బ్రహ్మోత్సవాలలో మూడోరోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ చేస్తుంది. తనను నమ్ముకొన్న భక్తులలో ఉన్న హింసా ప్రతీకమయిన మృగత్వాన్ని తాను అణచివేస్తానని చెప్పటానికి ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారు.
అన్నమయ్య సింహ ప్రశస్తితో చాలా కీర్తనలు వ్రాసాడు.
అన్నిటా జాణ గదవే అవుభళనారసింహుడు
ఎంత పరాక్రమము యీ సింహము
కంభమున వెడలి ఘననరసింహము
కదిరి నృసింహుడు కంభమున వెడలె
కానవచ్చె నిందులోన కారుణ్యనరసింహా
ఘోరవిదారణ నారసింహ
చిత్తగించు మా మాట శ్రీనరసింహా
చిత్తగించు మా మాటలు శ్రీనరసింహ
చిత్తజగురుడ వో శ్రీ నరసింహా
చేకొని కొలువరో శ్రీనరసింహము
చేపట్టి మమ్ముగావు శ్రీనరసింహా నీ
జయ జయ నృసింహ సర్వేశ
జూటుదనాలవాడవు సుగ్రీవనారసింహ
దిక్కు నీవే జీవులకు దేవసింహమా
నంటు చేసీ సిరితోడ నరసింహుడు నాట
నానాటికిఁ బెరిగీని నరసింహము
వెలసె నహోబలాన విదారణసింహము
నవమూర్తులైనట్టి నరసింహము వీఁడె
పరగీనదివో గద్దెపై సింహము వాఁడె
నానామహిమల శ్రీనారసింహము
ఇందులో వాచవిగా వెలసె నహోబలాన విదారణసింహము అను కీర్తన యొక్క తాత్పర్య విశేషాలు తెలుసుకొందాం.
పల్లవి: వెలసె నహోబలాన విదారణసింహము
సురల నరుల దయజూచీని వీడివో
చ.1: సరి వలకేలను చక్రము పీటగాబెట్టీ
గరిమ నొకచేత శంఖము వట్టి
హిరణ్యకశిపుని నిరుచేతులా జించి
అరిది బేగులు జందేలవే వేసుకొనెను
చ.2:
ఘనమైన కోరలతో కహకహ నవ్వుకొంటా
దనుజు ముందరొకచేతనుబట్టి
పెనగకుండా రొమ్ము పెడచేతుల నడిచి
నినువు వంకరగోళ్ళ నెత్తురు చిమ్మీని
చ.3: అంతట బ్రహ్లాదుని నటు దయజూచి లక్ష్మీ
కాంతదొడపై నిడుక కడు శాంతుడై
చింత దీర గరుడాద్రి శ్రీవేంకటాద్రిని
పంతము మెరసి నిల్చి ప్రతాపించీనీ
భావం:
పల్లవి:
అహోబలాన విదారణ(చీల్చుట, చంపుట,యుద్ధము)సింహము వెలిసింది.
దేవతలను , మానవులను ఈ సింహమే దయచూసింది.
చ.1:
కుడి చేతిలో చక్రమును పీటగాపెట్టి,మరొకచేత శంఖము పట్టి ,హిరణ్యకశిపుని రెండుచేతులతో చించి
అపురూపంగా హిరణ్యకశిపుని పేగులు జందేలుగా ఈ నరసింహం వేసుకొన్నది.
చ.2:
ఘనమైన కోరలతో కహకహ నవ్వుకొంటూ,రాక్షసుని ముందర ఒకచేతనుబట్టి,అతడు పెనగకుండా రొమ్మును వెనుకకు తిప్పిన భుజాలతో అణచి,సమృద్ధియైన వంకరగోళ్ళు నెత్తురు చిమ్ముతుండగా సింహం ప్రకాశిస్తోంది.
చ.3:
హిరణ్య కశిపుని సంహారం తరువాత ప్రహ్లాదుని దయజూచి,లక్ష్మీకాంతను తొడపై పెట్టుకొని కడు శాంతుడై
భక్తుల చింత దీరునట్లుగా గరుడాద్రి శ్రీవేంకటాద్రి పర్వతాలపై పంతము మెరయునట్లుగా వేంకటేశుని రూపంలో నిల్చి ఈ సింహం ప్రతాపము చూపిస్తుంది.
విశేషాలు
విష్ణూ సహస్ర నామాలలో సింహః(200వ నామం పాపములను నశింపజేయువాడు.) సింహః (488 నామము- సింహమువలె పరాక్రమశాలియైనవాడు.) అని రెండు సార్లుస్వామిని పొగిడారు. ఎన్ని సార్లు ఆ నరసింహాన్ని తలచుకొన్నా తనివి తీరదు. సింహవాహనుడైన ఆ నరసింహవేంకటేశ్వరునికి జేజేలు.
****
No comments:
Post a Comment