సౌహార్ద్రం (కథ)
కె.కె.భాగ్యశ్రీ
(జంధ్యాల పికెల్స్, అచ్చంగా తెలుగు సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కధల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కధ )
ఆర్టీసీ కాంప్లెక్స్ అంతా కిటకిటలాడిపోతోంది . వచ్చీపోయే జనాలు, వాహనాలతో బాగా రద్దీగా, సందడిగా ఉంది.
చెల్లిని చూసి మూడునెలలపైనే కావడంతో , ఒక్కసారి చూసొద్దామని సింహాచలం బయలుదేరాను. నేను వెళ్ళేసరికే సింహాచలం బస్సులు ఆగే ప్లాట్‌ఫాం దగ్గర తెలుగువెలుగు, మెట్రో… రెండురకాల బస్సులూ ఆగిఉన్నాయి. తెలుగువెలుగు బస్ నిండిపోయిందప్పటికే.
మెట్రోలో జనం పలచపలచగా ఉన్నారు. బరువుగా ఉన్న బాగ్ మోసుకుని నెమ్మదిగా మెట్రో ఎక్కి కూర్చున్నాను. కిటికీ దగ్గర సీటు దొరకడంతో తాయిలం అందుకున్న పసిపిల్లలాగా సంబరపడిపోతూ... సీట్లో కూర్చుని, నుదుటపట్టిన చమటలని సుతారంగా రుమాలు తో తుడుచుకుంటూ విశ్రాంతిగా వెనక్కి వాలాను.
తెలుగువెలుగు బస్ టికెట్ … మెట్రో టికెట్ కన్నా తక్కువకావడంతో పల్లెజనం దానికే ప్రాధాన్యత ఇస్తారని జనాల అభిప్రాయం. కాని, వెంటవెంటనే మెట్రోలోకి ఎక్కుతున్న కొంతమంది పల్లెప్రజలను చూసి ఆ ఉద్దేశ్యం తప్పనిపించింది. తెలుగువెలుగు- మెట్రో రెండూ బస్సులూ ఒకేసారి బయలుదేరినా …మెట్రో ముందుగా వెళుతుందని చాలామంది మెట్రోనే ఎక్కుతారు.
బస్ బయలుదేరే సమయం కావడంతో కండెక్టర్ వచ్చి టికెట్స్ ఇవ్వడం ప్రారంభించాడు. బస్ లోపలకి వెళ్ళి వెనకనుంచి టికెట్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. నా దగ్గరకు రావడంతో తగిన సొమ్ము ఇచ్చి నా టికెట్ తీసుకుని, జాగ్రత్తగా బ్యాగ్ లో లోపలి అరలో పెట్టుకున్నాను.
కిందటిసారి ఇలాగే సింహాచలం వెళ్తున్నప్పుడు వేగంగా పోతున్న బస్ లోకి వీస్తున్న గాలికి నా టికెట్ కొట్టుకుపోయి అవస్థపడడం ఇంకా గుర్తుంది.
ఆరోజు ఇలాగే టికెట్ అందుకుని, బ్యాగ్ లో పెట్టుకోబోతూండగా గాలికి టికెట్ ఎగిరిపోయి, బస్ అవతలకి పడిపోయింది. కండక్టర్ ని పిలిచి విషయం చెప్పి ఏం చేయాలని అడిగాను.
“చూడండి మాడమ్… ఒకవేళ చెకింగ్ స్క్వాడ్ కనక మీ టికెట్ చెక్ చేసినప్పుడు సమాధానం చెప్పుకోగలను అనుకుంటే మరి టికెట్ తీసుకోకండి. లేదూ… ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుంటే ఇంకో టికెట్ తీసుకోండి’’ అంటూ చెప్పి తన ఉద్యోగధర్మాన్ని చాటుకున్నాడు ఆరోజున్న కండక్టర్.
ఎందుకో… నాకంత సామర్ధ్యం లేదనిపించింది. ఆ వచ్చిన చెకింగ్ స్క్వాడ్ నామాటలను పట్టించుకోకుండా, ఫైన్ వేశారంటే డబ్బుతో పాటు పరువూ పోతుంది. ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటూ వేరే టికెట్ తీసి పర్సులోపల దాచుకున్నా.
ఆనాటి ఆసంఘటన తలపుల్లో మెదిలి నవ్వొచ్చింది నాకు.
ఇంతలో ముందు సీట్లోనుంచి ఏదో గలాభా వినిపించింది. ఏమిటా అని ఆసక్తిగా ముందుకు వంగి చూశాను. ఎవరో… ముసలమ్మ… కండక్టర్ సీట్లో కూర్చుని ఉంది. వయసు రీత్యా అతివృధ్ధురాలు కావడంతో బాగా ఉడిగిపోయి ఉంది. కండక్టర్ ఆమెతో ఏదో అంటున్నాడు. ఆమె వినిపించుకోకుండా ఘర్షణ పడుతోంది.
“నామాట వినిపించుకో మామ్మా… ఇది మెట్రో బస్సు. దీని టికెట్ కొంచెం ఎక్కువ. నువ్విచ్చిన డబ్బులకి అదుగో… పక్కనే ఉందే… ఆబస్సు ఎక్కాలి. నామాట విని అందులో ఎక్కు.’’ శాంతంగా చెప్తున్నాడు కండక్టర్.
ముసలమ్మ అతడి మాటలను పెడచెవిన పెట్టి ససేమిరా అని భీష్మించుకుని కూర్చుంది.
“ చెపుతూంటే అర్ధం చేసుకోవేంటి మామ్మా… పక్క బస్ కదిలిపోతోంది. వెంటనే ఎక్కు…’’ మృదువుగా నచ్చచెబుతున్నాడు కండక్టర్.
“నానెక్కను… నానిదే బస్సులో ఎల్తా…నీకేంటి మల్ల!’’ ముసలమ్మ బిగుసుక్కూర్చుంది.
కండక్తర్ నవ్వాడు అసహాయంగా మాకేసి చూస్తూ. ఈ గొడవంతా వింటున్న నా సహ ప్రయాణీకుడొక్కడు “ఆవిడకి టికెట్ ఇవ్వండి సార్…మిగిలిన డబ్బులు నేనిస్తాను…’’ అంటూ తన ఉదారతను ప్రదర్శించాడు.
ఏదో… చోద్యం చూస్తున్నట్లుగా చూస్తూ కూర్చున్నానే గాని, అతడికొచ్చిన ఆలోచన నాకు రాలేదని విచారించాను.
“మీరు భలేవారే సార్… చూడడానికి అలా… పిచ్చిగా కనిపిస్తోంది కాబట్టి ఆవిడ దగ్గర డబ్బు లేదనుకుంటున్నారా! ఆవిడకి బోలెడు పొలాలు, స్థలాలు ఉన్నాయి. చాలా ఆస్తిపరురాలు. ఒకరిద్దరు అనాధ పిల్లలని దత్తత తీసుకుని చదివిస్తోంది కూడా…’’ అంటూ నవ్వాడు కండక్టర్.
“మరెందుకిలా…ఇంత తక్కువ డబ్బులు ఇవ్వనని అల్లరి పెడుతోంది!’’ ఆశ్చర్యపోయాడు ఇందాక డబ్బులిస్తానన్న ప్రయాణీకుడు.
“ ఈ మధ్య బస్ చార్జీలు పెరగడం ఆమె జీర్ణించుకోలేక పోతోంది. అందుకే పాత ఛార్జీనే ఇస్తానని పట్టుపట్టుకుని కూర్చుంది. మాకిది రోజూ అలవాటే…’’ నవ్వాడు కండక్టర్ మరోసారి.
“మరి తత్తిమా చార్జీ ఎవరు భరిస్తారు? ‘’వింతగా ఆడిగాడి స.ప్ర. (సహ ప్రయాణీకుడు)
“నేనే భరిస్తాను సార్… నేనడగడం, ఆమె ఇవ్వనననడం మాకు పరిపాటే… ఇద్దరు విద్యార్ధులకి విద్యాదానం చేస్తోందన్న గౌరవంచేత ఆవిడ టికెట్ షార్టేజ్ ని నేను పెట్టుకుంటాను.’’ నవ్వుతూనే చెప్పేసి ముసలమ్మకి టికెట్ ఇచ్చేసి, మిగితా ప్రయాణీకుల దగ్గరకు సాగిపోయాడు కండక్టర్.
అతడి సమాధానం విన్న ఆ స. ప్ర. ముసలమ్మ ఔదార్యాన్ని కీర్తించడం మొదలెట్టాడు.
“నిజంగా ఆవిడ గ్రేట్… చూడడానికి ఇలా పీనాసిలా కనిపిస్తున్నా, విద్యాదానం చేస్తోందంటే… ఆమె చాలా గొప్పమనిషి.’’ అంటూ ఆమెని మెచ్చుకున్నాడు.
కాని, నాకెందుకో అతడితో ఏకీభవించాలనిపించలేదు.
సాధారణంగా కండక్టర్ అంటే… ప్రయాణీకులకి ఇవ్వవలసిన చిల్లరని ఇవ్వకుండా, తానే తినేసే కక్కుర్తి బుధ్ధున్న వాడిగా భావిస్తాం అందరం. నిజంగా అతడిదగ్గర చిల్లర లేకున్నాసరే… ఆ డబ్బేదో కావాలని మింగేసే మోసగాడిగా తలపోస్తాం. కొన్ని సందర్భాలలో అది వాస్తవమే కావచ్చు.
అలాంటిది, ఒక డబ్బున్న ముసలమ్మ తాను ఒక ప్రభుత్వరవాణా సాధనంలో ప్రయాణించినందుకు గాను న్యాయబధ్ధంగా కి ఇవ్వాల్సిన ప్రయాణ ఛార్జీని ఇవ్వడానికి తటపటాయిస్తోంది. అదే… నెలజీతానికి పనిచేస్తూ, ఆజీతంరాళ్ళపైనే ఆధారపడుతూ బతుకుతూ కూడా … ఆమె ఇవ్వాల్సిన టికెట్ చార్జీని కూడా తన జేబులోనుంచి తీసిస్తూ ఆమెకు సుఖప్రయాణం కల్పిస్తున్న ఇతడిలాంటి కండక్టర్ ని మొదటిసారి చూస్తూంటే నాకు అత్యంత విస్మయం కలిగింది. అతడిమీద అంతులేని గౌరవం కలిగింది.
ఛారిటీ పేరిట ఆమె అనాధలని పోషిస్తూ వారి మంచిచెడ్డలు చూస్తున్నాసరే నాకెందుకో గొప్పగా అనిపించలేదు. అంత ధనికురాలైన ఆమె చేస్తున్న సమాజసేవకంటే … చిరుజీతగాడైన ఈ కండక్టర్ సౌహార్ద్రమే వేయిరెట్లు గొప్పదిగా అనిపించింది. మనసులోనే అతడి పెద్దమనసుకి జోహార్లు అర్పించాను.
బస్సు నెమ్మదిగా కదిలింది రకరకాల మనుషులని తనతో పాటు తీసుకెళ్తూ.
***
No comments:
Post a Comment