ఆషాఢ వారాహీ నవరాత్రులు - అచ్చంగా తెలుగు

ఆషాఢ వారాహీ నవరాత్రులు

Share This
ఆషాఢ వారాహీ నవరాత్రులు 
-సుజాత. పి.వి.ఎల్.


ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండీ అమ్మవారి వారాహి నవరాత్రులు ప్రారంభమౌతాయి. 
ఆషాడంలో మనందరికీ తెలిసిన ముఖ్యమైన అమ్మవారి పండుగ బోనాలు. అది తెలంగాణాకి మాత్రమే పరిమితం అని అందరికీ తెలుసు. కానీ, ఈ వారాహి నవరాత్రులు ఎంతమందికి తెలుసు? సాధారణంగా నవరాత్రులు అనగానే మనకి గుర్తొచ్చేది శరన్నవరాత్రులు. అలాగే చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు కూడా అందరికి తెలిసిన విషయమే. ఈ రెండూ కాక మరో రెండు నవరాత్రులు కూడా ఉన్నాయి. అవి ఆషాఢంలో వారాహీ నవరాత్రులు మరియు మాఘమాసములో శ్యామలాదేవి నవరాత్రులు. అంటే నాలుగు ఋతువుల్లో వసంత, గ్రీష్మ, శరత్, శిశిర రుతువులో ఈ నవరాత్రులు వస్తాయి. చైత్రమాసమున పూజింపబడే అమ్మవార్లు శ్రీ లలితాదేవి, శ్రీ రాజరాజేశ్వరీ దేవతలు. ఆశ్వీయుజ మాసమున శ్రీ దుర్గాదేవిని అర్చిస్తాం. కానీ, ఆషాఢ, మాఘ మాసములందు వారాహీ, శ్యామలాదేవి దేవతలని కొలుస్తారని చాలా తక్కువమందికి తెలుసు.
అమ్మవారు సాంప్రదాయిని! సంప్రదాయేశ్వరీ! సదాచార ప్రవర్తిక! అందువలన నిర్మలమైన మనస్సుతో స్వచ్ఛంగా నమస్కరించి వేడుకుంటే ఆ తల్లి అనుకున్నదే తడవుగా అనుగ్రహిస్తుంది.
అసలు ఈ వారాహీ అమ్మవారు ఎవరు? 
హిందూమత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తీ రూపాల్లో, సప్త మాతృకల్లో ఒక అవతారమే వారాహిదేవి.
పూర్వం హిరణ్యాక్షకుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహ మూర్తి స్త్రీ తత్వమే వారాహిదేవి. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో వారాహిదేవి ప్రసక్తి కనిపిస్తుంది.
వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది. ఈమె శరీరఛాయ నల్లని మేఘవర్ణంలో ఉంటుంది. వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో దర్శనమిస్తుంది. అభయావరద హస్తాలతో, శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో కనిపిస్తుంది. వారాహిదేవి సింహం, పాము, దున్నపోతు వంటి వాహనాల మీద సంచరిస్తుంది.
దేవీమహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన రూపాలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధంకోసం రమ్మని సవాలు చేస్తాడు. అప్పుడు దుర్గాదేవి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడ్ని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవించినట్టు చెప్పబడింది. వీపు భాగం నుండి వారాహీ పుట్టినట్టు అందులో తెలుపబడింది. మార్కండేయ పురాణం ప్రకారం వారాహిదేవి వరాలిచ్చే తల్లి. వివిధ దిక్కులను మాతృకలు రక్షిస్తారు. దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిదేవిని ఇతర మాతృకలతో పాటుగా, అమ్మవారు సృష్టించారు. దేవతలను రక్షించేందుకే అమ్మవారు ఈ మాతృకలను సృష్టించినట్టు తెలుస్తోంది. మత్స్య పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది. అంధకాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు సహాయం కోసం శివుడ్ని వేడుకుంటే, ఆ పరమశివుడు వారాహిని సృష్టించినట్టు తెలుస్తుంది. అందుకే దేవి పురాణంలో వారాహిదేవిని వరాహ స్వామికి తల్లిగా, వరాహ జననిగా వర్ణించారు. 
వారాహి అమ్మవారిని చూసి ఉగ్ర దేవతలా భయపడతారు కొందరు. కానీ, వారాహిదేవి చాలా శాంతస్వరూపిణి. కొలిచిన వెంటనే అనుగ్రహించే చల్లని తల్లి. కరుణారసమూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఒక్కవిషయం.. ఈ అమ్మవారు కేవలం రాత్రివేళల్లో మాత్రమే పూజలందుకుంటుంది. ఎందుకంటే అమ్మవారు గ్రామదేవతలా తిరుగుతూ శత్రువుల నుండి, దుష్ట శక్తులనుండి మనల్ని కాపాడేందుకు రాత్రిళ్ళు నేటికీ వారణాశిలో సంచరిస్తుంది. అందుకని ఈ అమ్మవారి దేవాలయాలు రాత్రిళ్ళు తెరిచే ఉంటాయి. అందుకే రాత్రిళ్ళు పూజలు చేస్తారు. 
ఇచ్ఛాశక్తి లలితాదేవి, 
జ్ఞానశక్తి శ్యామలాదేవి, 
క్రియా శక్తి వారాహిదేవి ని మనస్ఫూర్తిగా స్మరించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయి. ఆషాఢమాసంలో వచ్చు అనారోగ్య సమస్యలు, అవాంతరాలు తొలుగుతాయి. 
శ్రీ వారాహీ మాత్రే నమః !
******* 

No comments:

Post a Comment

Pages