ఈ దారి మనసైనది - 19 - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది - 19
అంగులూరి అంజనీదేవి


(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. జాతరకు వెళ్తారు, దీక్షిత, మన్విత, అనురాగ్, మిత్రులు. దీక్షితతో అనురాగ్ సన్నిహితంగా ఉండడాన్ని భరించలేకపోతుంది మన్విత. పల్స్ ప్రోగ్రాం టూర్ కి ఢిల్లీ, ఆగ్రా వెళ్తారు అందరూ. తాజ్ మహల్ చూస్తూ ఉంటారు.)   
మృదుగంభీర స్వరూపిణిలా యమునవైపు చూస్తోంది దీక్షిత.
ఆమెనలా చూస్తుంటే - రాత్రి తన భుజం పై తల పెట్టుకొని భయపడూ పడుకున్న దీక్షితేనా అన్పిస్తోంది. 
ఇన్నాళ్ళు... ప్రేమగా పలకరించుకున్నారు. విలువైన అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరి కోసం ఒకరు అభిప్రాయాలను మార్చుకున్న సందర్భాలు కూడా వున్నాయి. ఒకరంటే ఒకరికి పైకి వ్యక్తం చేసుకోలేని ప్రేమ కూడా వుంది. ఇంతకన్నా ఏం కావాలి? జీవితంలో ఒకరితో ఒకరు కలిసి బ్రతకటానికి? 
ఆ వాతావరణంలో.... ఆమెకి దగ్గరగా వెళ్లి ఆమె కళ్లలోకి చూస్తూ-తనమనసేంటో చెప్పాలనుకున్నాడు. చెప్పక ఎన్నాళ్లిలా? ఏదో ఒకరోజు చెప్పాల్సిందేగాఅదేదో ఇప్పడే ఆ తాజ్ మహల్ సాక్షిగా, యమున సమక్షంలో చెబితే అద్భుతంగా వుంటుందనుకున్నాడు. 
దగ్గరగా వెళ్లి "హాయ్ ! దీక్షా !" అన్నాడు. ఎప్పడో తప్ప అతను "దీక్షా అనడు. గమనించింది దీక్షిత
‘దీక్షిత! కమాన్!” అంటూ అరిచింది సౌమ్య.సౌమ్య అక్కడ ఆమెకేదోవింత కన్పించినట్లుంది.... అది దీక్షితకి చూపించాలనే ఆ పిలుపు. 
ఆ పిలుపువిని సౌమ్యనే చూసూ "ఎక్స్ క్యూజ్మీ' అని అనురాగ్ తో  చెప్పి, అతన్ని విడిచి వెళ్ళాలని లేక పోయినా వెళ్లింది దీక్షిత.
ఒంటరిగా అలాగే యమునా నది వైపు చూస్తూ నిలబడి పోయాడు  అనురాగ్.
ఎప్పడు చూసినా ఫ్రెండ్స్ తోనో, లేక ఏదో ఒక పని చేస్తూనోహుందాగా, బిజీగా తిరిగే అనురాగ్ అలా ఒంటరిగా కన్పించటంతో మన్విత పరిగెత్తుతున్నట్లే ఒక్క అంగలో అతన్ని చేరుకొంది. 
అతన్నలా చూడగానే ఏవో ఊహలు ఆమెను చుట్టుముట్టి.... అతనికి "ఐ లవ్ యు చెప్పమని తొందర చేశాయి.
చెబితే ఏమంటాడోనన్న సంశయంతో, ముందుకెళ్లి చెప్పకపోతే తనని తను మోసం చేసుకుంటానేమో అన్న భయంతో ముందుకెళ్లి ఒక్కసారి గుండెనిండా గాలిపీల్చుకొని తగినంత బలాన్నికూడదీసుకొంది. 
మన్వితను చూడగానే నవ్వుతూ పలకరించాడు అనురాగ్.
అతని పలకరింపు, అతని నవ్వు ఆమె మనసులోతుల్ని తాకి, తేనె విందు చేశాయి. 
ఎవరి సమక్షమైతే ఆనందాన్ని యిస్తుందో, ఎవరి మాటలు వింటుంటే పులకింత పుడుతుందో వాళ్ల సహచర్యంలో బ్రతకాలని ఎవరికైనా ఉంటుంది. ఇక ఆపుకోలేక...
" అనురాగ్ నేను. ఎప్పటి నుండో ..." అంటూ ఆమె మనసులోని మాటలు పెదవి దాటేలోపలే.... 
(సశేషం)

No comments:

Post a Comment

Pages