అనుబంధాలు - అచ్చంగా తెలుగు
 అనుబంధాలు
కొనకళ్ళ ఫణింద్ర రావు 

రాత్రి పదకొండు గంటలు!
పిల్లలలిద్దరికీ పాఠాలు చెబుతూ, పదే పదే వల్లె వేయిస్తోంది,శ్రీమతి. మధ్య మధ్య లో ప్రశ్నలు వేస్తూ,వాళ్ళు చెప్పలేకపోతే..టెన్షను పడిపోయి..చిరాకు పడిపోతూ..గట్టిగా అరుస్తోంది నా శ్రీమతి, సాధన.

“సాధన”!  పేరుకి తగ్గట్లుగనే ఏదయినా సాధించాలనే పట్టుదల వస్తే నిద్రకూడా పోదు శ్రీమతి . నిద్రపోనీయదుకూడా పిల్లల్ని పరీక్షలొస్తే!
వారానికో శలవుదినం! ఆ ఆదివారం కూడా హాయిగా ఏ సినిమాకో షికారుకో పోకుండా అర్ధరాత్రి వరకూ పిల్లల్ని చదివించేయాలనే తపన తోనే టెన్షన్ టెన్షన్ గా గడిపేస్తుంది సాధన, పిల్లలకి పరీక్షలొస్తే! నచ్చినా నచ్చకపోయినా మౌనం గా వుండిపోవడం తప్ప, నేను చేయగలిగిందేమీలేదు.ఎందుకంటే..నా ఆఫీసు టెన్షన్లు నాకుండటం వల్ల  పిల్లలని పట్టించుకొనే సమయమే దొరకదు నాకు.మరి వాళ్లకోసం అంతగా సమయాన్ని కేటాయించి అభివృద్ధి పథాన నడిపించాలని తాపత్రయ పడిపోతున్న శ్రీమతిని కాదని ఎలా చెప్పగలను?

రాత్రి పదకొండున్నర! ఇంకా పిల్లలతోనే విసిగిపోతోంది శ్రీమతి. నవ్వుతూ, త్రుళ్ళుతూ, హాయిగా డాబామీద పండువెన్నెల్లో మల్లెపూల ఘుమఘుమల్లో.. చాపమీద పడుకొని, చందమామని చూస్తూ..కబుర్లు చెప్పుకోవాలని ఎన్ని కలలు కన్నాను!  అంత లేకపోయినా.. ఆదివారమయినా త్వరగా పక్కకు చేరి ప్రేమజల్లుల్లో తడిసిపోతే ఎంత బాగుంటుంది! కానీ..ఆ ఆశలన్నీ కలలుగానే మిగిలిపోయాయి కదా!

పిల్లల్ని చూస్తే జాలి వేస్తుంది! హాయిగా నానమ్మ తాతయ్యల మధ్య పడుకొని రామాయణ భారతాలు..పేదరాశి పెద్దమ్మ..కథలువింటూ హాయిగా నిద్రలోకి జారుకొనే వయసులో ఆ ముచ్చట్లే లేక ఎన్ని కష్టాలొచ్చాయో కద! ఒక్క సారి నిట్టూర్చి బెడ్ రూం లోకి వెళ్లిపోయాను ఒంటరిగా!

పడుకున్నా నిద్ర రావడంలేదు. తన చిన్న నాటిరోజులన్నీ కళ్లలో రీళ్లుగా తిరుగుతున్నాయి! ఎంత అందమైన బాల్యం! ఎంత అందమైన పల్లె వాతావరణం! ఎన్ని ముచ్చట్లు!ఎంత ప్రేమని పంచుకున్న రోజులు!

నలుగురం పిల్లలమైనా ఎంత ఓర్పుగా పెంచారు అమ్మ నాన్న! అల్లారు ముద్దుగా గారాబాలు పంచటమే తప్ప విసుగు చిరాకులతో వాళ్ళు  గట్టిగా కళ్ళెర్రజేయడమే తెలియదు నాకు! వాళ్ళ ప్రేమకు జోడై రెట్టింపు గారాలు పంచారు నానమ్మ తాతయ్యలు. కథలు,శ్లోకాలు,శతకాలు చదివించడం, రాత్రయ్యేసరికి పక్కలో వేసుకొని కథలు చెప్పి నవ్వించడం..లాలిపాటలతో  నిదురపుచ్చడం తాతయ్య,నానమ్మల నిత్య జీవితం గా వుండేది! వాళ్ళ లాలనలో ఎంత మధురంగా గడచాయి చిన్ననాటి రోజులు! ఎవీ ఆముచ్చటు నాపిల్లలకు?

ఆలోచనలతో నిద్ర రావడంలేదు.పిల్లల్ని గొప్పవాళ్లని చేశేయాలనే తపనతో..ఎంత శ్రమ పడిపోతున్నాం ! ఎంత శ్రమ పెడుతున్నాం వాళ్లని! నిజమే! ఇప్పటి పరిస్థితులకి అంతగా కృషి చేయకపోతే ముందుకు వెళ్ళడం కష్టమే మరి! “సాధన” తప్పుకూడా కాదు! కానీ..పిల్లల పరీక్షలొస్తే ప్రపంచాన్నే మరిచిపోయేలా జీవించడం అవసరమా?

అమ్మ నాన్న వద్దామనుకున్నారు.ఫోను చేసారు ఒక నెల ఉండేలా వస్తున్నామని! కానీ...

బాధగా మూలిగింది మనసు!

“పిల్లల పరీక్షలు.పరీక్షలయ్యాక వద్దురు లెండి”  అని చెప్పింది శ్రీమతి! ఎంత దురదృష్టం! తల్లితండ్రులకు తమ పిల్లల దగ్గరకు వెళ్ళాలన్నా అప్పోయింట్మెంటా! మౌనంగా ఉండటమే..నేను చేయగలిగింది!మరోమాట చెప్పలేని నిర్భాగ్యుణ్ణి!

అల్లోచనలు ఇంకా అలా ముసురుతూనే ఉన్నాయి!

“సాధన” పిల్లల భవిష్యత్తు గొప్పగా చేసేయాలనే తపనతో ఎంతో శ్రమ పడిపోతోంది పాపం! అభినందించవలసిందే!చదువుల్లో ఫస్ట్ రావాలి!ఆటల్లో ఫస్ట్ రావాలి! ఆర్ట్ లాంటి     హాబీలలో గొప్ప వాళ్ళయిపోవాలి! ఎంత ఆశ! తప్పులేదు.తల్లిగా పిల్లలు గొప్పవాళ్ళవ్వాలనుకోవడం తప్పుకాదు! కానీ అందుకు వాళ్ల బాల్యన్నే చిదిమేస్తే..యాంత్రికంగా మారిపోయే వాళ్ల జీవితాలు వాళ్ళు యే అనుబందాలు లేని మర మనుషులేకదా!

మమతాను రాగాలు, తెలియకుండా పెరిగే పిల్లలు ..పెద్ద చదువులు చదివినా..ఉన్నత హోదాకి ఎదిగినా..వాళ్ల జీవితాల్లో మిగిలేది ఏమిటి? అప్పుడు మన పరిస్థి తి ఏమిటి?  ఏమిటి????
****

అదో సుందర ప్రదేశం! ఊరికి దూరంగా..పచ్చని ప్రకృతి! ఆహ్లాదమైన వాతావరణంలో..అన్ని హంగులతో కట్టిన అధునాత భవంతుల సముదాయం! ఆ రిసార్ట్స్ లో సామాన్యులకి ప్రవేశమే దొరకదు. అక్కడ డబ్బుకి అన్ని హంగులూ దొరుకుతాయి ఒక్క ఆత్మీయ ప్రేమానుబంధాలుతప్ప. అక్కడ ఉండాలంటే లక్షలకి లక్షలు ఖర్చు చేయవలసి వుంటుంది! అయితే కోట్లు సంపాదించే వారికి లక్షలు లెఖ కాదుకదా!
అక్కడ ఓ అందమైన భవంతిలో మేం ఉండటానికి అన్ని యేర్పాట్లు జరిగిపోయాయి.
అది లేనివారికైతే "అనాథ శరణాలయం".ఉన్నవారికైతే.."ఓల్డేజ్ హోం" ఇంకా ఉన్న వారికైతే, “సీనియర్ సిటిజెన్ రిసార్ట్స్” అనే పేరులతో పిలవ వచ్చునేమో!

ఎర్పాట్లు చాలా ఘనం గా ఉన్నాయి.ఏ.సి రూములు..టి.వి ల తో సహా అన్ని హంగులూ ఉన్నాయి.బెల్లు నొక్కితే అవసరాలు తీర్చడానికి ఆయాలు ఉన్నారు!మన యింటికంటే గొప్పగా ఉంది అక్కడ! కానీ..

సాధన ముఖంలో నెత్తురుచుక్క లేదు! అంత గొప్ప గా అన్ని ఏర్పాట్లు పిల్లలు చేసినా తృప్తిగా లేదు.ఏదో వెలితి! ఏదో అంతర్గత మధన! ఏదో కోల్పోయిన వేదన!

కొద్దిరోజులకే..అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాం.అంతా పెద్ద పెద్ద ఉద్యోగాలుచేసి రిటైర్ అయ్యినవాళ్ళే! అందరూ గొప్పవారే! డబ్బంటే లెఖలేనివాళ్ళే!

పెద్ద ఎల్.యి.డి టి.వి.లో కొడుకులు కోడల్లు మనుమలు మనవరాళ్లని చూసుకుంటూ మురవడమే మిగిలిందిపుడు.ఎక్కడో అమెరికాలో ఉన్న కొడుకు అమ్మా ఎలా వున్నారంటాడు గుర్తొచ్చినప్పుడెప్పుడో! అత్తయ్యగారూ ఏర్పాట్లన్నీ బాగుంటున్నాయా? ఇబ్బందులేమీ లేవుకదా? అనికుశల ప్రశ్నలు వేస్తుంది కోడలు.

హాయ్! నానమ్మా! హాయ్ తాతయా! అని విష్ చేసేసి  ..బై అంటూ లాప్టాప్ లోలీనమై పోతారు మనవలు మనవరాళ్ళు! ఆష్ట్రేయాలో ఉన్న రెండోకొడుకు కుటుంబంతో సంబంధాలూ ఇంతే!
**** 
పండు వెన్నెల! డాబామీద చాప వేసుకొని..చందమామని చూస్తూ పడుకున్న నేను పక్కకు వచ్చి పడుకున్న సాధన ను చూసి అవాక్కయ్యాను. ఎంతకాలానికి ఇల నా కల పండింది అన్నట్లనిపించినా..అప్పటి కోరికలు ఆవిరై పోయిన మలి రోజుల్లో చిత్రమైన అనుభూతి! చాలా ముభావంగా ఉంది సాధన!
ఎమిటి? అన్నట్లు చూసా!
కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి సాధనకు!

పిల్లని చూడాలనిపిస్తుందండీ అంది మెల్లగా! చిన్నగా నవ్వాను అసంతృప్తితో!

ఎందుకు? పూర్వం  వెళ్ళాం! అనుభవించాం కదా! మళ్ళీ ఎందుకు? ఇప్పటి పరిస్థితులకి వాళ్ళలో మనం ఇమడలేం సాధనా! మనం వాళ్ళకి భారం గానో..అడ్డంకిగానో ఉండకూడదనేగా ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నది! మళ్ళీ ఈ ఆలోచనలేమిటి?

మనం అనుకున్నది సాధించాం.పిల్లల్ని చాలా గొప్ప వాళ్ళని చేసాం. ఎంతగా అంటే మనతో కూడా గడపలేనంత గొప్పగా! వాళ్ల పిల్లల్ని మరింత గొప్పవాళ్ళని చేయాలని వాళ్లకి ఉండదామరి? అందులో తప్పు పట్టవలసిందీ ఏమీలేదు. వాళ్ల బ్రతుకుల్ని వాళ్లని బ్రతకనిద్దాం.మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళని డిస్ట్రబ్ చేయడం ఎందుకు?

మనకే లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసారుకదా! ఇంకేం కావాలి? పిచ్చి ఆలోచనలు చేయక పడుకో! నెమ్మదిగానె అన్నా!
అన్నీ ఉన్నయండీ! అనుబంధాలే లేవు! మూల్గింది సాధన! బాధగా!

 ***

No comments:

Post a Comment

Pages