్గింది. సంధ్య, రామారావు హాలులో కూర్చో గానే తాను వచ్చి కూర్చుని వారి సంభాషణ లో పాల్గొనేది. దీనితో సంధ్యతో ఆఫీసు సంగతులు కూడా పంచుకోలేనత స్థితీ ఏర్పడింది. 
రాహుల్ ఇంటికి వచ్చినప్పుడు సరదాగా బయటకు వెళ్లి సినిమా చూసి, బయటనే డిన్నర్ చేసి వచ్చేవారు. ఒకసారి ఆవిడను కూడా తీసుకుని వెళ్ళారు. హోటల్ లో ఆవిడ తినే విధానం,అన్నిటికీ వంకలు పెట్టడం భరించలేక పోయారు. పోనీ ఆవిడను ఒంటరిగా వదిలితే ఇంటికి రాగానే “మీ నాయన కాలం లోనూ నాది ఇంటి బతుకే, కొడుకు దగ్గరకూడా ఏమి మారింది ??”అని సాధించింది రెండు రోజులు.
ఇంటికి మీటర్ రీడింగ్ కు వచ్చే వ్యక్తి గానీ, గాస్ తీసుకు వహ్చేమనిషి వచ్చినా సంధ్య మాట్లాడితే వెంట వెంట తిరిగేది. ఎందుకు అలా అంటే ‘ఈ కాలం లో ఎవరినీ నమ్మకూడదు. అట్లా లోపలకు రానిచ్చేస్తావా ‘ అని కోప్పడేది.
దీనితో సంధ్యక అప్పుడప్పుడూ సహనం కోల్పోయేది. “అలా ఏమీ జరగదు అత్తయ్యగారూ. అలా అనుకుంటే ఇన్ని రోజులు ఎలా కాపురం చేసేవాళ్ళం’ అనగానే భారతమ్మకు కోపం చట్టున వచ్చేది.
రామారావుతో ఆమె విషయాలు అన్నీ చెప్పలేక పోయేది సంధ్య.
మొత్తానికి ఆ ఇంటి వాతావరణమే మారింది. 
ఎప్పుడైనా సంధ్య కాస్త ఆలస్యంగా లేచినా, ఎక్కడైనా వెళ్లి కాస్త ఆలస్యం అయినా సంజాయిషీలు, సమాధానాలు చెప్పుకోవడం కష్టంగా ఉంటోంది.
ఒక రోజైతే రాత్రి సరిగా నిద్రపోలేక పోవడం తో మధ్యాహ్నం చాలా నిద్ర వచ్చింది. అత్తగారికి భోజనం పెట్టి తను తిన్నాక వెళ్లి పడుకుంది. ఒక రెండుగంటలు నిద్ర పోయింది. సడన్ గా ముఖం మీద నీళ్ళుపడ్డం తో ఉలిక్కి పడి లేచింది గాబరాగా. ఎదురుగా అత్తగారిని చూసి “ఏమైంది?” అంది. ‘నీకేమైంది ?అని నేను గాబరా పడ్డాను. రెండుసార్లు పిలిస్తే కూడా పలకక పోతే ఏమైందో అని నీళ్ళు చల్లి లేపాలని చూశాను.”అంటూ అక్కడ నుండీ వెళ్ళింది. ఆ షాకు నుండీ తేరుకోవడానికి ఒక అరగంట పట్టింది సంధ్యకు.
తను ఆమెకు ఏమీ తక్కువ చెయ్యకుండా చూసుకుంటూ శ్రీవారి అమ్మగా గౌరవిస్తూ వున్నా ఆవిడకు సంతృప్తి గా ఉందనిపించలేదు.అలా అని భర్తకు తన అమ్మ మీద ఏమి చెప్పినా బాగుండదు అని ఆలోచించేది సంధ్య.
ఒక రోజు ఆశ ఫ్రెండ్ రమ్య వాళ్ళ అక్క లాశ్యతో బాటు ఇంటికి వచ్చింది. మర్యాద కోసం భారతమ్మను “మా నాన్నమ్మ’ అని పరిచయం చేసింది. వాళ్ళు మాట్లాడుతున్నతసేపూ అక్కడే కూర్చుంది భారతమ్మ పిల్లలు ఫ్రీ గా మాట్లాడ లేక పోతున్నారని గమనించి ఆవిడను లోపలి పిలిచింది సంధ్య.
ఆవిడ లోపలకు వచ్చిన కొద్దిసేపట్లో లాస్య భర్త రమేష్ బైక్ లో వచ్చాడు. వాళ్లకు పెళ్లి అయి నెలరోజులే అయ్యింది. 
మగవారి గొంతు విని భారతమ్మ మళ్ళీ హాలులోకి వచ్చింది. రమేష్ ను లాస్య భర్తగా పరిచయం చేసారు. ఒక పది నిముషాల తరువాత లాస్య రమేష్ బైక్ లో వెళ్లి పోయారు. రమ్యను తీసుకుని ముందు పైన డాబా మీదికి వెళ్ళింది ఆశ.
భారతమ్మ సంధ్యతో “ ఇప్పుడు వచ్చిన జంటకు పెద్దలే  పెళ్లి చేశారా?వాళ్ళే చేసుకున్నారా??” అంటే షాకు తినింది సంధ్య.
“అలా ఎందుకు ఆలోచిస్తారు?? వాళ్ళ అమ్మ నాన్నలు చేసిన పెళ్ళే” ఈసడింపుగా అంది సంధ్య.
“ఈ కాలం పిల్లలు వాళ్ళే పెళ్ళిచేసుకోవడం, మళ్ళీ విడి పోవడం మామూలు కదా.. అట్లా నీతి లేనివారితో స్నేహం చేస్తే ఆశ బుర్ర చెడుతుంది అని నా బాధ...” ఆవిడ మాటలు పూర్తి కాకముందే ఇంట్లోకి వస్తున్న ఆశ, రమ్య లను చూసిఅత్తగారితో “మీరుకాస్సేపు రూమ్ లో కూర్చోండి’ అని బయటకు రాగానే 
రమ్య ‘వెళ్ళొస్తా ఆంటీ. ఈ సారి ఆశను మాఇంటికి పంపాలి. లాస్య, బావ వెళ్ళిపోతారు...”అని బై చెబుతూ బయటకు వెళ్ళారు ఇద్దరూ.
వెంటనే రూమ్ లోకి వెళ్లి భారతమ్మ తో “దయచేసి ఇలాటి ఆలోచనలు చేసి మా బుర్రలు పాడు చెయ్యకండి..మమ్మ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి..” అంది చేతులెత్తి నమస్కారం పెడుతూ.
“పెద్దదాన్ని మంచికి చెబితే కూడా మీకు చేడ్డేనా?? రాము రానీ అడుగుతాను” అంది బారతమ్మఛీత్కారంగా.
 వీళ్ళ మాటలు విని లోపలకు తొంగి చూసింది ఆశ. సంధ్య గబా,గబా బయటకు వచ్చి లాస్యను బెడ్ రూమ్ లోకి లాక్కెళ్ళింది. “ఏమయిందే అమ్మా..మళ్ళీ నాన్నమ్మ ఏమన్నాఅందా??” అన్న ఆశను మాట్లాడవద్దు అని నోటిమీద  వేలు పెట్టి సైగ చేసింది. సాయంకాలం రామారావు వచ్చేవరకూ ఎవరూ మాట్లాడుకోలేదు...
రామా రావు రాగానే భారతమ్మ “రామూ నన్ను వూరికి పంపించేసెయ్యి” అంది కోపంగా 
“ఏమైంది? అక్కడ ఉండద్దు అనే కదా ఇక్కడకు తీసుకు వచ్చింది??” అమ్మను అడుగుతూ సంధ్యకోసం చూసాడు. సంధ్య కనిపించలేదు. వంటింట్లో వున్నట్టు వుంది.
“ఇక్కడ నన్ను చూస్తే ఎవరికీ సరిపడదు. ఏమి మాట్లాడినా తప్పే..నాతో కూర్చుని మాట్లాడడానికి కూడా ఎవరికీ తీరిక వుండదు. వూర్లో అయితే ఇరుగూపొరుగూ పలకరిస్తారు...బోలెడు కాలక్షేపం...”
“అమ్మా నీ వయసులో వూర్లో వుంటే ఎక్కడైనా పడినా లేచినా కోలుకోవడం కష్టం. ఇక్కడైతే మేము వున్నాం కదా “
“పడితే గిడితే ఏమైనా అయితే అక్కడ ఈడ్చి పారెయ్యండి. నాకెవరూ చెయ్యద్దు..ఇంకామీకు కష్టం అయితే ఏదైనా ఆశ్రమం లో లేదా గుడి దగ్గరో వదిలెయ్యండి..వున్నన్నాళ్ళు వుంటాను ..పోతే పోతాను..”
‘ఎందుకే అన్ని మాటలు ?? ఏమైందని??” మళ్ళీ సంధ్యకోసం చూసాడు. 
“నీ భార్యనే అడుగు తెలుస్తుంది..” అని విసురుగా తన గది లోకి వెళ్లి పోయింది భారతమ్మ.
వంటింట్లోకి వెడితే సింక్ దగ్గర గోడను ఆనుకుని ఏడుస్తూ కనిపించింది సంధ్య.
“ఏమైంది??” అడిగాడు రామారావు.
సంధ్య మెల్లిగా తమ బెడ్ రూమ్ లోకి నడిచింది.
ఇంట్లో అత్తగారు వచ్చినప్పటి నుండీ జరిగిన విషయాలను, తను భర్త తో చెప్పలేని నిస్సహాయతను తెలియచెప్పింది. ఇంతలో లొపలికీ వచ్చిన ఆశ “నాన్నమ్మ తో కష్టంగా వుంది నాన్నా. అందరి ఇళ్ళల్లో వున్న అమ్మలూ, నాన్నమ్మలను  నేను చూశాను. గుళ్ళకూ, ప్రవచనలకూ వెడుతూ వుంటారు. మనమలకు పాత కథలేవైనా చెబుతూ వుంటారు నాన్నమ్మ కూడా అలాగే ఉంటుందని అనుకున్నా...పైగా చాలా అనుమానంగా, బాధ కలిగించేలా మాట్లాడుతుంది. అప్పటికీ నేనూ, అమ్మా దేనికీ జవాబు ఇవ్వటం లేదు కూడా..”అని చెప్పింది.
ఇక ఏమనాలో తోచలేదు రామారావుకు. 
“సంధ్యా, అమ్మను వెనక్కి పంపలేను. కొంచెం ఓపిక పట్టు. అందరూ నార్మల్ గా వుండండి. నేను ఆమెను మార్చడానికి ట్రై చేస్తాను “అన్నాడు..
*****
“ఇదీ సంగతి శేషూ...ఏమి చెయ్యాలో అర్థం కావటం లేదు.”
“మీ నాన్నవున్న కాలం లో కూడా ఆవిడ ఇలాగే ఉండేదా? జ్ఞాపకం చేసుకో..”
“నాన్న చండశాసనుడు. అమ్మ వంటింటి  నుండీ బయటకు వచ్చే అవకాశం వుండేది కాదు. ఏ విషయాలు మాట్లాడడానికి ఆడవాళ్ళకు అవకాశం లేదు ఆ ఇంట్లో. నా తరువాత ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోవడం తో అమ్మ కూడా దేని మీదా ఆసక్తి చూపేది కాదు. పని తప్ప వేరే ఎలాటి వ్యాపకం వుండేది కాదు...”
“బహుశా మీ అమ్మ గారికి తన ఆలోచనలూ, కోరికలూ అణచి వేసుకుని వుండి...ఇప్పుడు స్వాతంత్రం దొరికీసరికి అన్నీ తనకు కావాలి. తనతో చెప్పాలి అన్న ఆటిట్యూడ్ వచ్చివుంటుంది.. దీనికి నాకు తోస్తున్న సొల్యూషన్ ఒకటి ఏమంటే మళ్ళీ ఆమెను కట్టుదిట్టం చేయడం... లేదా...తనవయసు వున్న ఇతరులతో కలిస్తే ఇక్కడ తనకు జీవితం ఎంత సుఖంగా వుందో అవగాహన కలిగించడం...అంటే ఆవిడ గుడీ, గోపురం అనదు  కదా మరి ఎలా ??” ఆలోచించాలి...’
“గుడికి పంపాలనీ, హనుమాన్ చాలీసా, భగవత్ గీత లాటివి చదివించాలని సంధ్య ప్రయత్నంచేసిందిట. 
“నాకు పుస్తకాలు చదివితే కళ్ళు నొప్పి పుడతాయి. అయినా దేవుడు నాకేమీ మంచి చెయ్యలేదు..నేనెందుకు తలచుకోవాలి?” అనిందట.
“అయితే ఒక పని చేస్తాము. నీవు ఏదైనా ఎమర్జెన్సి అని కుటుంబం అంతా బయటకు వెళ్ళండి..ఒంటరిగా వదిలేయ్యలేము కాబట్టి నీ ఫ్రెండ్ ఆశ్రమం ఉందని చెప్పి అక్కడ ఒక వారం ఉంచుదాం. నాకు ఒక ఆశ్రమం తెలుసు  వారితో మాట్లాడుతాను.అక్కడ చూస్తే అప్పుడు అర్థం అవుతుంది ఆవిడకి తనది ఎంత మెరుగైన జీవితమో...తను ఎలా ఉండాలో...ట్రై చేద్దామా ఆలోచించి చెప్పు...” అని చెప్పాడు శేషు.
రామారావు కి ఇది నచ్చింది. ఇంటి వెళ్ళాక సంధ్యతో డిస్కస్ చేశాడు. ఆశ కూడా “ఒక వీక్ సెలవులు వున్నాయి.అమ్మమ్మా వాళ్ళ వూరు వెడదాం.”అనింది.
ఒకరోజు అఫీసునుండీ మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కొడుకును చూసి “ఏమిరా ఇప్పుడు వచ్చావు?”అంది.
“అమ్మా, సంధ్యావాళ్ళ అమ్మమ్మకు బాగాలేదంట. అందరూ ఒకసారి వచ్చిపొండి అని మామగారు ఫోను చేసినారు.సాయంకాలం బయలు దేరాలి..”అన్నాడు .
“నేను అంత దూరం రాలేను లేరా...ఇక్కడే వుంటాను” అంది బారతమ్మ.
“అయితే ఎలా ??ఒంటరిగా వుంచలేము అమ్మా ...వుండు నా ఫ్రెండ్ కు ఫోను చేస్తాను...”అంటూ 
“సంధ్యా బట్టలు సర్దుకో...ఆశ స్కూల్ కు ఫోను చేశాను. వచ్చేస్తూ వుంటుంది. సాయంకాలం బస్సుకి బయలు దేరాలి..’అన్నాడు.
“మరి అమ్మ ..” అ౦ది సంధ్య.
“ఫోను చేస్తున్నా”అని శేషు కు ఫోన్ చేసి ఆశ్రమం విషయం కనుక్కున్నాడు.
“అమ్మా నీవుకూడా బట్టలు సర్దుకో. నిన్ను నా ఫ్రెండు దగ్గర వదిలేసి మేము బస్టాండ్ కు వేడతాము.’అని చెప్పాడు.
ఈ అనుకోని ప్రయాణానికి భారతమ్మ మానసికంగా తయారు కాకనే హడావిడిగా రెండు ఆటోలలో అందరూ బయలుదేరారు.
మధ్యలో ఆశ్రమం దగ్గర శేషగిరి కాచుకుని వుంటే భారతమ్మ ను అప్పగించి సంధ్య పుట్టింటికి వెళ్ళే బస్సు ఎక్కడం అయింది.
“ఏమిటో ఇలా నిర్ణయం తీసుకున్నారు. అమ్మకు కష్టం అవుతుందేమోనని చాలా యోచన అవుతూంది..”అంది సంధ్య బాధగా.
“ఇలాటి కోడలు విలువ అమ్మకు తెలియాలనే సంధ్యా ఈ ప్రయత్నం. కొడుకుగా ఆమెను సుఖపెట్టాలి అనుకున్నాను. కోడలుగా ఎటువంటి కష్టం లేకుండా చూసుకుందామని చూసావు నువ్వు. నాన్నమ్మ దగ్గరచేరాలని ఆశపడ్డారు మనమలు. ఇటువంటి అనుకూలమైన వాతావరణం ను తానే ఎంతగా కలుషితం చేసిందో అమ్మ నేర్చుకోవాలనే ఈ ప్రయత్నం. మనకూ, అమ్మకూ కూడా ఒక బ్రేక్ అన్నమాట” అన్నాడు రామా రావు శేషు కు మనసులో థాంక్స్ చెప్పుకుంటూ.
ఎంతమందికి అర్థం చేసుకుని బాగా చూసుకోవాలన్న కొడుకు కుటుంబం దొరుకు తుంది..ఆశ్రమం లో వివిధరకాల మనుష్యులతో గడిపినతరువాతైనా భారతమ్మ మారుతుందా???? వేచి చూద్దాం.
$$$$$$$$$
  

No comments:

Post a Comment

Pages