గంట-ఘంట
బండ్లమూడి పూర్ణానందం.
ఎంఏ.బి.యిడి. అణుశక్తికేంద్రీయవిద్యాలయము
“ఆగమార్థంతు దేవానాం, గమనార్థంతు రాక్షసాం
కుర్యాద్ఘంటారవం తత్ర ,దేవతాహ్వానలాంఛనం ”
‘గంట’అనగానే మన అందరికీ సమయమును తెలియజేసే పదము అని గుర్తుకు వస్తుంది.మరి‘ఘంటానాదము’ దేవాలయమునకు సంబంధించిన పదముగా స్ఫురిస్తుంది.రోడ్డుమీద పీచుమిఠాయి అమ్ముకొనేబండి అబ్బాయి కూడా గంట మోగిస్తూ వెళతాడు. కావలసిన వారుబండి ఆపి కొనుక్కుంటారు.వాని శ్రమను అంటే అరిచే శ్రమను అది తగ్గిస్తుంది అన్నమాట.మరి చర్చిలో మోగించే గంట ప్రభువు మార్గములో నడుచువారికి సమయసంకేతమిచ్చుటకు ఉపయోగిస్తారు. గంటకు నిలయస్థానముగా ఒక నియమిత ప్రదేశమునుచెప్పలేము. పైన తెలిపిన సందర్భములు ఒక ఎత్తైతే మరొకటి పాఠశాలలోని గంట.అబ్బ పిల్లలు ఎంత ఆనందం పొందుతారో చెప్పలేము.మధ్యాహ్నం 12 గంటలకు మోగేది ఆకలితెలిపేగంట.ఈ ఘంటా నాదం ప్రశస్తిచెందినది.కారణము రాజులకాలములో ఈ ఘంటానాదంతోనే (అంటే పెద్దఆకారముకలిగి ఊరందరికీ వినిపించేటంతటి ధ్వనిని ఇవ్వగలిగినది)ఊరందరికీ భోజనాలట. ఉత్సవాలు, జాతరలు, పండుగరోజులలో గంట మోగించనిదే రోజు గడవదు మనకు.కొన్నిచోట్ల వ్యాపారస్థులు తమ వ్యాపార సంస్థలు తెరవటానికి ఉదయం 10 గంటలకు మరియు రాత్రివేళ వ్యాపారసంస్థలు మూసివేయుటకు నియమిత సమయములలో తప్పనిసరిగా ఘంటారావం చేస్తారు.ఇత్తడి గంట ప్రాచీనమైనది.కంచుఘంట అతిప్రాచీనమైనది. దేవుని గుడిలో భక్తులు గంటకొట్టుట ద్వారా శుభశక్తిని కలిగించు శక్తివంతములైన ధ్వనితరంగములు వెలువడి పరిసరములను శుభ్రము చేస్తాయని పూర్వీకుల విశ్వాసము.ఈ ఘంటానాదము మనోమాలిన్యాలను తొలగిస్తుంది. గంట నాదములోని అతి సూక్ష్మతరంగధ్వనులుమన శరీరముపై కూడా మంచి ప్రభావము చూపుతాయి అనుటలో సందేహము లేదు.ఇన్ని రకములుగా ఉపయోగపడే దేవాలయపు గంట చండ్రకర్రను కలిగియుంటుంది. రైలుబండ్లు గమనాగమనములను తెలియజేయుటకు రైల్వేస్టేషన్ లో గణగణమోగే గంటలు ఒకటి లేదా రెండుగా మోగిస్తారు. తద్వారా ప్రయాణీకులను ప్రయాణానికి సన్నద్ధులనుచేస్తారు.సూక్ష్మంగా పరిశీలన చేస్తే ఈ ఘంటానాదము మనలను చక్కగా నడిపిస్తోంది.వేసవిలో ఇండ్లు అగ్గిలో తగులబడునప్పుడు మనం గంటలకార్లుగా పిలుచుకొనేవి వేగంగా ప్రయాణించి ప్రమాదస్థలమునకు వచ్చి మంటలను శాంతింపజేస్తాయి.పొలందున్నే రైతులు తామువ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులమెడలో గంటలు కడతారు.అవి మోగుతుంటే శుభసూచకంగా భావిస్తారు.
***
అన్నట్లు కొన్నిసందర్భాలలో పిల్లిమెడలోగంటకట్టేది ఎవరు అనే సామెత మనకు ఉండనే ఉంది.మరొక్క విషయం,
మన పూర్వీకుల విశ్వాసాలకు అనుగుణంగా చెప్పాలంటే క్లిష్టపరిస్థితులో ధర్మము చెప్పవలసి వచ్చినప్పుడు వారి భావాలకు అనుగుణముగా,సందర్భానికి తగినట్లుగా గుడిలో ఆకాశగంటలు మోగుతాయని నమ్మకముకలిగి యుండేవారు.తెలుగు సాహిత్యావధానము చేసేచోట పృచ్ఛకుడు గంట మోగిస్తుంటాడు.చివరగా అవధానిగారు ఆ గంట ఎన్నిసార్లు మోగిందో చెప్పాలి.ఇది చక్కని కళ.ఇది పరీక్ష.నేటి విద్యార్థులు పరీక్షలు రాసేసమయములో ప్రారంభించుటకు సూచనగా గంటమోగించుట, పరీక్షాసమయం ముగిసినదనుటకు చివరిగంట కొట్టుటమనకు తెలిసిన విషయము.ఇచట గంటకొట్టుట కాలమువిలువను తెలియజేయుటకు సంకేతముగా ఉన్నది.మనం ప్రయాణించు బస్సులు ఆగినడుచుటకు కండక్టరుగారికి డ్రైవరుగారికి మధ్య ఇది అనుసంధానముగా పనిచేస్తూ ఉంటుంది.
***
No comments:
Post a Comment