అభినవ సుమతి శతకము--దుర్భ సుబ్రహ్మణ్యశర్మ
పరిచయం :దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవి పరిచయం:
అభినవ సుమతి శతకకర్త శ్రీ దుర్భ సుబ్రహ్మణ్య శర్మ గారి జన్మస్థలం నెల్లురు. వీరు 1875, 1 అక్టోబర్ న జన్మించారు. వీరు నెల్లూరు వీ ఆర్ కాలేజిలో ప్రథానాంధ్ర పండితునిగా పనిచేసారు. వీరి శిష్యులలో వేపకొమ్మ ఆదిశేషయ్య, చలినురుగు కామయ్య, కొలకుల నారాయణరావు, దుర్భా రామమూర్తి, భట్టారం మల్లికార్జున, షేక్ దావూద్ మొదలైనవారు ఎన్నదగినవారు. వీరి బహు గ్రంధకర్త. దాదపు 25 రచనలు చేసినట్లుగా తెలుస్తున్నది. వానిలో కొన్ని అనువాదములు కూడా ఉన్నవి. వీరు రచించిన కొన్ని గ్రంధములు: 1. లక్ష్మీ శృంగార కుసుమమంజరి (అనువాదం) 2. అభినవ సుమతి శతకము 3. సౌందర్యలహరి (అనువాదం) 4. భరతుడు 5. శంకరాచార్య చరిత్రము 6. ఆంధ్ర అభిజ్ఞానశాకుంతలము 7. దీనచింతామణి 8. వివేకచూడామణి (అనువాదం) 9. సుమనస్మృతి.
వీరికి మహోపాధ్యాయ, సాహిత్యస్థాపక, అభినవ తిక్కన్న అనే బిరుదులు సత్కారాలు కూడా లభించాయి.
ఈ అభినవ సుమతి శతక రచనకు ప్రేరణ ఎలా లభించిందో వారి మాటలలోనే తెలుసుకుందాము.
"ప్రకృతము బాలురు చదువుచున్న "సుమతి శతకము"లో అశ్లీలములు మెండుగానున్నవి. స్త్రీ స్వభావ దూషణము, వేశ్యా గర్హణము మొదలగు విషయముల గురించిన పద్యములును కొన్నికలవు. వీనిం దొలగించి శిశుజనోచితముగా 'అభినవాముగా నొక్క సుమతిశతకము రచింపుడనిన" ప్రేరణతో ఈశతకమును రచించి దానికి అభినవ సుమతి శతకము అని నామకరణము చేసినారు.
వీరు 1956, మే 11వ తేదీన పరమపదించారు.
శతక పరిచయం:
"సుమతీ" అనేమకుటంతో 101 కందపద్యములతో రచింపబడిన ఈ శతకం నీతిపద్య శతకాల కోవలోనికి వస్తుంది. ఈశతకం బాలురు చదువుకోవటానికి అనువుగా రచింపబడటం వలన ఈశతకంలోని పద్యాలు కఠినంగా ఉండక సులువుగా అందరికి అర్థం అయ్యే రీతిలో ఉంటాయి. నాలుగు పైగా పునర్ముద్రణలు పొందిన ఈశతకం ఆరోజుల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా నిలిచింది.
కొన్ని పద్యాలను చూద్దాం:
తలపోసి మనుజు లీశ్వరు
నలఘు మహత్త్వంబు దెలియ నాసపడుట, యా
జలరాశిలోఁతు గనుఁగొనఁ
జలిచీమల పైనమైన చందము; సుమతీ!
ప్రత్యక్షదైవంబులు
సత్యముగా నీకు నీదు జననీజనకుల్;
ప్రత్యహము వారిఁ గొలువుము
నిత్యైశ్వర్యంబు నీకు నెలకొను; సుమతీ!
జనయిత్రికంటె దైవము
జనకునికంటెను గురుండు, జనహితరతికం
టెను మేలు, జనవిరోధం
బునకంటెను గీడు లేదు భువిలో; సుమతీ!
జననియును జన్మభూమియు
జనకుండు జనార్ధనుండు జాహ్నవియు ననన్
జను నీ యైదు ' జ ' కారము
లనయము సేవ్యములు సజ్జనాళికి; సుమతీ!
ప్రాణంబు లొడ్డియైనన్
మానము కాపాడుకొనుము మానము తొలఁగం
గా నుండినను, స్వధర్మము
మానకు మిదె ధీరజనుల మార్గము; సుమతీ!
కీర్తికయి ప్రాఁకులాడకు,
వర్తింపుము ధర్మ మెఱిఁగి వారకదానన్
గీర్తియయినఁ గా కున్నను
బూర్తిగఁ బుణ్యంబునీకుఁ బొసఁగును; సుమతీ!
స్నానమున మేనిముఱికియు,
జ్ఞానమున మనోమలంబు, శబ్దాగమ వి
జ్ఞానమున నుడిదొసంగులు,
పూని తొలగించుకొనుము పూర్ణత; సుమతీ!
పలుకుము సత్యముగా, మఱి
పలుకు మటు ప్రియమ్ము గాఁగఁ బలుక కసత్యం
బులు ప్రియము లంచు, సత్యం
బులు పలుకకు మప్రియంబులు మూర్ఖత; సుమతీ!
అపకారుల కైనను
ఉపకారము చేయుచుందు రుత్తము, లల గం
ధపుఁజెట్టు తన్ను నఱికెడి
కృపాణికకుఁ దావిగూర్చు రీతిని; సుమతీ!
ఒడలు చెడు, మతి నశించును
విడిముడి వితవోవు, యశము వీసరపోవున్
కుడు పుడుగుఁ, గూలు మనుగడ,
యొడరులకున్ మద్యపాన మెల్లర; సుమతీ!
ఉన్నతమగు స్థానంబున
నున్నంతనె నీచపురుషుఁ డుత్తముఁ డగునా?
మిన్నంటు మేడకొనఁ గూ
ర్చున్నను, కాకంబు ఖగవరుండటె? సుమతీ!
ఇటువంటి చక్కని అనేక నీతులను ఈ తరం విధ్యార్థులకు సులభమైన రీతిలో నేర్చుకోవటానికి వీలైన భాషలో రచించారు.
ఈ పూర్తి శతకం అందరికి అందుబాటులో ఉండేట్లుగా క్రింది లంకెలో లభిస్తున్నది.
మీరు చదవండి మీ మిత్రులచే చదివించండి.
***
No comments:
Post a Comment