ప్రియమైన నీకొక ప్రేమలేఖ - అచ్చంగా తెలుగు

ప్రియమైన నీకొక ప్రేమలేఖ

Share This
ప్రియమైన నీకొక  ప్రేమలేఖ
యామిజాల జగదీశ్


ప్రియమైన శ్రీ...
నేను కొన్ని రోజుల వరకూ ఇంటర్నెట్ లోకి రాను. వాట్సప్ కూడా తీసేసాను. వీటిలో ఉండడం వల్ల నా పనులన్నీ పెండింగ్ పడిపోతున్నాయి. వాటిని పూర్తి చేసుకోవాలి. అప్పటి వరకూ నీకు అందుబాటులో ఉండను. అపార్థం చేసుకోకు అని చెప్పివెళ్ళిన దానివి ఇప్పటి వరకూ ఒక్క మెసేజ్ కి కనీసం సమాధానం కూడా లేదు. ఉదయం లేచీ లేవడంతోనే నీ మెసేజ్ కోసం చూస్తాను. అలాగే రాత్రి కూడా నీతో చివరగా శుభరాత్రి, స్వీట్ డ్రీమ్స్ అని చెప్పించుకున్న తర్వాతే నిద్రపోతాను. నీ నుంచి ఒక్క మాట లేకున్నా ఆ రోజంతో తోచదు. చిరాగ్గా ఉంటుంది అన్న నువ్వేనా ఇప్పటికి వారం పది రోజులైంది. నేనేమన్నా నీకు కోపం తెచ్చేలా ఏమన్నా చెప్పేనా రాసేనా అని ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు. ఎందుకని ఉన్నట్టుండి నారు దూరమవాలనుకున్నావో అంతుపట్టడం లేదు. నిన్ను పరిచయం చేసిన ఫేస్ బుక్కులో ప్రతి రోజూ వచ్చి పోతున్నా నువ్వు కనిపిస్తావేమోనని, కానీ అక్కడా నువ్వు కనిపించడం మానేశావు.  నన్నెందుకు ఇలా ఎడారిలో విడిచిపెట్టి పోయావో తెలీడం లేదు.

నిన్ను తలచుకుంటుంటే .....పువ్వుని ప్రేమించే పక్షంలో దానిని కోయకూడదు, అది వాడి రాలిపోయేవరకూ తొడిమకే సొంతం...ఆ తర్వాత భూమికి సొంతం. పువ్వుని ప్రేమించే పక్షంలో దానిని కోయకూడదు. కోస్తే చనిపోతుంది. అప్పుడే ప్రేమా పోతుంది. కనుక పువ్వుని చూసి ఆనందించాలి. ఆస్వాదించాలి అన్నట్టుంది నీ తత్వం.  
ఎవరో చెప్పారు...ఎవరినీ లోతుగా ప్రేమించకూ అని. ఆ ప్రేమే ఏదో రోజు నీకు కన్నీళ్ళనే కానుకగా ఇస్తుందని. అలా చెప్పిన వారందరితోనూ వాదించేవాడిని. నా ప్రేమ అలాంటిది కాదని. నా ప్రేమ ఎప్పుడూ నన్ను దూరం చేయదని. నా శ్రీ నన్ను దూరం చేయదని. కానీ ఇప్పుడు నీ తీరుతో ఓడిపోయాను.
నా ప్రేమలో నీ శ్వాస ఉందన్నాను. అయితే నువ్వేమన్నావో తెలుసా అదంతా అబద్ధమని. తీరా ఆ ప్రేమను సమూలంగా తుంచి పారేసిన తర్వాత చెప్పావు అవును నీ ప్రేమలో శ్వాస ఉందని.
మనం ప్రేమించడం కోసం పుట్టలేదని చాలా కటువుగానే చెప్పావు. అప్పుడది తెలుసుకోలేకపోయాను, ఇంతకూ మన ప్రేమ ఎవరికోసం పుట్టిందంటావో చెప్పు.
నీకు క్షణం చాలు నన్ను మరచిరోవడానికి...కానీ నాకలా కాదు, బతికే ప్రతి క్షణం కావాలి నువ్వూ నీ చూపూ నీ మాటా....
నీ తలపే నన్ను నడిపిస్తోందని ఎన్నోసార్లు మనసు విప్పి చెప్పాను. సంతోషించావు. థాంక్స్ అన్నావు.
ఐ లవ్ యూ అనగానే  ఐ టూ అన్నావు. అప్పుడు నేను నేల మీద లేను. నా మాటకు రెక్కలొచ్చి  నేను గాల్లో తేలడం మొదలుపెట్టాను.
నువ్వు చూసిన కలా నేను చూసిన కలా నిజమయ్యాయి. కానీ అదేంటో తెలీదు మనం చూసిన నిజం కాస్తా కలై నన్ను లేవనివ్వడం లేదు. వర్షం వచ్చినప్పుడల్లా మనం ఆరోజు చెట్టు కింద గడిపిన క్షణాలు చిరస్మరణీయమనుకో. నేను ఇంట్లోంచి బయలుదేరుతున్నప్పుడే ఎందుకో డౌటొచ్చి గొడుగుతోనే వచ్చాను నువ్వు రమ్మన్న చోటుకి. నేననుకున్నట్టే వర్షమూ మనతోనే వచ్చింది. నేను గొడుగు విప్పుతుంటే నువ్వన్నావు...
వద్దు గొడుగేయకు...తడుద్దాం...ఎప్పటికీ ఈ వర్షం మనకు గుర్తుండాలి అని తడుస్తూ ఎన్ని అడుగులు వేశామో...చలిగా ఉందన్నాను. నా కోసం ఆ మాత్రం తడవలేవా ...నోరు తెరిస్తే చాలు ఐ లవ్యూ అంటూ ఉంటావు...ఎన్ని సార్లు చెప్పావని కాదు, ఎంత ప్రేముందో ఇలాంటప్పుడు చూపించాలి అన్నావు. అవును, నువ్వన్నది నిజమే, మాటలతో ప్రేమ పరిమితమైపోతే ఎలా...
నాలో ఓ సవ్వడి వినిపిస్తోంది. నీకో ఓ సవ్వడి వినిపిస్తోంది. ఆ రెండు సవ్వడులూ ఒక్కటే. అవి పలికే మాట ఒక్కటే అదే మన ప్రేమ గురించి చేసే సవ్వడులే...
నా మాటలన్నీ అంకితం చేస్తున్నా...
ఎవరికో తెలుసా, ప్రేమకూ, ప్రేమను పరిచయం చేసిన నీకూనూ...
మన తొలి పరిచయంలో నన్నడిగావు...
మీకు కోపం ఎక్కువా అని. ఎలా కనిపెట్టావా అని ఇప్పటికీ అర్థం కావడం లేదు. అప్పుడు నేనేమన్నా అసహనంతో ఏవైనా మాటలు చెప్పానా...ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు. అయినా అవన్నీ ఎందుకిప్పుడు....
ఆ మధ్యెప్పుడో ఓ నలబై ఎనిమిది గంటలు నీకు మెసేజ్ చేయనందుకు నన్ను నానా మాటలు అన్నావు. నువ్వూ నీ ప్రేమా ఓ నటనే అని. మరిప్పుడు నువ్వు నాకు మెసేజ్ చేసి రెండు వందల నలబై గంటలు పైనే అయింది. ఒక్క మాటా లేదు. నేను రోజూ నీకు మెసేజ్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడో అప్పుడు నాకు నువ్వు రిప్లయ్ ఇస్తావనే.
నీ మౌనం నన్ను పిచ్చివాడిని చేస్తోంది. నీ మౌనం నా ప్రాణం తీస్తోంది. ఎందుకు నన్ను నిషేధించావో తెలియడం లేదు.
నువ్వు నన్ను కావాలనే దూరం చేసేవా...చేసుకో.....కానీ నేను నిన్ను దూరం చేసుకోలేను.
నువ్వు నాకు మెసేజ్ చేయకపో. కానీ నేను పంపే మెసేజులను నీ కనులు స్పర్శించనివ్వు.
వాటికి ఊపిరిపోసినట్టవుతుంది. వాటికి కళ వొస్తుంది. వాటికి నడకొస్తుంది. రెక్కలొస్తాయి. ఆకాశంలో విహరిస్తాయి ఎంచక్కా. నువ్వున్న ఇంటి డాబా మీద నువ్వు ప్రాణప్రదంగా పెంచే పూలమొక్కలలోని పువ్వులై నిన్ను పలకరిస్తాయి. అప్పుడు నువ్వు నవ్వే నవ్వులే నా ఊహలకు నీరు పోస్తుంటాయి. నా హృదయమూ తడుస్తుంది హాయిగా....
ఎప్పటికీ నువ్వు నాకోసమనే భ్రమైనా కల్పించు. బతికేస్తుంటాను. నన్ను నేను మరచి, నీ ప్రేమను ఎత్తుకుంటాను. నీకో విషయం తెలుసా, ప్రేమలో ఉన్నప్పుడు ఏ బరువైనా దూది అంత తేలికేసుమా....కనుక ప్రేమతోపాటు నిన్ను ఎత్తుకోవడమూ నాకు సులభమే అవుతుంది.
ఇది చదివిన తర్వాతైనా కోపాలు పట్టుదలలు పంతాలూ మాని నన్ను పలకరిస్తావనే ఆశతో
నీ యామిజాల జగదీశ్
***


No comments:

Post a Comment

Pages