కుక్కుటలింగ శతకము - అల్లమరాజు రంగశాయి కవి - అచ్చంగా తెలుగు

కుక్కుటలింగ శతకము - అల్లమరాజు రంగశాయి కవి

Share This
కుక్కుటలింగ శతకము - అల్లమరాజు రంగశాయి కవి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవి పరిచయం:
అల్లమరాజు రంగశాయి కవి (క్రీ.శ.1861-1936) పిఠాపురము సమీపములోని చేబ్రోలు గ్రామనివాసి. వీరు ఆపస్తంబసూత్ర, ఆరామద్రావిడ బ్రాహ్మణులు. హరితసగోత్రులు. వీరివంశమునందు చాలామంది కవులు కలరు. వీరితండ్రిగారైన అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి బహుగ్రంధకర్త. సుబ్రహ్మణ్యకవి అనేక గ్రంధాదులేకాక అనేక శతకముల కర్త కూడా. రంగశాయికవి తల్లి పేరు చిన్నమ. 
ఈ కవి జీవిత విషేషాలను, వీరు ఇతర రచనలను గురించి మనం గతంలో పరిచయం చేసుకొన్న "మాధవ శతక" పరిచయంలో చర్చించుకున్నాము గనుక ఇక్కడ మరల వ్రాయుటలేదు. ఆస్క్తిగలవారు మాధవ శతక పరిచయమును చూడగలరు.
శతక పరిచయం:
"కుక్కుటలింగా" అనే మకుటంతో 104 కందపద్యములతో రచింపబడిన ఈశతకం భక్తిరస ప్రధానమైనది. శతక మంతయి చక్కని సరళమైన భాషలో సాగిపోతూ చదివేవారికి తన్మయత్వాన్ని కలిగింపచేస్తుంది. 
క. శ్రీపీఠికా పురంబునఁ
గాపురముగనుండి భక్తగణములనెల్లన్
జేపట్టిప్రోచుచుంటివి
గోపతివిలసత్తురంగ కుక్కుటలింగా

అనే పద్యాన్ని గమనిస్తే ఈ శతకం పిఠాపురమున వెలసిన కుక్కుటేశ్వర స్వామిపై చెప్పిన శతకమని తెలుస్తున్నది. కొన్ని కద్యాలను చూద్దాము.
అంత్యానుప్రాసలో ఉన్న ఈ పద్యాలను గమనించండి
క. అంగజమదభంగ దయా
పాంగ ధరిత్రీశతాంగ వార్ధినిషంగా
గంగాశశిమారుతభు
క్పుంగవలసదుత్తమాంగ కుక్కుటలింగా

క. నారద పారద శారద
నీరద మందారతరతారనిభధవళాంగా
గౌరీమనోబ్జభృంగా
ఘోరాఘతమఃపతంగ కుక్కుటలింగా

క. పండితలోకాధారా
చండగజాసురవిదార సద్భసితాళీ
మండిత శరీరధీరా
కుండలీవరరమ్యహార కుక్కుటలింగా

ఈశతకంలో శివలీలావిలాసము గురించిన పద్యాలు అనేకం. కొన్నిటిని చూద్దాం
క. భూరితపం బర్జునుఁడు తు
షారాచలవనమునందు సలిపఁ గిరాతా
కారుడవై కృప నాతని
కోరికలనొసంగితీవె కుక్కుటలింగా

క. మును మార్కండేయమహా
మునినిన్నున్ భక్తి తోడఁ బూజింపఁగనా
తనిఁబ్రోచి దందధరుమా
ర్కొనఁ దన్మదమణఁచితీవె కుక్కుటలింగా

క. పురదానవులు జగంబులఁ
గరమున్ బాధింపుచుండఁగను గోవిందున్
శరముగఁ గైకొనియాము
గ్గురినిన్ బఱిమార్చితీవె కుక్కుటలింగా

క. రక్కసులును వేలుపులును
జక్కఁగ జలనిధిమధించు సమయంబునఁ బెం
పెక్కిన హాలాహలమొక
గ్రుక్కంగొని మ్రింగితీవ కుక్కుటలింగా

క. తొలి రావణాసురుఁడు ని
న్నలఘమతిన్ గొల్వనతని కైశ్వర్యములం
గలుగంగఁజేసితివి భ
క్తులకున్ గల్పద్రుమమవు కుక్కుటలింగా

మరి కొన్ని పద్యాలు
క. జడుఁడను పామరుఁడనిదీ
నుఁడను భవత్సేవకుఁడనిన్ నమ్మితినా
యిడుములఁదొలగింపుమునీ
గుడికిఁబ్రక్షిణమొనర్తుఁ గుక్కుటలింగా

క. కవితారసజ్ఞులగుమా
నవులనవునని మెచ్చుకొనఁగ నా వాక్కులు త
క్కువయైనను నీనుతులె
క్కువగానొనరింపుచుందుఁ గుక్కుటలింగా

క. కనుఁగొనుటకు దుర్లబుఁడని
మనముననినుఁదలచినంతమాత్రంబున నే
కనుపండువగానేది
క్కునఁజూచిననుంటివౌరా కుక్కుటలింగా

క. నీపదయుగళము నామది
లోపలనమ్ముచునునిచ్చలున్ నినుఁగొలుతుం
బాపములణఁచుముకరుణా
కుపారగిరీశయీశ కుక్కుటలింగా

భక్తిరసభావనతో కూడిన ఈశతకం అందరు చదివి ఆనందించవలసిన శతకము. మీరు చదవండి, మీ మిత్రులచే చదివించండి.

No comments:

Post a Comment

Pages