జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 20 - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 20
చెన్నూరి సుదర్శన్


(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.) 
జీవితాలు గాడిన పడతాయనడానికి  నేనే ఒక ఉదాహరణ.

            నేను ఇంటర్మీడియట్ పాసవుతానను కోలేదు. సార్  తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు  ఉచితంగా ప్రైవేటు తరగతులు తీసుకొని బోధించాడు. మా బ్యాచ్‍లో అంతా  పాసయ్యాం.

            ప్రస్తుతం నేను సెకండరీ గ్రేడు టీచర్ని.. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాను. దానికి కారణం సూర్యప్రకాష్ గారు నాకు ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చి తీర్చిదిద్దిన ఫలితం. సార్‍కు నేను.. నా జీవితాంతం రుణపడి ఉంటాను” అంటూ నావంక తిరిగి తల వంచి రెండు చేతులా నమస్క రించాడు.

            సభలో చప్పట్లు మరోసారి మారుమ్రోగాయి. నా మనసు దూది పింజంలా ఎగిసి పడింది.          

నేను సుధాకర్‍ను అభినందించాను. అతడి సహకారంతో  నేను మునిపల్లి కాలేజీని చక్కదిద్దిన వైనాన్ని వివరించాను. విద్యార్థుల, తోటి అద్యాపకుల సహకారం లేనిదే ఎవరూ విజయం సాధించలేరని ధన్యవాదాలు తెలుపుకున్నాను..    

            నా జీవితంలో మరుపురాని రోజది. ఉపాద్యాయునికి విద్యార్థులే మూలధనం. వారే స్థిర ఆస్తులు. విద్యార్థుల నుండి లభించే గౌరవమే చెరగని కీర్తి ప్రతిష్టలు.

***

1995.. మెదక్ జిల్లాలోని సూరారం జూనియర్ కాలేజీలో జాయినయ్యాను.         

కాలేజీ మెదక్ జిల్లా అంచున.. హైదరాబాదు, ముంబై జాతీయ రహదారిపై ఉంది. ప్రతీ ఆరగంటకో బస్సు.. సిటీ నుండి కాలేజీకి వెళ్లి రావచ్చు. శంకర్ పల్లి రైల్వే స్టేషనూ సమీపంలోనే ఉంది. ఇంత సౌకర్యమున్నా కాలేజీలో విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. దాని కారణం ప్రైవేటు కాలేజీల ప్రభావం..

            దానికి తోడు ప్రైవేటు కాలేజీల్లో సైతం ప్రభుత్వపరంగా స్కాలర్షిప్‍ల పంపకం మొదలయ్యింది. విద్యార్థులకు కావాల్సింది నాణ్యమైన చదువు.. అది ప్రైవేటు కాలేజీల్లో మాత్రమే దొరుకుతుందనే అపోహ.. పైగా స్కాలర్షిప్ రూపంలో వచ్చిన డబ్బులు ఎంసెట్ కోచింగ్ కోసం వినియోగించుకోవచ్చు అనే ఆశ వెరసి ప్రభుత్వ కాలేజీల

అడ్మిషన్లకు గండి పడింది.

            ఇక ప్రభుత్వ కాలేజీలకు వచ్చే విద్యార్థులు కేవలం నిరుపేదలు. రెక్కాడితే గాని డొక్కాడని తల్లి దండ్రుల ఆశాజీవులు. వీరికి ఎంసెట్‍తో పని లేదు. నిత్యం కాలేజీకి హాజరయ్యే అవసరమూ లేదు. తమ పనులు తాము చేసుకుంటూ  వీలున్నప్పుడు  అలా  కాలేజీకి  వెళ్లి  ముఖం  చూపించి  ఇలా వచ్చేయవచ్చు.   

            ఇలాంటి సౌకర్యం ప్రైవేటు కాలేజీలలో ఉండదు.

            ప్రభుత్వ కాలేజీలు విద్యార్థులను ఆకర్షించడానికి ఈమాత్రం వెసులుబాటు కల్పించకపోతే కాలేజీలు ఎక్కడ మూత పడిపోతాయో..! అనే ఆందోళన మొదలవుతోంది.. అయినా మన జీతాలు మనకు ఠంచనుగా మొదటి తారీఖున రాక తప్పవుగా.. విద్యార్థులపై ఆంక్షలు పెట్టి మన తలమీదకెందుకు తెచ్చుకోవడమనే ధోరణిలో లెక్చర్లర్లు..

            ప్రభుత్వ కాలేజీలకు ప్రత్యేక భవనాలు లేక హైస్కూళ్ల నాశ్రయించడం.. కేవలం ఒక షిఫ్టు లోనే కాలేజీలు నడిచేవి.. దీంతో కొంత మంది లెక్చరర్లు షిఫ్టుకు అనుగుణంగా ప్రైవేటు కాలేజీల్లో చెప్పడం.. ప్రభుత్వ కాలేజీలలో విద్యార్థుల సంఖ్య తగ్గిందని అనుకుంటాను.            

            అలాంటి సమయంలో నేను సూరారం కాలేజీలో అడుగు పెట్టాను. నన్ను చూడగానే “మీ కోసమే చూస్తున్నాను సార్.. వెల్‍కం..” అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు కాలేజీ ప్రిన్సిపల్ యాదగిరి. అతడు నాకు  స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులో సుపరిచితుడు. మా కాలేజీకి రండని అడుగుతూ ఉండేవాడు.

            అభివాదం చేస్తూ “మీ దగ్గర పని చేయడం నాకూ సంతోషంగానే ఉంది సార్..” అన్నాను. జాయినింగ్ రిపోర్ట్ అందజేసాను. రిజిస్టర్లో సంతకం చేస్తుంటే.. కొంతమంది స్టాఫ్ మెంబర్స్ వచ్చారు. వారింకా హాజరు రిజిస్టర్లో సంతకాలు చేయలేదు. అప్పటికే కాలేజీ ఆరంభమై అర గంట దాటింది.. నాకు తెలుసు. ఇక్కడా.. అదే అలవాటు. కాలేజీకి ‘ఆయా రాం.. గయా రాం..’.

            యాదగిరి అందరిని పరిచయం చేసాడు. కాని నాకున్న ఇన్‍ఫర్మేషన్ ప్రకారం మరో ఇద్దరు లెక్చర్లు రావాలి.

            హాజరు రిజిస్టర్లో చూసాను. వారి సంతకాలు లేవు..   అంటే ఇంకా రాలేదన్నమాట..  అనుకుంటూండగా ఆ ఇరువురు ప్రత్యక్ష మయ్యారు.

“సార్.. వీరు ఎకానామిక్స్ లెక్చరర్ ఏకాంబరం.. వారు సివిక్స్ మేడం సునీత” అంటూ వారిని ‘వీరు మ్యాథ్స్ లెక్చరర్ సూర్యప్రకాష్” అంటూ నన్నూ పరిచయం చేసాడు యాదగిరి. “ఈ జిల్లాలో సూర్యప్రకాష్ తెలియందెవరికి సార్ హ్హ..హ్హ..హ్హా..” అని నవ్వుతూ  చేయి కలిపాడు ఏకాంబరం.. ‘హ్హహ్హహ్హా..’ నవ్వడం అతడి చిరునామా.

ఏకాంబరం నాకంటే సీనియర్.. తోటి లెక్చరర్లను సార్ అని సంబోధించడం నామోషీగా భావిస్తాడు. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయని కుసంస్కారి అని తెలుసు. ఇంకా అప్పులు చేయడంలో దిట్ట. తిరిగి చెల్లించాలనే సంస్కృతి అతడి డిక్షనరీలో లేదని కాస్తా జాగ్రత్తగా మసలుకోవాలని నా మిత్రబృందం ఉప్పందించారు.

సునీత “హలో సార్..” అంది చిరునవ్వు పెదవులపై పులుముకుంటూ..

 (ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages