పదవీ గండం
జైదాస్
"అహ్హహహ.... వెర్రివాడా!నీ అంతు చూసేవాడు రేపల్లెలో పెరుగుతున్నాడురా..!!" తూలి ముందుకు పడబోయినవాడల్లా తమాయించుకున్నాడు సర్పంచ్ పులిరాజు. "వెధవది వెధవభాగవతం" అనుకుంటూ చటుక్కున 'ఛానెల్' మార్చేశాడు.'ముగ్గురు మంత్రు లకు ముందస్తు ముప్పు' 'ఠపీ...'మని టివి కట్టేశాడు పులిరాజు న్యూస్ హెడ్ లైన్స్ చూడలేక. "ఛీ..ఛీ.. మనశ్శాంతికోసం టీవీ చూడబోతే ఏ ఛానల్లో చూసినా అవే వెధవ సీరియళ్లు, అవే దరిద్ర గొట్టు వార్తలూను.." అని తిట్టుకుంటూ కాలు కాలిన పిల్లి లా అటూ ఇటూ పచార్లు చేయసాగేడు. కళ్ళు మూసినా తెరిచినా 'చిచ్చుల బాబా' చెప్పిన మాటలే పులిరాజు చెవుల్లో చిందులేస్తున్నాయి. అంతకుముందు రోజే అతనివద్దకు ఓ బాబా వచ్చి 'తన పేరు చిచ్చులబాబా అనీ, తాను చేయి చూసి ఎవరికైనా భవిష్యత్తులో రాబోయే చిచ్చులను ఇట్టే పసికట్టే యగలననీ' చెప్పుకొచ్చాడు. పులి రాజుకు రాజకీయాల్లో దిగినప్పటి నుండి బాబాలన్నా, జాతకాలన్నా, పిచ్చి నమ్మకం. బాబాకు చేయి చూపించి తన 'భవిష్యత్ రాజకీయ జీవితంలో చిచ్చుపెట్టి వారెవరైనా ఉన్నారేమో' చెప్పమన్నాడు. చిచ్చుల బాబా పులి రాజు చేతిని ఎగా దిగా చూసి నిట్టూరుస్తూ "జాతక రీత్యా రాబోయే కాలంలో నీకు పదవీ గండం తప్పదు.అదీ నీకు బాగా అయిన వాళ్లే 'రాజ్యాంగేతర శక్తి' గా మారి పదవికి ముప్పు కలిగిస్తారు" అనిచెప్పిపులిరాజు గుండెల్లో ఆరని, తీరని చిచ్చు రేపి పోయాడు. అంతే అప్పటినుండి తన పదవికి ఎప్పుడు ఏ గండం దాపురిస్తుందోనని హడలి చస్తున్నాడు. పులిరాజు తాత ముత్తాతలందరూ అధికారంతోనే బ్రతికారు. అధికారంతోనే పోయారు. తనూ వరుసగా రెండుసార్లు గెలిచి వచ్చే ఎన్నికల్లో 'హ్యాట్రిక్' సాధించాలని ఉవ్విళ్లూరుతుంటే మధ్యలో ఈ చిచ్చుల బాబా గాడొచ్చి చిచ్చు పెట్టి పోయాడు.చిచ్చుల బాబా చెప్పిన ఆ 'రాజ్యాంగేతర శక్తి' ఎవరో ఎంతగా ఆలోచించినా అంతు పట్టడం లేదతనికి. ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కి పోసాగింది."ఏంటో బావగారు పరిసరాల్ని కూడా మరిచిపోయి చాలా 'డీప్' గా లోచిస్తున్నారు.కొంపదీసి కొత్త స్కామ్ కి స్కెచ్చేయడం లేదుకదా.."అన్నమాటలు విని ఉలిక్కిపడి ఈలోకంలోకొచ్చాడుపులిరాజు.ఎప్పుడొచ్చాడో ఏమో ఎదురుగా సోఫాలో కూర్చోని వున్నాడు గోపాలం.పులిరాజు కు గోపాలానికి 'బీరకాయపీచు బంధుత్వ'ముంది.పులిరాజు రాజకీయ రంగంలో దూకింది మొదలు ఇప్పటిదాకా అవసరమైన పుడల్లా తన ఆమోఘమైన తెలివి తేటలతో సలహాలిచ్చి అదుకుంటూ అన్నింటా చేదోడు వాదోడుగా వుండే గోపాలాన్ని తన 'అనధికారిక పి.ఏ' గా నియమించుకున్నాడు పులిరాజు. ఇంతకాలం పాటు పులిరాజు తిరుగులేకుండా అధికారంలో కొనసాగుతున్నాడంటే అందుకు ఒకరకంగా స్వామిభక్తి పరాయణుడైన గోపాలమే కారణం. అలాంటి గోపాలాన్ని చూడగానే అతని ఆలోచనలు సడెన్ గా సైడిచ్చుకున్నాయి. "కొంపదీసిఈ గోపాలంగాడే నాపాలిట రాజ్యాంగేతరశక్తి గా మారి నా పదవికి ఎసరుపెట్టడుకదా!" ఏమో నమ్మించి తడిగుడ్డతో గొంతులు కోసేవారిని రాజకీయాల్లో ఎంతమందిని చూళ్లేదు?నాకు తప్పుడు సలహాలిచ్చో,నాప్రత్యర్ధి సింగినాధం తోచేతులుకలిపో,నన్ను దొంగదెబ్బ తీస్తాడేమో!అసలే అలవికాని పొత్తులతో ఆధికారపార్టీ లే అతలాకుతలమవుతున్న రోజులివి.ఎవరు ఏక్షణాన ఎటుదూకి ఎవరితో పొత్తుపెట్టుకుంటారో ఎవరికెరుక?" "ఏవండోయ్ బావగారు!లోకల్ ఎలక్షన్లకులైన్ క్లియరైనప్పటినుంచి బొత్తిగా ఈలోకంలోనే లేకుండాపోతున్నారు.ఏంటికథ..? పోత్తులకోసం పధకరచనలా...?" అసలు మీ సమస్యేంటో చెప్పండి. నేను చిటికెలో తేల్చేస్తా".అంటూ గోపాలం మొహంమీద చిటికే యడంతో పులిరాజు తడబడి "అబ్బే..! ఏం లేదురా..!"అన్నాడు తన భావాలు పైకి కనబడనీయకుండా సర్దుకుంటూ. "అయినా 'నేనుండగా నీకు అండ నీమెడలో పడకతప్పదు అధికారపు దండ'. డోంట్ వర్రీబావా..! అసలు విషయమేంటో చెప్పు". అన్న గోపాలం మాటలకు కాస్త ఊరట చెందిన పులిరాజు అసలుసంగతి చెప్పేసాడు.అంతా విన్న గోపాలం బిగ్గరగా నవ్వేసి"ఓహో ఆదన్నమాట బావగారి 'ఫీల్ బ్యాడ్ ఫ్యాక్టర్'. దీనికంత ఆలోచనెందుకు బావా..!రాజ్యాంగేతర శక్తులంటే ఏమిటో మన రాష్ట్రంలో ఏ వార్డు మెంబరునడిగినా 'టకీ' మని చెప్పేస్తారే. ఇంతచిన్న విషయం కూడా తెలీకుండానే నువ్వు సర్పంచ్ గా నెగ్గుకొస్తున్నావంటే నీకవార్డు ఇవ్వాల్సిందే. అదిసరేగాని బావా ముందు నాకీ విషయం చెప్పు.నీ కెవరైనా 'అపద్ధర్మ సహధర్మచారిణి' ఉన్నారా?" పులిరాజు ఏమి అర్ధంగాక 'అపద్ధర్మ ముఖ్యమంత్రి' లాగా అపద్ధర్మ సహధర్మచారిణి ఎవర్రా..? అవిడేమన్నా అపదల్లో వుండే నాలాంటివారికి అధికారం కట్టబెట్టి ఆదుకునే ధర్మచారిణా..?" ఆత్రంగాఅడిగేడు.ఆమెవరో 'లేడిబాబా' కాబోలనుకుని."అబ్బా నీతో నాకిదే చిక్కుబావా.ఏదీ సరిగ్గా అర్ధం చేసుకోలేవు. నీ 'సహధర్మచారిణి' నిన్నెలా భరిస్తుందో ఏమో?నేనడిగేది నీకు 'సెకండ్ సెటప్' ఏమైనా ఉందా..? అని"అన్నాడు.విషయం అర్ధం కాగానే పులిరాజు సిగ్గులమొగ్గయి మెలికలు తిరిగిపోతూ,"నీకు తెలియనిదేముందిరా గోపాలం.నేను చిన్నాచితకా లేడీల జోలికెళ్లనుకదా!కొడితే ఏనుగుకుంభస్థలాన్నే కొట్టాలి.పడితే రంభలాంటి దాన్నే పట్టాలి.ఆ బాపతుకేసేది దొరకలేదింకా.అయినా ఈరోజుల్లోఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలిసి చావడం లేదు.పులిరాజు అని పేరు పెట్టుకొని అడ్డమైన ఆడాళ్లతో తిరిగి 'ఎయిడ్స్' తెచ్చుకుంటే ఇంకేమైనావుందా?మనూరు ఓగొప్ప నాయకుడిని కోల్పోదూ!ఆ 'ఏ.పి ఎయిడ్స్ కంట్రోలు విభాగం' వాళ్ళుచంకలు గుద్దుకుంటూవచ్చి నన్నుపట్టుకెళ్లి 'పులిరాజాకు ఎయిడ్స్ వచిందహో...!అంటూ రాష్ట్రమంతా సినిమానటుల్ని విజయయాత్రల పేరుతో తిప్పినట్టు, నన్నూతిప్పితిప్పి చంపరూ..!"అన్నాడు. గోపాలం"పోనీలే బావా..! సానుభూతి ఓట్లుపడి అక్కయ్య అధికారంలో కొస్తార్లే" అనబోయిన వాడల్లా నాలుక్కరచుకుని"అంటే ఎవరూలేరన్న మాట.అయితే గియితే నీ సహధర్మచారిణే ఐ మీన్ అక్కయ్యగారే అవుతారు రాజ్యాంగేతరశక్తి.కానీ అక్కయ్యగారు అంతగా యాక్టివ్ కాదుగనక నువ్వింతగా రియాక్ట్ కానవసరంలేదు.ఒకవేళ ఈ సారి రొటేషన్లో రిజర్వేషన్ మారిఅక్కయ్య గారికి అధికారం వచ్చినా మునిగిపోయేదేమీ లేదు.ఒక్కనీ పదవితప్ప.పెళ్ళాన్ని పదవిలోవుంచి 'కొంగుచాటు కృష్ణుడి'లా పెత్తనం చేలాయించే పతులు ఇపుడెంతమంది లేరు? సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అలా చేయగా లేనిది ఆఫ్ట్రాల్ సర్పంచ్ వి నువ్వెంత?సో..రాజకీయాల్లో ఇవన్నీ కామన్ గనుక కష్టమనుకోకూడదు."అన్నాడు."ఒరేయ్ గోపాలం నాపేరేమిట్రా..? పులి..పులిరాజురా..!వుంటేపదవిలో ఉంటా లేకపోతేలేదు.అంతేకాని ఆడ దాన్ని అందలం ఎక్కించి తగుదునమ్మా అంటూ రాజ్యాంగేతర శక్తిలా రాజకీయం నడిపే అవలక్షణం మా ఇంటా వంటా లేదు.అందుకు చస్తే నేనొప్పుకోను."అన్నాడు పులిరాజు రోషంగా."అయితే ఇక నీ ఖర్మ.'రెబెల్స్ పోరు అప్పోజిషనోళ్లు తీర్చినట్టు'నీ శత్రువు సింగినాధం ఇదేసందని భార్యను బరిలోదించి నీ పదవినెగరేసుకుపోతాడు.ఇక నీకు పడవీగండం ఖరారైనట్టే.ఆతర్వాత నువ్వు ఏ 'సచ్చు, పుచ్చు' బాబానో ఆశ్రయించి సేవచేసుకుంటూ పొద్దుపుచ్చుకోక తప్పదు.అదే నీకు 'ఫీల్ గుడ్ ఫ్యాక్టర్."అన్నాడు గోపాలం."ఒరేయ్.. ఒరేయ్..పోతావురా గోపాలం.నా పదవికి ముప్పుదాపురిస్తుందేమోనని నేను మూలుగుతుంటే ,వేళాకోళంగా ఉందిరా నీకు...!"అరిచేడు పులిరాజు వుడుక్కుంటూ."లేకపోతే ఏంటి బావా..! 'సభ్యులూలేరూ, గుర్తులూలేవు పార్టీ పేరు ప్రజాపార్టీ' అన్నట్టు ఎన్నికలూ లేవు అధికారమూరాలేదు.పదవీ గండమేంటి?వాడెవడో చిచ్చులుపెట్టే బాబా ఉచ్చులోపడి ఇప్పట్నుంచే సచ్చుబడి పోతావా?నేనున్నాగా.. నువ్వెళ్ళి హాయిగా పడుకో.."అన్నాడు గోపాలం హామీ ఇస్తున్నట్టు.
'పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా..? అన్న ప్రశ్న అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేపినట్టే'పులిరాజాకు టిక్కెట్ వస్తుందా..?'అన్న ప్రశ్న ఊరంతా సంచలనం రేపుతోంది. గెలుపుగుర్రాల వేటలో చిత్ర విచిత్రమైన సమీకరణాలతో, వింతైన పొత్తుల ఎత్తులు, జిత్తులతో రాజకీయాల రంగే మారిపోతోంది.పులిరాజు భయపడినట్టే సర్పంచ్ సీటు రొటేషన్లో రిజర్వేషన్ మారి అడవాళ్లకుపోయింది.భార్యను బరిలో దించడం తప్ప గత్యంతరం లేకుండాపోయింది.ఊహించని ఈ ఉపద్రవానికి తట్టుకోలేని పులిరాజు" అయిపోయింది.. అంతా అయిపోయింది.." అంటూ పెద్దగా అరుస్తూ మొదలునరికిన చెట్టులా కుప్పకూలిపోయాడు."ధబ్.." మంటూ మంచం మీదనుంచి క్రిందపడిన పులిరాజు ను "ఏవండీ.. ఏవయిందండీ..?" అంటూ లేపి కూర్చోబెట్టింది భార్య.నిద్రలో కలవరిస్తున్న వాడల్లా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు పులిరాజు.ఎదురుగా ఏమీ అర్ధంకానట్టు తనముఖంలో ముఖపెట్టి చూస్తోంది భార్య."అహ్హహహ ఇకనేనేరా..నీకూ ఈవూరికి మహారాణిని" అంటున్నట్టనిపించిందతనికి. అంతే అమాంతం ఆమె గొంతు దొరకబుచ్చుకుని " నువ్వే నువ్వే ఆ చిచ్చులబాబా చెప్పిన చిచ్చువి.నా పదవికి అసలైన గండానివి నువ్వే.."అంటూ ఉన్మాదిలా ఆమె పీక నొక్కేయ సాగాడు.ఈ హఠాత్పరిణామానికి బెదిరిపోయిన పులిరాజు భార్య "హమ్మో.. .చంపేస్తున్నాడురోయ్.. నేనసలే ఒట్టిమనిషిని కాను. నన్ను కాపాడండిరోయ్.." అంటూ గావుకేకలు పెట్టసాగింది. ఈ గోలకు నిద్రలేచిన పులిరాజు కూతురు 'సీన్' చూడగానే పరి స్థితినర్ధం చేసుకుంది. సినిమా లు,సీరియళ్ళు చూసి రాటుదేలివున్న ఆమె మైండు 'యమఫాస్ట్' గా రియాక్టయింది.ఒక్కవుదుటున వెళ్లి మూలనున్న దుడ్డు కర్ర తీసుకొని పులిరాజు నెత్తిన ఒక్కటిచ్చింది.అదెబ్బకు పులిరాజు నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది.ఎదురుగా కడుపుతో ఉన్న భార్యను,కర్ర పట్టుకోనున్న కూతుర్ని చూడగానే "అంతా కలన్నమాట! హమ్మయ్య ప్రస్తుతానికి పడవీగండం తప్పినట్టే" నని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.
ఎన్నికల యుద్దానికి తెరలేచింది.'హ్యాట్రిక్కు'లన్నీరెడీచేసుకుని రంగంలో దిగాడు పులిరాజు. అతనికి పోటీగా 'సింహనాథం' అనే ఒరిజినల్ పేరున్న 'సింగినాదం'బరిలో దిగేడు. ఊర్లో ఎన్నికలు జరిగినపుడల్లా పులికి సింహానికి మధ్య పోటీగానే భావిస్తారంతా.సింహనాథం ప్రతిసారీ బరిలోదిగి ఎన్ని ఎత్తులు జిత్తులు ప్రయోగించినా ఫలించక పోవడమేగాక,గోపాలం తెలివివల్ల అవిపులిరాజుకే అనుకూలించి ఓడిపోవడం మామూలు కావడంతో అతనికి 'సింగినాద'మనే పేరే స్థిరపడి పోయింది.లేటెస్టుగా పులిరాజు గుండెల్లో గండం పేరుతో గుబులు రేపిన చిచ్చులబాబా కూడా అతని ప్రయోగమే.నిజానికి పులిరాజు సీటు రిజర్వు అయ్యేదే. కానీ చిచ్చులబాబా పుణ్యమాని ముందుగానే జాగ్రత్త పడ్డాడు.గోపాలం తో కలసి నానా తంటాలుపడి సీటు తానే దక్కించుకున్నాడు.అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరో తాజా వ్యూహం తో పులిరాజును దెబ్బతీసేందుకురంగం రెడీ చేసుకున్నాడు సింగినాదం.
"ఏం కొంపలంటుకుపోతున్నాయని బావగారూ ఉన్నపళాన రమ్మన్నారట"అంటూ లోపలికొచ్చిన గోపాలం తో "కొంపలు కాదురా మనం చూడకపొతే కోటలే కూలిపోయుండేవి.ఇదిగోచూడు."అంటూ 'ఓటర్ల లిస్టు కాపీ'ని గోపాలం ముందుకు తోశాడుపులిరాజు. లిస్టు చూసిన గోపాలం" ఏంటి బావా ఇది?పోయినోళ్ళవే కాకుండా పిల్లా జెల్లా పేర్లుకూడా ఉన్నాయేంటి?బోగస్ ఓటర్లా..?"అడిగేడు ఆశ్చర్యంగా. "ఇందుకేనోయ్ నిన్ను పిలిపించింది. ఇదంతా ఆ సింగినాదం గాడి కుట్ర.ఓడిపో తాననే భయంతో తన మద్దతుదార్లలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరి పేర్లు రాయించి 'బోగస్' ఓట్లతో గెలుద్దా మనుకుంటున్నాడు. మన వాళ్ళ పేర్లు కూడా చాలా 'గల్లంతు' చేయించాడు. ఇప్పుడెలా..?" టెన్షనుగా అడిగాడు పులి రాజు. గోపాలం 'గ్రేట్ మైండ్' కి క్షణాల్లో జరిగిందంతా అర్థమైపోయింది. వెంటనే ఏదో ఆలోచన వచ్చిన వాడిలా "ఆ..ఏముంది బావా ఇందులో 'సింగినాదం జీలకర్ర'.ఆ సింగి నాదానికి వాడి 'ప్లాన్' తోనే తల బొప్పి కట్టిస్తాను చూడు". అన్నాడు. "ఎలా..?" ఆత్రంగా అడిగాడు పులిరాజు. నిక్షేపంగా ఉన్నవాళ్లను నిర్దాక్షిణ్యంగా, నిలువునా పైకి పంపాలన్నా, పోయినోళ్ళ ప్రాణాలు తిరిగితేవాలన్నా, ఒక్క ఓటర్ల లిస్టు తోనే సాధ్యం. తాత పేరు మనవడికి పెట్టడం మన ఆంధ్రా లో ఆనవాయితీ కదా! దాన్నడ్డం పెట్టుకునే సింగినాదం గుట్టుచప్పుడు కాకుండా తన మద్దతుదార్లలో 'రిపీటయిన' మూడో తరం పేర్లన్నీ రాయిం చేసాడు. ఇది 'ప్రొవిజినల్ లీస్టే' కాబట్టి ఇచ్చిన టైంలో గా మనం 'బోగస్ ఓటర్లు' న్నారని 'కంప్లైంట్' చేద్దాం. సవరించేటపుడు సింగినాదంకు మద్దతిచ్చే సిసలైన ఓటర్ల పేర్లు కూడా డబ్బిచ్చి 'గల్లంతు' చేయిద్దాం. పనిలో పనిగా 'సింహంనాదం' అనే పేరే మన ఊర్లో లేదని చెప్పి ఏకంగా సింగినాదం ఓటునే 'గోల్ మాల్' చేయిద్దాం. ఆఖరిటైంలో తెలిసినా ఆ సింగినాదం ఏం చేయలేడు.'టిట్ ఫర్ టాట్'. ఏమంటావ్..?' అడిగాడు గోపాలం.పులిరాజు ఆనందం పట్టలేక గోపాలాన్ని కౌగిలించుకున్నంత పని చేసాడు. గోపాలం తిరిగి చెప్పసాగాడు. "నువ్వు వెంటనే పక్కూరినుంచి విశ్వాసపాత్రులైన కొందరు మనుషులను రప్పించు. వారితో ఊరంతా ఓటుకు వెయ్యి లెక్కన పంచు. ఊరంతా 'సారా' ను ఏరులా పారించు. కానీ ఇవన్నీ మూడో కంటికి తెలీకుండా ఆ సింగినాదం పేరుమీదే చేయించు...". పులిరాజు మధ్యలోనే అడ్డుపడుతూ సింగినాదం పేరుతో నా డబ్బు,సారా పంచడమే..? అందరూ తాగిన విశ్వాసంతో వాడికే ఓటేస్తే నా గతేం కాను..? నేనసలేపదవీ గండం ఉందని హడలిచస్తుంటే. ఇది నేను చస్తే చేయనుగాక చేయను". అన్నాడు బింకంగా. గోపాలం సింగి నాదంతో జట్టు కట్టి తనను పకడ్బందీ ప్లాన్ తో దెబ్బ తీయబోతున్నాడేమో ననే అనుమానంతో. "అందుకే బావా నిన్ను అందరూ 'పిల్లిరాజు' అనేది.పిరికి మాటలు మాని చెప్పేది పూర్తిగా విను. డబ్బు తీసుకున్నోడెవడూ డబ్బిచ్చి నోడికి ఓటేయడు.సారా తాగినోడెవడూ తాగించినోడికి ఓటేయడు. అది ఆంధ్రుల అవలక్షణం. వారికి ఇష్టమైన వారికే ఓటేస్తారు. కానీ ఏ పార్టీ ఏదిచ్చినా తీసుకుంటారు. అయినా నువ్వు పంచేది నీ డబ్బు కాదు..." "మరెవరిది..?" ..ఎవరిదీ కాదు...దొంగ నోట్లు మాత్రమే...!" " అమ్మో..! దొంగ నోట్లా.." అన్నాడు పులిరాజు భయంగా. "ఎస్ దొంగ నోట్లే. ఏ పల్లెకెళ్లినా కిరాణా షాపుల్లోకూడా ఈజీగా దొంగనోట్ల దొరికే రోజులివి. సింగినాదం ఓట్ల కోసం దొంగ నోట్లు కుమ్మరిస్తూ ఊరిని భ్రష్టుపట్టిస్తున్నాడని ప్రచారం చేద్దాం. పోలింగ్ రోజు కూడా సింగినాదం మద్దతుదారులకు ముఖ్యంగా ముసలోళ్ళకు దొంగచాటుగా వాళ్ల పార్టీ పేరుతోనే ఊటుగా సారా తాగించి మత్తులో జోగుతూ ఓటేసే ఓపిక కూడా లేకుండా పడిపోయేలా చేద్దాం. ఎన్నికల నియమావళి ప్రకారం ఓటర్లను వాహనాల్లో తరలించకూడదు. కనుక ఆ సింగినాదం ఏం చేయలేడు. ఇక ఆఖరుగా మన తెలుగింటి ఆడపడుచులకు పైసా ఖర్చు లేకుండా డైరెక్టుగా డైలీ సీరియళ్లు చూసి శోక సముద్రంలో మునిగితేలి తరించేలా డిటీహెచ్ కనెక్షన్ ఊరంతా ఉచితంగా కల్పిస్తామని చెపుదాం. దీంతో ఆ సింగినాదం పని ఠా....!" అంటూ చెబుతున్న గోపాలం పులిరాజు కళ్ళకి 'ఆపర శ్రీకృష్ణుడి'లా కనిపించాడు. ఆ తర్వాత బిక్కుబిక్కుమంటూనే గోపాలం చెప్పినవన్నీ మూడో కంటికి తెలియకుండా అమలు చేశాడు. అవి ఫలించి డిపాజిట్ కూడా దక్కకపోవడమే గాక ఏకంగా తన ఓటే 'గల్లంతు' కావడంతో ఘొల్లుమన్నాడు సింగినాదం. భారీ మెజారిటీతో 'హ్యాట్రిక్' సాధించిన పులిరాజు తన పదవీ స్వీకార మహోత్సవాన్ని బహిరంగంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయించాడు. సరిగ్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సమయానికి "బావా..! ఓ..బావా..!" అంటూ స్టేజీపైకి పరుగెత్తుకొచ్చాడుగోపాలం.చివరి క్షణంలో ఏం 'చిచ్చు' దాపురించిందోనని గుండె గుభేల్మంది పులిరాజుకి. "ఇప్పుడే అందిన వార్త బావా..అక్కయ్య గారు కూడా హాస్పిటల్లో "హ్యాట్రిక్" కొట్టారు.ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లల్ని కన్నారు. అదృష్టమంటే నీదే బావా..!"అన్నాడు మెచ్చుకోలుగా. 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చు కున్న పులిరాజు ఆ తర్వాత ఆనందంతో డాన్స్ చేసినంత పని చేసాడు.
"అంతా బాగుంది." అనుకున్నాక సర్పంచ్ హోదాలో పులిరాజు తనకు గండాలన్నీ గడిచి తనతోపాటే భార్య కూడా 'హ్యాట్రిక్' కొట్టినందుకు కొడుకుల నామకరణ మహోత్సవం నాడు బ్రహ్మాండమైన పార్టీ ఏర్పాటు చేసేడు. పార్టీ మాంచి రసపట్టులో ఉండగా "బావోయ్..!బావా..! కొంప మునిగింది బావా...!" అంటూ రొప్పుతూ,రోస్తూ పరిగెత్తుకొచ్చాడు గోపాలం.పులిరాజు మనసేదో కీడు శంకించింది."బావా నీకు ఆల్రెడీ ఓ కూతురుందా..! ఇప్పుడు మళ్లీ ఆక్కయ్యగారు ఏకంగా ముగ్గురితో హ్యాట్రిక్ కొట్టారా..!"అంటూ ఆగాడు ఆయాసంతీర్చుకోడానికన్నట్టు."అవును.అయితే ఏంటట?"ఆడిగేడుఅసహనం తో గుండె చిక్కబట్టుకుని."నీ వంశాంకురాలైన పుత్ర రత్నాలే నీ పాలిట రాజ్యాంగేతర శక్తులుగా మారి నీ పదవికి చిచ్చుపెట్టారు బావా..! జనాభా నియంత్రణకుగాను, 'సవరించిన పంచాయతీరాజ్ చట్ట'ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగిన వాళ్ళు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు, పదవుల్లో కొనసాగేందుకు పనికిరారు. ఒకవేళ ఆల్రెడీ ఒకరుండి తర్వాత 'ట్విన్స్' పుడితే పర్లేదు.కానీ ముగ్గురైతే ఏమిచేయాలో చట్టంలో చెప్పలేదు. ఇలాంటి పరిస్థితిఇంతకు ముందెప్పుడూ రాకపోవడంతో చట్ట సవరణ గురించి ఎవరూ పట్టించుకోలేదు.రాష్ట్రంలో నీదే మొదటికేసు. ఇదే అవకాశంగా ఆ సింగినాదం ఎన్నికల అధికారులకు రిపోర్టు చేసి రూల్స్ ప్రకారం తక్షణ చర్యగా నలుగురు పిల్లలున్న నిన్నుపదవిలోంచి పీకేయించాడు. ఇక కోర్టులు, కేసులు తెమిలి, ప్రభుత్వం చట్టం చేసి తేల్చే సరికి పుణ్యకాలంకాస్తా గడచిపోయినట్టే. ఇదిగో చూడు."అంటూ ఓలెటర్ పులిరాజు చేతిలో పెట్టాడు.అంతే ఉగ్రవాదుల దాడితో నేలకొరిగిన 'అమెరికన్ ట్రేడ్ సెంటర్' లా 'ఆంధ్రా టైగర్'.ఫెళ ఫెళార్భాటాలు చేస్తూ నేలకొరిగాడు.
***
No comments:
Post a Comment