పచ్చని చీర - అచ్చంగా తెలుగు
పచ్చని చీర...
సుజాత తిమ్మన




ఆకాశం అద్దానికి ..
తన ప్రతిబింబాన్ని 
అద్దిందేమో..ధరణి..


పైర గాలులు పిల్లగాలులై..
పచ్చికను కెలుకుతూ.. 
పచ్చి వాసనను మోసుకొస్తున్నాయి.


వదిలి పెడుతున్నదని గ్రీష్మం..
కాలం ఒకటే కన్నీళ్ళు కారుస్తుంది..

పచ్చని చీరలో వర్ష ఋతువు ..
వయ్యారాలు పోతూ ఉంది.


గాలం వేసి పట్టలన్నా...
దొరకని చేపలలా..
క్షణాలు..నిన్నలలోకి జారుతూ..
ఎదురు చూపుల గుట్టలను 
పేరుస్తున్నాయి.


లంగా ఓణిలలోని పరువం..
బరువై..చీరకట్టులో బిగువవుతూ ఉంది..
కొబ్బరాకుల సందుల్లోంచి 
దొంగచాటుగా దూరే వెన్నెల రేకుల్లా 
చీకటి ముంగురుల్లో అక్కడక్కడా మెరుస్తూ..
వెండి తీగెల వెంట్రుకలు..వెక్కిరిస్తున్నాయి.


నీవు చెప్పిన ‘నీ కోసమే నేను ..’ 
అన్న ఒకే ఒక్క మాట..
నా శ్వాసల సంద్రాల అలలపై..
అటుపోట్లవుతుంది.

అల్లల లాడుతున్న కనురెప్పల తటాకం 
తనలోకి నన్ను లాక్కొనకముందే...
ఒక్కసారి..నీ ఆగమన సమాచారం 
ఆ మేఘమాలికలతో పంపించు ప్రియతమా...!!
******** ************


No comments:

Post a Comment

Pages