దుర్గ-భర్గ శతకము - కపిలవాయి లింగమూర్తి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవి పరిచయం:
కపిలవాయి లింగమూర్తి గారు అచ్చంపేట తాలుకా, బల్మూర్ మండలం, జినుకుంటలో మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకు మార్చి 31, 1928కు సరియైన ప్రభవ నామ సంవత్సరం మాఘ శుద్ధ నవమి నాడు జన్మించారు. ఆయనకు రెండున్నరేళ్ళ వయసులో తండ్రి మృతి చెందడంతో మేనమామ పెద లక్ష్మయ్య దగ్గర పెరిగాడు. పాఠశాల విద్యను ఉర్దూ మాధ్యమంలో పూర్తి చేశాడు. ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు రాసి తెలుగులో విశారద ప్రమాణ పత్రాన్ని సంపాదించాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొంది 1954లో నాగర్‌కర్నూల్ జాతీయోద్యమ పాఠశాలలో తెలుగు పండితునిగా చేరాడు. ఆ తర్వాత 1972 లో పాలెం శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరి దశాబ్దం పాటు సేవలందించి 1983లో ఉద్యోగవిరమణ పొందాడు. లింగమూర్తి నడిచే విజ్ఞానసర్వస్వంగా పేరుపొందాడు.[3] పలుగ్రంథాలు, పరిశోధనలు రచించి సాహితీవేత్తగా పేరుపొందాడు. కపిలవాయికి తెలుగు విశ్వవిద్యాలయం 26.8.2014 న గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 30.08.2014 రోజున విశ్వవిద్యాలయం 13 స్నాతకోత్సవంలో చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వీరికి గౌరవ డాక్టరేట్‌ను అందించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీ నుంచి తొలి గౌరవ డాక్టరేట్ పొందిన వ్యక్తిగా కపిలవాయికి ఈ ఘనత దక్కింది. 1954 నుంచి 1983లో పదవీ విరమణ పొందే వరకు నాగర్‌కర్నూల్ లోని జాతీయోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి, అక్కడే స్థిరపడ్డారు. అనేక స్థలచరిత్రలు, దేవాలయాల కథలకు ఆయన ప్రాణంపోశారు. మొత్తం 70 రచనలు ముద్రితమయ్యాయి. 11 రచనలు ద్విముద్రితాలు, 25 రచనలు ముద్రించాల్సి ఉంది.
వీరి రచనలు అనేకం అందులో కొన్ని 1. ఆర్యా శతకం, 2.ఉప్పునూతల కథ, 3.క్షేపాల గంగోత్రి - తూము వంశ రెడ్ల చరిత్ర, 4. చక్రతీర్థ మాహాత్మ్యం - అయిదాశ్వాసాలు గల స్థల చారిత్రక కావ్యం, 5. తిరుమలేశ శతకం, 6. దుర్గా భర్గ శతకాలు, 7. పండరినాథ విఠల శతకం - ఏకప్రాస ఔత్సలాలు, 8. పరమహంస శతకం, 9. పాలమూరు జిల్లా దేవాలయాలు, 10. భాగవత కథాతత్త్వం, 12. మహాక్షేత్రం మామిళ్ళపల్లి - స్థల చరిత్ర, 13. శ్రీ భైరవకోన క్షేత్ర మాహాత్మ్యం, 14. శ్రీమత్ప్రతాపగిరి ఖండం 15. జినుకుంట రామబంటు శతకం 16. గద్వాల హనుమద్వచనాలు 17. సౌధ శిఖరం, 18. ఇందేశ్వర చరిత్ర, 19. సోమేశ్వర మహాత్యం, 20. స్మృతిపథం, 21. పద్య కథా పరిమళము, 22. పామర సంస్కృతం, 23. మాంగళ్య శాస్త్రం 24. శ్రీ రుద్రాధ్యాయము మొదలైనవి.
కపిలవాయి లింగమూర్తికి సాహిత్య రంగంలో చేసిన విశేషకృషికి గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో అనేక సందర్భాలలో సన్మానాలు జరిగాయి. 1983లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వీరిని సన్మానించారు. తరువాత నారా చంద్రబాబు నాయుడు, వై.యస్. రాజశేఖరరెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నకాలంలోనూ వారిచే సన్మానాలు పొందారు. తెలంగాణ రాష్ట్ర సమితి దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వీరిని సన్మానించారు. నలుగురు ముఖ్యంత్రులచే సన్మానింపబడిన ఏకైక తెలుగు కవి, పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి. ఇంకా తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభాపురస్కారం, బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం, బ్రౌన్ సాహిత్య పురస్కారం, నోరి నరసింహశాస్త్రి పురస్కారం, కందుకూరి రుద్రకవి పురస్కారం, పులికంటి సాహితీ పురస్కారం, బి.ఎన్.శాస్త్రి స్మారక పురస్కారం మొదలైన ఎన్నో సత్కారాలను పొందాడు.
ఇంతేకాక వీరు సాహిత్య రంగానికి చేసిన సేవలకు గురింపుగా అనేక బిరుదులను పొందారు.
1992లో కవితా కళానిధి, పరిశోధనా పంచానన
1996లో కవికేసరి
2005లో వేదాంత విశారద
2010లో గురు శిరోమణి
2012లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి, సాహితీ విరాణ్మూర్తి
వీరిపై వెన్నెల సాహిత్య అకాడమీ వారు తీసిన డాక్యుమెంటరీ అత్యుత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ చిత్రంగా 2011 సం. లో గుర్తించబడింది.
సాహిత్య రంగానికి ఎంతో వన్నెతెచ్చిన ఈ కవి నవంబర్ 6, 2018లో కన్ను మూసినారు.
(సేకరణ వికీపీడియా నుండి)
శతక పరిచయం:
దుర్గ-భర్గ శతకములు లక్షణ శాస్త్రానికి సంబందించిన పద్యాలతో నిండిన శతకములు. దుర్గ-భర్గ శతకమును రెండు శతకములుగా చూడవచ్చును. మొదటిభాగంలో మకుటం దుర్గా అని రెందవభాగంలో మకుటం భర్గా అని ఉన్నది. ఈరెండు శతకాలు అలంకార యతి శతకాలుగా కవి పేర్కొన్నాడు. దుర్గ శతకంలో అమ్మవారి సౌందర్యలీలలను, భర్గశతకంలో శివుని మహిమలీలలను వర్ణించారు. దుర్గాశతకంలో ఉమాదేవి స్తుతికి 109 ఆటవెలదులతో, భర్గ శతకం లో 111 తేటగీతులతో రచన సాగించారు. దుర్గా శతకంలో 109 అలంకారములలో దుర్గ అంగవర్ణన (40 పద్యాలలో) అష్టాదశ శక్తిపీఠ వివరము (18 పద్యాలలో), అవతార కథనము (9 పద్యాలలో), దుర్గాతత్వము (19 పద్యాలలో), అభ్యర్థనము (23 పద్యాలలో) చేసినారు. 109 పద్యాలను అలంకారయుతంగా- ఒక్కొక్క అలంకారానికి లక్ష్య లక్షణములుగా వ్రాసినారు. అలంకారములు అలంకారములే అనే లాక్షణిక సిద్ధాంతానికి ఈశతకం సార్థకత కలిపించింది.
రెంశ్డవ శతకము శబ్ధప్రధానము. దుర్గ అలంకారయుతయైనట్లే భర్గుడు శబ్ధ ప్రధనుడు కదా. చందస్సు అక్షర ప్రధానమైనది. అందుచేత చంధస్సును భర్గ శతకంగా చెప్పటం చాలా సమంజసంగా ఉన్నది. ఈశతకంలో యతి విదమరిచి వివరించినారు. స్వరప్రధానవడి అని రెండు, ఉద్విరామము,ఉవళి,ఋవళి, ఋత్వ సంబంధయతులు అన్నిటికి 7 పద్యములు, అత్వవళి,అత్స్యమ్యవళి, ఌ, ఌత్వ సంబంఢ వళులు లకు 5 పద్యాలు, ప్రాని విరామమునకు 3 పద్యాలు, క,చ,ట,త, ప, స వర్గ యతులు నాసిక సవర్ణాసిక యతులు, లుప్తవిసర్గక-గూఢ యతులను వేరు వేరుగా చెప్పినారు.
దుర్గ శతకము నుండి కొన్ని పద్యములను చూద్దాము
ఆతసి కుసుమకాంతి నపరాజితా సుమ
చ్ఛవిని బొలుచు నీవు శివుని గూడి
గంగతోడ నున్న కాళింది వలె నొప్పి
తివి మనోహరముగ నవని దుర్గ (ఉపమ అలంకారము)
నేత్ర పద్మములను నీపదార్చన సల్పు
వారి నుదుటి వ్రాఁత వక్రగతుల
తన్నఖాగ్రపాళి తిన్నగా సవరించి
శుభము లిచ్చుచుండు చూడ దుర్గ (రూపకము)
పంచ భూతములను ప్రత్యక్ష రూపంబు
గగనమునకు లేదు గాన నీకు
ఘన కుచాద్రులకు జఘన పులినమునకు
నడుమ గలదొ లేదో నడుము దుర్గ (సందేహము)
హరుని జూచి నీవు నహిభూషణమ్మును
దాల్చినావ నా నుదరము పైన
నారు నొప్పుచుండు నల్లనై కాలాహి
నాఁ బ్రశస్త లక్షణమున దుర్గ (ఉత్ప్రేక్ష)
జనని నీ యుదరమునను గల వళుల సుం
దరము వేరె వాని తరహ వేరె
వానిఁ బోలనెంచి వాహినులందలి
యలలు భంగమగుచు వెలసె దుర్గ (అతిశయోక్తి)
భువనమందు పద్మములె కోమలంబులు
వనములందు పల్లవములె మృదువు
అవనియందు నీదు హస్తంబులే సుకు
మారమగును ప్రమదమార దుర్గ (దృష్టాంతము)
నెగడి గంధఫలిగ నేత్రాళి కడలకు
నొదుగ కనకవర్ణ మొదవి నీదు
నాస ముద్దులొలుకు ననరాజమై మొగం
బునకు ముక్కె యందమనగ దుర్గ (శ్లేష)
లంకయందు నీవు శాంకరి యను పేర
వెలసితీవు భక్త సులభ అయిఉన
లంక యిమిదినట్టి లవణాబ్ధియందు నీ
యశము నిముడ జాలదయ్యె దుర్గ (అధికము)
జనని! గయను నీవు సర్వమంగళయనఁ
దనరి భక్తతిని దనుపు వేళ
నన్య దేవతాళి యరుదెంచి నినుజూచు
మొగమువాంచు నలుగు మొఱగు దుర్గ (కారకదీపిక)
చండులైన చంద ముండుల జాముండి
రూపమెత్తి రూపు మాపినావు
కన సపర్ణవీవు కాత్యాయనీ! నీదు
మార్గ మెవ్వ డెఱుఁగు మహిని దుర్గ (అర్థంతరన్యాసము)
ఈవిధంగా అమ్మవారిని ఒక్కొక్క అలంకారంలో 109 పద్యాలలో దుర్గ శతకంలో అభివర్ణించారు. ఇప్పుడు శబ్ధప్రధానమైన భర్గ శతకంలోని కొన్ని పద్యాలను చూద్దాము.
అమృతతత్వంబు నీయది ఆదిపురుష
ఆత్మరూపంబు నీయది ఐంద్రవినుత
ఐంద్రజాలికుడవు నీవు ఔకలాపా
ఔపనిషదర్థమవు నీవు అభవ భర్గ (అ స్వరవళులు)
ఋతిగస్వాధిష్ట చక్రంబు యోగమాయ
ఋజువు గనకుండ గప్పె ప్రాయిని యనంగ
ఋషభ! మువన్నె పటమున హీనగతిని
బుద్ధిగా నీదుకటి జిల్కు హొయలు భర్గ (ఋత్వసంబంధ వళి)
లిబ్బికోసము దివురుచు ౡజహర
లెస్సకోసము దివురుచు ఌధరమధన
ౡస్వభావంబు దాల్చి నళీకవృత్తి
ఌస్థిత నిన్ను గనండూ కూళుండు భర్గ (ఌవడి)
ౡజ మస్తనికృంతనా క్రోధపడక
ఌధ్వజుని గాచినట్లు నా క్రోధముడుపు
ౡశిఖాయుధ సంసార క్రూరముడుప
ఌయశ యింకెవ్వడగు దయా క్లిన్న భర్గ (ఌవడి)
కంతు కడగంత గాల్పడే కాయితముగ
కాలఫణినైన దాల్పడే కైవసముగ
కైపు విసమైన నిల్పడే గౌరవముగ
కౌశికీపతి నినుమది గనునె భర్గ (ప్రాణివిరామము)
కన్ను గానక నశివ మఖంబు సల్పు
ఖలుల మన్నింపరాదు లోకాననంచు
గణనసేయక దక్షుని ఘనతలెల్ల
ఘస్మ మొనరించి వైతివి కృకర భర్గ (కవర్గజ యతి)
జ్ఞాయినన్ విషయేచ్ఛ సంకాశరూప
జ్ఞయినన్ గర్వ కలన పంచాశ్య యా గు
ణములు నీదయ లేక గెంటంగ వశమె
నన్ను దయ గనవయ్య సంతతము భర్గ (బిందు యతి)
క్ష్మాధరంబున వసియించి గణుతికెక్కి
క్ష్మారథుడవయి త్రిపురముల్ మసియొనర్చి
క్ష్మమనోహరునకు పోటి సాటి వగుచు
క్ష్మాతలిని గాచితివి శుభచరిత! భర్గ (సంయుక్త వళి)
అరుగుదెంచియు నల్ప నాపోశనంబు
చూవె బోయకు జిక్కు పృషోదరంబు
అటుల నిరయంబు జేరెడు ద్వారములకు
నరుడు జిక్కును తృష్ణకై యరిగి భర్గ (పృషోదరాది గణయతి)
అభవ! కన్నులప్పగింప కన్నప్పగాను
తనువు నర్పింపగా నమిత్తాండి గాను
అరయ నీ గణమందు దేవరనుగాను
రక్షమా పాహి పాహి మల్లయ్య భర్గ (నామాఖండ వళి)
పాఁడిగా నిన్ను గనలేని నాఁడు నెవ్వఁడు
తోఁడు నీడగు సుమ్మి యానాఁడు కీడు (అర్థబిందు ప్రాస)
దండధరు దూతలేతెంచి గుండె లదరు
చుండగా ప్రాణములు దీయుచుండ భర్గ (పూర్ణబిందు ప్రాస)
ఈవిధంగా యతిప్రాసల ఉదాహరణములను భర్గ శతకంలో మనకు విశిదపరిచారు. సమాన్యులకే కాక తెలుగు సాహిత్యాభిమానులకు, విద్యార్థులకు కూడా ఈశతకం ఎంతో ఉపయోగకరం. మీరూ చదవండి మీ మిత్రులచే చదివించండి.
No comments:
Post a Comment