శ్రీసాక్షిలింగ శతకము - కొప్పుల ఆదినారాయణ - అచ్చంగా తెలుగు

శ్రీసాక్షిలింగ శతకము - కొప్పుల ఆదినారాయణ

Share This
శ్రీసాక్షిలింగ శతకము - కొప్పుల ఆదినారాయణ
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవిపరిచయం:

శ్రీసాక్షిలింగ శతకకర్త కొప్పుల ఆదినారాయణ విశాఖపట్టణ వాస్తవ్యుడు. వీరరాఘవ గోత్రుడు. కొప్పుల సూరయ, సీతాలక్ష్మి వీరి తల్లితండ్రులు. భీంపల్లి చిన్నయ్యగారి వద్ద విద్యనభ్యసించారు. 

ఈ శతకారంభంలో కవి తనగురించి ఈ విధంగా చెప్పికొనినాడు.

సీ. శ్రీమహేశునిజింత జేసెడినరులతో, బరగు శ్రీవైశాఖ పురవరుండ
సతతంబు కీర్తిని చాలగనిచ్చు శ్రీ, వీరరాఘవగోత్రవంశజుండ
సుగుణయుతుండగు సూరయనాతండ్రి, యలమహలక్ష్మికి నాత్మజుండ
సుజ్ఞాని బీంపల్లి చిన్నయ్యగురుకృప, నజ్ఞానమునుబాసి యలరువాడ

ఒప్పు మీరనేను కొప్పుల వంశాబ్ధి
సీతకరుడనగుచు జెలగుచుందు
నామమునను ఆది నారాయణుండను 
సర్వపాపభంగ సాక్షిలింగ

ఈ కవి ఇతర రచనల గురించి కానీ, జీవిత విశేషాలను గురించి కానీ వివరాలు తెలియ లేదు. 

శతక పరిచయం:

" సర్వపాపభంగ! సాక్షిలింగ!" అనే మకుటంతో 134 ఆటవెలదులలో రచింపబడిన సాక్షిలింగ శతకము భక్తి, వేదాంత, వైరాగ్య రస ప్రధానమైనది. 

కొన్ని పద్యాలను చూద్దాము.

ఆ. గగనమందు విత్తు ఘనముగావిలసిల్లి
జగములోన వేరు జొరగనపుడు
గగనమందు పండు ఘనముగా పండెరా
సర్వపాపభంగ! సాక్షిలింగ!

ఆ. పండుయందు ప్రణవ పరమాత్మయే విత్తు
పంచవింశితంబు పైనితోలు
పండులోననుండు బ్రహ్మాండమంతయు
సర్వపాపభంగ! సాక్షిలింగ!

ఆ. కొండలేడు పైని కోటిభానులవెల్గు
అండబాయకాత్మ ననుసరించి
యేడుకొండలెక్కు యేర్పాటు నెరుగరా
సర్వపాపభంగ! సాక్షిలింగ!

ఆ. గుడ్లగూబ పగలు గుర్తెరుంగనియట్లు
కలకకండ్లు జ్యోతి గాననట్లు
మూఢజనుడు మూలమూర్తినిగాంచునా
సర్వపాపభంగ! సాక్షిలింగ!

ఆ. ఆత్మగననివాడు హరిదాసు డెటులాయె
కామక్రోధము లెట్లు కాలిపోయె
ఆ హరికృతి పేర యాచించుటే వృత్తి
సర్వపాపభంగ! సాక్షిలింగ!

ఈలోకంలో భక్తి పేరిట చాలామంది అనుసరిస్తున్న మూఢాచారాలను కవి చాలా నిష్కర్షగా ఖండించాడు.

ఆ. పట్టుపంచగట్టి పైభక్తి నిల్పినా
భక్తిగాదు లోకభ్రాంతిగాని
లోకభ్రాంతి వలన లోవెలిబాయునా
సర్వపాపభంగ! సాక్షిలింగ!

ఆ. దేవుడన్ని యెడల దీరుగ నుండగా
వెఱ్ఱికుక్కరీతి వెదుకనేల
అడవులంటబోవు నాతడా సుజ్ఞాని
సర్వపాపభంగ! సాక్షిలింగ!

ఆ. మనసు దెలియలేక మమతచే నజ్ఞాని
వెళ్ళి యడవులంట వెతలుజెందు
క్షుత్పిపాసవల్ల చెడిపోవు జునానంబు
సర్వపాపభంగ! సాక్షిలింగ!

ఆ. చెట్టుకొమ్మగొట్టి చెక్కి బొమ్మగజేసి
అమ్మయనుచుమ్రొక్కు రిమ్మతెవులు
తెగులుదృంచి యాత్మతేజంబు గనవలె
సర్వపాపభంగ! సాక్షిలింగ!

ఆ. తీర్థయాత్రలెన్నొ తిరిపెమెత్తగవచ్చు
నూర్ధ్వపుండ్రముపెట్టి యెనయవచ్చు
సార్థకంబులేదు సర్వముతాగాక 
సర్వపాపభంగ! సాక్షిలింగ!

ఇంగ్లీషు తెలుగు కలిపి మణిప్రవాళరీతిలో కొన్ని పద్యాలు మనకు ఈశతకంలో కనిపిస్తాయి.

ఆ. బియ్యెయెల్  చదువుట బీఫ్ తినుటకేగాని
హోప్ లెస్సు యమబాధ స్టాపుగాదు
స్లీపులేనియట్టి చిత్రంబుగననైరి
సర్వపాపభంగ! సాక్షిలింగ!

ఆ. ఇనుపదారిమీదనింజను జనునట్లు
వడిపయోధిపైని యోడజనును
అరయ తనువులోను దిరిగుచుండును నాత్మ
సర్వపాపభంగ! సాక్షిలింగ!


పరమత ప్రసక్తికూడా ఈశతకంలో మనకు కనిపిస్తుంది

ఆ. క్రీస్తుక్రీస్తుయనుచు కీలెంరుంగనివారు
మాదెమతముచాల మంచిదండ్రు
ఇతరమతములకును ఈశుడెవ్వడోగదా
సర్వపాపభంగ! సాక్షిలింగ!

ఆ. అల్లఖుదయంచు అరువగానేసరా
యుల్లమందున ఖుద యున్కిదెలియ
బన్కి ముసల్మాన్ బద్మాస్ హోగయా
సర్వపాపభంగ! సాక్షిలింగ!

వేదాంతసారాన్ని చక్కని సులువైన భాషలో శతకరూపంలో వెలువరించారు ఈ కవి. మీరూ చదవండి. మీ మిత్రులచే చదివించండి.
***

No comments:

Post a Comment

Pages