నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -"భానోదయం "   - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -"భానోదయం "  

Share This
నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -"భానోదయం "  
శారదాప్రసాద్ 



అది 11-12-1977, ఆదివారం మా నాన్నగారు చెప్పినట్లే మధ్యాహ్న మార్తండుడి లాంటి మగశిశువు గుంటూరులోని కన్యల హాస్పిటల్ లో నా భార్యకు జన్మించాడు!మూలా నక్షత్రం.పెద్ద శాంతి.అన్నీ యధావిధిగానే నాన్నగారు జరిపించారు.ఆదివారం పుట్టడం వలన,జాతక ప్రభావం వలన వాడికి నాన్నగారు 'వేంకట భాస్కర్ ' అనే నామకరణాన్ని నిశ్చయించారు.పళ్లెంలో అదే పేరును నేను వ్రాసాను!నా భార్య ముద్దుగా వాడిని 'భాసు 'అని పిలుచుకునేది .27 ఏళ్లకే ముగ్గురు పిల్లలు కలిగారు.కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా జరిగిపోయింది!భాస్కర్ దిన దిన ప్రవర్ధమానమౌతున్నాడు. అక్షరాభ్యాసం జరిగింది.నా ఆర్ధిక పరిస్థితి  బాగా లేనందున, సమిష్టి కుటుంబంలో పెద్దవాడిగా కొన్ని బాధ్యతలు ఉండగా--పిల్లలను సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాల్సి వచ్చింది!వాళ్ళ అమ్మ కడుపు చలువ వలన ,వాళ్ళు పెరిగి బుద్ధిమంతులయ్యారు.అన్ని తరగతుల్లో చురుకుగా ఉండేవాడు. అలా ప్రాధమిక విద్యలో మంచి మార్కులతో తెనాలి మునిసిపల్ హై స్కూల్ నుండి కృతార్థుడయ్యాడు .ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెనాలిలోనూ, రెండవ సంవత్సరం పాలకొల్లులోనూ --నా బదిలీల మూలకంగా చదువుకోవలసి వచ్చింది.ఇంటర్మీడియట్ లో ఏ కోచింగ్ తీసుకోకుండా ప్రభుత్వ కోటాలోనే గుంటూరు లోని RVR ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది.Mechanical dept  లో చేరాడు!అప్పుడు నేను పెనుగొండ (ప.గో .జిల్లా)లో మేనేజర్ గా పని చేస్తున్నాను.భాస్కర్ ను గుంటూరులోనే ఇంజనీరింగ్ లో చేర్చి,ఒక రూమ్,హోటల్ లో భోజన సదుపాయం ఏర్పరచినాను!రోజూ వాడే ఏదో ఒక టైం లో ఫోన్ చేసేవాడు!ఒక రెండునెలలు అయిన  తర్వాత ఎలా వున్నాడో చూడాలనిపించి ,ఒక శనివారం సాయంత్రం బ్యాంకు టైం పూర్తి కాగానే ,గుంటూరుకు బయలు దేరాను!గుంటూరు బస్సు స్టాండ్ లో వాడు నా కోసం వేచియున్నాడు.నన్ను చూచి ఆనందపడ్డాడు.బస్సు స్టాండ్ లో అడుగు పెట్టగానే నాకు తీవ్రమైన గుండె నొప్పివచ్చింది!రాఘవ శర్మ గారి హాస్పిటల్ కు వెళ్ళటం జరిగింది.వాడు చిన్నవాడైనప్పటికీ,ధైర్యంగా నిలబడ్డాడు.దాన్ని హార్ట్ స్ట్రోక్ గా రాఘవ శర్మ గారు నిర్ధారించారు!ఆ రోజుల్లో గుంటూరులో Angiogram  సౌకర్యం కూడా లేదు!పరిస్థితి కొంత స్టెబిలైజ్ అయినా తర్వాత అక్కడినుండి కేర్ హాస్పిటల్, హైద్రాబాద్ కు తీసుకొని వెళ్లారు.భాస్కర్ క్లాసెస్ పోతాయని బాధ్యతగా గుంటూరులోనే దిగులుగా ఉన్నాడు.కేర్ హాస్పిటల్ లో నాకు 1997 లో ఒక స్టెంట్ వేశారు!ఆ తర్వాత రెండు నెలలు హైద్రాబాద్ లోనే విశ్రాంతి తీసుకున్నాను.బాంక్ అధికారులు దయతో గుంటూరుకు బదిలీ చేశారు!భాస్కర్ ముఖంలో నూతన తేజం వచ్చింది!దృష్టి అంతా చదువు మీదే పెట్టి మంచి మార్కులతో బి.టెక్ పూర్తి చేసాడు.గేట్ exam లో క్వాలిఫై అయ్యి,M.Tech లో చేరాడు.వాడి చదువుకు నేను పెట్టిన ఖర్చు చాలా తక్కువ!అన్ని సౌకర్యాలను కూడా ఏర్పరచలేకపోయాను.నాకిది కావాలని వాడు ఎప్పుడూ నన్ను ఏమీ అడుగ  లేదు!తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. నాకు కావలసినవన్నీ వాడే నాకు provide చేసేవాడు!పేరుకే నేను తండ్రిని,నాకు తండ్రిగా వాడు వ్యవహరించాడు,వ్యవహరిస్తున్నాడు!మాట కఠినం,మనసు వెన్న!నాకు ఉండటానికి ఇల్లు ఏర్పాటు చేసాడు!అలా మా అవసారాలన్నిటినీ గుర్తించి తీర్చేవాడు!కష్టజీవి!వాడి బుద్ధికి తగినట్లే మంచి భార్య దొరికింది.ఆ అమ్మాయి కూడా కోడలు లాగా కాకుండా ,కూతురులా ఉంటుంది.ముత్యాల్లాంటి ఇద్దరు మనవరాళ్లు,శ్రీ విద్యా మైత్రేయి,లాస్య!కొడుకుల్లాంటి అల్లుళ్ళు,కూతురు లాంటి కోడలు,ముత్యాల లాంటి మనవళ్ళు,మనవరాళ్లు ...ఇంతకన్నా కావలసినదేముంది?ఒకప్పుడు నేను నిర్ధనుడను.ఇప్పుడు నన్ను మించిన భాగ్యశాలి ఎవరూ ఉండరేమో?ఇంతటి వైభోగాన్ని ప్రసాదించిన సంతానాన్ని ఆశీర్వదిస్తూ,మూల కారకుడైన పరాత్పరుడికి నమస్కృతులు సమర్పిస్తున్నాను!మరికొన్ని ముచ్చట్లతో మరో సారి! 
***

4 comments:

  1. చాలా గొప్ప ఆస్తిని సంపాదించుకున్నారు!

    ReplyDelete
  2. అందరూ ఆత్మకథలు వ్రాస్తారు,నిజాయితీగా వ్రాసేది మీలాంటి కొందరే!

    ReplyDelete
  3. మిమ్మల్ని చూస్తుంటే అసూయ కలుగుతుంది!సంతృప్తికరమైన జీవితాన్ని మించింది ఏదీ లేదు!

    ReplyDelete

Pages