అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- 20 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- 20

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- 20

(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)


(కనిపించకుండా పోయిన తన కుమారుడి సాహిత్యాన్ని వెతికి పెట్టమని నాన్సీ తండ్రిని సాయమడుగుతాడు ముసలి మిలిటరీ ఉద్యోగి మార్చ్. తన స్నేహితురాళ్ళతో అతని యింటికి వెళ్ళిన యువగూఢచారి అతని యింటిని, అటకని గాలించినా ఫలితం శూన్యం. తట్టురోగంతో యింటికి తిరిగి వచ్చిన మార్చ్ మనుమరాలి సంరక్షణకు ఎఫీ అన్న అమ్మాయిని నియమిస్తుంది. ఆమె ద్వారానే ఆ యింటిలో ఆగంతకుడెవరో తిరుగుతున్నట్లు తెలుసుకొంటుంది. ఒకరోజు అటక మీద ఆమెకు బీరువాలో ఒక అస్తిపంజరం కనిపిస్తుంది. అదే సమయంలో తండ్రి తనకు అప్పజెప్పిన మరో కేసులో డైట్ కంపెనీలో దూరి బుషీట్రాట్ అన్న వ్యక్తిని కనుక్కోవటమే గాక, ఆ లాబ్ నుంచి రెండు సీసాల్లో పట్టు పరికిణీలు తయారుచేసే రసాయనిక ద్రవాల నమూనాలను రహస్యంగా సంపాదించి, తన తండ్రికి యిస్తుంది. ఆగంతకుడు తరచుగా కనిపించటంతో భయపడుతున్న ఎఫీని ఒక రోజు యింటికి వెళ్ళమని చెప్పి, తన స్నేహితురాళ్ళతో కలిసి ఆ రాత్రికి మార్చ్ భవంతిలో ఉండిపోతుంది నాన్సీ. ఆ రాత్రి ఒక ఆగంతకుడు భవంతి వెనుకకు వెళ్ళటం గమనించి అతన్ని అనుసరిస్తుంది. కానీ అతను అకస్మాత్తుగా మాయమవుతాడు. తన స్నేహితురాళ్ళను భవంతి బయట కాపలా ఉంచి, తాను మార్చ్ తో కలిసి అటకమీదకు వెడుతుంది. ఈ లోపున బయటినుంచి స్నేహితురాళ్ళ కేకలు వినిపించి వాళ్ళకు సాయపడటానికి బయటకు వెడుతుంది. వాళ్ళు ముగ్గురు ఎంత వెంబడించినా, సమయానికి అతనికి ఒక కారు సాయంగా రావటంతో, అతను దాన్ని ఎక్కి పారిపోతాడు. ఆ రోజు దొంగ మరొక పాటను దొంగిలించినట్లు గమనించారు గనుక ముగ్గురు అమ్మాయిలు మరునాడు ఆ భవంతిలో దొంగ వచ్చి పోయే రహస్య మార్గాన్ని కనుక్కోవాలని ప్రయత్నించి విఫలమవుతారు. అటక మీద రహస్యమార్గం ఉందేమో అని వెతుకుతున్న సమయంలో అస్తిపంజరం తమకేదో సైగ చేస్తోందని బెస్ అంటుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన యువగూఢచారికి అస్తిపంజరం దిగువన ఒక నాబ్ కనిపిస్తుంది. దాన్ని తెరిచేలోగా జెన్నర్ వచ్చాడని తెలిసి నాన్సీ కిందకు వెళ్ళి అతనితో మాట్లాడుతుంది. ఒక పాటను ముద్రించేముందు దాని అసలు రచయిత ఎవరన్నది తెలుసుకోవాలని చెప్పగానే, జెన్నర్ ఆమె హద్దులను దాటుతోందని కేకలు వేసి వెళ్ళిపోతాడు. తరువాత అటక మీదకు వచ్చిన నాన్సీ తీవ్రంగా ప్రయత్నించి ఆ గూటిని తెరుస్తుంది. దానిలో పాత ఉత్తరాలతో పాటు కొన్ని పాటలు దొరుకుతాయి. తన తండ్రి క్లయింట్ కు అమ్మించి పెడతానని వాటిని నాన్సీ యింటికి తీసుకొస్తుంది. మాటల మధ్యలో ఆమె తండ్రి మరొకసారి డైట్ కి కనిపించి రమ్మని, లేదంటే సీసాలను అమ్మటానికి వచ్చిన ఆమె అకస్మాత్తుగా మాయమవటం, లాబ్ లో బుషీట్రాట్ ఆర్పేసిన లైట్లను ఎవరో వేసి వదిలేయటాన్ని డైట్ తేలికగా తీసుకోడని, వేలి ముద్రల నిపుణులను పిలిస్తే తనకు ప్రమాదమని హెచ్చరిస్తాడు. తరువాత కథ ఏమిటంటే. . .)
"వేలిముద్రలా?" నాన్సీ గుటకలు మింగింది. "ఎందుకు? కేవలం ఆ స్విచ్ బోర్డు మీదే కాదు, లాబ్ లో, సాలీళ్ళున్న గది తలుపు మీద, ఆఖరికి ఆ సొరంగంలో కూడా అవి దొరుకుతాయి."
"అందుకే నువ్వు కష్టాల్లో యిరుక్కొనే లోపే డైట్ కి కనిపించి నిన్ను అనుమానించకుండా నివృత్తి చేసుకోమని సలహా యిస్తున్నాను."
"అదేనా మీరు చెప్పేది?" నాన్సీ మూలిగింది. "నేను అతన్ని చూడాలి. మార్చ్ కి చెందిన పాత సీసాలు డైట్ దగ్గరే ఉన్నాయి. వాటి గురించి నేను వెళ్ళకపోతే అతని అనుమానం రెట్టింపవుతుంది. మీరు అతనిపై అభియోగం మోపే లోపే తన రహస్య పరిశోధనశాలను అతను శోధించే ప్రమాదముంది. అంతేనా?"
డైట్ ని కలవాలని నాన్సీ ఆలోచించే కొద్దీ ఆమెలో భయం పెరిగిపోతోంది. ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం తాను అతని వద్దకు వెళ్ళినప్పుడు రహస్యంగా తన వేలిముద్రలను సేకరించే ప్రయత్నం చేయవచ్చని కూడా ఆమెకు సందేహం కలుగుతోంది.
"ఇంతవరకూ అతను ఏమి కనుక్కొన్నాడో కూడా తనకు తెలియదు."
ఆమె ఆలోచనలకు విరుద్ధంగా ఆ రోజు మధ్యాహ్నం బాగా పొద్దుపోయాక, డైట్ ఫాక్టరీకి నాన్సీ బయల్దేరింది. తనలోని భయాలు బయట పడకుండా జాగ్రత్తపడుతూ ప్రయివేటు కార్యదర్శి మిస్ జోన్స్ ని పలకరించింది.
"మిస్టర్ డైట్ ని కలవాలి" అంటూ అభ్యర్ధించింది.
పూర్వం తనతో చనువుగా మసలిన కార్యదర్శి గంభీరంగా తలెత్తి చూసింది కానీ పలకరింపు నవ్వయినా నవ్వలేదు.
" మిస్ డ్రూ! మిస్టర్ డైట్ మీతో మాట్లాడాలని గాఢంగా కోరుకొంటున్నారు" అంటూ ఆమె నొక్కి చెప్పింది.
నాన్సీ గుండె జారిపోయింది. తాను ఈ యిబ్బంది నుంచి తప్పించుకోవాలంటే చాకచక్యంగా తన పాత్రను పోషించాల్సి ఉంటుందని ఆమె గుర్తించింది.
"తన గదిలోంచి నువ్వు అకస్మాత్తుగా మాయమవటంతో మరునాడు మిస్టర్ డైట్ చాలా కలవరపడ్డారు" అని మిస్ జోన్స్ చెప్పింది.
నాన్సీ ఆమె చెప్పింది అర్ధం కానట్లు నటించింది. "మాయమవటమా? ఎందుకు? నేను తన ఆఫీసుని విడిచిపెడితే, తిన్నగా మా యింటికే వెడతానని ఎందుకనుకోవటంలేదు?"
"ఖచ్చితంగా అనుకోవటం లేదు. ఈ ఫాక్టరీలోనే ఎక్కడికో వెళ్ళావని ఆయన అనుకొన్నారు."
"బాగుంది. మీరలా అనుకోవటంలో వింతేమీ లేదు" నాన్సీ చెప్పింది.
"మీరిక్కడ ఉన్నారని ఆయనతో చెబుతాను" అంటూ కార్యదర్శి కుర్చీలోంచి లేచింది.
మరుక్షణం తిరిగొచ్చి ఆయన తన ఆంతరంగిక కార్యాలయంలో ఆమెను కలుస్తానన్నారని నాన్సీకి చెప్పింది. కార్యదర్శి చూపించిన ఆంతరంగిక కార్యాలయానికి నాన్సీ వెళ్ళింది. ఆమె లోనికి వెళ్ళిన సమయానికి అతను తన బల్లముందు కూర్చుని వ్రాసుకొంటున్నాడు. కొద్ది క్షణాలు తన ముందుకొచ్చిన నాన్సీని అతను పట్టించుకోలేదు. చివరికి వ్రాయటం పూర్తి అయ్యాక తలెత్తి చూశాడు.
" సరే" నాన్సీని ఆత్మసంరక్షణలో పడేసే విధంగా బిగ్గరగా అన్నాడు. "నిన్ను యిక్కడికి దేని కొరకు పంపించారో తెలుసా?"
తనను యిక్కడకు ఎవరో, తన తండ్రే, యితనిపై నిఘాకి పంపినట్లు డైట్ అనుమానిస్తున్నాడని నాన్సీ గ్రహించింది. కానీ ఆమె మరో రకంగా నటించింది.
"ఓ! మీరనేది సీసాల గురించేనా?" ఆమె ఉత్సాహంగా చెప్పింది. "ఆ రోజు నేనలా బయటకు పరుగెత్తినందుకు మన్నించండి. ఈ ప్రాంగణంలో ఒక వ్యక్తి నాకు బాగా తెలిసినవాడిలా కనిపించాడు. తీరా వెళ్ళేసరికి ఆలశ్యమైపోయింది. అటునుంచి అటే యింటికి వెళ్ళిపోయాను."
లారెన్స్ డైట్ ఆమెను ప్రశ్నార్ధకంగా చూశాడు. "నువ్వు యిక్కడినుంచి నేరుగా యింటికే వెళ్ళావా?" సూటిగా ప్రశ్నించాడతను.
నాన్సీ అంత తేలికగా బుట్టలో పడే రకం కాదు.
"బాగుంది. నేనెలా వెళ్తానో మీకు తెలుసు" నవ్వుతూ చెప్పిందామె. " ఒకరిని యిబ్బంది పట్టే నైజం కాదు నాది. అందుకే దారిలో కొంతమంది స్నేహితులను కలవాలని ఆగాను. బాగా పొద్దుపోయేవరకూ యింటికి చేరలేదని ఒప్పుకొంటున్నాను. మా వంటమనిషి కూడా బాగా నిరాశపడింది."
"నేను ఊహించగలను" డైట్ బదులిచ్చాడు.
అతను నాన్సీ కధను పూర్తిగా నమ్మాడు. ఇంతవరకూ ఎవరో పంపితే తన లాబ్ రహస్యాన్ని కనుక్కోవటానికి ఆమె ప్రయత్నించిందని, అది కనుక్కొన్నాక అక్కడ లైట్ ఆర్పకుండా వెళ్ళిందని డైట్ అనుమానించాడు. తన ముఖంలోని అమాయికత్వం చూశాక, తన యంత్రాగారంలోని కార్మికుడే ఎవరో లాబ్ లోని లైట్ ఆర్పటం మరిచిపోయాడని డైట్ నిర్ధారించుకొన్నట్లు ఆమె గ్రహించింది.
అక్కడ అన్ని వస్తువులు తమ స్థానాల్లోనే ఉన్నట్లు బుషీ చెప్పాడు. కానీ అతను నాన్సీ చంపిన బ్లాక్ విడో సాలీణ్ణయినా గమనించలేదన్న విషయం మాత్రం డైట్ కి తెలీదు.
డైట్ చక్రాలకుర్చీలో వెనక్కి చేరబడి ఒళ్ళు విరుచుకొన్నాడు. నాన్సీపై అతనికి ఉన్న అనుమానం సడలిపోయి మనసు తేలికపడింది. స్నేహపూరితమైన గొంతుతో మార్చ్ సేకరించిన సీసాల గురించి నాన్సీతో చర్చించాడు.
"పాత గాజు వస్తువుల సేకరణ అంటే నాకు చాలా యిష్టం. నువ్వు వాటి ధరను చెబితే మనం బేరాన్ని నిర్ధారించవచ్చు."
"ఆ నీలంసీసా బహుమతిగా యిస్తున్నది."
"సరె! మిగిలిన వాటిని నేను కొంటాను. వాటన్నింటికీ ముప్ఫై అయిదు డాలర్లు యివ్వాలనుకొంటున్నా."
ఆమె నిరుత్సాహంగా చూసింది. డైట్ తక్కువ ధరకు బేరమాడుతాడని ఆమె ఊహించినదే! కానీ మరీ వంద డాలర్ల కన్నా తక్కువకు అడుగుతాడనుకోలేదు.
"ముప్ఫై అయిదేనా? నేను ఆ ధరకు అమ్మలేను" నాన్సీ చెప్పింది.

(తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages