పుష్యమిత్ర - 40
- టేకుమళ్ళ వెంకటప్పయ్య
జరిగిన కధ: పుష్యమిత్రుడు తన కాలంలో దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు. ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు. ఇండియన్ గ్లోబల్ ఐ విషయం పాకిస్తాన్ వాళ్ళకు తెలిసిపోయిందన్న విషయం ప్రభుత్వం గమనిస్తుంది. పాకిస్తాన్‌లోని ఉప్పుగనులకు టెండర్ వేసిన సుకేశ్ సుభానికి టెండర్ వచ్చిందని ఫోన్‌లొ మన ప్రధానికి పాక్ ప్రెసిడెంట్ శుభవార్త చెప్తాడు. పంచాపకేశన్‌ను అనుచరుడు వెంకటేశన్ ప్రభుత్వానికి లొంగిపోయి సాక్ష్యాధారాల్తో సహా పట్టించగా ఆర్ధికమంత్రి జైలుపాలవుతాడు. ఇండియన్ గ్లోబల్ఐ రహస్య విషయం అక్కడపనిచేసే అసాఫాలి ద్వారా ఎక్కువ విషయాలు రాబట్టాలని అతణ్ణి పాకిస్తాన్ కు తీసుకెళ్ళే పధకంలో ఇండియన్ అర్మీకి దొరికిపోతాడు. బాబాజీ ప్రత్యక్షమై త్వరలో పుష్యమిత్రుని అవతారం పరిసమాప్తి కాబోతున్నదని చెప్తాడు. నాగబంధం విప్పే విధానం సవిస్తరంగా తెలియజేస్తాడు. పుష్యమిత్రుడు అనుకున్న విధంగా నాగబంధం విప్పి పది లక్షల టన్నుల బంగారం మిగతా నవరత్నాలు రిజర్వు బ్యాంకుకు చేరుస్తాడు. (ఇక చదవండి)
గ్లోబల్-ఐ దిగువన ఉన్న గ్రవుండ్ కంట్రోల్ గదిని సైనికులు కట్టుదిట్టంగా కావలి కాస్తున్నారు. ప్రధాని ఆదేశాల మేరకు ఒక వినూత్న "సేవ్-ఐ.జి" ఆపరేషన్ చేపట్టారు. గ్లోబల్-ఐ కి కిలోమీటర్ దూరంలో పాకిస్తాన్ బార్డర్‌ను ఆనుకుని ఉన్న హిమాలయాలను ఒక కిలో మీటర్ లోతు వరకూ లోనకు క్రుంగి పోయే విధంగా క్షిపణులను ప్రయోగించాలని నిర్ణయం జరిగింది. అలా జరిగితే పాక్ మన భూభాగం చేరాలంటే ఆ లోయ పూడిన తర్వాత మాత్రమే కుదురుతుంది. దానికి రెండు మూడు సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అలాగే గ్లోబల్ ఐ ఉన్న పర్వతం మీద ఎదురుగా ఒక కిలో మీటర్ దూరంలో ఏ విమానం కానీ హెలికాప్టర్ కానీ వచ్చినట్లైతే ఆటోమాటిక్‌గా క్షిపణులు దూసుకుపోయే విధంగా అమర్చారు. హిమాలయాలు క్రుంగి పోయే ప్రాజెక్టు, సహజ సిద్ధంగా జరిగినట్టు ఏదో మంచు తుఫాను వల్ల వచ్చినట్టుగా ఉండాలని, రాత్రి 2- 3 గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరగాలని ప్లాన్ చేశారు.
* * *
రిజర్వు బ్యాంక్ స్టాఫ్‌కు చేతినిండా పని దొరికింది. ఆ బంగారాన్నంతా మదింపు చేసి ఎంత విలువ గల కరెన్సీ ప్రింట్ చెయ్యాలో నిర్ణయించుకునే సరికి ఒక నెలరోజులు పట్టింది. వరల్డ్ బ్యాంక్‌కు అప్పు బంగారం రూపంలో తీరుస్తామని తాకీదు పంపారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్న అత్యంత అధునాతన ఆయుధాల కొనుగోలుకు రంగం సిద్ధం అయింది. వివిధ దేశాలకు బాకీ ఉన్న మారకపు ఎక్చేంజి (బ్యాలన్స్ ఆఫ్ ట్రేడ్) కూడా వెంటనే తీర్చి వెయ్యాలని నిర్ణయం జరిగింది. భారతదేశంలో అన్ని గ్రామాలకు రోడ్లు, విద్యుత్తు, నీటివసతి యుద్ధ ప్రాతిపదికన జరిగిపోవాలని నిర్ణయించారు. అన్ని దేశాల వారు భారత్ పురోగతి చూసి ముక్కున వేలేసుకున్నారు. క్రొత్త క్రొత్త ఎయిర్‌పోర్ట్‌లు నిర్మాణానికి పునాదులు వేశారు.
* * *
భారత్ కు ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యత్వం
యూ.ఎన్.ఐ - బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికా సం.రాష్ట్రాలతో సహా నేడు ఇండియాకు శాశ్వత సభ్యత్వం లభించడంతో ఈ సంఖ్య ఆరుకు చేరింది. చైనా మన దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వరాదని ఎంత వాదించినప్పటికీ 192 దేశాల్లో 191 దేశాలు మనకు మద్దతు పలకడంతో ఇవ్వక తప్పలేదు. ఒక దశలో భారత్‌కు సభ్యత్వం ఇచ్చే పక్షంలో తాము ఈ శాశ్వత సభ్యత్వం నుండి తప్పుకొంటామని బెదిరించినా ఎవ్వరూ ఖాతరు చెయ్యలేదు. ఇండియా ప్రధాని అదే సమయంలో లేచి అప్పటి ప్రధాని జవహర్‌లాల్ మీకు బిక్షగా వేసిన శాశ్వత సభ్యత్వం విషయం మరచిపోయి ప్రవర్తించరాదనగా అన్ని దేశాలు బల్లలు చరిచి హర్షామోదాలు తెలియజేయగా, చైనా ఏమీ చేయలేని పరిస్థితులలో ఒప్పుకోవడం జరిగింది. ప్రపంచంలోనే ఒకటవ స్థానంలో నిలబడిన ఇండియాకు అందరూ చప్పట్లతో ఐదునిముషాలు ఆగకుండా హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని కృతజ్ఞతలు తెలియ జేస్తూ ఇండియా అందరికీ ఆదర్శంగా ఉంటుందని, శాంతి కాముక దేశమని, ఏ దేశమైనా పొగరుగా కాలుదువ్వితే మాత్రం ఆ దేశానికి గ్లోబ్ లో కానీ ప్రపంచ పటంలో స్థానం ఉండదని తెలియజేశారు. మేము స్వాతంత్ర్యమైనా, శాశ్వత సభ్యత్వమైనా పోరాడి గెలుచుకున్నామని పోరాట పటిమ, స్ఫూర్తి భారత్ ప్రజల్లో ఉంటుందన్న విషయం గుర్తుచేస్తూ ప్రసంగం ముగించారు.
* * *
ప్రధాని నేరుగా ఫ్లైట్ దిగి పుష్యమిత్రుడిని కలిశాడు. త్వరలో "సేవ్-ఐ.జి" కి సుముహుర్తం నిర్ణయించమని కోరాడు. వెంటనే తన అవతార సమాప్తి అయిపోతున్నదని బాబాజీ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి చిరునవ్వు నవ్వాడు. ప్రధాని ఐక్యరాజ్య సమితి విషయాలు, భారత్ ప్రపంచంలో నంబర్ వన్‌గా ఎదిగిన విషయం చెప్పగా పుష్యమిత్రుడు చాలా సంతోషించాడు. మన ధర్మాన్ని విడిచి పెట్టి పరధర్మాన్ని మనం ఎప్పుడు ఆచరిస్తామో అప్పుడే మన సంస్కృతి మట్టిలో కలిసిపోతుందని పుష్యమిత్రుడు మరో సారి వివరించాడు. మన దేశంలో ఆయుర్వేదం వంటి పురాతన విద్యలను పైకి తీసుకుని రావాలని చెప్పాడు. పుష్య శుద్ధ పౌర్ణమి నాడు కార్యక్రమం అమలు చేయాలని తాను కూడా ఆ సమయంలో అక్కడకు వస్తానని పుష్యమిత్రుడు తెలియజేశాడు.
* * *
సమయం 6 గంటలు దాటింది. పుష్యమిత్రుడు సంధ్యావందనం ముగించి గదిలో ప్రాణాయామం లో ఉన్నాడు. ఓ తెల్లని వెలుగు క్రమంగా గదినాక్రమించింది.
"నాయనా పుష్యమిత్రా! నేను నిన్నటి రోజున పరమేశ్వరుని దర్శనం అయింది. ఆయన మౌనంగా ఉండి పంపిన సందేశం నిన్ను మళ్ళీ కాలనాళికలో హిమాలయాలకు చేర్చమని ఆదేశించారు. పుష్య శుద్ధ పౌర్ణమి నాడు బహుశ: ఆ కార్యం జరుగవచ్చు. ఆ తారీకు విని పుష్యమిత్రుడు నవ్వాడు. “నేనూ అదే రోజు నిర్ణయించుకున్నాను బాబాజీ. అంతా దైవ కృప” అన్నాడు.
* * *
పాక్ ప్రెసిడెంట్ గదిలో కోపంతో నిప్పులు గ్రక్కుతున్నాడు.
"వాళ్ళకు యూ.ఎన్.వో శాశ్వత సభ్యత్వం కూడా వచ్చేసింది. ఇంక వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అవుతుంది. చైనా వాళ్ళు ఎంత పోరాడినా ఆపలేక పోయారు. ఒకవైపు నుండి అన్ని దేశాలనుండి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారు. ఇంత ధనం వారికి ఎక్కడనుండి వచ్చిందో తెలీడం లేదు. ఈ ప్రధాని సామాన్యుడు కాదు. మొన్న పీ.ఓ.కే గురించి యూ.ఎన్.వో లు లేవనెత్తాడు. మా భూభాగం మాకివ్వకపోతే పోరాడి తీసుకుంటాం అన్న అన్యాపదేశ సందేశం ఆ మాటల్లో ఉంది"
"నిజమే! వాళ్ళను కంట్రోల్ చెయ్యడం చాలా కష్టంగా ఉంది" అన్నాడు ఆర్మీ ఛీఫ్.
"ఇంకో ముఖ్య విషయం. మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. బెలూచిస్తాన్ వాళ్ళు ఇవాళో రేపో మనమీద యుద్ధం ప్రకటించేట్టు ఉన్నారు. వాళ్ళకు ఆర్మీ, ఆయుధాలు భారత్ వాళ్ళే అందజేస్తున్నారు. కొన్ని క్షిపణులు కూడా రహస్యంగా అక్కడకు చేరవేస్తున్నారు"
"విన్నాను సార్! మనమూ ఎక్కువ ఆయుధాలు మొహరిస్తున్నాము కదా!"
"నో! భారత్ ను తక్కువగా అంచనా వేయకు. వారి సైనిక శక్తి ముందు మనం సరిపోము. పైగా మనవాళ్ళలో కొంతమంది అక్కడి తొత్తులు. నిరంతరం వార్తలు చేరవేస్తున్నారు"
"మనం వారి గ్లోబల్ ఐ నాశనం చెయ్యడానికి శాయుశక్తులా ప్రయత్నిస్తున్నాం. సమయం కోసం వేచి ఉన్నాం."
"వీలైనంత తొందరలో ఆకార్యక్రమం జరగాలి. అది నామ రూపాలు లేకుండా నాశనం అవాలి"
"ఇవాళ్టికి కరెక్టుగా నెలరోజులలోపు ఆ కార్యం సాధిస్తాం సార్!"
"గుడ్! చాలా కాన్‌ఫిడెన్షియల్ గా జరగాలి. ఎవ్వరికీ లీక్ అవకూడదు. హై అఫిషియల్స్‌కు మాత్రమే తెలియాలి"
* * *
"సర్! హిమాలయాల్లో బొరియలు చేసి క్షిపణులు పెట్టడం ప్రారంభమయింది. మన భూభాగంలోనే పెడతాం కానీ అవి అడుక్కి ఏటవాలుగా దూసుకుని వెళ్ళి వారి భూభాగంలో ఒక కిలోమీటర్ లోయలు చేస్తాయి. మొత్తం 25 క్షిపణులు ఒకేసారి ప్లాన్ చేశాము."
"గుడ్" అన్నాడు ప్రధాని.
"గ్లోబల్.ఐ రాడార్‌లో ఎవో సందేహాస్పద నీడలు కనిపిస్తున్నాయి సార్!. సరిహద్దుల్లో ఏవో అరాచకాలు సృష్టించడానికి సన్నహాలు చేస్తున్నారని నా అనుమానం"
"మనం ఆ క్షిపణుల ప్రయోగం తర్వాత వాళ్ళు చేసేదేమీ ఉండదు. బై" (సశేషం)
* * *
No comments:
Post a Comment