జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 19
చెన్నూరి సుదర్శన్
(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి అనుభవాలను వారితో పంచుకుంటూ ఉంటాడు.)
“బోర్డు పరీక్షలు దగ్గరపడ్తున్నాయి. సిలబస్ పూర్తి చెయ్యడంలో స్టాఫ్ శ్రద్ధ చూపండ” ని స్టాఫ్‍కు విజ్ఞప్తి చేసాను..
రెండవ ప్రిఫైనల్ పరీక్షలు నిర్వఘ్నంగా నిర్వహించాను. పిల్లలలో కాస్తా మార్పు వచ్చింది.
ఆ సంవత్సరం బోర్డు పరీక్షలు జయప్రదంగా ముగిసాయి.
***
కాలేజీ పునః ప్రారంభానికి ముందే ఫణీంద్ర మహబూబ్‍నగర్ జిల్లాలోని పెబ్బేరు కాలేజీకి హిమజ నల్గొండ జిల్లాలోని ఆలేరు అమ్మాయిల కాలేజీకి బదిలీ అయ్యారు. ఇది ఫణీంద్ర రాజకీయ పలుకుబడి అని అర్థమయ్యింది.
రామనాథం బదులు మరో ప్రిన్సిపాల్ సూర్యనారాయణ వచ్చాడు. అతడు కాలేజీ విషయాలన్నీ అవగతం చేసుకునే వచ్చాడనుకుంటాను. కాలేజీలో జాయిన్ కాగానే నాతో చర్చిస్తూ కాలేజీలో పెనుమార్పులు చేసాడు.
నాకు చాలా సంతోషమేసింది.
సూర్యనారాయణ ప్రిన్సిపాల్ ఆధ్వైర్యంలో మరో నాలుగు సంవత్సరాలు రంగనాథపురం జూనియర్ కాలేజీలో పనిచేసాను.
కాలేజీ ఫలితాలు జిల్లాలోనే ప్రథమంగా నిలిచాయి. దానికి తోడు నాకలలు ఫలించాయి. కాలేజీకి పూర్వ వైభవం వచ్చింది.
కాలేజీ గదులు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, తదితర సౌకర్యాలు మెరుగుపర్చారు. ప్రిన్సిపాల్‍కు కారు యోగం.. స్టాఫ్‍కు క్వార్టర్స్.. అన్నీ వసతులు తిరిగి సమకూరాయి. యాజమాన్యం నిర్వహించే సమావేశాలకు ప్రిన్సిపల్ తన వెంట నన్నూ తీసుకొని వెళ్ళే వాడు.
ప్రభుత్వ ఉద్యోగి అన్నాక సామాన్య బదిలీలు తప్పవు. ఆ నేపథ్యంలో నాకు సూరారం జూనియర్ కాలేజీకి బదిలీ అయ్యింది. ఇంద్రాణికి భువనగిరి జూనియర్ కాలేజీకి బదిలీ అయ్యింది.
మాకు వీడ్కోలు సమావేశం ప్రిన్సిపల్ అద్యక్షతన చాలా ఘనంగా నిర్వహించారు విద్యార్థులు. ఆనాటి సమావేశానికి కంపెనీ జనరల్ మేనేజర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. తన ఉపన్యాసంలో కాలేజీకి మరిన్ని అదనపు సౌకర్యాలు.. ఆటల అభివృద్ధి కోసం నిధులు ప్రకటించాడు. కాలేజీ మంచి ఫలితాలు సాధించడంతో బాటు వాలీబాల్, బాల్ బ్యాట్ మింటన్ క్రికెట్ తదితర ఆటల్లో విజయం సాధించడం పట్ల తన హర్షం వ్యక్తపర్చాడు.
విద్యార్థులు మాట్లాడుతూ నాపట్ల గౌరవాభిమానాలు చూపించారు.
మాణిక్యం మాట్లాడుతూ మాటలు రాక ఎడ్చేసాడు. నా కళ్ళు చెమర్చాయి.. కర్చీఫ్‍తో తుడ్చుకోబోతుంటే.. హాల్లో ఎవరో ప్రవేశిస్తున్నట్లుగా.. మసక, మసగ్గా.. కనబడింది. కళ్ళు తుడ్చుకొని తెరిపారగా చూసాను. అతడు సుధాకర్. మునిపల్లి విద్యార్థి. ఆశ్చర్య పోయాను. ఇక్కడికెలా వచ్చాడని మనసులో అనుకుంటూ సమావేశ అద్యక్షులైన సూర్యనారాయణ చెవిలో వేసాను. తను సుధాకర్‍ను వేదిక పైకి ఆహ్వానించాడు.
సుధాకర్ వేదిక పైకి వస్తూనే నా కాళ్ళకు నమస్కరించాడు. నేను చలించి పోయాను.
సుధాకర్ సభనుద్దేశించి మాట్లాడుతూ..
“సూర్యప్రకాష్ సార్ మూలాన నేను ఈ వేదికనెక్కే అవకాశం కలిగింది. నా బతుకు అడవుల పాలయ్యే దశలో సార్ నన్ను చేరదీసాడు. నేను మునిపల్లి కాలేజీ పూర్వవిద్యార్థిని. సార్ శిష్యుణ్ణి నేను.. అలా చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంది” సభలో చప్పట్లు మ్రోగాయి... “సార్ లాంటి గురువు ఒక్కరుంటే చాలు. విద్యార్థుల జీవితాలు గాడిన పడతాయనడానికి నేనే ఒక ఉదాహరణ.
(సశేషం )
No comments:
Post a Comment