ప్రాణం - అచ్చంగా తెలుగు
 ప్రాణం 
జి. దివ్య కీర్తన 

“తొందరగా తయారవ్వు! పెళ్ళి వారు వచ్చే సమయానికి రెడీ గా ఉండాలి. అమ్మ పిలుపు.
                        అబ్బాయి పేరు వివేక్. మిలటరీ. నాన్నకు దేశభక్తి ఎక్కువ. ఎందుకంటే నాన్న స్నేహితుడు మిలటరీ లో చేసి రిటైర్ అయ్యారు. అక్కడి గురించిన విషయాలు ఎప్పుడూ చెపుతుంటారు. 
"దేశానికి సేవ చేసే అవకాశం అందరికీ రాదు రా... ఈ విషయం లో నేను చాలా అదృష్టవంతుడి ని..." ఈ మాట నా ముందే చాలా సార్లు అన్నారు. 
మా నాన్నకు నన్ను జవాన్ కు ఇచ్చి పెళ్ళి చేయాలని కోరిక. ఉన్నది నేనొక్కదాన్ని. అన్నదమ్ములు లేరు. ఉంటే మిలటరీ లో వేసేవాడు. అందుకే అల్లుడినైనా దేశ సేవ చేసే వారు కావాలని అనుకున్నారు. నాకు ఏమి కావాలో నాకన్నా నాన్నకే బాగా తెలుసు. అందుకే నేను ఏమీ మాట్లాడలేదు.
మా నాన్న స్నేహితుడి ద్వారా పరిచయం అయ్యాడు వివేక్. చాలా మంచివాడు. అమ్మ, నాన్న అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి బార్డర్ లో జవాన్ గా ఉండాలని ఆశ. సాధించాడు. పోయినసారి వచ్చినప్పుడు కలిశారు. నాలుగు నెలల క్రితం. ఇద్దరికీ ఒకరికొకరు బాగా నచ్చేశాము. నిన్ననే వచ్చారు ఊరినుండి. ఈ రోజు అదే సంబరం. ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది.
“ఏంటే! తెమిలావా”... అని మళ్లీ అమ్మ పిలుపు. “ఇదిగో తయారు అయిపోయాను. వచ్చి చూడు" అని అన్నాను. 
“ఎంత బాగా ఉన్నావో చూడు. వాళ్ళు వచ్చారు. ఇంక వెళ్దాము”. అంటూ నన్ను హాలులోకి తీసుకెళ్ళింది.
తలెత్తితే వివేక్ నన్నే తదేకంగా చూస్తూ ఉండటం గమనించాను. వారం రోజులుగా మేము ఫోనులో మాట్లాడుకోలేదు.  వివేక్ మెల్లిగా “ఒకసారి ఆధ్యతో మాట్లాడాలి” అని అన్నాడు.
“అయ్యో! అలాగే వెళ్ళి మాట్లాడుకోండి” అని మేడ పైకి పంపారు.
వెళ్ళిన వెంటనే “ఎన్ని రోజులు అయింది నిన్ను చూసి! ఎలా ఉన్నావు?” అని అడిగాడు.
“ఇప్పటివరకు బెంగగా ఉన్నాను. నిన్ను చూశానుగా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది” అన్నాను. 
“నిన్ను చూస్తే భయంగా ఉంది. నిన్ను పెళ్ళి చేసుకున్న తరువాత నేను మళ్ళీ నా విధులకు వెళ్ళిపోతే నువ్వు ఎలా ఉంటావో అని. నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటూ తప్పు చేస్తున్నావేమో” అన్నాడు.
           “అలా అనకు వివేక్! నేను బాగానే ఉంటాను. నాకు తెలుసు. నేనేమీ తప్పు చేయటం లేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం. ఏవి మనసులో పెట్టుకోకు. మన కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. పద కిందకు వెడదాం.” అని అంటూ తన కళ్ళలోకి చూశాను. ఆనందంగా, హుషారుగా ఉన్న కళ్ళు. అలా ఇంకాస్సేపు మాట్లాడుకున్నాక కిందకు వెళ్ళే సమయంలో ఒక్క సారిగా “ఐ లవ్ యు ఆద్యా.” అన్నాడు ప్రేమగా.  
“ఇక కిందకి వెళ్దాము. లేదంటే వాళ్ళే ఇక్కడికి వచ్చేస్తారు.” అని అన్నాడు నవ్వుతూ...
కిందకి వెళ్ళాము. మా పెళ్ళి ముహూర్తముతో పెద్దవారు రెడీగా ఉన్నారు.
   “అబ్బాయి ఇరవై రోజులు ఉంటాడు కదా! ఇంకో మూడు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్పారు. అదే ఖరారు చేసుకుందాం. ఏమంటారు?” అని వివేక్ నాన్న గారు అన్నారు. 
అందరూ దానికి ‘సరే’ అని పెళ్ళి పనులు ప్రారంభించాలని నిర్ణయం జరిగాక వారు వెళ్లి పోయారు. 
తరువాత  పెద్ద వారు పెళ్ళి పనుల్లో ఉంటే నేను, వివేక్ బయట తిరుగుతూ బిజీగా ఉన్నాము. చాలా విషయాలు చెప్పాడు. బార్డర్ లో పరిస్థితులు ఎలా ఉంటాయో, మన వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉండాలో, తన స్నేహితుల గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి...
ఇలా చూస్తుండగా మా పెళ్ళి రోజు వచ్చింది.
అందరూ హడావిడిగా ఉన్నారు. మా అమ్మ నాతో మాట్లాడుతూ అంది “అల్లుడు చాలా మంచి వాడు. దొరకడం మన అదృష్టం. కానీ బార్డర్ అంటేనే భయంగా వుంది. గర్వంగా కూడా ఉంది. నా అల్లుడు జవాన్ అని గర్వంగా చెప్పుకుంటాను”. 
ఇంతలో వచ్చాడు వివేక్. ”అత్తయ్యా! ఆధ్యతో రెండు నిమిషాలు మాట్లాడాలి. ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలని వచ్చాను” అన్నాడు. “అయ్యో! సరే వివేక్....” అంటూ బయటకి వెళ్లిపోబోయింది. 
“ఉండండి అత్తయ్యా... రా! రా! కృష్ణ.... కలవాలి... కలవాలి అన్నావు గా... తనే నీ చెల్లి ఆధ్య! కృష్ణ అని నా స్నేహితుడు... నీ అన్న... ఇద్దరం ఒకే చోట ఉంటాం. అక్కడే పరిచయం కృష్ణ” అని అన్నాడు. 
“అబ్బ.! పోనీలే ఇలాగైనా దీనికి ఒక అన్న దొరికాడు” అని అమ్మ అంది.
   “రా! రా! మళ్ళీ ఆలస్యం అవుతుంది. వాళ్లు మాట్లాడుకుంటారులే.” అని వాళ్ళ అమ్మ తీసుకుని వెళ్ళిపోయింది. 
" మీ గురించి వివేక్ చాలా చెప్పాడు. నాకు నిజంగా చాలా మంచి చెల్లి దొరికింది. నాకు చెల్లి ఉంటే నీలాగా ఉండేదేమో!" అని కృష్ణ అన్నారు. 
“అంటే మీకు కూడా చెల్లెలు, తమ్ముడు లేరా” అని అన్నాను.
“ నాకు ఎవరూ లేరు. ఉన్న నాన్న కూడా ఉగ్రవాదుల దాడి లో చనిపోయారు. వివేక్, తన కుటుంబాన్ని కలిసేవరకు నాకు ఎవరూ లేరు.... తరువాత వారిలో ఒకరిని అయిపోయాను...నా సెలవులు కుడా వీళ్ళతోనే. వీడి పెళ్ళికి నేను రాకపోతే ఎలా? అందుకే వచ్చేశాను. సరే! నేను వెళ్ళొస్తానండి. మళ్ళీ అమ్మ పాపం వెతుక్కుంటూ వస్తుంది.” అని వెళ్ళిపోయారు. 
ఒక్క సారిగా అమ్మ వైపు  చూశాను. కొంగు తో కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఉంది. అమ్మకు ఇప్పుడు వివేక్, వాళ్ళ అమ్మ నాన్న అంటే అమితమైన గౌరవం వచ్చేసింది. స్నేహితుడిని కొడుకుగా చూసుకుంటున్నారని...
          పెళ్ళి చాలా బాగా జరిగింది. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. చాలా మంచి సంబంధం చేసుకున్నారు. అని అన్నారు. వివేక్, నేను పెళ్ళి పీటల పైన కూడా మాట్లాడుతూనే ఉన్నాము. మాతో కృష్ణ కూడా కలిసిపోయి, వివేక్ ని ఏడిపిస్తూ, నన్ను వెనకేసుకొని మాట్లాడుతూ బాగా సందడిచేశాడు. చాలా బాగా పెళ్ళి జరిగింది. మాతో రెండు రోజులు ఉండి ఫోన్ రావడంతో ప్రయాణానికి సిద్దం అయ్యాడు.“ఈ అన్న నీతో ఎప్పుడూ ఉంటాడు” అని  వెళ్లిపోయాడు... 
ఇరవై రోజులు ఎలా అయిపోయాయో తెలీదు. ఈ రోజే వివేక్ ప్రయాణం. బెంగగా ఉంది. 
“వెళ్ళొస్తా! మళ్ళీ ఆరు నెలల తరువాత వస్తా. అందరినీ వదిలి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంది. కానీ వెళ్ళాలి. జాగ్రత్త ఆధ్య...ఐ లవ్ యు...అందరినీ జాగ్రత్త గా చూస్కో...” 
“జాగ్రత్త వివేక్... ఫోన్ చేస్తూ ఉండు. ఇక్కడ నీ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటాం.”
వివేక్ వెళ్ళిపోయాడు. మళ్ళీ జీవితం మామూలు అయిపోయింది. ఇంట్లో బోర్ అని దగ్గరగా ఉండే స్కూల్ లో టీచర్ గా చేరాను. పిల్లలకు పాఠాలు చెప్పడం బాగావుంది. 
రోజు పొద్దున, రాత్రి రెండుసార్లు వివేక్ ఫోన్ చేసి మాట్లాడుతాడు. అంతా కలిపి ఒక్క పది నిమిషాలు మాట్లాడుతాడు. ఆ ఫోన్ కోసం రోజంతా వెయిట్ చేసేదాన్ని. కృష్ణ అన్నయ్య వారానికి ఒకసారి మాట్లాడే వాడు. న్యూస్ లో బార్డర్ లో ఏదైనా జరిగింది అంటే ఏమి వినవలసి వస్తుందో అన్న భయం. ఆ భయం వివేక్ ఫోన్ తో పొయ్యేది. 
ఐదు నెలలు గడిచిపోయాయి. ఆరోజు వాలెంటైన్స్ డే. స్కూలు కి కూడా వెళ్ళాలని అనిపించక ఇంట్లోనే ఉండిపోయాను. వివేక్ తో మొదటి వాలెంటైన్స్ డే. వివేక్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో కృష్ణ అన్న ఫోన్ చేశాడు. 
“అమ్మ ఎలా ఉన్నావు? ఇంకో వారం రోజుల్లో ఇద్దరం వస్తాము. ఇప్పుడు కాశ్మీర్ లో ఈస్థావరం నుంచి మరో స్థావరం వెళ్తున్నాం. రాత్రి మళ్ళీ ఫోన్ చేయడానికి కుదరదు. అందుకే ఇప్పుడే మాట్లాడేస్తున్నా. ఇప్పుడు బయల్దేరుతున్నాం. అందరూ జాగ్రత్త”  అని చెప్పి ఫోన్ పెట్టాడు.
కొద్ది సేపటికి వివేక్ ఫోన్.  తను కూడా అదే చెప్పాడు. “కాశ్మీర్ లో ఈ స్థావరం నుంచి మరో స్థావరం వెళ్తున్నాం. మా ఇద్దరి ఫోన్ లు కలవకపోతే ఆఫీసు కి ఫోన్ చెయ్యి. మిమ్మల్నిఅందరినీ చూడాలని మేము ఇద్దరం ఎదురు చూస్తున్నాం. ఇంక ఎంత ఒక వారమే కదా...ఇట్టే గడిచిపోతుంది. అందరూ జాగ్రత్త. ఉంటా మరి...మళ్ళీ రాత్రి ఫోన్ చేయలేను. హ్యాపీ వాలెంటైన్స్ డే... బై.. మిస్ యు.. ఐ లవ్ యు...” అని పెట్టేసాడు. 
అబ్బ! ఇంకో వారం లో ఇద్దరిని చూడవచ్చు. సరదాగా గడపవచ్చు అని అనుకుంటూ నా పనులు చేసుకుంటూ ఉండిపోయాను. పనులన్నీ అయిపోయాక సరదాగా న్యూస్ పెట్టాను. పుల్వామ లో ఆత్మాహుతి దాడి. నలబై మంది మృతి. వార్త చూడగానే ఇద్దరికీ ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ వచ్చింది. అందరూ ఇంటికి వచ్చారు. అందరూ ప్రయత్నిస్తున్నారు. నేను ఆఫీసు కి ఫోన్ చేశాను. వాళ్ళు చెప్పిన వార్త విని ఒక్కసారిగా గుండె పగిలి పోయింది. దాడి లో ఇద్దరూ మాకు దూరం గా వెళ్ళిపోయారు.  
       పెళ్ళి తర్వాత మళ్ళీ బందువులు వివేక్ ని చూడటానికి మళ్ళీ వస్తున్నారు. అందరూ వచ్చి వెళ్తున్నారు. కృష్ణ, వివేక్ ఇద్దరూ వస్తున్నారు. కానీ ప్రాణాలతో కాదు...అవి దేశానికి ఇచ్చేశారు. మాకు వాళ్ళ జ్ఞాపకాలను మాత్రం ఇచ్చారు. 
     పెద్ద ఎత్తున నినాదాలు, పెద్ద ఎత్తున జనాలు. వ్యాన్ లో ఇద్దరూ దిగి ఒంటి మీద త్రివర్ణ పతాకం వేసుకొని హుందా గా వస్తున్నారు...ఎనిమిది మంది ఇద్దరినీ తీసుకు వస్తున్నారు. జీవితం మొత్తం చీకటి అయిపోయింది. ఒక పక్క అన్న...ఇంకో పక్క వివేక్. వారం రోజుల్లో వస్తాము అన్నారు. ఇంత తొందరగా వస్తారు అనుకోలేదు. రాత్రి ఫోన్ చేయలేమని చెప్పారు. కానీ అదే ఆఖరు మాటలు అనుకోలేదు... గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
కబోర్డ్ లో వేళ్ళాడుతున్న వివేక్ మిలట్రీ డ్రెస్ ను తీసి గుండెలకు హత్తుకుంది ఆద్య. ఎంత ఇష్టంగా వేసుకునేవాడు ఈ డ్రెస్... అనుకుంటూ అతని చొక్కా వేసుకుని, అద్దంలో చూసుకుంటూ ఆలోచనలో పడింది. వివేక్ దేశం కోసమే బ్రతికాడు, దేశంకోసమే ఆనందంగా ప్రాణాలు అర్పించాడు. అతను అంతగా ఇష్టపడే యూనిఫారం తనూ ధరించాలి. తనూ ఆర్మీలో చేరి ఇదే దుస్తులు వేసుకుని, దేశానికి సేవ చెయ్యాలి... అని ధృడంగా తీర్మానించుకుంది. అప్రయత్నంగా 'జై హింద్ !' అంటూ సలాం చేసి, తన కర్తవ్యం దిశగా ముందుకు సాగింది.

***

No comments:

Post a Comment

Pages