జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 21
చెన్నూరి సుదర్శన్
(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‌గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి అనుభవాలను వారితో పంచుకుంటూ ఉంటాడు.)
నాక్లాసులో సెకండియర్ పిల్లలు పద్దెనిమిది మంది. అందులో రెగ్యులర్‌గా వచ్చేవారు.. అమ్మాయిలు ఐదుగురు, అబ్బాయిలు ఆరుగురు.
తప్పకుండా పాసవుతారు అనుకునే వారు.. అమ్మాయిలలో ఇద్దరు, అబ్బాయిలలో ముగ్గురు. అలా అయితే మ్యాథ్స్ లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ. అదనపు సమయం తీసుకొని ఉత్తీర్ణత శాతాన్ని కనీసం అరువది పెంచాల
ని ఆలోచిస్తూ క్లాసుకు ప్రిపేర్ అవుతున్నాను.
“ఏం చదువు సూర్యప్రకాష్..! చిన్న పిల్లాడిలా..!! హ్హహ్హ..హ్హా..” నవ్వుతూ తాను కూర్చున్న కుర్చీలో నుండి లేచి వచ్చి నాపక్కనే ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
నాదృష్టిలో ఉపాద్యాయుడు ఒక సైనికుడు. క్లాసులోకి వెళ్తున్నాడంటే కదనరంగంలో అడుగుపెట్టినట్లే.. పరిస్థితి మన అదుపులో ఉండాలంటే పాఠం చెప్పడంలో నైపుణ్యత కలిగి ఉండాలి. విద్యార్థులు సంధించే ప్రశ్నల అస్త్రాలకు.. సమాధాన శస్త్రాలతో మెప్పించాలి.
ఉపాద్యాయుడు నిత్య విద్యార్థి. విజ్ఞాన తాజాతనాన్ని విద్యార్థుల మెదళ్ల మొదళ్లలో చిలకరిస్తూ వారి ప్రగతి మోడుబారకుండా చూడాలి.
నా ముందున్న పుస్తకాన్ని లాగేసుకున్నాడు ఏకాంబరం. నేను చిరునవ్వు పెదవులపై అద్దుకొని ఏకాంబరం వైపు కుర్చీ తిప్పుకున్నాను. అతడి ముఖం విప్పారింది.
“అటు చూడండి సార్.. సునీత చీర చాలా బాగుంది కదూ.. జాకెట్టు చీరంచు బలే మ్యాచయ్యాయి హ్హ..హ్హ..హ్హా” అంటూ తెగ మురిసిపోసాగాడు. నా ముఖ కవళికలు ఎలా ప్రదర్శించాలో అర్థం కాలేదు.
“ప్రకాష్.. ‘మడిసన్నాక కాసింత కళా పోసన ఉండాలోయ్’ ముత్యాలముగ్గు సినిమాలో మన రావుగోపాలరావు అనలేదూ.. లేకుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏముంటుద్ది..హ్హ.హ్హ.హ్హా..” తిరిగి తనే అన్నాడు.
“నాకు నెక్స్ట్ పీరియడ్ క్లాసుంది సార్..” అన్నాను నెమ్మదిగా.. నేను ఇబ్బంది ఫీలవుతున్నట్లు అనుకోవాలని. కాని అతడికాధ్యాసే లేదు. ఫుల్ స్వింగ్‌లో ఉన్నట్లు కనబడ్డాడు గురుడు.
“క్లాసులు ఎప్పుడూ ఉండేవే.. అయినా మనం చెబితే మాత్రం వాళ్ళు పాసవుతారా.. చోద్యం గాని.. హ్హ..హ్హ..హ్హా..”
“అదేంటి సార్.. అలా అంటారు”
“అదంతేలే.. పరీక్షల్లో మన చెయ్యివాటం చూపిస్తే సరి.. ఫుల్ రిజల్ట్స్.. మీకు తెలీదనుకుంటాను.. మన కాలేజీ ఫలితాల ఫైలు చూడ లేదా.. ఎక్జామ్స్ ఇంచార్జివిగదా..”
బుర్ర గోక్కోసాగాను.. ‘ఏ కాలేజీ చూసినా ఏమున్నది గర్వకారణం.. సమస్త కాలేజీలు సైతం పరీక్షల కాపీలమయం..’ అని నా అంతరాత్మ ఘోషించింది.
“అది సరే గానీ రాత్రి ఓ విచిత్రం జరిగింది చెప్పనా?” అంటూ టాపిక్ మార్చాడు ఏకాంబరం. నన్ను ఎలాగూ క్లాసుకు ప్రిపేర్ కానిచ్చేడులా లేడు.. వినక తప్పదని చెవులు అతడికి అప్పగించాను.
“సునీత మొగడు బుడ్డ రాజకీయ లీడరు.. ఇంటిపట్టున ఉండడం తక్కువ. ఎప్పుడూ మీటింగులంటూ తిరుగుతూనే ఉంటడు.. టూర్..టూర్.. టూర్. సునీతకు పిల్లలు పుట్టుమంటే పుడ్తరా..! హ్హ..హ్హ..హ్హా.. సంతాన యోగం లేదందుకే.
నన్ను రమ్మని మాఇంటికి ఫోన్ చేసింది. రాత్రంతా సునీత ఇంట్లోనే పడుకొని తెల్లవారు ఝామున్నే వచ్చా..హ్హ..హ్హ..హ్హా..” అంటూ మురిసిపోసాగాడు.. ఒలంపిక్‌లో బంగారు పథకం సాధించిన వాడిలా ’హ్హహ్హహా..’ నవ్వొకటి.
నేను నివ్వెరపోయాను. మాకు కాస్తా దూరంలో కూర్చున్న కామర్స్ కమలమేడం వినాలానే చెబ్తున్నట్లు నా కర్థ మయ్యింది. అందుకే అతడిలో అంత ఉత్సాహం ఎగిసిపడ్తోంది.
నేను అసహనంగా ముళ్ళపై కూర్చున్నట్లు కాలేజీ నా దీనావస్థ పసిగట్టిందేమో..! బెల్ మ్రోగించింది. బతుకుజీవుడా అనుకుంటూ క్లాసుకు బయలుదేరాను.
(సశేషం)
No comments:
Post a Comment