సుబ్బుమామయ్య కబుర్లు!
భద్రత
పిల్లలూ ఎలా ఉన్నారర్రా!
మీకు భద్రత (సేఫ్టీ) మంటే తెలుసా?
మనం కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు మనకు ప్రమాదం జరిగి గాయాలవ్వొచ్చు. ఒక్కోసారి అంగవైకల్యం కలగవచ్చు. ప్రాణాలూ పోవచ్చు.
అందుచేత మనం ఏ పని చేసినా సావధానంగా, శ్రద్ధగా చేయలి. ముఖ్యంగా పనిముట్ల(టూల్స్) తో చేసేటప్పుడు జాగ్రత్తగా పని చేయలి. ఏ పని చేసినా ఆలోచించి ఎలా చేయాలో తెలుసుకుని చేయాలి.
మనం రోడ్డెక్కినప్పుడూ ఎడం వైపున ఎందుకు వెళతాం. ఎందుకంటే ప్రమాదం జరగకుండా! ఇది సేఫ్టీనే తెలుసా?
మనం కరెంట్ వస్తువుల జోలికి అసలు పోరాదు. ఒక్కోసారి కొన్ని మెటల్ వస్తువుల ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది. అప్పుడు మనకు షాక్ కలుగుతుంది. చక్కగా రబ్బరు చెప్పులు వేసుకుని టీ వీ, ఫ్రిజ్, కంప్యూటర్ లాంటి ఎలెక్ట్రికల్ వస్తువులను ముట్టుకోవాలి. మరీ ముఖ్యంగా వానాకాలంలో. షాక్ కొట్టకుండా ఈ మధ్య ఎలెక్ట్రికల్ వస్తువుల బాడీలు ఫైబర్ తో చేస్తున్నారు. అది ఇన్సులేటర్ అందుచేత కరెంట్ దాని ద్వారా ప్రవహించదు..షాక్ కొట్టదు.
పెన్సిల్ చెక్కుకోడానికి బ్లేడ్లు ఉపయోగించకూడదు. షార్ప్నర్స్ ఉపయోగించాలి. అవి ఎంతో సురక్షితం.
మనది పారిశ్రామిక దేశం. ఎన్నెన్నో పరిశ్రమల్లో నిత్యం ఎన్నో వస్తువుల ఉత్పత్తి (ప్రొడక్టివిటీ) జరుగుతుంది. ఆయా పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగుల్లో సేఫ్టీ అవేర్ నెస్ (భద్రతా అవగాహన) పెంచడానికి భద్రతా వారోత్సవాలు జరుపుతారు. ఆ వారం రోజులూ ఉద్యోగులకు పనిచేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు (సేఫ్టీ ప్రికాషన్స్) తీసుకోవాలో చెబుతారు.
షాక్ కొట్టినప్పుడు గాని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గాని ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలో వివరించే విషయాలు తెలుసుకోవాలి.
అసలు ప్రమాదాలను నివారించే విషయాలపై సరైన అవగాహన పెంచుకోవాలర్రా!
ఇప్పుడు మీకు అర్థమైందా? ప్రమాద నివారణ అంటే ఏమిటో. ప్రమాదం జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో. ఇది చాలా ముఖ్యమర్రా!
ఉంటాను మరి.
మీ సుబ్బు మామయ్య!
No comments:
Post a Comment