"పండగొచ్చింది"
గ్రీష్ముడిపై అలిగి
పాతాళంలో దాగిన
గంగమ్మ పరవశంతో
ఉబికి భూమాత నుదుటిని
ముద్దాడింది
ఒళ్ళుకాలి గోల పెడుతున్న గాలి
జలకమాడి, జలదరించి
చిందులేసింది
కడవ చంకన ఎత్తి, నీకోసం
నేల దూరం కొలిచిన పడతి
ఇంటికి నడచి వచ్చిన నీకు
హారతిచ్చి, పసుపుకుంకుమలతో
స్వాగతించింది
నేలమ్మ పచ్చని చిరకట్టి పరవశించింది
మొయిలు రాజు సంధిస్తున్న
చినుకు బాణాలకు వశం తప్పి
తరువులు ఆకులతో తాలమేసాయి
పక్షులు పరవశంతో పాటలందుకున్నాయి
జీవజాలమంతా ఒళ్ళు మరచి నాట్యమాడాయి!
పండగ!
ఊరంతా పండగ!
నెలంతా పండగ!
***
No comments:
Post a Comment