పార్వతి కధ - అచ్చంగా తెలుగు
పార్వతి కధ 
పొత్తూరి విజయలక్ష్మి 
(జంధ్యాల పికెల్స్, అచ్చంగా తెలుగు సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కధల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కధ )

దేశం మన దేశమే. అప్పటికే  దేశానికి స్వతంత్రం వచ్చి    చాలా కాలమైంది. 

పల్లె కు ఎక్కువ పట్నానికి తక్కువ అయిన వూరు అది. వేసవి కాలం ముగిసి పోయింది.  బయట మంచం వేసుకుని పడుకుంటే ఈదురుగాలి నాలుగు చినుకులు మధ్యలో లేపే స్తున్నాయి. ఆవేళ అలాగే జరిగింది. అర్థరాత్రి దాటాక గాలి దుమారం .మంచాలు వరండాలోవేసుకున్నారు ఆ ఇంటి వాళ్ళు.

కాసేపు అటు ఇటు దొర్లి నిద్రకు ఉపక్రమించారు. అప్పుడే వాకిట్లో బరు బరు అంటూ చీపురు చప్పుడు.  పార్వతి  చిమ్మటం ప్రారంభించింది.

"అమ్మడూ! ఇంకా తెల్లవారిటానికి చాలా సమయం ఉంది పడుకో!"  అన్నాడు రామ్మూర్తి.

 "అట్లాగా  నాన్నా !  "అంటూ చీపురు పక్కన పెట్టి లోపలికి వెళ్ళింది పార్వతి.

ఆ సమయంలోనే కరెంటు పోయింది . ఒక లాంతరు వెలిగించుకుని పుస్తకాలు తీసుకుని వరండాలో కూర్చుని అశోకుడు సామ్రాజ్యము పాలించెను అంటూ చదువు ప్రారంభించింది.

" ఇప్పుడు చదువు ఏమిటమ్మా కాసేపు పడుకో. " అన్నాడు రామ్మూర్తి మళ్లీ.

"నిద్ర తేలి పోయింది నాన్న చదువు వద్దంటే పోనీ  సంగీత సాధన చేసుకొనా?" అన్నది.

 అప్పుడు సంగీత సాధన ప్రారంభిస్తే చుట్టుపక్కల వాళ్ళకు కూడా నిద్రా భంగం. సంగీతం కంటే చదువే నయం.  అందుకే." సంగీతం వద్దులేమ్మా చదువుకో. కాస్త మెల్లగా చదువుకో "అంటూ బుజ్జగింపుగా చెప్పాడు.

రుక్మిణి దిండు లో తలచుకుని ఏడవటం మొదలు పెట్టింది అది గమనించాడు రామమూర్తి. 

" ఊరుకో ఏడిస్తే కష్టాలుతీరిపోతాయా అనవసరంగా నీ ఆరోగ్యం పాడైపోతుంది." అన్నాడు ఓదార్పుగా.

భార్యకు చెప్పాడు కానీ ఆయనకి మనసు భారం అయిపోయింది.  దీని జీవితం ఎట్లా తెల్లవారుతుంది అనుకున్నాడు బాధగా.  ముగ్గురు కొడుకులు. తరువాత అపురూపంగా పుట్టిన ఆడపిల్ల పార్వతి. చక్కగా పచ్చగా ఇంత జడతో చూడముచ్చటగా ఉంటుంది.  వయసుకి  తగినట్లు  బుద్ధి పెరగలేదు . పని పాటలు బాగానే చేస్తుంది కానీ అమాయకత్వం. ఏమీ తెలియదు . డాక్టర్లకు చూపించినా ఫలితం లేకపోయింది . ఎవరిని చూసినా తగని ఆపేక్ష పడిపోతుంది. .ప్రేమగా పలకరిస్తుంది. అమాయకంగా ఏవేవో ప్రశ్నలు వేస్తుంది.  ఇంట్లో వాళ్లకి మాత్రమే కాదు. ఊళ్ళో అందరికీ పార్వతి పట్ల జాలి, ప్రేమ.

కూతురిని చూసి కుమిలిపోతుంటారు తల్లిదండ్రులు . పార్వతికి పద్ధెనిమిది ఏళ్లు  నిండాయి.  స్కూలుకి పంపించినా లాభం లేదు కాబట్టి ఏవో పుస్తకాలు తెచ్చి, ఇంట్లో చదువుకో అని నచ్చ చెప్పారు. 

 ఇష్టం వచ్చినప్పుడల్లా ఆ పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటుంది. సంగీతం నేర్చుకుంటా అంటే ఊర్లో మాస్టర్ చేత నేర్పిస్తున్నారు .  అపశృతులతో ఇల్లు ఎగిరిపోయేలాగా సాధనలు  చేస్తూ ఉంటుంది.

 రామ్మూర్తి ఇద్దరు కొడుకులకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఆయన పెద్ద కొడుకు ఆ ఊర్లోనే ఉద్యోగం.  స్కూల్లో టీచరుగా  పని చేస్తున్నాడు. పార్వతి కి పెళ్లి అంటే చాలా ఇష్టం. అన్నయ్యల పెళ్లిళ్లలో  " నాన్నా!  నాకు చెయ్యవా పెళ్లి?" అని  పేచీ పెట్టింది.

అప్పుడే కాదు ఊరిలో ఎవరికీ పెళ్లి కుదిరినా చూడాలి పార్వతి హడావిడి.  పరుగులు పెడుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది .నీకు పెళ్లి కుదిరింది ఎంచక్కా  అని ఆనంద పడి పోతుంది.  ఇంటికి వచ్చి అరుంధతి కి పెళ్లి ,  మరి నాకు పెళ్లి చేయవా  నాన్నా అని గొడవ పెడుతుంది. రామ్మూర్తికి  దుఃఖం ఆగదు. 

చేస్తాం అమ్మా అని సమాధానం చెప్తాడు.  ఎవరు చేసుకుంటారు ఈ  పిచ్చి పిల్లనీ !  అలా కాలం గడుస్తూ వుండగా ఒక రోజు హఠాత్తుగా ఒక కార్డు వచ్చింది వీళ్ళ ఇంటికి. పార్వతికి పెళ్లి సంబంధం సూచించారు ఎవరో. ఆశ్చర్యపోయాడు రామ్మూర్తి.  ఎవరికో రాయబోయి నాకు రాశారు అని అవతల పడేసాడు.

మరో రెండు నెలల తర్వాత మళ్లీ వచ్చింది ఉత్తరం. ఈసారి అందరూ చదివారు.  పెద్ద కొడుకు కలగ  చేసుకున్నాడు. 

"ఎవరు రాశారు."   అని అడిగాడు.

 "ఎవరో గోపాల రావు అని ఆయన రాశారు ."

"ఆ గోపాలరావు కి ఉత్తరం రాసి విషయం ఏమిటో  కనుక్కోండి "అని సలహా ఇచ్చాడు కొడుకు.

 ఉత్తరం రాశాడు రామ్మూర్తి.  సమాధానం వచ్చింది  పెళ్ళికొడుకు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. తండ్రి లేడు. తల్లి నాయనమ్మ  ఉన్నారు .సొంత ఇల్లు ఉంది. వాళ్లు నెమ్మదైన పిల్ల కావాలనుకుంటున్నారు అందుకే మీకు రాశాను. సంప్రదించి చూడండి అని సమాధానం రాశాడు గోపాలరావు.

ఏం చేయాలో తోచలేదు రామ్మూర్తికి. మంచి అవకాశం వచ్చింది. వదులుకోకు, ఏమో దాని అదృష్ట ఎట్లా ఉంది ఎట్లా ఉందో. అన్నారు శ్రేయోభిలాషులు.

 మనం ఎల్లకాలం ఉండిపోతామా? దానికి ఒక తోడు నీడ కావాలి కదా. చూద్దాం అని నచ్చ చెప్పింది భార్య.

తను కూడా ఆలోచించి మంచి రోజు చూసుకుని వాళ్లకి ఉత్తరం రాశాడు.

 "మా అమ్మాయి అమాయకురాలు.  గంటసేపు పెళ్లి చూపులు చూసి నిర్ణయించుకునే వ్యవహారం కాదు .మీరు మా బంధువు లాగా వచ్చి మా ఇంట్లో రెండు రోజులు ఉండండి. మా అమ్మాయిని చూడండి. మీకు అంగీకారం అయితే ముందుకు సాగుదాం. అది నాకు బాధ్యతే కాని బరువు కాదు." అని స్పష్టంగా రాశాడు.

మరో పది రోజుల తర్వాత వారి దగ్గర నుంచి సమాధానం వచ్చింది ఫలాని రోజుకు రావచ్చునా అని రాసారు. వీళ్ళు తమ అంగీకారం తెలియజేశారు.

మరో నాలుగు రోజుల్లో వాళ్ళు వస్తారన గా ఇంట్లోనే ఆడవాళ్లు పార్వతికి   బుద్ధులు నేర్పడం ప్రారంభించారు . వాళ్ళని  మందలించాడు రామ్మూర్తి.

 "అది ఎలా ఉంటుందో అలాగే ఉండనివ్వండి. అలంకారాలు అందాలు ఏమి వద్దు. వాళ్ల ముందు ఏమి దాచటం నాకు ఇష్టం లేదు .ఇష్టమైతే చేసుకుంటారు లేకపోతే మానేస్తారు." అని కచ్చితంగా చెప్పేసాడు.

 వాళ్ళు వచ్చారు. పెళ్లి కొడుకు పేరు రాజారావు. చూడటానికి చక్కగా ఉన్నాడు. వెంట అతని తల్లి మరొక బంధువు వచ్చారు. ఆదరంగా ఆహ్వానించి తన కుటుంబ సభ్యులని పరిచయం చేసాడు రామ్మూర్తి.

పార్వతికి మనుషులంటే తగని ఆపేక్ష. ఇంటికి బంధువులు ఎవరైనా వస్తే చాలు వాళ్ళ కూడా కూడా తిరుగుతుంది వాళ్లకి బోలెడన్ని మర్యాదలు చేస్తుంది.

 అలాగే రాజారావు వాళ్లకు కూడా చాలా మర్యాదలు చేసింది. తనకు వచ్చిన కథలు చెప్పింది. పాటలు పాడి వినిపించింది.  వాళ్ళు రెండు రోజులు ఉన్నారు.
 మేము ఆలోచించుకుని చెపుతాము అని చెప్పి వెళ్లిపోయారు.

 మంచి  సంబంధం . పార్వతికి   ఇలా వుండాలి వాళ్ళ ముందు అని   కాస్త  ముందు నుంచి చెప్పి వుంచితే బాగుండేది అని బాధపడ్డారు ఇంట్లోనే ఆడవాళ్లు.

తండ్రి మాత్రం ఏదో వచ్చారు చూశారు వెళ్లారు. బంగారం లాంటి కుర్రాడు  . ఈ పిచ్చి పిల్లను  చేసుకోవాల్సిన కర్మ అతనికి ఏమిటి అనుకున్నాడు రామ్మూర్తి.

    ఎవరు ఊహించని విధంగా రెండు వారాల తర్వాత ఆ బంధువు వచ్చాడు . 
కబురు కాకరకాయ లేకుండా ఊడిపడ్డాడు.  వాళ్లకు మీ సంబంధం నచ్చింది. మీకు అంగీకారం అయితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు.

ఇంట్లోవాళ్ళకి నోట మాట రాలేదు. రామ్మూర్తి నమ్మశక్యం కాలేదు.

నిక్షేపంలాంటి కుర్రాడు. గవర్నమెంట్ ఉద్యోగం .అతని తలుచుకుంటే ఎంతో గొప్ప సంబంధం వస్తుంది . కోరి కోరి మా అమ్మాయి నీ ఎందుకు ఎంచుకున్నాడు  అని అడిగాడు.

 ఈ కాలం ఆడపిల్లలు ఎలా ఉన్నారో మీకు తెలుసు కదా అండి.

అతనికి తల్లి నాయనమ్మ ఉన్నారు.  తనతో పాటు వాళ్ళని కూడా ఆ దరంగా చూసుకునే భార్య కావాలని అతని కోరిక.

 మీ అమ్మాయి అమాయకురాలు అయినా మంచి మర్యాద తెలిసిన పిల్ల . అందుకే ఇష్టపడ్డారు అని వివరంగా చెప్పాడు.

రామ్మూర్తి ఇంకా ఏదో అడగకపోతే భార్య లోపలికి పిలిచింది   

"మీరు మీ చాదస్తం ! ఇంత జరిగినా ఇంకా అనుమాన మేనా!

 వాళ్లకి కోపం వస్తే తిరిగి వెళ్ళిపోతారు. వాకిట్లోకి వచ్చిన అదృష్టం కాల తన్ను కున్నట్టు అవుతుంది. సరే అనండి " అని సర్ది చెప్పింది.

 రామ్మూర్తికి అదే మంచిదేమో అనిపించింది వెళ్లి ఆయనతో తన అంగీకారం తెలియజేశాడు.

ఆయన ఎంతో ఆనందించాడు. వారి వైపున నేనే  పెద్ద.

 మీరు అంగీకరిస్తే తాంబూలం పుచ్చుకొని ముహూర్తం నిశ్చయించుకుని రమ్మన్నారు అని చెప్పాడు. 

ఇంట్లోవాళ్ళకి కాళ్లు చేతులు ఆడలేదు.  అటూ ఇటూ పరుగులు పెట్టారు.

భోజనాలు అయ్యాక  ఊర్లోని నలుగురు పెద్దలకు పెట్టి పురోహితుడిని పిలిపించి అందరి ఎదుట నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు . ఇచ్చిపుచ్చుకోవటాలు మాట్లాడుకున్నారు . ముహూర్తం  నిశ్చయించుకున్నారు.  సమయానికి పార్వతి ఇంట్లో లేదు . పక్క ఊర్లో ఎవరింట్లోనో సత్యనారాయణ వ్రతం అయితే వెళ్లింది. సరిగ్గా తాంబూలాలు పుచ్చుకుంటున్న సమయంలో వచ్చింది.

"ఏమిటి అమ్మా ఇదీ?  ఏదైనా పూజ చేస్తున్నారా?" అని అమాయకంగా అడిగింది.

 దగ్గరికి తీసుకు కళ్లనీళ్లు పెట్టుకుంది  తల్లి.  తల నిమిరింది. బుగ్గలు పుణికి ముద్దుపెట్టుకుంది. "  పూజ కాదమ్మా నీకు పెళ్లి." అని చెప్పింది.

ఇక పార్వతి ఆనందానికి పట్టపగ్గాలు లేవు పరుగులు పెడుతూ వెళ్లి ఊళ్ళో అందరికీ  చెప్పి వచ్చింది.

అందరూ ఆనందించారు. పోనీలే  ఇన్నాళ్టికి పార్వతికి మంచిరోజులు వచ్చాయి  అనుకున్నారు.

మంచి ముహూ ర్తం లో పార్వతికి వివాహం అయింది .ఏ లోటు లేకుండా ఘనంగా చేశారు పెళ్లి.

 ముచ్చట తీరిన మర్నాడు వదిన పార్వతిని చాటుగా పిలిచి "మీ ఆయన నీతో మాట్లా డాడా?"  అని అడిగింది. బోలెడంత సిగ్గుపడిపోయింది పార్వతి.

"ఛీ ఫో వదినా. నువ్వు మరీనూ!!! "అంది మెలికలు తిరిగి పోతూ. అప్పటిదాకా మనసులో ఏ మూలో ఉన్న భయం పటాపంచలు అయిపోగా అందరూ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు.

పెళ్లైన వెంటనే కాపురానికి తీసుకెళ్ళిపోతాను అన్నారు వాళ్ళు .  పార్వతి ముందే సిద్ధమైపోయింది.

 " నాకు ఈ పందిరిమంచం కావాలి నా న్నా!"  అని అడిగింది నిజానికి అది కొడుకులకు చెందాలి. కానీ పిచ్చి తల్లి కూతురు అడిగితే కాదనలేకపోయాడు తండ్రి.  తను కోరుకున్న వస్తువులన్నీ తీసుకొని కాపురానికి వెళ్ళింది పార్వతి.

 వాళ్ళది చిన్న పెంకుటిల్లు . అందులో ఉంటారు రాజారావు  తల్లి, నాయనమ్మ. అతనికి ఏదో దూరం ఊరికి బదిలీ అయింది. మళ్ళీ ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను అని ఆ ఊర్లో ఒక్కడే ఉంటున్నాడు వచ్చి పోతూ ఉంటాడు.

అతనికి ఒక  మేనత్త కూడా ఉంది .ఆవిడకి కూడా ఎవరూ లేరు. తనకి ఉన్న కాస్త ఆస్తి మేనల్లుడికి ఇచ్చి అతని  ఇంటనే పడి ఉందామని అనుకుంది. అతనికి వివాహం కాగానే ఆవిడ వచ్చేసింది.

ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు. పార్వతి. చుట్టపుచూపుగా వచ్చి పోయే భర్త. రాజా రావు నాయనమ్మ జబ్బు మనిషి.  మంచాన పడింది. అదివరకు ఆవిడ బాధ్యత ఆవిడ కోడలు కూతురి మీద ఉండేది. పార్వతి కాపురానికి వచ్చాక వాళ్ళ భారం   తీరింది. 

అన్ని పనులు బాధ్యతలు పార్వతి కప్పగించి, వాళ్లు కాస్త విశ్రాంతిగా సినిమాలకు గుళ్ళకు  వెళ్ళటం ప్రారంభించారు.

పార్వతి కాపురం ఎలా ఉందో చూడడానికి వెళ్ళిన పుట్టింటి వారికి చాలా సంతోషం కలిగింది.  ఎంతో ఆదరంగా చూసుకున్నారు   పెద్దవాళ్లు.

" మీ పార్వతి  కోడలు అవటం మా పూర్వజన్మ సుకృతం." అని వీళ్ళ అడుగులకు మడుగులు వత్తారు.  మొదటి పండగకి అత్తవారింటికి వచ్చి పార్వతీ పార్వతీ  అంటూ క్షణం కూడా భార్యని వదలకుండా తిరుగుతున్న రాజారావు ను చూసి ఊరంతా ముచ్చట పడిపోయారు.  పార్వతి వంటి అదృష్టవంతురాలు ఈ భూమి మీద ఉండదు అని తేల్చి చెప్పేశారు.

 ఏడాది తిరక్కుండా పార్వతి గర్భవతి అయింది. ఆడపిల్ల పుట్టింది.  రమ అని పేరు పెట్టారు.

రాజారావుకి తన ఊరికి రావటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు సరికదా మరింత దూరం ట్రాన్స్ ఫర్ అయింది. చాలా బాధపడిపోయాడు పాపం." చూస్తూ చూస్తూ గవర్నమెంట్ ఉద్యోగం వదల్లేను. పరిస్థితి చూడబోతే ఇది. ఇంత మంది పెద్దవాళ్ళు. పసిపిల్ల .వీళ్ళందర్నీ అంత దూరం తీసుకుపోలేను." అని కళ్ళనీళ్ళ పర్యంతం అవుతుంటే అత్త వారి వైపు వాళ్ళకి మనసు కరిగిపోయింది.

" పరవాలేదులే నాయనా సర్దుకుందాం. మేము ఉన్నాం గా" అన్నారు.

మూడోనెల రాగానే కూతురు వెంట వెళ్ళింది తల్లి. నెల రోజులు అక్కడే ఉండి పాపం పార్వతికి పని ఎక్కువగా ఉంది. కాస్త పెద్దది అయ్యేదాకా చంటి దాన్ని మా దగ్గర ఉంచు కుంటాం" అని తమ వెంట తీసుకు వచ్చేశారు.

    అలా  ఒక దశాబ్దం  గడిచింది. ముగ్గురు ముసలమ్మలు ఒకరి తర్వాత ఒకరు పైకి వెళ్లి పోయారు.

 ఆఖరుగా అతని తల్లి పోయింది. కర్మ కాండలు ఐపోయాయి. ఆశీర్వచనం అయ్యి అందరూ వెళుతుంటే మామ గారి దగ్గరికి వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు రాజారావు.

"ఇక పార్వతి వంటరిగా ఇక్కడ ఎందుకు తీసుకు వెళ్లి పోతాను . చదువు సగంలో ఉంది కదా పరీక్షలు రాయగానే రమ ను కూడా తీసుకువెళ్లి అక్కడికి స్కూల్లో వేస్తాను." అన్నాడు.

       తన అక్కడికి వెళ్లి వసతిగా ఉండే ఇల్లు చూసి నెల మాసికం వెళ్ళేటప్పటికి వచ్చి పార్వతిని తీసుకువెళ్లాలని అనుకున్నాడు. "సామాను అంతా సర్దుకుంటూ ఉండు. ఏ సాయం కావాలన్నా ఇరుగుపొరుగులను పిలు. జాగ్రత్త. ఎప్పుడు వంటరిగా ఉండలేదు నువ్వు"  అని లక్ష జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు.

    అంతలోనే అనర్థం జరిగింది. అతను వెళ్ళిన వారం రోజులకే పార్వతి బావిలో శవమై తేలింది.

   పక్కవాళ్ళు   చూసి బయటికి తీశారు. అందరికీ కబురు పెట్టారు పుట్టింటివారు పరుగున వచ్చారు. వాళ్ల దుఃఖ అంతా ఇంతా కాదు. వాళ్ళను చూసి అందరికీ దుఃఖం కలిగింది. 

పిచ్చి తల్లి . కాపురానికి వచ్చిన దగ్గరనుంచి బాధ్యతలు బరువులు. సుఖ పడే రోజులు వచ్చేసరికి ఆయుర్దాయం తీరిపోయింది అన్నారు.

వీళ్ళ అత్తగారు మంగళవారంనాడు పోయింది. మంగళవారం మారు   కోరుతుంది   అన్నారు.

రాజా రావు ను పట్టడం కష్టం అయిపోయింది . హృదయవిదారకంగా గుండెలు బాదుకుని ఏడ్చాడు.

 తల్లికి కర్మకాండలు నిర్వహించిన నెల రోజుల్లో లోపలి భార్యకు కర్మ చేయాల్సి వచ్చింది పాపం.

 మరో నెల రోజులు సెలవు పెట్టి ఇల్లు ఖాళీ చేసి అమ్మకానికి పెట్టి ఉద్యోగపు ఊరికి వెళ్లి పోయాడు.

కూతుర్ని తనతో పంపించమని అడిగాడు గాని ఎట్లా నాయనా కాస్త స్థిమితపడి అప్పుడు తీసుకువెళ్లే అన్నారు మామగారు.

ఇల్లు అమ్ముడుపోయింది. ఉత్తరాల ద్వారా కబుర్లు తెలుస్తూనే ఉండేవి.  ఒకరోజు ఉత్తరం రాశాడు.

పార్వతి వెళ్ళిపోయాక ఆ లోటు భరించటం దుర్భరం గా వుంది అని చెప్పుకుని  తను మళ్ళీ వివాహం చేసుకుంటున్నట్లూ, ఆదర్శంగా తన వయస్సుకు తగ్గట్టు  ఒక సారి పెళ్లయి కొడుకు ఉన్న దీనురాలిని పెళ్లి చేసుకుంటున్నట్లు  తెలియజేశాడు .

రామ్మూర్తి కుటుంబం అంతా విషాద ఛాయలు అలముకున్నాయి. పార్వతిని తల్చుకుని కుమిలి పోయారు. ఆతరువాత పోయింది ఎలాగా తిరిగి రాదు. అతను మాత్రం పెళ్లయినా ఏం సుఖం అనుభవించాడు. జీవితం   గడవాలి కదా పాపం అనుకున్నారు.

 పెళ్లి చేసుకుని భార్యని కొడుకుని వెంట పెట్టుకుని వచ్చాడు.ఆ అమ్మాయి పేరు లలిత. 

చదువుకుని తెలివిగా ఉంది. కొడుక్కి ఆరేడేళ్లు వున్నాయి.

 రమను తమ వెంట పంపమని అడిగింది లలిత.

 పోయిన కూతురుని దీనిలో చూసుకుంటున్నా మా దగ్గరే ఉండనివ్వండి అని ప్రాధేయపడింది అమ్మమ్మ. 

 వాళ్ళ బాధ అర్థం చేసుకున్న లలిత రాజారావు  సరే అన్నారు .

 తరుచూ ఫోను ద్వారా కూతురి క్షేమ సమాచారం తెలుసుకుంటూ ఉంటాడు రాజారావ్.

 మరో రెండు ఏళ్లు గడిచాయి రాజారావు కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది రాష్ట్రం చివరికి.

ఈ ఊరు బాగుంది ఇక్కడే ఇల్లు కట్టుకుని స్థిరపడి

 పోతాను. అని ఫోన్ చేశాడు.

 ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి పిలిచా డు.

 కానీ వీళ్ళకు వీలు కాక వెళ్ళలేదు.

 తరువాత రెండు నెలలకు పార్వతి పెద్దన్నయ్య ,వదిన, పిల్లలు, రమను,  వెంటబెట్టుకు వెళ్ళారు.

 పరమానందభరితులయ్యారు లలిత రాజారావు.

 ఇల్లు చక్కగా ఉంది. పార్వ తీ  నిలయం.

 ఇంటి లోపల పార్వతి కోరి తీసుకువెళ్లిన పందిరి మంచం మిగిలిన సామాన్లు. అంతా పార్వతీ మయం.

 హాల్లో పార్వతి ఫోటో. ఆ ఫోటో ముందు నిలబడితే దుఃఖం ఆగలేదు అన్నా వదినలకు.

  "ఏమిటో చిన్నప్పటినుంచి అంతేగా ఇది. అర్ధరాత్రి పూట నిద్ర లేచి పని చేద్దామని బావి దగ్గరికి వెళ్ళి ఉంటుంది.   కాలు జారిందో ఏమో!" 

  ఆక్రోశం గా  అంది వదిన .

 ఆడపడుచు అంటే కూతురి తో సమానం ఆవిడ కి.

 "లేదు వదినా! నేను వెళ్ళలేదు. అసలు ఏమైందంటే ఆవేళ అర్థరాత్రి మా ఆయన వచ్చారు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు.

 "పార్వతి. నీకు ఓ మాట చెప్పాలి.  . ఈ బాధ్యతల కోసమే నిన్ను వెతికి పెళ్లి చేసుకున్నాను.

నా సుఖం కోసం వేరే దారి చూసుకున్నాను. ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచడానికి చాలా కష్టపడ్డాను.

 నువ్వు    నాకు ఎంతో సాయం చేశావు.  నీ మేలు మర్చిపోను. 

 ఇక  నీ పని అయిపోయింది. నువ్వు ఇక వెళ్ళిపో అని బావి దగ్గరికి తీసుకొచ్చి తోసేసారు వదినా! "


ప్రాణం పోయిన మరుక్షణం నుంచి తన వాళ్లకు నిజం చెప్పాలని ఆరాట పడుతున్న ఆ పిచ్చి తల్లి పార్వతి మరొకసారి విఫల ప్రయత్నం చేసింది.
***

No comments:

Post a Comment

Pages