నేను గుంటూరోడిని
రావి కిరణ్ కుమార్
అవును నేను గుంటూరోడిని. చెప్పుకోవటానికి చాలా గర్వంగా అనిపిస్తుంది. మన జన్మస్థలం పై మమకారం సహజమే అయినప్పటికీ అంతకు మించిన బంధమేదో ఆ నేలతో నా మనసుకు ముడిపడిపోయింది.
ఏమైయివుంటుంది?
దేశం విడచిపొమ్మని ఇంట్లో కోరినా గుంటూరు దాటనన్నాను. కారణం ఏమంటే నాకు తెలియదు అప్పటికి.
కొందరి ఉద్దేశం ఎవరి ప్రేమలోనో పడి వుంటాడు. అందుకే పోనంటున్నాడు అని . నిజమా? నాకే ఆశ్చర్యం.
శ్రీ కాంతునకు తప్ప ఏ కాంతకు చోటివ్వని ఏకాంత హృదయంతో ఆనందపు లోకాలలో విహరించాలని నా ఆరాటం.
సరే ఎవరి ఊహలు వారివి. నవ్వి వూరుకోవటమే తప్ప ఖండన మండనలు చేయటానికి రాజకీయులం కాదుకదా .
కానీ కాలానికి మన నిర్ణయాలతో పని ఏమి . ఇవ్వవలసిన సమయం వచ్చినపుడు తానూ ఇవ్వతలచినదే ఇస్తుంది . తరచి చూస్తే దానికి మనం అంతకు ముందు చేసిన కర్మలే కారణాలు గా కనబడతాయి తప్ప అకారణంగా కాలం ఏది మనకివ్వదు .
హైదరాబాదు రమ్మంటే అది అభాగ్యనగరం, నే రాను అనేవాడిని. కానీ అదే నా పాలి భాగ్యనగరమై నా జీవన యానం సాగటానికి కారణభూతమై నిలచింది. భాగ్య నగరి చేరాక ముందుగా ఇల్లాలు, తరువాత ఇల్లు వచ్చి చేరాయి.
కాలం కదిలిపోతోంది, రాక పోకలు బాగా తగ్గిపోయాయి కానీ గుంటూరు మీద మమకారం తగ్గలేదు . ఈ మమకారానికి కారణం ఏమయ్యివుంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అలానే వుండిపోయింది.
ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో విన్న కొండవీడు రాజుల కథ. మళ్లి ఇంతకాలం తరువాత చెవిన పడింది. అక్కడికి సమీపంలోని చెంఘీజ్ ఖాన్ పేటలో కొలువైన వెన్నముద్ద గోపాల స్వామీ గుడి చరిత్ర చూచి రావాలని పనిగట్టుకు మరీ పయనమైతి.
ఆహా ఏమా సుందర రూపం . కుడి చేత వెన్నముద్ద పట్టి , ఎడమచేతిని నేలకు అదిమి పెట్టి, ఎడమ కాలు మడచి ముందుకు పారాడ సిద్ధంగావున్న బాలకృష్ణుని మనోహర రూపం.
" చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ..." ఎపుడో మరచిపోయిన పద్యం మళ్ళి గుర్తుకు వచ్చింది.
అప్పుడు అనిపించింది,
'గుంటూరు రోడ్లపై తిరుగాడే రోజుల్లో, ఎగసి పడిన ఎఱ్ఱని ధూళి కణాలు మోమున కమ్ముచున్నా కొంచెం కూడా చిరాకు అనిపించేది కాదు. ఎందుకంటే ఈ బాల కృష్ణడు ఈ దారుల వెంట పారాడుతూ అక్కడికి చేరినాడనుకుంటా. అందుకే ఇక్కడ ఎగిరే ధూళి చూస్తుంటే గోకులంలో సాయం సమయాన లేగలను గోవుల వద్దకు తోలుకొస్తున్నపుడు చెంగు చెంగున ఎగురుతూ పరుగులు తీస్తున్న లేగల పద ఘట్టనల తాకిడికి ఎగసిన ఎర్రని ధూళి మేఘంతో కప్పబడిన బాలకృష్ణుడే స్ఫురించేవాడు. బహుశా అందుకేనేమో ఈ మట్టి అంటే అంత యిష్టం .'
కృష్ణుడు సరే ,విశ్వమంతా తానైన వాడు. ఆయన జాడలు వుండటం ఆశ్చర్యమేమీలేదు. కానీ, అఖండ భారతావని అంత తన పాదపద్మాలతో పునీతం చేసిన శ్రీరాముడి జాడలేమైనా ఇక్కడ వున్నాయా అని తెలుసుకోవాలనిపించింది .
అలా అనుకోగానే తెలిసివచ్చిన ఇద్దరు మహనీయులు తన హృదయంలో రాముడిని దర్శింప చేసిన రంగన్న బాబు గారు, రాముడి సాక్షాత్కారం పొందిన అమ్మ కనకమ్మ గారు . నా దురదృష్టం ఏమంటే అమ్మ కనకమ్మ గారి గురించి తెలుసుకుని వారిని దర్శించాలని అనుకున్న రెండు రోజులకే వారు రామునిలో ఐక్యం అయ్యారు. ( ఏ టి అగ్రహారం లోని భారతాశ్రమం లో వీరి ప్రతిమను దర్శించవచ్చు ).
ఈలోపు గోరంట్లలో నివసించిన చందోలు శాస్త్రి గారి ఘనకీర్తి వింటి . వీరు అమ్మ లలితాదేవిని సాక్షాత్కరింపచేసుకున్న మహనీయులు.
ప్రస్తుతంలో ప్రస్తుత కుర్తాళ పీఠాధిపతి గా వ్యవహరిస్తున్న సిద్దేశ్వరానంద భారతీ స్వామివారు, వీరు పూర్వాశ్రమంలో హిందూ కళాశాల అధిపతిగా పనిచేసిన ప్రసాదరాయ కులపతి గారు. సిద్దేశ్వరి దేవిని సాక్షాత్కరింప చేసుకున్న మహా మంత్రవేత్త. ఇలా ఎందరో మహనీయులు . నాకు తెలియని వారు ఇంకెందరో.
అట్టి మహనీయుల నిశ్వాసం గుంటూరు గాలిలో పరిమళాలు నింపితే, అది నా ఉఛ్వ్వాశమై నాలో ప్రాణవాయువుగా చరిస్తూ, నా మనసులో గుంటూరు పట్ల తెగని మమకారం ఏర్పడటానికి కారణమయ్యింది.
గుంటూరు గోవిందుడు గణపతి అన్ని గకారాలే!
అవును నేను గుంటూరోడిని. అది నాకు గర్వకారణం.
No comments:
Post a Comment